
ఎనిమిదేళ్ళ క్రితం దాకా కేవలం పేరు వరకే తెలుసు. పాతికేళ్ళ క్రితం ఒకసారి వచ్చి ఆకాశవాణి కేంద్రంలో నన్ను కలిశానని అన్నారు కానీ గుర్తులేదు. కడపకు బదిలీ అయినప్పుడే గొల్లపల్లి మంజులాదేవి రేడియో కళా కౌశలం బోధపడింది. మంజులాదేవి ఆరేళ్ళుగా కాన్సర్ తో పోరాడి చివరకు ఓటమిని అంగీకరించి డిసెంబరు 6 ఆదివారం ఉదయం తిరుపతిలో కనుమూశారు.
అన్ని రకాల భావాలనూ, అన్ని అనుభూతులను స్పష్టంగా పలుకగలిగే గాత్రం ఆవిడకు తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటేశ్వర్లు వల్ల అబ్బి వుండవచ్చు. అయితే సాధన, పట్టుదల, క్రమశిక్షణ, మొండి ధైర్యం ఆ సామర్థ్యానికి బాసటగా నిలిచాయి. కనుకనే నేడు ఆకాశవాణి శ్రోతలు ఆవిడను తలచుకుని దిగులుపడుతున్నారు. ఈ విపత్తు సంభవించకపోతే మరో ఐదేళ్ళకు మించి ఆమె గొంతుక ఆకాశవాణి ప్రసారాలకు మాధుర్యపు సుగంధం అద్ది వుండేది. బదిలీ మీద 2012లో నేను హైదరాబాదు నుంచి కడప వెళ్లాను. చాలా పరిమితుల మధ్య మంజులాదేవి శ్రద్ధ, టాలెంటు కొసమెరుపుగా బోధపడ్డాయి. ఆమె అప్పటికి అనౌన్సరుగా మధ్యాహ్నం స్త్రీల కార్యక్రమాలతో, ఫోన్ ఇన్ పాటల కార్యక్రమంతో, ఉత్తరాల కార్యక్రమంతో బహుళ కీర్తి పొంది ఉన్నారు. అంతకుమించి రేడియో నాటకాలలో ఎంతో ప్రతిభ చూపి శ్రోతల హృదయాల్లో శాశ్వత నివాసం కూడా పొందివున్నారు. లకుమాదేవి, చంద్రలేఖ, మనస్విని, సౌభాగ్య వంటి పాత్రలు మాత్రమే కాక పెద్దరికం, అనురాగ శిఖరం, అనగనగా ఒకరోజు, వెన్నెల వర్షం, కలహాల కాపురం, అదీ విషయం వంటి నాటకాలు కూడా చిరస్మరణీయమయ్యాయి. ఇంకా హాస్యనాటకాలు, జిడ్డువరం, పప్పువినాయక, అద్దెఇల్లు మొదలైనవి కూడా ఎంతో రక్తి కట్టాయి. గుంతకల్లులో రైల్వేశాఖలో పనిచేసే చిన్న ఉద్యోగి ఇంట 1966 మే 27న తొలి సంతానంగా మంజులాదేవి జన్మించారు. తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు వున్నారు. చదువు అమ్మమ్మ ఇంటిలో అంటే ధర్మవరంలో బిఏ దాకా సాగింది. పిమ్మట ఎస్వీయూలో చరిత్ర ఎం.ఏ. పూర్తి చేసి 1994లో ఆకాశవాణి కడపలో అనౌన్సరుగా ఉద్యోగంలో చేరారు.. భౌగోళిక సౌలభ్యం వల్ల కడప ఆకాశవాణి ట్రాన్స్ మీటర్ ప్రసారాలు కేవలం తెలుగు ప్రాంతాలకే కాకుండా ఇటు ఢిల్లీ అటు అండమాన్ దాకా వినబడేవి. ఎత్తైన ప్రదేశంలో ఉండడంవల్ల ధార్వాడ ఆకాశవాణి కేంద్రం కూడా కడప వలె చాలా ప్రాంతాలకు చేరి ఆకర్షించేది. ఏ పనికేటాయించినా సులువుగా ఆకళింపు చేసుకుని రాణించే వ్యక్తి మంజులాదేవి. తొలి సంతానం కనుక మొదటి నుంచీ బాధ్యతలను మోసారు. అందులో భాగంగానే ఆమె వివాహం ఆలస్యమైంది. అంతేకాకుండా అవివాహితగా మిగిలిపోయారు. ఆమె తండ్రి చివరిరోజుల్లో ఆమె ఇంటిలోనే కడపలో కొన్ని సంవత్సరాల క్రితం కనుమూశారు. మంజులాదేవి 1994 నుండి 2017 దాకా కడప ఆకాశవాణిలో, తర్వాత తిరుపతి కేంద్రంలో పని చేశారు. రెండు ఆకాశవాణి కేంద్రాలలో కూడా రెండు సంవత్సరాలకు మించి ఆవిడతో నేను కలసి పనిచేయలేదు. కానీ ఆవిడ తోడ్పాటుతో సాధించిన విజయాలు గొప్ప తృప్తిని మిగిల్చాయి. అన్నమయ్య పదగోపురం కార్యక్రమానికి వేటూరి ఆనందమూర్తి, కామిశెట్టి శ్రీనివాసులు, శోభారాజు, బాలకృష్ణ ప్రసాద్, విఎకె రంగారావు, పివిఆర్ కె ప్రసాద్, సముద్రాల లక్ష్మణయ్య, శోభానాయుడు, కె.వి.రమణాచారి వంటి వారిని భాగస్వాములు చేస్తూ కొన్ని నెలలు సాగిన ధారావాహికను మంజులాదేవి అత్యద్భుతంగా నిర్వహించారు. అమరావతి కథలు మాత్రమే కాదు, కె.సభా కథలను కూడా రక్తి కట్టించి, తన గొంతుకతో మరింత జీవం పోశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మూడు డజన్ల సుప్రసిద్ధ కథకుల రచనలను ‘చిత్తూరు జిల్లా జీవన చిత్రం’గా మేము బృందంగా చేసిన ధారావాహిక ఒక చిత్తూరు జిల్లా సాహిత్యానికే కాదు, మొత్తం తెలుగు కథా సాహిత్యానికి సంబంధించిన విలక్షణమైన ప్రయోగంగా మిగిలింది. ప్రతి కథకు సంబంధించి పలుపార్శ్వాలు కల్గి ఉండటమే కాకుండా నైపుణ్యంగల కళాకారులకు వేదికగా తోడ్పడింది. అన్నమయ్య పదగోపురం, చిత్తూరు జిల్లా జీవన చిత్రం, అమరావతి కథలకు సంబంధించిన ధారావాహికల ఆలోచన, ప్రణాళిక నాది కావచ్చు కానీ మొత్తం, నిర్వహణాభారం, విజయం ఆవిడవే!
కరువు జిల్లాలో దళిత కుటుంబంలో జన్మించిన ఈ అపురూప ఆకాశవాణి కళాకారిణి గొల్లపల్లి మంజులాదేవి ఇటు రేడియో మాధ్యమానికీ, అటు ఆ ప్రాంతపు కళా సామర్థ్యానికి వెలుగుదివిటీ!
రచన:–డా. నాగసూరి వేణుగోపాల్
అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి
9440732392