
( భారత స్వాతంత్ర్య సమరయోధుడు)
నీతిని బతికించిన వ్యక్తి…
నిజాయితీని నిర్వచించిన వ్యక్తి…
నిబద్దతకు అర్థం చెప్పిన వ్యక్తి…
నిరాడంబరతకు ప్రతిరూపమైన వ్యక్తి…
దేశం కోసం బతికిన వ్యక్తి ….
దేహమే దేహంగా నడయాడిన వ్యక్తి
సీతారాంరెడ్డి ! కానీ వీరి పేరు పెద్దగా ప్రచారంలో లేదు. !
భారత స్వాతంత్ర్య కాలంలో దేశం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలని ఫణంగా పెట్టి
సమర రంగంలో అడుగుపెట్టారు. తమ నరనరాన ప్రవహిస్తున్న అచంచలమైన దేశభక్తిని గొంతెత్తి చాటుకున్నారు. తమలో నిద్రాణమైన జాతీయతను వరదలా పొంగించారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆ వరదలో ముంచెత్తాలని దహించారు… తరించారు ! ఇటువంటి గొప్ప సమరయోధుడు హాలహర్వి సీతారామరెడ్డి !
1900, మే 14న అప్పటి రాయలసీమ బళ్ళారి జిల్లా హాలహర్విలో జన్మించాడు. కాలక్రమంలో ఊరిపేరుతోనే ప్రసిద్ధుడు అయ్యాడు. వీరి తండ్రి బొజ్జిరెడ్డి. ఉదార స్వభావి. పిల్లలు క్రమశిక్షణతో పెరగడమే కాదు, దేశసేవకులుగా ఎదగాలనేది బొజ్జిరెడ్డి భావన. తండ్రి కలలకి తగ్గట్టుగానే సీతారాంరెడ్డి పెరిగి పెద్దవాడయ్యాడు .
పాఠశాల స్థాయి నుండే తోటి పిల్లలకు భిన్నంగా ఉండేవాడు. నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవాడు. పేదపిల్లలకు తమ కుటుంబం నుండి సహాయం అందేలా ప్రయత్నం చేసేవాడు. అవిటి పిల్లలల్ని కొందరు పిల్లలు ఎగతాళి చేసినా, మరి కొందరు పిల్లలు వారిపై జాలి చూపించినా ఒప్పుకోకపోయేవాడు. అవిటితనం శరీరానికే కానీ మనసుకి కాదని అవిటిపిల్లల్లో ఆత్మవిశ్వాసం నూరిపోసేవాడు.
మద్రాసు పచ్చయప్ప కళాశాల నుండి బీ.ఏ పట్టభద్రుడయ్యాడు. తర్వాత లా కళాశాల నుండి బీ.ఎల్ పట్టా పుచ్చుకున్నాడు. 1930లో మద్రాసులో న్యాయవాదిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, దేశ రాజకీయాలపైనే దృష్టి ఎక్కువగా సారించాడు. ఆనాటి జాతీయోద్యమ ప్రభావం అప్పటికే అతడిని కార్యోన్ముఖుడిని చేసింది. ఈ క్రమంలో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. అందుకే న్యాయవాద వృత్తిలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు.
సీతారామరెడ్డి భార్య గోవిందమ్మ.అనుకూలవతి. భర్త జాతీయోద్యమంలో ఉన్నప్పుడు తన సహాయ సహకారాలు అందించింది. వీరికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు.
సీతారాంరెడ్డికి వ్యవసాయం అంటే ప్రాణం. ఎంత చదివినా, రాజకీయంగా ఎంత ఎదిగినా వ్యవసాయ మూలాలు వదిలిపెట్టలేదు. రైతు కూలీలు కూలీలు కాదని, పంట నేస్తాలు అని చెప్పేవాడు.

