చాతుర్వర్ణ హిందూమత వ్యవస్థలో ఏ స్థాయిలోనూ చోటులేక సాంఘిక జీవన చట్రం చివరి అంచులకు నెట్టబడి వెలిగా జీవించవలసిందిగా నిర్దేశింపబడిన వాళ్లు దళితులు. అంబేద్కరిజం పునాదిగా దళితవాదం రూపు దిద్దుకొంది.కులాన్ని కేవలం ఒక సాంఘిక విషయంగా కాక ఒక రాజకీయ ఆర్థిక దళిత వాదంలో ప్రధానమైంది దళిత అణచివేత రాజకీయాలు ప్రాతిపదికగా దళిత సాహిత్యం వచ్చింది.
రాష్ట్రంలో దళిత ఉద్యమం దశదిశలా వ్యాపించినప్పటికీ, రాయలసీమలో మాత్రం ఆ ఉద్యమం తలెత్తడం, విస్తరించడం. దళిత చైతన్యం పెరగడం వంటి అంశాలను అంతగా పట్టించుకోలేదు. వర్తమాన దళిత ఉద్యమం గురించి తెలిసినంతగా రాయలసీమలో సంఘసంస్కర ణోద్యమకాలంలో హరిజనాభ్యుదయం (దళితుల)పేరిట జరిగిన కార్యాచరణలు, వాళ్ళ గుర్తింపు కోసం కానీ, చైతన్యం కోసం కానీ చేసిన కార్యక్రమాలేవీచరిత్రలోకి ఎక్కలేదు. రాయలసీమ దళిత జీవితానికి సంబంధించిన వివిధ అంశాలు, దళితుల సామాజిక రాజకీయ స్థితిగతులు, సంస్కృతికి సంబంధించిన విషయాలు చర్చకు రాలేదు. దళితులు సామాజికంగా ఎంతగా వేరు చేయబడి వున్నారో ఆర్థిక దోపిడికి, రాజకీయ నిరాదరణకు ఎంతగా గురైనారో ఈ విస్మరణ స్పష్టం చేస్తుంది. సామాజిక సిద్ధాంత కర్తలు, చరిత్రకారులు, తరచుగా దళితులను హిందూ వ్యవస్థలో అంతర్భాగంగా చేర్చి మాట్లాడుతుంటారు.కానీ దళిత సంస్కృతిలోని అంతర్గత వాస్తవికతను, సంక్లిష్టమైన వారి జీవన విధానాన్ని గుర్తించడంలో విఫలమవుతుంటారు.
19వ శతాబ్దపు సంఘసంస్కరణోద్యమం విద్య ద్వారానే వికాసం సాధ్యమవుతుందని గుర్తించింది. కానీ ఆ వికాసం, అభివృద్ధి దళితేతరులకు మాత్రమే పరిమిత మయ్యింది. అంటరాని కులాలలో ఆనాడు విద్యను విస్తరింపజేసేందుకు అరకొర ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటి వల్ల ఆశించిన ఫలితాలు కనిపించలేదు.
1909 మింటోమార్లే సంస్కరణలు, 1919 మాంటెంగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు ప్రభుత్వ కార్యనిర్వహణామండలిలో భారతీయులకు కొంత ప్రాతినిధ్యాన్ని కల్పించాయి.అది దళితులకు గుడ్డిలో మెల్లగా మేలు చేసింది. భారత రాజకీయ రంగంలో ప్రత్యేకనియోజకవర్గాలను ప్రవేశపెట్టాలన్న కీలకమైన నిర్ణయంతో దళితుల ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. ఈ అంశం దళితులపై ప్రత్యేక శ్రద్ధను చూపేలా వివిధ సంస్కర్తలను ప్రేరేపించింది.
క్రైస్తవులు దళితులను విముక్తి చేస్తున్నామంటూ తమ మతంలో చేర్చుకొనే ప్రక్రియ రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలోని జమ్మలమడుగు, కోవెలకుంట్ల,గుత్తి, గుంతకల్లు, ప్రాంతాలలో కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది.
