Prof P Hemachandra Reddy (source: Facebook)

నోబెల్, గ్లోబల్ శాస్త్రవేత్తల పక్కన తిరుపతి పూర్వవిద్యార్థికి చోటు


చాలా మంది అమెరికా వెళ్తారు. అక్కడి గుంపులో మాయమైపోతారు.కొందరే అందరికీ కనిపించేలా ఆకాశం అంత ఎత్తెదుగతారు. అలాంటి భారతీయులు, అందునా తెలుగు వాళ్లు ఒక డజను మించి అమెరికాలో ఉండరు. ఇపుడు తెలుగు వాళ్లే కాదు, మొత్తం భారతదేశం గర్వపడే స్థాయికి తిరుపతి పూర్వవిద్యార్థి ఎదిగాడు. ఆయన పేరు పి హేమచంద్రారెడ్డి. ఊరు తిరుపతి పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు… మల్లంగుంట.

హేమ చంద్రారెడ్డి నోబెల్, గోబల్ శాస్త్రవేత్తల క్లబ్బులో చేరాడు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ఎడ్వాన్స్ మెంట్ అఫ్ సైన్స్ (American Association of Advancement of Science , AAAS)ఫెలో అయ్యాడు. ఇది గొప్ప శాస్త్రవేత్తలకు మాత్రమే దొరికే అరుదాతి అరుదైన గౌరవం. ఈ సంస్థలో నోబెల్ శాస్త్రవేత్తలుంటారు, నోబెల్ ఫ్రైజ్ అందుకోబోయే వాళ్లుంటారు. ఇదేదో దరఖాస్తు చేసుకుంటే వచ్చేది కాదు. ముఖ్యమంత్రులో, మంత్రులో అనుకుంటే వచ్చే సిఫార్సు బాపతు కాదు. ఈ సంస్థలో వందల సంఖ్యలో ఉన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, హేమచంద్రారెడ్డి రీసెర్చ్ ను బేరీజు వేసి వోట్లేసి ఎన్నుకుంటారు. అలా మల్లంకుంట పిలకాయ్ కి నోబెల్, గ్లోబల్ శాస్త్రవేత్తల పక్కన సీటేసి కూర్చోబెట్టారు.
మల్లంకుంట ప్రైమరీ స్కూలు, తిరుపతి ఎస్వీ హైస్కూలు, ఎస్ వి అర్ట్స్ కాలేజీ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం… టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి పండగ చేసుకోవాలి.
హేమ్ ఐటిలో ఉండి ఉంటే అది జరిగేదేమే.ఆయన అపుడు బిలియనీర్ అయ్యే వాడు. మిణకుమిణుకున మెరిసే ఐటి ప్రపంచంలో కాకుండా పుట్టినప్పటినుంచి మనిషిని పీడించే వృద్ధాప్యం గురించి ఆయన పరిశోధన చేేసే లాబొరేటరీకి పరిమితయ్యాడు.

