Pic source sakshi తిరుపతి గంగ జాతర

రాయలసీమకు ప్రత్యేకమైన పండుగలు , పబ్బాలూ , ఆచార వ్యవహారాలు కూడా తక్కువగానే ఉన్నాయి . కోస్తా జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో బాగా ప్రచారంలో ఉన్న అట్ల తద్దె , తెలంగాణా అంతటా వైభవంగా ఆచరించే బోనాల పండుగ రాయలసీమలో లేవు . తెలంగాణా చరిత్రలో జానపద , జీవితంతో ముడిపడి ఉన్న సమ్మక్క – సారక్క జాతరను గురించి ఇటీవలి కాలం వరకూ రాయలసీమలో తెలియదు . ప్రసార మాధ్యమాల కృషివల్లనే ఆ జాతర వెనక ఉన్న చారిత్రక – జానపద నేపథ్యం రాయలసీమ వాసులకు తెలిసింది . అలాగే రాయలసీమలో బహుళ ప్రచారం ఉన్న గంగమ్మ జాతరలకు కోస్తా , తెలంగాణాలలో అంత ప్రచారం లేదనుకుంటానంటూ ప్రముఖ సాహితీవేత్త వల్లంపాటి వెంకటసుబ్బయ్య తన రాయలసీమ ఆధునిక సాహిత్యం గ్రంథం లో పేర్కొన్నారు.

గ్రామదేవతలకు సంవత్సరానికొక సారి జాతర్లు జరిపిస్తారు. జాతర సమయం లో అమ్మవారికి పొట్టేళ్ళను (యాటలను), మేకపోతులను బలి ఇస్తారు. బోనాలు చెల్లిస్తారు.ఆ సందర్భంగా జానపదులు తడి గుడ్డలతో అగ్నిగుండంలో దిగి నడుస్తారు. కాల్చిన గడ్డపారలను చేతులతో పట్టుకోవడం పవిత్రంగా భావిస్తారు. అలా చేస్తే దేవతలు శాంతిస్తారని చల్లగా కాపాడుతారని వీరి నమ్మకం.

తిరుపతి గంగ జాతర

తిరుపతి గంగమ్మ జాతర

రాయలసీమలో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే రాయలసీమ లో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి ఈ ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది.

తిరుపతి కూడలి లోని తాళ్ళపాక పెద్దగంగమ్మ జాతర

అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.

Pic source sakshi తిరుపతి గంగ జాతర

చాటింపు

తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం(ఈ ఏడాది మే 11) రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపుకుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు వూరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు.

మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో వెుదటిరోజున బైరాగివేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మిక. రెండోరోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. మూడోరోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. నాలుగోరోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు వూరంతా వూరేగుతారు. స్థలపురాణం ప్రకారం శనివారంనాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది.

నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట. దీనిని గుర్తుచేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను(వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరిరోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రినుంచే పడిగాపులు కాస్తారు.

Pic source Ntv

విశ్వ రూపం

పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది.

గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని భావించారు.
అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

శివరాత్రికి జాతర

అనంతపురం జిల్లా కదిరి లో వున్న తిమ్మమ్మ మర్రిమాను దగ్గర శివరాత్రికి జాతర జరుగు తుంది. చుట్టుప్రక్కల గ్రామాల నుంచే గాక రాయలసీమ అన్ని జిల్లాలు, కర్నాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలనుంచి కూడ భక్తులు విరివిగ పాల్గొంటారు. రాత్రికి జాగరణ చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హరికథలు, బుర్రకథలు చెబుతారు.ఒక్క పొద్దు (ఉపవాసం)తో తిమ్మమ్మను పూజిస్తారు. అలా చేస్తే తమ కష్టాలు తీరి సంతోషంగా ఉంటారని జానపదుల నమ్మకం.

“పోలేరమ్మ జాతర”అంకాలమ్మ జాతర”లో జంతు బలులు ఉంటాయి. బలి ఇచ్చిన తర్వాత పొలిచల్లడం ఆచారం. రక్తం, అన్నం, వేపాకులనుచేటలో కలిపిఊరి పొలిమేరవరకు పొలి చల్లుతారు. ఇలాచేస్తే పంటలు సమృద్ధిగా పండి, గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని, దయ్యాల భూతాల బారినుండి అమ్మవారు గ్రామస్తులను కాపాడుతారని జానపదుల విశ్వాసం.

పోలేరమ్మ, అంకాలమ్మ ల పై జానపదులు పొలి చల్లే విధానం గురించి చక్కగా వర్ణిస్తారు.

తిరునాల(జాతర)


గ్రామదేవతలకు ప్రతి శివరాత్రికి తిరునాళ్ళు జరుపుతారు.తిరునాళ్ళు ఎంతో వైభోగంగా జరుగు తాయి.సుదూర ప్రాంతాల నుంచి కూడ ఈ తిరునాలకు వెళ్తారు. కడపలో దేవునికడపలో, నిత్యపూజ య్య స్వామి దగ్గర తిరునాల జరుగుతూంటుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s