క్రైస్తవ మిషనరీల లక్ష్యం క్రైస్తవీకరణే అయినప్పటికీ అంటరాని వారి పట్ల వారు ప్రదర్శించిన మానవీయత, దుర్భర పరిస్థితుల నుంచి వారిని విముక్తం చేయాలన్న కాంక్ష రాయలసీమ దళిత కులాల తక్షణ అవసరాలు తీరేందుకు దోహదం చేశాయి. వీళ్ళ ప్రభావంతో దళితులు క్రైస్తవ మతం అవలంబించి నప్పటికీ వాళ్ళ స్థితిగతులలో పెద్దగా మార్పు లేనప్పటికీ కొంతవరకైనా వారి జీవనసరళి మెరుగుపడింది. అంతే కాదు దళితుల్లో తరతరాలుగా తమ జీవితాలను దుర్భరం చేస్తూ కొనసాగు తున్న అంటరాని తనం అనేది ఎంత బూటకమైనదో తెలిసి వచ్చింది. ఈ మతమార్పిడి కార్యక్రమ ఫలితాలు రాయలసీమే
తర ప్రాంతాలలోని మతసంస్కరణ వాదులలో ఒక విధమైన చురుకును పుట్టించ గలిగాయి.కానీ రాయలసీమ భూస్వామ్య మనస్తత్వం దీన్నే మాత్రం ఖాతరు చేయలేదు. క్రైస్తవ మిషనరీల విద్య మొదలైన కార్యకలాపాల కారణంగా ఆంధ్రలోని దళితులు హిందూ మతం తమ అసమానతల్ని పెంచి పోషిస్తున్నదని గుర్తించారు. కోస్తా దళితులలో తమ హక్కుల పట్ల చైతన్యం పెరిగింది. కానీ రాయలసీమలో ఆ చైతన్యం కనిపించక పోవడానికి క్రైస్తవ మిషనరీ లలోని ప్రచారకులు అగ్రవర్ణ భూస్వాముల ఆధిపత్యాన్ని అంగీకరించిపనిచేయడమే ప్రధాన కారణం కావచ్చు. అందుకే దళితుల నిరసనలు చైతన్య పోరాట రూపాన్ని సంతరించుకోలేదు.
వామపక్షీయులు కొంత వరకు ఈ ఆధిపత్యాలను అంగీకరించలేదు. అట్లని పెద్ద పోరాటరూపం కూడా తీసుకోలేదు. ఉద్యమ నాయకత్వం కొన్ని సామాజికవర్గాల చేతుల్లోనే వుండిపోవడం వల్లనే రాయలసీమ దళితుల చైతన్యం గుర్తింపుకు నోచుకోలేదు. ఎందుకంటే, వివిధ వలసవాద వ్యతిరేక ఉద్యమాలలో దళితులు పాల్గొన్నారు. గ్రామీణ పేదలను భూమిలేని వ్యవసాయ కూలీలను సంఘటితం చేస్తూ సాగిన కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా ఎందరో దళితులు భాగస్వాము లయ్యారు. మార్క్సిజం పట్ల ఆకర్షితులైన దళితులు వ్యవసాయ కూలీల సంఘాలలో చేసిన సమ్మెలలోచురుకుగా పనిచేశారు. ఇలా కమ్యూనిస్టులు నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లోఉద్యమాల్లో దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నప్పటికీ, ఆ ఉద్యమంలో మిగిలిన వారిలాగే దళితులు కూడా త్యాగాలు చేసినప్పటికీ, దళితులకు కీలకమైన నాయకత్వ పాత్ర లభించలేదనేది దళిత సంఘాల అభియోగం.
మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తయినా రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాలలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత దళిత జీవితాలలో ఇప్పటికీ మౌలిక మార్పు రాలేదు.
రాయలసీమలోని దళిత సాహిత్యం పై అధ్యయనం చేసినప్పుడు రాయలసీమ రచయితలలోని దళిత స్పృహను అంచనా వేయటం జరుగుతుంది. రాయలసీమలోని దళితుల సమస్య ఆత్మగౌరవం వరకూ పరిణమించని దశనురాయలసీమ దళిత కథల్లో చూడగలుగుతాం. దళితులు రాసిన కథలను 1970 వరకూ అస్తిత్వ దృష్టితో చూడలేకపోయాం.
రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమ భావాలు దశదిశలా వ్యాపించిన తరువాతనే ‘దళిత కథ’ ఆవిర్భావం జరిగింది.కానీ రాయలసీమ నుండి వచ్చిన మొట్టమొదటి దళిత చిరంజీవి కథ.దీనిని అనంతపురం నుండి గుత్తి రామకృష్ణ రాశారు. ఇది సాధన పత్రికలో 41 మార్చి 26వ సంచికలో వచ్చింది. (ఇటీవలి పరిశోధన లో తెలిసిన విషయం ఏమంటే ఈ కథ కంటే ముందే ఆదిమాంధ్ర భక్తుని జీవిత చరిత్ర అనే కథను 1928లోనే శ్రీరాములు రెడ్డి రాసినట్లు తవ్వా వెంకటయ్య గుర్తించాడు.)చిలుకూరి దేవపుత్ర రాయలసీమలో దళిత అనుభవంలోనుంచి కథ రాయడానికి 1980 దశకం వరకూ వీలుచిక్కలేదు. రాయలసీమ నుండి దళితేతరులు అనేక దళిత కథల్ని సృజించారు. దళితేతరులుగా వాళ్ళు రాసిన కథలకు, దళితులే రాసిన కథలకు కూడా చాలా తేడా వుంది. దళిత పాత్రలు ఎదుర్కొన్న
సమస్యలను దళితేతరులు చిత్రించారు. చిలుకూరు దేవపుత్ర, నాగప్పగారి సుందర్రాజు,నాగులారపు విజయసారధి, బత్తుల ప్రసాద్ కథలు ఇందుకు సాక్ష్యం. ‘మాదిగోడు’, కథాసంకలనంలో “మద్దికెర మార్తమ్మ కత ఎంతమందికి తెలుసప్పా”, ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేదా’, ‘చంద్రగ్రహణం’, ‘నెత్తురు మరకలు’ మొదలైన కథలలోని కథాకథనాన్ని గమనించి నట్లయితే, ఈ కథలలో మొత్తం దళిత జీవిత వ్యక్తీకరణ రూపం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక పాత్రల నడుమ, చిత్రించిన దళిత పాత్రలలోని సాంద్రతను మించిన గాఢమైన స్వీయానుభవం వీళ్ళ కథల్లో బహిర్గతమవుతుంది.