అవ్వ చెంగమ్మతో హేమచంద్రారెడ్డి పిల్లలు


వృధ్యాప్యం అంటే ఏమిటి? చావంటే ఏమిటి? వృద్ధాప్యం ఎందుకొస్తుంది? ఎందుకలా జబ్బులతో, పతనంతో పీడిస్తుంది? వృద్ధాప్యంతో పాటి మతిమరుపు ఎందుకొస్తుంది, అసలు ఈ మతిమరుపు ఎపుడు మొదలవుతుంది? దాన్ని అధిగమించడం ఎలా? మతిపరుపురాకుండా హుందాగా వృద్ధాప్యంలోకి ప్రవేశించవచ్చా, వృద్ధాప్యం గడపవచ్చా? వృద్ధాప్యం జబ్బులు సొసైటీ నుంచి వస్తాయా, లేక మనిషిలోనే ఎక్కడో కణాంతరాలలో పుడతాయా? ఈ సమస్యలేకుండా గ్రేస్ ఫుల్ గా వృద్ధాప్యాన్ని ఎంజాయ్ చేయవచ్చా, చేయవచ్చంటే ఎలా? ఇలాంటి ప్రశ్నలకు ఆయన సమాధానం వెతికాడు.
ఈయన పరిశోధన చేస్తున్నది బాహ్యప్రపంచంలో కాదు, మనిషి నరాల్లో, కంటికి కనిపించని కణాల్లో, ఇంకా లోలోతుకుపోయి జన్యువుల్లో… ఇంకా దూరం పోయి జన్యువుల్లోని ప్రొటీన్లలో. ఆయనకు ఫెలోషిప్ ఎందుకిచ్చారో చెబుతూ AAAS ఒక ప్రశంసా పత్రం విడుదల చేసింది. అందులో ఇలా రాశారు:
The AAAS elected 489 of its members as Fellows in 2020. Reddy was elected in the Biological Sciences category for his pioneering contributions to the fields of Alzheimer’s disease and mitochondrial neurobiology, particularly in discovering the key role of mitochondria in neurodegenerative diseases and their treatment. Mitochondria, considered the power generators of cells, take in and breakdown nutrients to create high-energy molecules for the cell.
ఇదే ఎత్తుకు ఆయన బిజినెస్ లోనో ఐటిలోనొో, సినిమాల్లోనో చేరివుంటే సెలెబ్రిటీ అయ్యేవాడు. నవంబర్ 27న టివీలో బ్రేకింగ్ అంటూ మద్దెల మోయించే వాళ్లు, పత్రికలోళ్లు మల్లంగుంటకు పరిగెత్తుకుంటూ హేమచంద్రారెడ్డి ఇల్లేది,బడేది,కాలేజీ ఏది,యూనివర్శిటీ ఏది, క్లాస్ మేట్స్ ఎవరూ అంటూ వెదుకులాడే వాళ్లు. హేమ్ పనిచేసింది గ్లామర్ లేని ప్రపంచంలో… ఏదో యూనివర్శిటీలో, ఏదో మూలన ల్యాబ్ లో కూర్చుని నిరంతరం చేసే పరిశోధన. మనిషి జీవితం చరమాంకంలో ప్రశాంతంగా సాగేంచేకు సాయపడే రహస్యాల అన్వేషణ.

హేమ్ 1981-83 లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాాలయంలో ఫిజికల్ యాంథ్రోపాలజీ అండ్ ప్రిహిస్టారిక్ అర్కియాలజీలో (PAPA) ఎమ్మెస్సీ చేశాడు. ఆరోజుల్లో ఈ సబ్జక్టును ఎవరు తీసుకునే వాళ్లు కాదు. ఎమ్మె్సీ జువాలజీ, బాటనీ, బయోకెమిస్ట్రీ వంటి డిపార్ట్ మెంట్ లలో సీటు రాకపోతే ఫిజికల్ యాంథ్రోపాలజీ తీసుకునే వాళ్లు. మార్కెట్లో డిమాండ్ లేని సబ్జక్టు అది.అందుకే యూనివర్శిటీలో ఈ శాఖ ఇపుడు లేదు, ఇందులో చేరే వాళ్లు లేక మూసేశారు.దీనిని మరొకశాఖలో విలీనం చేశారు. అయితే, 1981లో ఈ శాఖలో చేరిన వాళ్లంతా చాలా సీరియస్ స్టుడెంట్స్. అందుకే కొత్త స్పెషలైజేషన్స్ కావాలని పట్టుబట్డి పోరాడి సైటో జెనెటిక్స్,పాపులేషన్ జెనెటిక్స్, ఫోరెన్సిక్ యాంథ్రోపాలజీ వంటి వాటిని తెచ్చుకున్నారు. అంటే అందరూ రీసెర్చు వైపు వెళ్లాలనుకున్నారు. హేమచంద్రారెడ్డి సైటో జెనెటిక్స్ వైపు వెళ్లాడు.


