ఉరుముల నృత్యం అనంతపురము జిల్లాలో ప్రసిద్ధమైంది. జిల్లా సరిహద్దులలోని కర్ణాటక ప్రాంతాలకు విస్తరించింది. మాలల లోని ఒక తెగవారు ఈ కళారూపాన్ని సంప్రదాయంగా అనుసరిస్తారు. ఉరుములకు వీరణము అనే పేరు కూడా ఉంది. జానపద ప్రదర్శన కళారూపాలలో బృంద నృత్యానికి ఇది చెందుతుంది వాయిస్తూ, పాడుతూ నృత్యం చేస్తారు ఉరుము వాయిద్యాన్ని

మేఘగర్జనలకు నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది. ప్రకృతిలో ఇలాంటి దృశ్యాలను చూసి జానపదులు ఉరుములు తయారు చేసి ఉంటారు. ఉరుములు వాయించే సందర్భంలో కుంచెల నృత్యం ఇప్పటికీ చేస్తారు. కుంకాలాట అని కూడా అంటారు. కుంచెలను నెమలీకలతో తయారు చేస్తారు కుంచెలను రెండు చేతులతో తలమీద ఉంచుకొని నలుగురు వరుసగా నిలబడతారు. ఉరుములతో వారికి పూనకం తెప్పిస్తారు. ఉరుములు ఇలా ప్రకృతి నేపథ్యంగా పుట్టి కళారూపంగా విస్తరించింది. ఇదే అనంతర కాలంలో వైష్ణవ సంప్రదాయంలో భాగమైంది. విజయనగర కాలంలో మాలదాసరుల వలె, ఉరుముల వారికి ప్రత్యేక గౌరవం మాన్యాలుండేవి

ఉరుముల వాయిద్యం పుట్టుక వెనుక ఉన్న ఒక జానపద కథను ‘తెలుగు జానపద వాద్యాలు’ వ్యాసంలో డా. చిగిచర్ల కృష్ణారెడ్డి గారు వివరించారు. పదమూడోవ శతాబ్దం ఆరంభంలోని మొఘలుల కాలంలో అక్కమ్మ గార్లు అనేనాగదేవతలు నరులకు మహిమలు చూపి దేవాదుల కొండలో (కళ్యాణదుర్గం కొండ) ఉండాలని నిర్ణయించుకొంటారు. ఆ కొండ అనువైనదో కాదో అని పాలకొండలలోని బ్రహ్మముని వద్దకు వెళ్ళి తెలుసుకోవాలనుకొంటారు. అక్కమ్మ గార్ల రాకను తెలుసుకొని బ్రహ్మముని పాలకొండ గుహలో దాక్కొంటాడు. అక్కమ్మ గార్లు గుహ వద్దకు వెళ్ళి పిలిచినా బ్రహ్మముని బయటకు రాడు ఆ ఆకాశంలో ఉరిమే ఉరుములను వాయిద్యాలతో ధ్వనింపచేసి కొండంతా ప్రతిధ్వనించేలా చేయాలని పూనుకొంటారు. వీటిని వాయించడానికి రెండు మట్టి బొమ్మలుగా సినన్ని సింగరయ్య కావిరేవు సాయన్నలను అక్కమ్మ గార్లు సృష్టించి జీవం పోసారు. కంచు, మేక చర్మంతో తయారు చేసిన ఉరుము వాయిద్యాన్ని వాయించమన్నారు. మేము అర్హులము కాదని ఆ మట్టి బొమ్మలనుండి తయారైన వారు అనగా నారాయణ మహిమతో జనించిన మీరు ఉరుములను వాయించాలని అక్కమ్మగార్లు అన్నారు. మాలలైన మిమ్మల్ని నా భక్తులు ఆదరిస్తారని అక్కమ్మ గార్లు అభయమిచ్చారు. వారి ఉరుముల వాయిద్యానికి పాలకొండలు ఊయలలా ఊగాయి. ఉరుముల శబ్దాలతో ప్రతిధ్వనించాయి. ఆ ఓంకార నాద శబ్దానికి బ్రహ్మముని బయటకు వచ్చి పంచాంగం చూసి స్థల విషయం తెలిపి, ఉ రుముల కళాకారులను ఆశీర్వాదం చేసాడు. మాలలైన ఉ రుము వాయిద్యకారులు అనంతరకాలంలో అక్కమ్మగార్ల
మహిమలు చెబుతూ, వృత్తి సంప్రదాయం పాటిస్తూ వస్తున్నారు.