రాయలసీమ నుండి దళిత అస్తిత్వ స్పృహతో వచ్చిన కథలు తక్కువే అయినా వచ్చిన మేరకు అవి దళిత అస్తిత్వ స్పృహ ను కలిగి ఉన్నాయి. దళిత అస్తిత్వాన్ని సృజించిన రచయితలలో చాలామంది దళితేతరులు ఉన్నారు. దళితులైన రచయితలు తమ అనుభవంలో నుంచి రాసిన కథలకు, దళితేతరులు రాసిన సానుభూతి రచనలకు ఖచ్చితమైన తేడా ఉందనిఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే, ఈ స్టేట్ మెంటుకు కొంత మినహాయింపు కూడా ఉంది. ఎందుకంటే జి. రామకృష్ణ, సింగమనేని నారాయణ, పి. రామకృష్ణ, శాంతినారాయణ, బండి నారాయణస్వామి, జి. వెంకట కృష్ణ లాంటి మరికొంత మంది రచయితల కథలు చూసినపుడు వాటిలో దళిత అస్తిత్వ స్పృహ కంటే దళిత జీవిత చిత్రణకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారు. చాలామంది దళితేతర రచయితలు దళిత జీవితాన్ని ప్రతిబింబించే కథలను రాశారు.
దళిత అస్తిత్వాన్ని సృజించిన కథలలో అనంత పురం నుండి చిలుకూరి దేవపుత్ర కథలు ‘ ఆయుధాలు ‘, ‘ సమిధలు ‘, ‘ విలోమం ‘ అలాగే కర్నూలు జిల్లానుండి నాగప్పగారి సుందర్రాజు ” మాదిగోడు” కథా సంకలనంలోని ‘ నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద ‘.’ మద్దికెర మార్తమ్మ కత ఎందరికి తెలుసప్పా ‘ కథలు, కడపజిల్లా నుండి బత్తుల ప్రసాద్
కథాసంకలనంలోని ‘ నెత్తురు మరకలు ‘, సిన్నిగోడి సికారి ‘, ‘ కూరాక్కు సచ్చేటోడ్నా ‘, విజయసారథి “చంద్రగ్రహణం” కథలను దళిత అస్తిత్వ స్పృహ కలిగిన కథలుగా తీసుకో బడ్డాయి. అలాగే దళిత కులానికి చెందక పోయినప్పటికీ, దళిత వర్గ స్పర్శతో రచించిన కథలు దళిత సానుభూతి కథలైనప్పటికీ దళిత చైతన్యాన్ని సృజించిన కథలు,రాయలసీమ జిల్లాలో చాలా ఎక్కువగానే వచ్చాయి. అలాంటి కథలలో పి.రామకృష్ణ’ ఎలిగే పెద్దళ్ళు నలిగే చిన్నోళ్ళు ‘, కర్రోడు ,సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి ‘ చనుబాలు ‘,“అంటు ‘, సింగమనేని ‘ ఉచ్చు ‘, ‘ మకరముఖం ‘, స్వామి ‘ ప్రశాంతం ‘, ‘ ఓ సరస్వతి కథ ‘,’ తల్లివేరు ‘, జి. వెంకటకృష్ణ ‘ పడిలేచే కెరటం ‘, ‘ రాజకీయ దేవుడు ‘, ‘ పడగనీడ ‘, ‘ దేవరగట్టు ‘,శాంతినారాయణ ‘ ఉక్కుపాదం ‘, దాదాహయత్ ‘ ఎల్లువ ‘, పాలగిరి విశ్వప్రసాద్’ చెప్పుకిందిపూలు ‘, మహేంద్ర ‘ పాడి ఆవు ‘, వై.సి.వి.రెడ్డి ‘ ఐదు రూపాయలు ‘, ‘ ఇంటి మాదిగోడు ‘, నాగమ్మ పూలే ‘ అరుంధతి పంతం ‘ మొదలైనవి ముఖ్యమైనవి.
___సీమ కథ అస్థిత్వం నుండి
