అనంతపురం జిల్లా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా. దీని వైశాల్యం 19135 చ.కి.మీ.గోదావరి రెండు జిల్లాలంత ఉంటుంది. ఇందులో సాగు భూమి 27 లక్షల ఎకరాలు. దీనిలో ఒక లక్షా 76 వేల ఎకరాలు నీటి పారుదల పథకాల కింద ఉంటే, 55 వేల ఎకరాలు  చెరువులు కుంటల కింద సాగువుతోంది.దాదాపు 88 శాతం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువ.గాలులు ఎక్కువ.జీవనదులు లేవు. జిల్లాలో వర్షపాతం తక్కువ. కేవలం 550మి.మీ. మాత్రమే. జిల్లాలో సగటు ఆవిరి నష్టం 1850 మిల్లీమీటర్లు.భూమి మీద పడిన నీరు ఆవిరై పోతుంది. జిల్లాలో ఏ మండలంలో కూడా సహజమైన నీటివనరులు లేవు.మొత్తం గ్రామాలన్నీ తాగునీటి కోసం బయటి నుంచి వచ్చే నీటి మీద ఆధారపడా ల్సిందే.జిల్లాలోని రిజర్వాయర్ల సామర్థ్యం 24 టీఎంసీలు మాత్రమే. చెరువులు కుంటలది 16టిఎంసిలు.   అంటే 25 లక్షల ఎకరాల్లో వర్షాధారం మీద ఆధారపడే రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఈ సాగుభూమికి ఆరుతడి కింద ఒక పంటకు నీళ్లు ఇవ్వాలంటే 250 టిఎంసిల నీళ్లు కావాలి. తాగునీటి కోసం కనీసం 30 టీఎంసీల నీరు కావాలి .ఇది ఈ జిల్లా అవసరం.               అనంతపురం జిల్లాలోని పెన్నార్ పరివాహక ప్రాంతంలో అప్పర్ పెన్నార్, మిడ్ పెన్నార్, చిత్రావతి, తడకలేరు, కుందేరు, పాపాగ్ని, సగిలేరు, చెయ్యేరు, లోయర్ పెన్నేరు అని పది నదులున్నాయి. అయితే గడిచిన దశాబ్దకాలంలో చూస్తే నీరు ప్రవహించిన దాఖలాల్లేవు.పేరుకు నదులే గాని ఇందులో నీళ్లుండవు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా వచ్చే 22 టిఎంసిలే జిల్లాకు ఏకైకా జలాధారంగా ఉంటోంది. అరకొరగా కురిసినవర్షాలతో నిండే చెరువులు, కుంటలు, భూగర్భజలాలే జిల్లాకు సాగునీటి వనరుగా ఉంటున్నాయి. అందుకే జిల్లా అంతా అడుగంటిన భూగర్భ జలాలు పచ్చదనం కానరాని కొండలు మనకి కనిపిస్తూ ఉంటాయి.       జిల్లాలో సగటున పడే వర్షపాతం  550 మి.మీ. ఇది     కూడా సక్రమంగా పడడం లేదు. వాగులు వంకలు పారవు.దీంతోతరచూ కరువులు ఏర్పడుతున్నాయి. గడిచిన 17 సంవత్సరాల్లో 14 సం.లు కరువొచ్చింది.గత నాలుగు సంవత్సరాలుగా కరువే.