ఈ కథ ఆధారంగా చూస్తే వైష్ణవ సంప్రదాయంలో భాగంగా ఉరుము వాయిద్యకారులు ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. ఈ వాయిద్య కారుల పేర్లు, సంప్రదాయాలు వైష్ణవంతో ముడిపడి ఉన్నాయి

బుక్కపట్నం మండలం, సిద్ధరాంపురం గ్రామంలోని ఉ రుముల కళా సంప్రదాయం వారసత్వంగా కొనసాగిస్తున్న సత్యం అనే కళాకారుడు తెలిపిన మరో ఇతివృత్తం కూడా ఉ రుముల వారికి ఉన్న వైష్ణవ సంబంధం తెలుపుతుంది విజయనగరంలో శైవుల దాడులలో అనేకమంది దాస భక్తులు ఉరుముల వారు చనిపోయారు. బైకూరి కంటకరాజు ఈ మారణ హోమం కొనసాగించాడు. ఒక రోజున రాచవీధిలో ఉరుము కొట్టుకొంటూ నారాయణ భక్తుడు రాగా అతని మెడ నరికివేసారు. తల ఎగిరి ఆదిశేషునిపై పవళించిన విష్ణుమూర్తి పాదల చెంత పడింది. విష్ణుమూర్తి తిరిగి దాసునికి ప్రాణం – పోసి నిలిపాడు. ఆ దాసరి వారసులమే ఈ వృత్తిలో ఉన్నామని ఉరుముల కాళాకారుడు సత్యం తెలిపాడు. వీటిని బట్టి వైష్ణవ సంప్రదాయంలో ఈ ఉరుములకు సంబంధం ఉందని తెలుస్తుంది. తరువాత కాలంలో జీవనోపాధికై ఇతర కె ఆలయాలకు, కార్యాలకు కూడా వీరు కొనసాగుతూ వస్తున్నారు.

ఉరుము వాయిద్యం కంచుతో గుండ్రంగా డ్రమ్ములా నిర్మాణం చేసి, ఇరువైపులా మేకచర్మంతో బిగిస్తారు. అందంగా అలంకరిస్తారు. కుడి భుజం మీదుగా తాడుతో వేలాడుతూ, నా పొట్టపై ఎడమవైపుగా ఉరుమును వాల్చుకొని ఉంటారు ఎడమచేతితో కదురు పుల్లతో బూర్.. బూర్.. బూర్ అని పైకి, కిందికి లయాత్మకంగా గీస్తూ ఉరుములా శబ్దం ధ్వనింప చేస్తారు. కుడిచేతిలోని పుల్లతో డబు, డబు, డబు అని కొడుతుంటారు. ఉరుమువలే గుండెజలదరించేలా శబ్దం వెలువడుతుంది

తలకు రుమాలు చుట్టుకొని, బండారు, కుంకుమ నామం పెట్టుకొని, ఎర్రని,పచ్చని శాలువలు భుజాలపై వేసుకొని, – మెడలో కాసులదండ, కాళ్ళకు పట్టీలతో ఇద్దరు మొదలు లేదా ఐదారు మంది గుంపుగా వాయిస్తారు.

గంగమ్మ దేవతల వద్ద ప్రతి మంగళవారం మేలుకొలుపు పాటలు, అమ్మవారి కథాగేయాలు పాడతారు.

ఒక గంగ మేలుకొలుపు పాట ఈ విధంగా ఉంది

మేలుకొనవే వో మేలుకొనవే అమ్మనీవు పుట్టక ముందేనాడుగా
యిగమూ లేదూ జగమూ లేదు ||మే||
అమ్మ మచ్చు మాయల వో గంగినీవూ
పీనిగీలు తినే పిశాచివో ||మే||
సామి గంగ లేని వో తానమేలేదు
గంగలేని వో జలకమ్మే లేదు ||మే||
సామీ నీవు పుట్టకముందే నాడూ
నరుడు లేడు నారాయనుడే లేడు ||మే||
యిష్టుడు వో యీసురుడు లేడు
ముప్పది కోట్ల వో మునులే లేరూ ||మే||
డెబ్బది కోట్ల వో దేవతలే లేరు
అమ్మపాప జాతి నలవీర గంగవూ ||మే||
దావలిడ నేవో ఆదిశక్తి దావలిడలే.