మల్లంగుంటనుంచి ప్రయాణం
హేమ్ తిరుపతికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరాన ఉన్న మల్లంగుంటలో ఒక పేద రెైతుబిడ్డ, యూనివర్శీటీ లో ఇబిసి స్కాలర్ షిప్ తో హాస్టల్లో ఉండేవాడు. స్కూలు చదువు మల్లంగుంటలో సాగింది.తర్వాత తిరుపతి ఎస్వీ హైస్కూలుకు మారాడు. పొద్దునే వాళ్లవ్వ (జేజి) ముందు రాత్రి నీళ్లలో నాన బెట్టిన రాగిముద్ద టిపిన్ బాక్స్ లో పెట్టుకుని దాని మీద మాడికాయ కారం ఒప్పు ఒకటేసుకుని, చేసంచి నిండా పుస్తకాలు మోసుకుని నడచుకుంటూ తిరుపతికొచ్చే వాడు. కాలేజీ దాకా ఇదే జీవితం, యూనివర్శిటీ చేరాకనే హాస్టల్ భోజనం.

శ్రీమతితో హేమచంద్రారెడ్డి
ఈ పరిశోధనకు ఎక్కడ పునాది పడిందోయ్ అంటే , ‘ మా యవ్వ కట్టిచ్చిన చద్ది రాగిముద్దలోనే ఏదో ఉందయ్యా. దాని రుచి, అది అందించిన శక్తి ఇదిగో ఇంకా భద్రంగా ఉంది తలకాయలో. అక్కడి నుంచి అవ్వే నాకు ప్రేరణ. నేను వృద్దాప్యం మీద రీసెర్చు చేయాలను కోవడానకి కారణంకూడా అవ్వనే,’ అని హేమ్ గొప్పగా వాళ్లవ్వ గురించి, తన టిఫిన్ బాక్స్ గురించి చెబుతాడు.
వాళ్లవూరు, ఆవూరి మనుషులు, స్నేహితులు…నాటి జీవితమంతా ఆయన జ్ఞాపకాల్లో సజీవంగా ఉంది. హేమ్ నిలువెత్తు కుప్పపోసిన ఆత్మీయత. పెదవులు మీద చెరగని చిరునవ్వు హేమ్ ఐడెంటిటి. తనకు AAAS ఫెలోషిప్ వస్తున్నదని, ప్రకటన నవంబర్ చివర్లో ఉంటుందని నాకు చెప్పాడు. నేను మర్చిపోయాను. ఈ విషయం మాట్లాడేందుకు ఫోన్ చేస్తే, ఒక నిమిషం పాటు, హెలో అని కూడా చెప్పకుండా, ఎమోషనల్ అయిపోయి అనందంతో నవ్వుతూనే ఉండిపోయాడు. మా ఇద్దరి మధ్య రెండు నిమిషాలు మాటల్లేవు. భాష మొత్తం నవ్వుగా విరబూసింది. గుభాళించింది.
వృధ్యాప్యం మీద రీసెర్చ్ ఎలా మొదలయింది?
వాళ్లవ్వ (జేజికి) పార్నపల్లి చెంగమ్మ 94 సంవత్సరాల దాకాజీవించింది. ఆమెకు వృద్ధాప్యంలో మతిమరపు (Dementia) వచ్చింది. ఏదీ గుర్తుండటం లేదు. జీవితం నరకమయింది. ఇండియా వచ్చినపుడల్లా ఈ పరిస్థితి చూసి ఆయన చలించిపోయాడు. వృద్ధాప్యంలో హుందాగా జీవితం సాగాలిగాని, ఇలా నరకం కాకూడదు అనుకున్నాడు. ఈ జబ్బు గురించి పరిశోధన చేసి తీరాలనుకున్నాడు. వృద్ధాప్యంలో కనిపించే శారీకర, నరాలాపతనావస్థకు కారణాలు వెదకడంలో గత 20 సంవత్సరాలుగా మునిగిపోయాడు. ఇందులో కణంలో ఉండే మైటోఖాండ్రియా పాత్ర చాలా ఉందని ఒక సత్యం ఆవిష్కరించాడు. ఆయన పరిశోధన వల్ల వృద్ధాప్యం, డిమెన్సియా, ఎల్జైమర్స్, హంటింగ్టన్ జబ్బు ల గురించి మనిషి అవగాహన చాలా పెరిగింది. వాటి చికిత్సకు మార్గం ఏర్పడింది.

