Kethu viswanaadhareddi

 ‌‌        కేతు విశ్వనాథరెడ్డి  కడప జిల్లాలో యర్రగుంట్ల మండలంలోని రంగశాయిపురం గ్రామంలో జన్మించారు. ఈయన, ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరిగి, చివరికి కడప గడప చేరారు.తన వ్యక్తిత్వపు మూలాలను, తన కథల మూలాలను కడపజిల్లాలోని పల్లెపట్టుల చరిత్రలో, తెలుగు సామాజిక పరిణామాల్లో నిరంతరం వెదుక్కుంటున్న కథకుడీయన.ఆయన కథలన్నింటికీ దాదాపు మధ్యతరగతి జీవితమే కథా వస్తువు. సీమ ప్రాంత కరువు స్థితిని తెలిపే కథలు కూడా రాశారు. రచయితకు జీవితానుభవంతో బాటూ శిల్పదృష్టి కూడా వున్నప్పుడే మంచి కథకుడు కాగలడు. అలాంటి జీవితానుభవంతో బాటూ శిల్పదృష్టి కూడా వున్న రచయిత ఈయన.   

       (సేకరణ: పిళ్లా విజయ్)

           కేతువిశ్వనాథరెడ్డి కథలు స్వాతంత్ర్యానంతరం రాయలసీమ, ముఖ్యంగా కడప జిల్లాలో వచ్చిన మార్పులకు అద్దంపడతాయి. ప్రకృతిశాపం, మార్కెట్ వ్యవస్థ,కులవ్యవస్థ, గ్రామకక్షలూ, పారిశ్రామికరంగం సృష్టించిన సంవేదనను ఆయన తన కథల్లో చిత్రించాడు.

          నమ్ముకున్న నేలను రైతులు ఎలా అమ్ముకోవలసి వస్తుందో, రైతులు,కూలీలుగా ఎలా మారిపోతున్నారో తెలిపే కథ ‘ నమ్ముకున్న నేల ‘.ఈ కథలో రచయిత  అనుభవాలు  ఎన్నో చోటు చేసుకున్నాయి. అయితే మారిన జీవితకాల పరిస్థితులను బట్టి ఇప్పుడీ కథనే కొత్తగా ఈయన రాస్తే, ముందులా వుండదు,మరోలా వుంటుంది. పూర్తి భిన్నంగా కూడా వుండవచ్చు. చిలంకూరు దగ్గర వచ్చిన సిమెంటు ఫ్యాక్టరీ వల్ల వ్యవసాయాన్ని వదులుకొని రైతులు కూలీలుగా మారే దైన్యస్థితిని  ఆయన చాలా జాగ్రత్తగా రికార్డు చేశాడు ఆయన కథల్లో. అయితే నేడు అత్యాధునిక మిషన్లు రావడంవల్ల ఆ కూలీ పనులుకూడా దక్కని ఓ స్థితి వచ్చింది. కథాకాలం నాటికీ ఇప్పటికీ సీమ ప్రాంతంలో వ్యవసాయం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. అలాగనీ పారిశ్రామికం గానూ ఏమాత్రం అభివృద్ధి చెందలేదుకూడా!ఇంతటి దయనీయమైన స్థితి రాయలసీమలోని కడప జిల్లాలో దాపురించడం తలుచుకుంటే మనసు కృంగిపోతుంది.  ఖనిజాలెన్నో  వున్నా సరైన పరిశ్రమలు కూడా ఇక్కడ అభివృద్ధి చెందలేదు. ఉన్న పరిశ్రమలు దాదాపు మూతపడే పరిస్థితి. ఈ పరిస్థితిలో కడపజిల్లా ప్రాంతంలో విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రజలుఉద్యమించారు. మారిపోయిన రాజకీయసమీకరణలు, ఛిద్రమైపోతున్న మానవుల స్థితిగతుల మీద, గ్లోబలైజేషన్ మీద, వలసల మీద, ఈ ప్రాంతం నుంచి ఎన్నో కథలు రావలసి వుంది.

‘ వానకురిస్తే ‘ కథకు మంచి గుర్తింపు వచ్చింది. సొదుం జయరాం వంటి రచయితలు ఆ కథని విమర్శించి వుండవచ్చు గానీ ఎంతో మంది సమీక్షకులే కాదు, విమర్శకులు సైతం మెచ్చుకునే కథ అది. వానకురిస్తే కథ విషాదాంత కథే! సీమ ప్రాంత జీవితాన్ని రికార్డు చేసిన కథ అది. ‘ దాపుడుకోక ‘ కథ కేవలం శిల్ప దృష్ట్యా చూస్తే, గొప్పగా అనిపించకపోవచ్చు గానీ జీవిత వాస్తవికతలోని విషాదాన్ని చూస్తే, అది గొప్ప కథే! అంతర్జాతీయ స్థాయిలో గొప్ప కథలుగా గుర్తింపు పొందిన కథలెన్నో ఇలాంటివి వున్నాయి. కథా ప్రక్రియకు సంబంధించిన మెలుకువలెన్నో కేతు విశ్వనాధరెడ్డి, రా.రా. దగ్గర మొదట నేర్చుకున్నవే! అయితే విమర్శకుడి దృష్టివేరు, రచయిత దృష్టివేరు. విమర్శనా దృష్టిలో రచయిత కథలెప్పటికీ రాయకూడదు కూడా! రా.రా. కేవలం విమర్శ, సమీక్ష కోసమే కథలు రాసినా,ఆ కథల గురించిన అసంతృప్తి ఆయనలో వుండింది. అదే మార్గంలో సూటిగా నడిచిన సోదుం జయరాం వంటి కథకుడిలోనూ ఆ దృష్టి ఎక్కువగా వుండడంవల్లనే ఆయన ఎక్కువకథల్ని రాయలేక పోవడానికి ప్రధాన కారణం! కానీ ఆ సందిగ్ధతగానీ, కేవలం అటువంటి దృష్టి లేకపోవడం కారణం గానే కేతువిశ్వనాథరెడ్డి అనేక కథల్ని తెలుగు పాఠకులకు అందించగలిగాడు. 

అయితే రచయితలకూ, పాఠకులకు ఇద్దరికీ ఒక  విమర్శకుడు ఉండడం  చాలా అవసరం.అతనే వారిద్దరి మధ్య సంధానకర్త.

        1974 లో ఈయన కథల సంపుటి ‘ జప్తు ‘ ప్రచురింపబడింది. 1991 లో కేతు విశ్వనాథరెడ్డి కథల సంపుటి వచ్చింది. రష్యన్, హిందీ,బెంగాలి, మరాఠీ, కన్నడ భాషల్లోకి వీరి కథలు అనువదింపబడినాయి.

ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడంతో పాటు అనేకజాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులొచ్చాయి. ఇండియాటుడేలో వచ్చిన “అమ్మవారినవ్వు ” కథ మీద విమర్శలు వచ్చాయి. హిందుత్వవాద భావజాలం అందులో చొప్పించారన్న వాదనలూ బలంగా వినిపించాయి. అయితే ఆయన ఆ తర్వాత రాసిన కథల్లో అలాంటి జాడలేవీ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఆయన కథల్లో  మలచిన పాత్రలన్నీ సాదాసీదా మనుషులే.అందుకే ఆయన కథలు కొత్తగా రాస్తున్న రచయితలకు ఒక గైడ్ గా పనికొస్తాయి.

(కడప జిల్లా సాహితి నుండి)

_ఖలందర్

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s