తొలి దళితకథా రచయిత గుత్తి రామకృష్ణ

                  

               స్వాతంత్ర్య సమర యోధుడు, అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరు,జిల్లా తొలిపాత్రికే యుడు , రాయలసీమ కరువు ను చిత్రించిన తొలి కథా రచయిత గుత్తి రామకృష్ణ 1915,జూలై13న అనంతపురం

పట్టణంలోని అంబారపు వీధి లోని గుత్తి వెంకటప్ప, నారాయణమ్మ దంపతులకు జన్మించారు.

     ఆయన తన  జీవితమంతా  సమాజం కోసం అంకితం చేశారు.ఎంత చేసినా తనకు సంబంధం లేదన్నట్లుగా నిమిత్తమాత్రుడిగా జీవితం గడిపిన ధన్యజీవాయన. 

   ఆయన  బోర్డు స్కూల్ , ట్రైనింగ్ స్కూల్ , మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్నారు . చదువుకునే రోజుల్లోనే తరగతుల పుస్తకాలకన్నా జనరల్ పుస్తకాలు అధికంగా చదివినారు.

             రామకృష్ణ గారికి చిన్ననాటినుండే బ్రిటీష్ వారంటే ద్వేషంతో వుండేవారు. అందుకే ఆయన ఇంగ్లీషు సబ్జెక్టు చదివేవారు కాదు . స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొంటూ జాతీయోద్యమ నాయకులు ఎర్రమల కొండప్ప, వి. నారాయణప్ప ప్రేరణతో విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. హరిజనోద్ధరణ వంటి సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఎర్రమల కొండప్ప విరాళంగా ఇచ్చిన రెండు ఎకరాల స్థలంలో ఐదుకల్లు సదాశివన్ తో  కలిసి కేశవ విద్యానికేతన్

హరిజన వసతిగృహాన్ని నిర్వహించారు. అక్కడ విద్యార్థులకు ట్యూషన్ కూడా చెప్పేవాడు. ఐదుకల్లు సదాశివన్ ప్రోత్సాహంతో బందరు జాతీయ కళాశాలలో చదువుకున్నాడు.1937లో ఎన్జీరంగా రైతాంగ విశ్వవిద్యాలయంలో వేసవి పాఠశాలలో చదివారు.

        చదువుతున్న రోజుల్లో కమ్యూనిస్టు నాయకులైన 

పుచ్చపల్లి సుందరయ్య , చంద్రరాజేశ్వరరావు లాంటి నాయకుల ఉపన్యాసాలు విని కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షింపబడ్డారు.జిల్లాలో 1941లో నీలం సంజీవరెడ్డి గారు ‘ ఆకాశవాణి ‘ పత్రికను నడుపుతుండేవారు . ఆయనను పోలీసులు అరెస్టు చేయగా ఆ బాధ్యతను రామకృష్ణ  నిర్వహించారు. కానీ ఆయనను కూడా  ప్రభుత్వం అరెస్టు చేసి కడలూరు జైలు కు పంపింది. అక్కడ ఖైదీల పట్ల పోలీసు అధికారుల ప్రవర్తనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన లో పోలీసులు కాల్పులు జరిపారు.ఆసందర్భంలో ఒక కన్ను పోగొట్టుకొన్న త్యాగజీవాయన.

                పుచ్చలపల్లి సుందరయ్య గారు జిల్లాలో 1939లో ఏర్పాటు చేసిన మొదటి కమ్యూనిస్టు శాఖలో 

తరిమెల నాగిరెడ్డి , నీలం రాజశేఖర్ రెడ్డి, సదాశివన్, గుత్తి రామకృష్ణ ఉన్నారు. సదాశివన్ తో కలిసి కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంతో పాటు విద్యార్థి , యువజన , రైతుసంఘాలను ఏర్పాటు చేసింది . ఈ క్రమంలో  వీరందరిని ప్రభుత్వంఅరెస్టు చేసి బళ్ళారి జైలులో పెట్టినారు. ఈ దశలో ఏటుకూరి బలరామమూర్తి జిల్లా ఆర్గనైజర్‌గా బాధ్యత తీసుకోగా ఆయనకు రామకృష్ణ గారు సహకరించారు . అనేక వ్యయప్రయాసలకోర్చి పార్టీ నిర్మాణానికి కృషి చేసినారు .పార్టీ అప్పగించిన బాధ్యతలో భాగంగా ‘ స్వతంత్ర భారత్ ‘ పత్రికను జిల్లాలో రహస్యంగా పంపిణీ చేసేవారు జిల్లాలో . 

        పార్టీ సాహిత్యాన్ని యువతలోకి విస్తృతంగా తీసుకు వెళ్లేందుకు కృష్ణాబుక్ స్టాల్ ఏర్పాటు చేసి 15సంవత్సరాల పాటు నిర్వహించారు . 1964 లోకమ్యూనిస్టు పార్టీలో  చీలిక  వచ్చినప్పుడు  గుత్తిరామకృష్ణ  సిపిఎం వైపు నిలిచారు . 