వృద్దాప్యం లో వచ్చే జబ్బులు, నరాల పతనం (neurodegeration) ఎలా ఉంటుంది, కణాల్లో మైటోఖాండ్రియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎలా ఉంటుంది అనే అంశాల మీద ఆయన చేసిన లోతైన పరిశోధన లకు, పరిశోధనా పద్ధతులకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.
ఇపుడు ఈ ఎస్వీయు పూర్వ విద్యార్థి టెక్సాస్ టెక్ యూనివర్శిటీ హెల్త్ సైన్స్ స్ సెంటర్ ( TTUHSC)లో ప్రొఫెసర్. ఆయన డిపార్ట్ మెంటులో న్యూరాలజీ,న్యూరో సైన్సెస్, ఫార్మకాలజీ, ఇంటర్నల్ మెడిసిన్, స్పీచ్, లాంగ్వేజీ విభాగాలు ఉన్నాయి.
హేమచంద్రారెడ్డి రీసెర్చ్ గురించి నాలుగు ముక్కలు
హేమచంద్రారెడ్డి , అందే మనం మల్లంగుంట పిలకాయ్ రీసెర్చ్ చూస్తే గుండె గుభేల్ మంటుంది. హేమ్ చేసిన రీసెర్చ్ లోతుపాతులు, పొడువు నిడివి గుండె చెక్కుచెదరకుండా తెలుసుకోవాలనుకుంటే Tirupati SVU Alumnus in the Club of Global, Nobel Scientists మీద క్లిక్ చేసి చదవండి.
హేమచంద్రారెడ్డి రీసెర్చ్ అంతర్జాతీయ పరిశోధనలను చాలా బాగా ప్రభావితం చేసింది. ఆయన truly unique అనే క్యాటగరీ కింద వచ్చే శాస్త్ర వేత్త. అది అసాధారణమయిన గుర్తింపు. హేమ్ ఇంతవరకు 160 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. గూగుల్ స్కాలర్ ఇండెక్స్ వెబ్ సైట్ ప్రకారం వీటిని 16,579 సార్లు ఇతర పరిశోధకులు తమ పరిశోధనా పత్రాల్లో ఉటంకించారు. ఇది చాలా చాలా అసమాన ప్రతిభ. ఆయన పరిశోధనల H-index 66.
ఒక శాస్త్రవేత్త పరిశోధన శాస్త్ర ప్రపంచాన్ని ఎంతవరకు ప్రభావింతో చేసిందో తెలియచేప్పేదే H-Index (Hirsch Index).ఈ స్కేలు మీద 20 సంవత్సరాల పరిశోధన తర్వాత నెంబర్ 20 వస్తే ఆయన Successful Scientist కింద లెక్క. ఈ ఇండెక్స్ నెంబర్ 40 వస్తే Outstanding Scientist గా పరిగణిస్తారు. ఈ ఇండెక్స్ నెంబర్ 60 వస్తే Truly Unique శాస్త్రవేత్త అవుతాడు. హేమ్ దీనిని దాటిపోయాడు.
ఇట్లాగే i-index మీద హేమ్ స్కోర్ 128. మామూలు ప్రతి రీసెర్చ్ పేపర్ కనీసం పది సార్లు ఇతర పరిశోధనల్లో ఉటంకిస్తే ఐ-ఇండెక్స్ గుర్తింపు వస్తుంది. ఈ స్నేలు మీద హేమచంద్రారెడ్డి స్కోర్ 128.
AAAS ప్రశంసా పత్రంలో హేమ్ పరిశోధన గురించి ఏం ప్రశంసించారంటే……the Reddy lab is actively investigating chronic conditions such as diabetes, obesity, cardiovascular disease, kidney disease, stroke, vascular dementia, and other factors that are associated with dementia.