     కరువుతో కేవలం తిండి కొరత,నీటి కొరత మాత్రమే ఏర్పడవు.అది జీవించేందుకు అనేక అమానవీయ పరిస్థితులు ఉత్పన్నం చేస్తుంది.దీని వలన జిల్లాలో రెండు సామాజిక సమస్యలు ముందుకు వచ్చాయి. ఒకటి వలసలు. రెండు మహిళల అక్రమ తరలింపు. వ్యవసాయం తిరోగమనం చెందడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో దళిత బలహీన వర్గాలకు జీవనోపాధి కరువైంది. దాంతో వలస మార్గం చేపట్టారు.కొంతమంది కేరళకు అడుక్కోవడానికి వెళ్లారు.మరికొంతమంది బెంగుళూరు, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ లాంటి నగరాలకు పనులకోసం వెళ్లారు. ముస్లిం కుటుంబాల నుంచి ఆ తర్వాత వెనుకబడిన కులాల నుంచిపూనే,ముంబయి నగరాలకు  అమ్మాయిల    తరలింపు మొదలైంది. ఆర్థిక సంక్షోభాలను నివారించవచ్చు లేదా రూపుమాపవచ్చు కానీ దిగజారిపోయిన సాంఘిక విలువలను, జీవన పరిస్థితులను మెరుగు పరచడం సులభమైన విషయం కాదు.  ప్రతి ఏటా వచ్చే కరువులను పారద్రోలడానికి బ్రిటీష్ వారు ప్రయత్నంచేశారు.అనంతపురం, కడపజిల్లాలలో ప్రవహించే పెన్నా బేసిన్ లో నీళ్ళు లేవు కనుక పెన్నా బేసిన్కు నీరు మళ్ళించాలని మద్రాసు ప్రభుత్వం 1901లో సర్ కాలిన్. సి. స్కాట్ అధ్యక్షతన ఇరిగేషన్ కమిషన్ ను నియమించింది.ఈ కమిషన్ మల్లేశ్వరం వద్ద తుంగభద్ర నది మీదుగా ఓ పెద్ద ఆనకట్ట కట్టి కృష్ణా పెన్నా బేసిన్లు కలపాలని సమగ్రమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది.దీంతో కల్నల్ మెకంజీ  300 టీఎంసీల సామర్థ్యంతో మల్లేశ్వరం వద్ధనూ, 60టిఎంసిలతో కడప జిల్లాలోని గండికోట వద్దనూ రిజర్వాయర్లను నిర్మించికృష్ణా నీటిని తరలించాలని ప్రణాళిక రచించారు. 1905_06 లో కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నది మీద ఆనకట్ట నిర్మించాలని కూడా ఆయన ప్రతిపాదించాడు. ఇవి అమలై ఉంటే జిల్లాకు 60 నుంచి 70 టీఎంసీలు  నమ్మకంగా వచ్చేవి. 

      తుంగభద్ర జలాశయాన్ని  1951 లో నిర్మించిననాటినుండి 1993 వరకు ప్రవాహములో కొట్టుకొని వచ్చిన ఒండ్రు మట్టి పూడిక వల్ల దాని నిల్వ సామర్థ్యం133 టి.యం.సి. నుంచి 119 టి.ఎం.సిలకి తగ్గింది. 1993 లో జరిపిన సర్వేలో దాని సామర్థ్యం 111.5 టి.ఎం.సి.లు.అందువల్ల దానిలో నీటి లభ్యత 212 టి.యం.సి.ల నుండి 170 టి.యం.సి.లకు తగ్గిపోయింది. ఈ ఒండ్రుమట్టి పేరుకొనడం నిరంతరం కొనసాగడం వలన ప్రతి సంవత్సరం రిజర్వాయర్ పరిమాణం 0.50 టి.ఎం.సి.లు తగ్గుతూ వస్తున్నది. నీటి లభ్యత తగ్గుతుండటం వలన జిల్లా కు రావలసిన నీటి కోటా తగ్గి ప్రస్తుతం ఎగువకాలువకు రావలసిన 32.50 టి.ఎం.సి.లనుంచి 26. 50 టి.ఎం.సి.కి తగ్గించబడింది. 

