
ఆంధ్ర రాష్ట్రంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా ?
రాయలసీమలో మొదటి సిమెంటు పరిశ్రమ అయిన పాణ్యం సిమెంట్స్ వ్యవస్థాపకులు ఎవరో తెలుసా ?
దేశంలో సహకార రంగంలో అతి పెద్ద చేనేత సంస్థలలో ఒకటైన YWCS (ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ) స్థాపకుడు ఎవరో తెలుసా ?
1960లలోనే విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో భారత ఉపఖండంలోనే మొట్టమొదటి స్ప్రింగ్స్ తయారీ పరిశ్రమ కంపెనీ అయిన SSSను స్థాపించింది ఎవరో తెలుసా ?
అన్నిటికీ ఒకే సమాధానం – మాచాని సోమప్ప – ఎమ్మిగనూరు ముద్దుబిడ్డ
అయన పారిశ్రామికవేత్త, విద్యావేత్త, సహకారరంగంలో చేనేత పితామహుడు, జాతీయ స్థాయిలో అనేక హోదాల్లో పనిచేసిన వ్యక్తి మాచాని సోమప్ప.
శతబ్దాలుగా ఎమ్మిగనూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. వందలాది చేనేత కుటుంబాలకు ఎమ్మిగనూరు ఆవాసం. మాచాని సోమప్ప1904వ సంవత్సరంలోఒక చేనేత కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి మాచాని సోమన్న మాస్టర్ వీవర్. ఐదుగురు అన్నదమ్ముల మాచాని కుటుంబంలో సోమప్ప నాలుగవవాడు. పెద్దన్న మాచాని గంగప్ప అభీష్టం మేరకు కర్నూలు లోని కోల్స్ మెమోరియల్ స్కూల్ లో SSLC వరకు చదివారు. తరువాత తరువాత వ్యాపారం ప్రారంభించి అనంతకాలంలోనే పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. తరచూ వచ్చే కరువుల వల్ల ఎమ్మిగనూరు చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవారు. 1930లలోకరువు సంభవించినపుడు కష్టాలలో ఉన్న చేనేతకార్మికుల కోసం 1937లో ఒక రిలీఫ్ సెంటర్ ను ప్రారంభించారు. రిలీఫ్ సెంటర్ ను మూసివేసిన తరువాత 1938లో ఎమ్మిగనూరు చేనేత కార్మికులకు అండగా సహకార పద్దతిలో YWCS (ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ) సంస్థను మాచాని సోమప్ప ప్రారంభించారు.

మొదట కేవలం 20 మందితో ప్రారంభమైన YWCS యొక్క సభ్యులసంఖ్య తరువాతకాలంలో వేలల్లో పెరిగింది.YWCS శాఖలు కర్నూలుజిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. సహకారరంగంలో ఒక విజయవంతమైన ఒరవడికి YWCS శ్రీకారం చుట్టినట్టయింది తరువాత కాలంలో YWCS పంథాలో దేశంలో అనేక సహకార చేనేత సంస్థలు ఏర్పడ్డాయి. ఎమ్మిగనూరు / కర్నూలు చేనేత కార్మికుల అభివృద్ధిలో, ఎమ్మిగమునూరు పట్టణం అభివృద్ధిలో YWCS పాత్ర ఎంతైనా ఉంది. YWCS విజయం ఇచ్చిన ప్రేరణతో తరువాత సహకార రంగంలోనే ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ స్టోర్స్, ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్, ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ మిల్క్ సప్లై సొసైటీ, మార్కెటింగ్ సొసైటీ, హౌస్ బిల్డింగ్ సొసైటీ వంటి అనేక సంస్థలను ప్రారంభించి సోమప్ప ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశారు.
మాచాని గ్రూప్:
ఐదుగురు అన్నదమ్ములలో పెద్దవాడైన మాచాని గంగప్ప పేరిట 1928లో మాచాని కుటుంబం MG Brothers సంస్థను స్థాపించి, ఆ సంస్థ కింద అనేక పరిశ్రమలు నెలకొల్పారు. వ్యాపారాలు ప్రారంభించారు
పరిశ్రమలు :
రాయలసీమలోని ప్రముఖ స్పిన్నింగ్ మిల్స్ ఎమ్మిగనూరు స్పిన్నింగ్ మిల్స్ (1940), రాయలసీమ స్పిన్నింగ్ మిల్స్ (ఆదోని), గుంతకల్ కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ (దేశంలోనే ఈ తరహా పరిశ్రమల్లో మొదటిది ) వంటి భారీ పరిశ్రమలు సోమప్ప ఆధ్వర్యంలో ఏర్పడినవే. అంతే కాక టెక్స్టైల్స్, ఇంజనీరింగ్, రవాణా, వాహన మొదలగు రంగాలలో సోమప్ప మరియు MG గ్రూప్ అనేక పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించారు.
పాణ్యం సిమెంట్స్:
రాయలసీమలో ఏర్పడిన మొదటి సిమెంటు పరిశ్రమ పాణ్యం సిమెంట్స్ & మినరల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ పరిశ్రమ 1955లో మాచాని సోమప్పగారి MG గ్రూప్ సారధ్యంలో ఏర్పడింది.తదనంతర కాలంలో నందిగ్రూప్ వారి అధీనంలో ఉన్నది.