2014 లో హేమచంద్రారెడ్డి అమెరికా న్యూరోలాజికల్ సొసైటీ ఫెలో కూడా అయ్యారు.
ఇండియాలో ఉండిఉంటే ఏమై ఉండేది…
శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ఎమ్మెస్సీ పూర్తి చేశాక, సిసిఎంబిలో లో .రీసెర్చ్ ఉద్యోగంలో కుదిరాడు.అయితే, అపుడే ఆయనకు కామన్ వెల్త్ ఫెలోషిప్ రావడంతో ఇంగ్లండుకు వెళ్లి పిహెచ్ డి పూర్తి చేశారు. ఆపైన ఇండియా వచ్చి ఉద్యోగంలో స్థిరపడాలకున్నాడు.
దాదాపు 15 ఇంటర్వ్యూలు అటెండయ్యాడు. ఇంగ్లండు కు చెందిన ప్రతిష్టాత్మకమయిన యూనివర్శిటీనుంచి డాక్టొరేట్ ఉన్నా ఆయన ఉద్యోగంలో రాలేదు. దానితో ఆయన మెంటర్ సలహా మేరకు పోస్టు డాక్టొరల్ కు అమెరికా వెళ్లాడు. అలా కాకుండా ఇండియా లో ఏదో యూనివర్శిటీ లో ఉద్యోగం వచ్చి ఉంటే ఇక్కడి ముఠారాజకీయాల్లో ఇలాంటి పరిశోధన సాగించే ఉండే వాడుకాదేమో. ఏదో ఒక యూనివర్శిటీలో రిజిస్ట్రారో విసియో అయి ఉండేవాడు. ఇండియా లో చాలా మంది ప్రొఫెసర్లు పరిశోధన కంటే అడ్మినిష్ట్రేటివ్ పోస్టులను ఇష్టపడతారు. ఫ్రొఫెసర్ అయినప్పటినుంచి చాలా మంది పైరవీలు చేసుకుంటూ విసియో , రిజిస్ట్రారొ కావడమే జీవితాశయంగా పెట్టుకుంటారు. హేమచంద్రారెడ్డి ఈ కులమత రాజకీయాల కూపంలో పడకుండా అట్లాంటిక్ అవలి వొడ్డుకు ఈదుకుంటూ వెళ్లిన సాహసి
అమెరికాలో అరుదైన గుర్తింపు
తొలినుంచి హేమచంద్రారెడ్డి అంతర్జాతీయ శాస్త్రవేత్తల దగ్గిరే పనిచేశారు. ఆయన పోస్టు డాక్టొరల్ పరిశోధనకోసం అమెరికా వెళ్లడం పరిశోధన యాత్రలో ఒక కీలకమయిన మలుపు. పోస్టుడాక్టొరల్ పరిశోధన ఆమెరికా జీనోమ్ ప్రాజక్టులో (National Human Genome Research Institute) సాగింది. జీనోమ్ ప్రాజక్టును ప్రారంభించింది డిఎన్ ఎస్ ని కనిపెట్టిన వారిలో ఒకరైన జేమ్స్ వాట్సన్. మనిషిలోని జీనోమ్ లెటర్స్ ని గుర్తించేందుకు 1989లో ఈ ప్రాజక్టును ప్రారంభించారు.ఇది నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) ఆధ్వర్యంలో మొదలయిన పరిశోధన.
NIH ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో పాలుపంచుకున్న 163 మంది శాస్త్రవేత్తలో ఇంతవరకు ఒక్కరిగానో, భాగస్వాములుగానొ 96 మందికి నోబెల్ బహుమతులొచ్చాయి. ఇంకా చాలా కాలం ఉంది. ఒకపరిశోధన ఆవిష్కరణకు నోబెల్ బహమతి మూడు దశాబ్దాలుకూడా పడుతుంది. హేమచంద్రరెడ్డి అధిరోహించాల్సింది ఆ శిఖరమే.

రచన:-జింకా నాగరాజు. సీనియర్ జర్నలిస్ట్ ,ట్రెండింగ్ న్యూస్ సంపాదకులు.

జింకా నాగరాజు

1 comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s