టంగుటూరి ప్రకాశం పోరాటాలు, గాంధీ ఉద్యమాలు, సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, సీతారాంరెడ్డిని బాగా ప్రభావితం చేశాయి.
బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా 1928 సంవత్సరంలో బార్డోలీలో వల్లభాయ్ పటేల్ కిసాన్ ఉద్యమం చేపట్టి దిగ్విజయంగా ముందుకు నడిపించిన సంఘటన సీతారాంరెడ్డిని గాఢంగా ప్రభావితం చేసింది. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ కిసాన్ ఉద్యమం వల్లభాయ్ ని సర్దార్ ని చేసింది. సీతారాంరెడ్డి వంటి యువకుల్ని జాతీయోద్యమం దిశగా అడుగులు వేసేలా చేసింది కూడా. ఈ ఘటన తర్వాత సీతారాంరెడ్డి తోటి యువకులను ప్రభావితం చేసాడు. జాతీయోద్యమం ఆవశ్యకతను తమలో తాము చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకుని వివరించాడు
గాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా సీతారారెడ్డి మీద ప్రభావం చూపింది. ఆ ఉద్యమంలో తోటి యువకులతో కలిసి పాలొన్నాడు. ఈ ఉద్యమం ద్వారా వల్లభాయ్ పటేల్ దాదాపు 3 లక్షల మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని సీతారాంరెడ్డి కూడా తన వంతు కృషిగా విరాళాలు సేకరించాడు . అందులో తన సొంత డబ్బును కూడా జమచేశాడు. పేదల తరుపున కూడా తానే విరాళాలు ప్రకటించి ఉదారత చాటుకున్నాడు.
దేశమే ఊపిరిగా స్వదేశీ నినాదాన్ని ఒంటబట్టించుకున్న సీతారాంరెడ్డి విదేశీ వస్తువుల్ని బహిష్కరించాడు. స్వాతంత్ర పోరాట సమయంలో గాంధీ పిలుపు మేరకు విదేశీ వస్తు దహనంలో తనదైన అంకితభావాన్ని కనబర్చాడు. తన వద్దనున్న తెల్లదొరల సాంప్రదాయ దుస్తుల్ని అగ్నికి ఆహుతి చేసాడు. తన స్నేహితులతో కుటుంబ సభ్యులతో తన వెనక నిలిచిన ప్రజలతో జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని ప్రతిజ్ఞ చేయించి ఆచరించాడు
సమాజంలో సమస్యలుగా ఉన్న మద్యపానం అస్పృశ్యత కులవివక్షలకు వ్యతిరేకంగా పనిచేసారు. ఆనాటి సమాజంలో హీనంగా చూడబడిన దళితులను మనుషులుగా గుర్తించాలని, వాళ్ళు మనలో ఒకరని, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు. స్త్రీ విద్యను కోరుకున్నాడు బాల్య వివాహాలను, బాల కార్మిక వ్యవస్థను వ్యతిరేకించాడు. భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కష్ట పడి పనిచేయాలని ఆశించాడు.
బ్రిటిష్ ఇండియాలో కొందరు భారతీయులు బ్రిటిష్ దొరలకు అనుకూలంగా వ్యవహరించేవారు. ఇటువంటి వ్యక్తుల్ని కొందరు జాతీయోద్యమకారులు శత్రువులుగా భావించేవారు. సీతారాంరెడ్డి ఇందుకు విరుద్ధం. వారు ఏ కారణంతో బ్రిటిష్ దొరలకు అనుకూలురుగా ఉన్నారో పరిశీలించాడు. వాళ్లలో దేశభక్తి ఉన్నప్పటికీ అభద్రతా భావంతో మాత్రమే పరాయీకరణను ప్రోత్సహిస్తున్నారని తెలుసుకున్నాడు. వారిని మాతృదేశం కోసం పోరాటయోధులుగా మలచడంలో తనవంతు ప్రయత్నం చేసాడు. ఈ ప్రయత్నంలో కొందరు మారారు. కొందరు మారలేదు.

రాయలసీమ ప్రాంతానికి చెందిన గొప్ప రాజకీయనాయకుడుగా సీతారాంరెడ్డి తనదైన ప్రస్థానాన్ని కొనసాగించాడు.
1937లో బళ్ళారి నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు.
1937లో కడప కోటిరెడ్డి అధ్యక్షతన విజయవాడలో జరిగిన ప్రతిష్టాత్మక రజతోత్సవ ఆంధ్ర మహాసభలను ప్రారంభించాడు.1937 నాటి ఆంధ్రమహా సభలో ఎమ్మెల్యేలు కడప కోటిరెడ్డి, హాలహర్వి సీతారామరెడ్డి వంటి వారు సీమలో రాజధాని ఏర్పాటు గురించీ, మంత్రి వర్గంలో సీమ, సర్కార్ ప్రాంతీయ సమానత గురించీ, తుంగభద్ర ప్రాజెక్టు వంటి ప్రాజెక్టుల గురించీ హామీ కోరారు.
తర్వాత 1947 నుండి 1952 వరకు కూడా బళ్ళారి నుండి మద్రాసు శాసనసభకు వరకు ఎన్నికయ్యాడు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ, పరిశ్రమలు, శ్రామిక శాఖల మంత్రిగా పనిచేశాడు.
మంత్రిగా పనిచేస్తున్న కాలంలో కూడా సామాన్య పౌరుల్లో ఒకడిగా జనాలతో మమేకం అయ్యాడు.
1960 నుండి బెంగుళూరు కాఫీ బోర్డు అధ్యక్షునిగా పనిచేశాడు.
రాయలసీమ అభివృద్ధి సంఘం అధ్యక్షునిగా ఉన్నాడు.రాయలసీమను దత్తమండలాలుగా పిలవడాన్ని వ్యతిరేకించాడు. రాయలసీమ నేతగా శ్రీబాగ్ ఒడంబడికలో పాల్గొన్నాడు.
తెలుగు ప్రాంతాలపై తమిళుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ఆంధ్రోధ్యమంలో చురుకుగా పనిచేసిన సీతారామరెడ్డి
ప్రత్యేక ఆంధ్ర తన స్వప్నం కాదని, అది తన ప్రాణం అని భావించాడు.

1962లో ఆదోని నియోజకవర్గం నుండికాంగ్రెస్ అభ్యర్థి కె.సి.తిమ్మారెడ్డి పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.
మచ్చలేని నాయకుడుగా –
మానవతావాదిగా –
సామాజిక చైతన్యం ప్రజల బాధ్యతగా నినదిస్తూ…
జీవిత కాలం బతికిన సీతారారెడ్డి భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్మరణీయుడు.
రచన :–✍️ తంగెళ్ళశ్రీదేవిరెడ్డి