SSS – స్టంప్, షూల్ అండ్ సోమప్ప
1960లో ప్రఖ్యాత జర్మనీ కంపెనీ స్టంప్+షూల్ (Stump+Schule GmbH) భాగస్వామ్యంతో సోమప్ప గ్రూప్ (MGB) బెంగళూరులో SSS – స్టంప్, షూల్ అండ్ సోమప్ప స్ప్రింగ్స్ తయారీ పరిశ్రమను నెలకొల్పింది. భారత ఉపఖండంలోనే ఇది తొలి స్ప్రింగ్స్ తయారీ పరిశ్రమ. అంతేకాక ప్రస్తుతం SSS కంపెనీ భారతదేశంలో నాణ్యమైన స్ప్రింగ్స్ తయారీ కంపెనీలలో ముందువరసలో ఉంది.
రచనలు:
YWCS అధ్యక్షుడిగా, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు సభ్యుడిగా వివిధ హోదాల్లో చేనేత రంగ అభివృద్ధికి వివిధ సూచనలు చేశారు సోమప్ప. వారు రచించి YWCS ఆధ్వర్యంలో వెలువడిన ”Whither Handlooms” , “Fairdeal to Handlooms”, “The Voice of the Handlooms” వంటి పుస్తకాలు
చేనేతరంగ అభివృద్ధికి మార్గదర్శకాల వంటివి.
పద్మ పురస్కారం.
భారతదేశం అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మ పురస్కారాలను 1954వ సంవత్సరంలో మొదలుపెట్టింది. ఈపురస్కారాలు ఇవ్వడం మొదలు పెట్టిన తొలి జాబితాలోనే శ్రీ మాచాని సోమప్పగారికి పద్మశ్రీ పురాస్కారం లభించింది. వారు చేనేత రంగానికి, సహకార రంగానికి చేసిన అపూర్వ సేవకు ‘ప్రజా సంబంధాల’ కేటగిరీలో వారికి ఈ అవార్డు లభించింది. అప్పటికి అయన అఖిల భారత చేనేత బోర్డులో సభ్యులుగా ఉన్నారు.

సమాజ సేవ / విద్యాలయాలు
మాచాని సోమప్ప విద్యావేత్త. విద్యను బాగా ప్రోత్సహించారు.
వీరి పేరుతో ఎమ్మిగనూరులోమాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏ కాక మాచాని సోమప్ప గర్ల్స్ ZPHS హై స్కూల్ వంటి విద్యాలయాలు ఉన్నాయి. మాచాని చారిటీస్ పేరిట వీరి కుటుంబం అనేక సేవాకార్యక్రమాలు చేపడుతోంది.
దార్శనికులు, ఆధునిక రాయలసీమ తొలితరం పారిశ్రామికవేత్తలలో ఒకరైన సోమప్ప 1978 మార్చ్ 30న పరమపదించారు.
సోర్సెస్:
http://machanigroup.com/others.html
Heritage
గవర్నమెంట్ గజెట్
https://padmaawards.gov.in
సీమరత్నాలు వాల్ నుంచి
సేకరణ:- చందమూరి నరసింహారెడ్డి