(జానపద నృత్య కళ – డా. చిగిచర్ల కృష్ణారెడ్డి, పుట-77) …
ఇలా లయ బద్దంగా గేయం సాగుతుంది.

అక్కమ్మ గార్లు, శ్రీ రాజుల గుళ్ళు, వీర తిమ్మయ్య, వీర నారాయణ స్వామి, పోతలయ్య, కాటమయ్య, బొమ్మయ్య కాటమయ్య, చల్లా పరమ్మ గుళ్ళలో పూజా, ఉత్సవ కార్యక్రమాలలో ఉరుములు వాయిస్తారు పై ఆలయాలలో పూజారులకు పూనకం తీసుకరావడానికి ఉరుములను ప్రధానంగా వినియోగిస్తారు

మేలుకొలుపు పాటలలో కుడిచేతిపుల్ల వాయిస్తారు. నృత్యంలో రెండు వైపులా వాయిస్తారు. గుండ్రాకారంగా ఉంటూ రెండు కాళ్ళను పెనవేసుకొని, శరీరంమంతా ఊపుతూ ఎగురుతూ నృత్యం చేస్తారు. సరిసంఖ్యలో ఎదురెదురుగా అటు ఇటు తిరుగుతూ, తల అటు ఇటు తిప్పుతూ నృత్యం చేస్తారు మొదట తెలిపిన కుంచెల నృత్యం వీరావేశంతో సాగుతుంది

వీరి మంగళహారతి గేయంలో సుబ్బారావు పేట గంగమ్మ పెదకోట్ల చౌడమ్మ, ముష్బూరి నలకాటమయ్య, చిల్లారి నలకాటమయ్య, దాదులూరి పోతలయ్య, మైసూరి మిడిమాలదేవత, నసనకోట ముత్యాలమ్మ, బుక్కచర్ల నల్లాలమ్మ, కదిరి నరసింహా, ఏడుకొండల వెంకటేషుడు, దిగువ తిరుపతి గోవిందరాజులు, అలివేలుమంగ, బీబి నామనాంచారి, వీర నారాయణస్వామి, పసిబాలనారన్న మగుడుపల్లి బయన్న, తాటిచెర్ల పెద్దయ్య, చంద్రగుత్తాలమ్మ మేటకోర్ల పెద్దమ్మ, పోతలయ్య, ఆది శక్తి గంగ తదితర దేవతలను స్తుతించడం ఉంది

అనంతపురము జిల్లాలో సనప, తోపుదుర్తి, గుంజేపల్లి,
ముష్టూరు, సిద్ధరాంపురం, గూగూడు,మాదాపురం తదితర అనేక గ్రామాలలో వీరికి కేటాయించిన గుడికట్టు ప్రకారం ఆయా ఆలయాలకు అనుబంధంగా ఉంటారు. కేవలం గుళ్ళకు అనుబంధంగానే కాకుండా ఆయా గ్రామాలలో ఇంటి కాపులున్న గ్రామాలలో కథలను కూడా గానం చేస్తారు ఒకో కథ రెండు మూడు రాత్రులు సాగుతుంది.

అక్కమ్మగార్ల కథ, చెన్నకేశవుని కథ, ఎరికలమ్మ కథ ,రాజుల స్వామి కథ, పడుగు నాగులమ్మ కథ ఇలా పన్నెండు కథలను ఉరుముల వారు కథాగేయాలుగా గానం చేస్తారు ఇందులో సిద్ధరాంపురం ఉరుము కళాకారుడు సత్యం చెప్పిన పడుగు నాగులమ్మ అనే వీరకథను పరిశీలిద్దాం

“పందలకుంట సిద్ధయ్యనాయుడు ఒక పాలేగారు. అంతకు మించి గొప్ప మాంత్రికుడు. తన మాయలు మంత్రాలతో ప్రజలను బయపెట్టెవాడు. చివరకు ఆ దుర్మార్గుడి వల్ల స్త్రీల మాన ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయింది

