
నిజ జీవిత హీరోలు – మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్
భారతదేశ యుద్ధ విజయాలలో అత్యంత చిరస్మరణీయమైంది 1971 ఇండో- పాక్ యుద్ధ విజయం(బాంగ్లాదేశ్ విమోచన యుద్ధం ). ఆ యుద్దంలో భారత సైన్యం ఇటు తూర్పున(తూర్పు పాకిస్తాన్), అటు పశ్చిమాన పాకిస్తాన్ సైన్యంతో ఏక కాలంలో తలపడాల్సి వచ్చింది. భారత దేశం త్రివిధ దళాలతో పాకిస్తాన్ ఓటమి లక్ష్యంగా 1971 డిసెంబర్ లో ‘ఆపరేషన్ కాక్టస్ లిల్లీ’ మొదలుపెట్టింది. ఆపరేషన్ కాక్టస్ లిల్లీలో ప్రముఖ పాత్ర వహించి 1971 యుద్ధ సమయంలో తను చూపిన తెగువకు గుర్తింపుగా ‘మహావీర చక్ర’ పురస్కారం అందుకున్నారు మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్ ( అప్పటికి లెఫ్టినెంట్ కల్నల్ ). చిత్తూరు వేణుగోపాల్ గారు చిత్తూరు జిల్లా తిరుపతి నివాసి.

గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ కమాండింగ్ అధికారిగా అప్పటికి లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్న చిత్తూర్ వేణుగోపాల్ ఉన్నారు. వీరి నేతృత్వంలో గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ భారత దేశ తూర్పు సరిహద్దులో పాకిస్తాన్ సైన్యంతో తలపడింది. డిసెంబర్ 4, 1971వ సంవత్సరం తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బాంగ్లాదేశ్) లోని సరిహద్దు ప్రాంతాలైన ఉథాలి, దర్శన ప్రాంతాలలో కట్టుదిట్టమైన శత్రువుల స్థావరాలను వేణుగోపాల్ గారి నేతృత్వంలో గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ స్వాధీనపరుచుకుంది. వేణుగోపాల్ గారు ముందు ఉండి శత్రుసైన్యాల మీద దాడి కొనసాగించారు. రెండు బలమైన స్థావరాలు స్వాధీనంతో వీరు ఆగలేదు, పారిపోతున్న శత్రు సైనికులు తిరిగి బలం పుంజుకోకుండా, అదనపు బలగాలు వారికి సహాయం రాలేని విధంగా మూడు రోజులు దాడి కొనసాగించి జెండియా కూడా స్వాధీన పరుచుకున్నారు.
ఈ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, తన బెటాలియన్ ను ముందుండి నడిపించి శత్రు స్థావరాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడినందుకు వేణుగోపాల్ గారికి రెండవ అత్యుత్తమ సైనిక పురస్కారమైన మహావీర చక్ర పురస్కారం లభించింది.

వీరు అందించిన సేవలను గుర్తింపుగా వీరిని పరమ విశిష్ట సేవా మెడల్ కూడా వరించింది. సైన్యంలో అంచలంచలుగా ఎదిగి మేజర్ జనరల్ స్థాయికి చేరుకున్నారు వేణుగోపాల్ గారు.
సేకరణ:– చందమూరి నరసింహారెడ్డి
Pics and Source:
మీరు మా రాయలసీమ వారు అవ్వటం మాకు గర్వకారణం వేణుగోపాల్ గారు. మీకు మా నమస్కారాలు.
LikeLike