             తుంగభద్ర జలాశయం నుంచి 212 టి.ఎం.సి.లు నీరు కూడా రాష్ట్రానికి కేటాయించిన కృష్ణాజలాలలో ఇమిడి ఉంది. అందులో 73 టి.ఎం.సి.లుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు,  139 కర్నాటక కు   కేటాయించారు.తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా 32 టీఎంసీలు ఈ జిల్లాకు కేటా యించామని చెప్తున్నారు. కానీ ఇందులో వచ్చేది మాత్రం 20టి ఎంసి లు మాత్రమే. దాంట్లో కూడా ఆరు టిఎంసిలు కడప కర్నూలు కు పోతాయి. అంటే 14 టిఎంసిలేఅనంతపురానికి మిగిలేది.1950 లో ఈ పథకం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేశారు.అప్పట్లో మన ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కి ప్రాధాన్యత నిచ్చి ఎక్కువ విద్యుత్ ను తీసుకుని,దానికి బదులుగా తక్కువ నీటికి అంగీకరించింది.అది కూడా మనకు నీటి లభ్యత తగ్గి పోవడానికి కారణం.         అనంతపురం జిల్లా 1050-1100 ఎం.ఎస్.ఎల్ ఎత్తైన ప్రాంతంలో ఉంది. మనకన్నా కృష్ణానది లోతట్టులో పారుతోంది. కృష్ణానీటిని మళ్ళించుకోవాలంటే ఎత్తిపోతల పథకాలు అమలు చేయాలి. కానీ తుంగభద్ర జలాశయం మనకన్నా ఎత్తులో ఉంది. దాదాపు 500 ఎం.ఎస్.ఎల్. తేడా వుంది. ఆ ప్రాంతం 633 ఎం.ఎస్.ఎల్ లో వుంది. నీటిని గురుత్వాకర్షణ ద్వారా మనం సులభంగా పొందవచ్చు. తుంగభద్ర, భీమా, హంద్రి, దిండి, మూసి ఉపనదులు ఉన్నాయి. కృష్ణాకు అధిక నీరందించే ఉపనది తుంగభద్ర మాత్రమే. కృష్ణానదికి 2390 టి.ఎం.సి అడుగుల నీరు లభిస్తున్నట్లు బచావత్ ట్రిబ్యునల్ లెక్కవేసింది. నాలుగు రాష్ట్రాలకూ కృష్ణానది నీటిని కేటాయించేందుకు బచావత్ నేతృత్వంలో కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఉంది. లభిస్తున్న నీటిలో 75 శాతం విశ్వసనీయత ఆధారంగా 2060 టి.ఎం.సి. అడుగుల నీరు నికరంగా లభిస్తున్నట్లు లెక్కకట్టారు. ఇందులో తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు విడుదల చేస్తున్న 212 టి.ఎం.సి.లనీరు కూడా ఇందులో ఉంది. మిగులు జలాల కింద 330 టీ.ఎం.సి.ల నీటిని అంచనా వేశారు. ఈ నీటికి 25 శాతం విశ్వసనీయత ఉంటుంది. ఈ నీరు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మిగులు జలాలను ఏ ప్రాజెక్టుకు కేటాయించలేదు. అందువల్ల మిగులు జలాలు ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు లభించింది.కృష్ణానది నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టి.ఎం.సి.లు, కర్నాటకకు 700, మహారాష్ట్రకు 560 టి.ఎం.సి.ల చొప్పున కేటాయించారు. విభజన ఒప్పందం ప్రకారం 66:34నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కు 512టిఎంసిలు, తెలంగాణ కు 299టిఎంసిలు పంచాలి.   అయితే ఇంతవరకు మిగులు జలాలను ఉపయోగించు కోవటంలో మన రాష్ట్ర గత ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. 30 ఎళ్ళు గడిచిపోతున్నా, బచావత్ గడువు మీరిపోయినా ఆనీటిని ఇప్పటికీ సద్వినియోగం చేసుకోలేక పోయాము. ఆ నీటిని వినియోగించుకొని సాగునీటి పథకాలను సాగునీటి పథకాలను చేపట్టివుంటే నీటిపై హక్కు లభించేది. మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పాటైతే సమీక్ష చేసినప్పుడు ఆ ప్రాజెక్టులకు నీటికేటాయింపు లభించేది.

రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా మిగులు జలాలను ఉపయో గించుకుని గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఎస్.ఎల్.బి.సి., నెట్టెంపాడు, భీమా తదితర సాగునీటి పథకాలను రూపొందించింది. ఈ పథకాలన్నీ అమలు చేసినా కేవలం 240 టి.ఎంసి.ల మిగులు జలాలను మాత్రమేవినియోగించుకోవటం సాధ్యమయ్యేది. కానీ ఇప్పటివరకు అవి అమలుకు నోచుకోలేదు. ఈ విధమైన పరిస్థితి ఏర్పడడానికి  కారణంఇక్కడి ప్రజా ప్రతినిధులు అసలు పట్టించుకోకపోవడమే. హంద్రీనీవా పథకం ఈ జిల్లాలో సాగుతోంది. రాయలసీమ జిల్లాలకు 40 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం డ్యాంలో చేరిన వరద నీటిని లిఫ్ట్ ద్వారా ఈ నీళ్ళు ఇవ్వాలన్నారు. కానీ రాయలసీమకు వరద  నీరు ఒక టీఎంసీ నీరు కూడా   రావట్లేదు.ఈజిల్లాకు  కనీసం 250 టీఎంసీల నీరు వస్తే ఒక పంటైనా రైతులు పండించు కుంటారు.   దీనికోసం కృష్ణా నది నీటి కేటాయింపు పునః పంపిణీ చేయాలి.  సర్కారు వారు మూడు పంటలకు సరిపడా నీళ్లు తీసుకుంటు న్నారు.రెండు పంటలు కూడా నోచుకోని ఈ జిల్లాకు 100 టీఎంసీల నికర జలాలు ఇవ్వడానికి సిద్ధపడాలి. తుంగభద్ర డ్యాం నుండి 50 టీఎంసీల నీరు జిల్లాకు మళ్ళించే ప్రణాళిక అమలు చేయాలి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం నుంచి 30 టీఎంసీల నీరు అడిగి తీసుకోవాలి. చెరువులు కుంటల్లో పూడికలు తీయాలి.అప్పుడు కొంతలో కొంత బాగుపడే అవకాశం ఉంది.

Pillaa kumaraswaamy,9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s