నల్లజోడుపల్లెలో నల్లజోడు శిరన్న, కామలాదేవికి చాలా కాలంగా సంతానం లేదు. ఒక్కగానొక్క సంతానం కోసం వారు ఎన్నో ప్రయాసలు పడ్డారు. నల్లజోడుపల్లి కనికిలి కొండ అక్కమ్మగార్ల పుణ్యాన వారికి జోడు సంతానం కలిగారు. వారే పడిగు నాగులమ్మ, గొడుగు నాగులయ్యలు. తమ పిల్లలను ఎంతో అల్లారు ముద్దుగా పోషించుకొన్నారు. కనికిలి కొండ అక్కమ్మ గార్ల మహత్మ్యం ఆనోట ఈ నోట విని అక్కమ్మ గార్ల అంతు చూడాలని సిద్దయ్య వెళ్తాడు. పెళ్లీడు వచ్చిన పడిగు నాగులమ్మ అక్కమ్మ గార్లకు సేవచేస్తుంటుంది. నాగుల సిద్దయ్య కంటబడింది. ఎలాగైనా అమెను వశపరచుకోవడానికి సిద్దయ్య పన్నాగం పన్నుతాడు. చివరకు తన మంత్రశక్తితో స్వాధీనం చేసుకొని తన పందలకుంట పాళేనికి నాగులమ్మను తీసుకెళ్తాడు. నాగులమ్మ లొంగలేదని చిత్రహింసలు పెడతాడు. నాగులమ్మను మంత్రాల మరిగట్టు పై కూర్చో పెట్టి మంత్ర, తంత్రాలతో వశపరుచుకోవాలని చూస్తాడు.

అక్కమ్మ గార్లు పార్వతీ పరమేశ్వరుల రూపంలో నాగులమ్మను కాపాడాలని వస్తారు. పార్వతీదేవి సిద్దయ్య కూతురు లింగేశ్వరి రూపంలో మంత్రాల మరిగట్టుకు చేరుతుంది. నాగులమ్మ సోదరుడు నాగులయ్య నన్ను చెర పట్టడానికి పగబట్టాడానికి వస్తున్నాడని సిద్దయ్యకు చెబుతుంది సిద్దయ్యకు మంత్రంపై నిలకడ తప్పుతుంది. అదే సమయంలో మరోవైపు పరమేశ్వరుడు సిద్దయ్య రూపంలో కోటలోని సిద్ధయ్య కూతురు లింగేశ్వరి వద్దకు వెళ్తాడు. ఇక అన్ని మంత్ర తంత్రాలు వదిలేస్తానని, నాగులయ్య అనే రూపవంతునితో నీకు వివాహం చేస్తానని సిద్దయ్య రూపంలోని పరమేశ్వరుడు చెబుతాడు. తండ్రి మాటకు లింగేశ్వరి సరే అన్నది. కోటలోని కాళీ మాత ఆలయంలోని రెండు గండదీపాలను ఆర్పేయమని మాయా రూపంలోని పరమేశ్వరుడు అంటాడు. లింగేశ్వరి సొరంగ మార్గంలో వెళ్ళి కాళికామాత ఆలయంలో దీపాలు ఆర్పివేస్తుంది. దీంతో సిద్దయ్య శక్తి పోతుంది. మంత్రాల మరికట్టు వద్ద సిద్ధయ్య శక్తి హీనుడై పోతాడు. పార్వతీ పరమేశ్వరులు మారువేషాలలో ఈ విధంగా సిద్దయ్య నుండి నాగులమ్మను కాపాడుతారు. నాగులమ్మ వీర సింహరూపం దాల్చి కనికిని కొండ అక్కమ్మ గార్ల కొండలోని కలుబరిగెకి చేరుతుంది

జరిగిన వ్యవహారమంతా సిద్దయ్య తెలిసుకొని సరైన సమయం కోసం వేచి ఉంటాడు. సింహా రూపంలోని నాగులమ్మపై సిద్ధయ్య పగపడతాడు. నాగులమ్మ అన్న నాగులయ్య తన చెల్లెలు కోసం దేశదేశాలు, అడవుల వెంబడి వెతుకుతుంటాడు. సిద్దయ్య మనుషులు నాగులయ్యను గుర్తించి అడవిలో దాడి చేస్తారు. చనిపోయాడని వదిలేస్తారు. కానీ కొన ఊపిరితో నాగులయ్య బతికే ఉంటాడు. వీరఓబనపల్లె దేవిరెడ్డి పెద్దిరెడ్డి అతని తలారులతో అడవికి వెళ్ళి ఉంటాడు కొన ఊపిరితో ఉన్న నాగులయ్యను రెడ్డి తన ఇంటికి తీసుకొచ్చి కాపాడతాడు. నాగులయ్యకు యుద్దవిద్యలు