    ‌‌     రామకృష్ణ ఆంధ్రభూమి దక్కన్ క్రానికల్ జనశక్తి విశాలాంధ్ర ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల ప్రారంభ సమయాలలో నుండి తొలి జర్నలిస్టుగాపనిచేశారు.చాల కాలం ప్రజాశక్తి పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తూ వివిధ పత్రికలకు వ్యాసాలు రాసేవారు. సుమారు 70 సంవత్సరాలు విలేకరిగా పనిచేశారు.

          గుత్తి రామకృష్ణ సాహితీ రంగానికి విశేష కృషి చేశారు రాయలసీమ కథా రచయితగా గుర్తింపు పొందారు. ప్రధానంగా ఆయన ఆరు కథలు రాశారు. ఆయన రాసిన గంజి కోసం కథ అనంతపురం జిల్లాలో తొలి కరువు కథ. ఈ కథ కరువు కాలంలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపింది. ఈ కథ విజయవాణి పత్రికలో 1941 లో ప్రచురితమైంది.కరువు నేపథ్యంలో కుటుంబ సమస్యల మధ్య అవ్వ, కొడుకు, కోడలు, మనవరాలు మనవడు మధ్యగల అనుబంధాల సన్నివేశాలతో అల్లిన కథ గంజి కోసం.కరవు దెబ్బకు వలస వెళ్లే క్రమంలో ఆ కుటుంబం పడే వేదనను కథలో వ్యక్తపరిచాడు రచయిత.వారికి ఉన్న జీవనాధారం ఐదెకరాల మడి. అది కాస్త రెడ్డి చేతిలోకి వెళ్ళిపోతే అవ్వ దిగులుచెందుతుంది. తినడానికి తిండి లేక కలబంద గ్యాదరాకు తినిబతుకు సాగిస్తున్న నేపథ్యంలో పొరుగు ప్రాంతాల్లో గంజి కోసం ప్రజల పాకులాటను కళ్ళకు కట్టినట్లు చూపుతాడు.భూమి లాక్కున్న రెడ్డి, కోడలు మానం పై కన్నేయడం తో అవ్వ తీసుకున్న నిర్ణయం మనసులను కట్టిపడేస్తుంది. మనవడు మనవరాలు ఆకలితో అలమటిస్తుంటే పడిన ఆవేదన కథను ముందుకు నడిపిస్తుంది. ప్రభుత్వ గంజి కోసం మైళ్ల దూరం నడిచిన తీరు కరువుకు నిదర్శనం గా కనిపిస్తుంది. ఎంతో కష్టపడి గంజి కేంద్రానికి చేరుకున్న అవ్వకు ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల మాట విని గుండె జారిపోతుంది. ఆశలు ఆవిరై పోతాయి.ఇలా రామకృష్ణ రాసిన చిరంజీవి,శిల్పి, కరువు కులము- మతము, సాహిత్యచరిత్రలో నిలిచిపోయాయి.

         చాలా కాలం వరకు ఆయన రాసిన కథనే రాయలసీమ తొలికథ గా భావించేవారు.ఇప్పుడు ఆయన కన్నా ముందే రాసిన కథలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఆయన 1941 లో రాసిన ‘గంజికోసం’ కథే నేటి వరకు రాయలసీమకరువు పై రాసిన మొట్టమొదటి కథగా వుంది.

      ఆయన రాసిన  దళిత కథ చిరంజీవి కథ. ఇది రాయలసీమ లో వచ్చిన మొట్టమొదటి దళిత కథ.ఇది ఇది సాధన పత్రికలో 1941 లో వచ్చింది.దీనిని తిరిగి అప్పి రెడ్డి హరినాథ్ రెడ్డి మొదటి తరం రాయలసీమ కథలు పుస్తకంలో ప్రచురించారు. అగ్రవర్ణ వ్యవసాయదారులు దళితులకు అప్పులిచ్చి వాళ్లతో వంశపారపర్యంగా వెట్టిచాకిరీ చేయించుకొనే దుర్మార్గాన్ని ఈ కథ బట్టబయలు చేస్తుంది. వెంకటరమణ ముత్తాత తన పెళ్ళికి రెడ్డి దగ్గర అప్పు చేసి ఇ ఆపు లేకుండా చనిపోతాడు ఆ తర్వాత వచ్చిన రెండు తరాలు కూడా అప్పు తీర్చలేవు. వడ్డీ వడ్డీ లెక్క కట్టి ఆ కుటుంబంలోని సభ్యులందరూ పని చేసిన అప్పు తీరని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా దళితులపై శ్రమ దోపిడీ ఎలా ఉందో ఈ కథలో మనకు తెలియజేస్తాడు రచయిత.

     రాయలసీమఅభివృద్ధి కోసం నిరంతరం తపిస్తూ , సమాజం ఎప్పటికైనా మారుతుందనే ధృడ విశ్వాసం తో ఉండేవారు. కష్టపడే తత్వం నీతి నిజాయితీ నిరాడంబరత నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం గా నిలిచిన గుత్తి రామకృష్ణతన 95వ ఏట 2009 మే 12న కన్ను మూశారు.అయితే ఆయన కథాసాహిత్యం, ఉద్యమపటిమ మాత్రం రాయలసీమ ప్రజల మదిలో కలకాలం నిలిచి వుంటుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s