
ఇది కథ కాదు
కాళహస్తి కలంకారీకి చిత్తూరు చాక్లెట్ న్యూట్రిన్ కి సంబంధం ఏమిటి?
కలంకారీ కళను పునరుత్తేజం కల్పించి అంతర్జాతీయ ఖ్యాతి లభించేలా చేయడంలో ఇద్దరు స్త్రీలు ప్రధాన భూమిక పోషించారు. ఒకరు కమాలదేవి ఛటోపాధ్యాయ కాగా మరొకరు ఎవరు?
బెంగళూరు మహానగరం. ఒక రోజు మూటలో వస్త్రాలు పెట్టుకుని, ఇంటటింటికీ తిరిగి అమ్ముతున్న ఒక వృద్ధుడు ఒక ఇంటి తలుపు తట్టాడు. ఈ నగరంలో అంతటా తాము నిరాదరణకు గురవుతున్నామని, తమని బిచ్చగాళ్లని చూసినట్టు చూస్తున్నారని, సహాయం చేయాలని అర్థించాడు ఆ వృద్ధుడు.
ఆ మూటలోని వస్త్రాలను, వాటి పనితనాన్ని, వాటిని అమ్మడానికి ఆ వృద్దుడు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు ఆ ఇంటి యజమాని. ఆ ఇంటి యజమాని కూతురు పెట్టిన భోజనం తిన్నాక తనలాంటి కళాకారులు చాలామంది ఉన్నారని వారి దీనగాథని వారికి వివరించాడు ఆ వృద్ధుడు. రాయలసీమకు చెందిన ఒక మహోత్కృష్ట హస్తకళ ఖండాంతరాలకు వ్యాప్తి చెందడానికి ఆ సంఘటన నాంది పలికింది.
ఆ మూటలో ఉన్నవి కాళహస్తి కలంకారీ వస్త్రాలు. ఆ వృద్ధుడు కాళహస్తి కలంకారీ కళలో ఆరితేరిన పురుషోత్తం అనే కళాకారుడు. ఆ ఇంటి యజమాని మరెవరో కాదు, తాను పుట్టిన నేలకు ఏదన్నా చేయాలన్న భావనతో, దేశంలోనే ఒకప్పుడు పెద్ద కన్ఫెక్షనరీ పరిశ్రమగా ఉన్న న్యూట్రిన్ పరిశ్రమ వ్యవస్థాపకుడైన BV రెడ్డి గారి కుమారుడు న్యూట్రిన్ ద్వారాకనాథ రెడ్డి గారు.

పురుషోత్తం గారిలాగా చాలామంది కళాకారులు సరైన ఉపాధి లేకుండా ఉన్నారని, ఒకప్పుడు మహారాజులు పోషించిన గొప్ప కళ నేడు ఆదరణ లేకుండా పోయిందన్న విషయం తెలుసుకున్న ద్వారాకనాథ రెడ్డి గారు, వారి కుమార్తె అనితా రెడ్డి గారు కాళహస్తి కళకు, దానిని నమ్ముకుని ఉన్న కళాకారులకు ఏదైనా చేయాలని సంకల్పించారు.
అప్పటికే ద్వారకనాథ రెడ్డి గారు రమణ మహర్షి బోధనలపట్ల ఆకర్షితులై, ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ సమాజ సేవకై ద్వారాకనాథ రెడ్డి రమణార్పణం ట్రస్ట్(DRRT) ను నిర్వహిస్తున్నారు.
వారి కుమార్తె అనితా రెడ్డి విదేశాలలో విద్యనభ్యసించి సమాజానికి ఏదైనా చేయాలన్న ఆశయంతో బెంగళూరుకు తిరిగి వచ్చి అక్కడ స్లమ్స్ (మురికివాడల్లో) పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
ఈ సంఘటన జరుగిన మరుసటి దినమే ద్వారాకనాథ రెడ్డి, అనితా రెడ్డిలు కాళహస్తి బయలుదేరి అక్కడి కళాకారులను కలిసి, వారి పరిస్థితి ఆకళింపు చేసుకున్నారు.

వారి అభివృద్ధి కోసం ద్వారక DWARAKA (Development of Weavers and Rural Artisans in Kalamkari Art) ను స్థాపించారు. 1998లో DRRT ట్రస్ట్ సహాయంతో ఏర్పడిన ఈ సంస్థ ద్వారా కళాకారులకు శిక్షణ ఇవ్వడం, కలంకారీ వస్త్రాలు ఇతర ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వంటివి చేస్తున్నారు. దాదాపు 20 మందితో చెట్టు కింద మొదలైన సంస్థ నేడు కాళహస్తి చుట్టుపక్కల ఎంతో మంది జీవితాలను మార్చేసింది. కలంకారీ కళకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టింది.
పేద కళాకారుల అభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ సమాజ సేవ చేస్తున్న అనితా రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
కొడగట్టిన దీపంలా ఉన్న ఒక గొప్ప కళను పది మంది జీవితాలకు మార్గం చూపే వీధి దీపంలా మార్చడంలో ద్వారక సంస్థ కృషి ఎంతైనా ఉంది.
Sources, Pictures : http://dwarakaonline.com/Html/MainStory.htm
Snapdeal
https://collections.vam.ac.uk/item/O454176/kalamkari-gurappa-chetty-jonnalagadda/