నేర్పిస్తాడు సింహ రూపంలోని నాగులమ్మను చంపాలని సిద్దయ్య నిర్ణయించుకుంటాడు. తన శక్తి అందుకు చాలదని గుర్తిస్తాడు. చుట్టుపక్కల పాళే గాళ్ళకు కబురు పంపుతాడు. కనిగిని కొండలోని సింహాన్ని చంపిన వారికి తన పాళేంలో సగం తన కుమార్తె లింగేశ్వరినిచ్చి పెళ్ళి చేస్తానని సిద్దయ్య ప్రకటిస్తాడు

వీరఓబనపల్లె పెద్దిరెడ్డికి సిద్దయ్య కబురు అందుతుంది అక్కమ్మ గార్ల కొండల్లోని సింహమే నాగులమ్మను తినేసింటాడనే వీరు కూడా భావిస్తుంటారు. ఆ సింహాన్ని

నాగులయ్య సంహరిస్తాడని పెద్దిరెడ్డి ప్రకటిస్తాడు నాగులయ్య వీర సింహాన్ని ఎదుర్కొంటాడు. ఆ వీరసింహం రూపంలో తన చెల్లెలు ఉందని తెలియదు తన అన్న చేతి కత్తిదెబ్బకు సింహ రూపంలో ఉన్న నాగులమ్మ పడిపోతుంది. రక్తం మడుగుల్లో నుండి నాగులమ్మ నిజరూపం పొంది సిద్దయ్య చేసిన అన్యాయం గురించి తన అన్నకు చెబుతుంది.

నాగులయ్య, పెద్దిరెడ్డిలు పందులకుంట సిద్ధయ్య పాళెం చుట్టుముట్టి బంధించి నాగులమ్మ వద్దకు తెస్తారు. ఆమె చేతిలోనే సిద్ధయ్య ప్రాణాలు పోతాయి. తర్వాత నాగులమ్మ కనిగిలి కొండలోని అక్కమ్మగార్ల వద్ద రాతి మడుగులో తెప్పలా నిలిచిపోతుంది. ఒకరకమైన పచ్చని గడ్డితో ఇప్పటికీ ఆ తెప్ప నీటిలో మునగకుండా తేలుకొనే ఉంది”.

ప్రతిసంవత్సరం అనంతపురము జిల్లా, ఓ.డి.సి మండలం, కనికిలి కొండ సమీపాన నల్లజోడుపల్లె దొన్ని కోటవారిపల్లె, వీరవోబనవారిపల్లి తదితర గ్రామాల వారు నాగులమ్మను వీరవనితగా గౌరవిస్తూ పూజలు చేస్తారు నేటిీ తరతరాలలుగా నాగులమ్మను నేటికీ స్మరించుకోంటారు

నల్లజోడుపల్లి అక్కమ్మ గార్ల పూజ సందర్భంగా సిద్ధరాంపురం ఉరుముల కళాకారులు పాడే పద్యంగా ఈ కథ సాగుతుంది. ఒక వీరగాథలా సాగే ఈ కథను గమనిస్తే మంత్రాల సిద్దయ్య చేతిలో బందియై పోరాడిన నాగులమ్మ వీరవనితగా కనిపిస్తుంది. నాగులమ్మ వంశీకులు, ఆయా కాపులు, భక్తులు తమకు సంబంధించిన కథలను ప్రత్యేకంగా ఉరుముల కళాకారులతో చెప్పించుకొంటారు.

చెన్నకేశవస్వామి కథను అన్ని వర్గాలవారు ఉరుముల కళాకారులతో చెప్పించుకొంటారు. అలనాటి వైష్ణవ మత విస్తరణ, ప్రచారంలో భాగంగా దాసరుల వ్యవస్థ లాగా, ఉ రుముల కళారూపం కూడా సాంస్కృతికంగా కొనసాగిందని తెలుస్తుంది. ఈ విషయమై మరింత ఆధ్యయనం జరగాలి

కొద్దిమంది మాత్రమే ఉరుముల కళాకారులు ఇప్పటికీ అనంతపురము జిల్లాలోని వివిధ గ్రామాలలో ఉన్నారు. వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వవలసి ఉంది. వారి వద్ద నుండి కథాగేయాలు, కథలు సేకరించి భద్రపరచవలసి ఉంది అలనాటి సాంఘీక, సాంస్కృతిక, భాషా చరిత్ర నిర్మాణానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

vurumula nrutyam

రచన :– డా||అప్పిరెడ్డి హరినాధరెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం గ్రహీత 99639 17187

డా||అప్పిరెడ్డి హరినాధరెడ్డి    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s