
అనంత సాహిత్య చరిత్ర గురించి మనకు దొరికే ఆధారాలు తక్కువ. స్వాతంత్ర్యోద్యమం కాలంనాటి సాహిత్యం దొరికేది కొంత. అదీ పప్పూరి రామచారిగారి “ సాధన” పత్రికనుంచే ఎక్కువ దొరుకుతుంది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పప్పూరి రామాచార్యులు , విద్వాన్ విశ్వం, చిలుకూరి నారాయణ రావు, బెళ్ళూరి శ్రీనివాస మూర్తి , కుంటిమద్ది శేషశర్మ, హెచ్.నారాయణరావు , కల్లూరి వెంకట నారాయణ ,ఎ.సి. నరసింగరాజు, బత్తలపల్లి నరసింగరాజు, కలచవీడు శ్రీనివాసాచార్యులు, ఎల్లమరాజు నారాయణభట్టు, టి. గురుమూర్తి, పంచాంగం సూరప్ప, జె . గుండప్పరావు, వాసుదేవ మూర్తి, గొట్టిపాటి సుబ్బరాయుడు, సొంటి శ్రీనివాసమూర్తి , తలమర్ల కొల్లప్ప, కందళం శేషాచార్యులు , కుంటిమద్ది రాఘవాచార్, టి.వి. రాఘవులు, పి.ఎన్ రామకృష్ణశర్మ, విశ్వరూప శాస్త్రి , చిన్నమంతూరు రామారావు , కె. కృష్ణ మూర్తి, మొదలగువారు అనంత రచయితలు. ఇందులో కవులున్నారు, విమర్శకులున్నారు, కథకులున్నారు. వ్యాస కర్తలున్నారు, నాటక కర్తలున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి. చిలకమర్తి లక్ష్మినరసింహం , ఉన్నవ లక్ష్మీనారాయణ, కొప్పరపు సోదర కవులు, మొ.వారు అనంత జిల్లాలో పర్యటించి సాహితీ ప్రేరణ కల్గించినారు. అనంత కవులు దేశభక్తినీ, సామ్రాజ్యవాద వ్యతిరేక, యుద్దవ్యతిరేకతనూ ప్రబో ధించినారు. ఆంధ్రరాష్ట్ర సాధనను ప్రోత్సహించినారు. అస్పృస్యత, మద్యపాన వ్యతిరేకతతోపాటు అనంతజీవితాన్ని పట్టి పీడిస్తున్నకరువు, నిరుద్యోగం, చాలని జీతభత్యాలు, ఓటు ప్రాముఖ్యత ,ఆరోగ్యం వంటి సమస్యలపైనా రచనలు చేసినారు. పాపాయిలను ఆడించి, పాడించినారు. వాడుక భాషను సమర్ధించినారు.
సాహిత్యలక్ష్యం గురించి సాధన పత్రికలో (1935) చిన్న వ్యాసమే వచ్చినా గొప్ప వ్యాసమే వచ్చింది.–
“కొద్దిజనులకు మనోరంజనం చేసి రూపాయలు వసూలు చేయునుద్దేశ్యముతో సాహిత్యరచన చేయకూడదు. ఉదరజ్వాలలో నున్నవారిని కోట్లకొలది కృషికులను, అసంఖ్యాకులగు కూలీలను ఉపేక్షించి కుర్చీలపయి విశ్రాంతిననుభవించు చున్న వారి మనః ప్రసన్నత కేర్పడినది కాదు సాహిత్యము. దేశము చెడియున్న దశలో సాహిత్యకారుని క్షేత్ర మేది? స్వార్థాంధులగు ధనికుల సౌధము గాదు ; కొరకను గింజ లేక, నిలువను నీడలేకయున్న బీదల గుడిసెలయందు కవి భ్రమింపవలెను. వారి కరుణాక్రందనను, భీభత్స పరిస్థితిని గమనింపవలెను. మూడుకోట్లమంది ముప్పొద్దులా గ్రామ్యంలో మాట్లాడుతా వుంటే చెడిపోని భాష – పత్రికలో రాస్తే మాత్రం చెడి పోతుందా? జన సామాన్యానికి తెలిసే భాషలో , అందరూ మాట్లాడే భాషలో రాయండి.”
స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి సాహిత్య మంతా కాదుగాని, కవిత్వాన్ని రేఖా మాత్రంగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. గాంధీగారి కార్యాచరణ ప్రభావం ఎంత శక్తివంతమైనదో పురాణ ప్రతీకలతో వర్ణిస్తూ కుంటిమద్ది శేష శర్మగారు 1939లో “ మహాత్ముని మహత్వం “ అనే శీర్షికతో ఒక ఖండిక రాసినారు. గాంధీ దీక్ష పూనినాడు అనగానే ---
“ధరణీచక్రము దిద్దిరన్ దిరిగె, గోత్రవ్రాత మల్లాడే, నం
బరముత్కంపితమయ్యే, నుత్కలికమై వారాశి గ్రీడించె,భా
స్కరబింబంబు తడంబడిన్ సడలె, నక్షత్రంబులున్ రాలె, ని
ష్ఠురమౌ దీక్ష మహాత్మ నేడు వహించున్ గాంధీ యన్నంత లోన్ “
హాహా రవాలతో, హర్తాల్లతో రాజకోట యంతయును గగ్గోలు పడియె, / విధి విరామము లేక వెనువెంట టెలిఫోను వైరు లల్లాడె కంబాలతోటి / కాదు కూడదని యున్న రాజుగారింతలోనె పట్టు విడినాడు, రాజీకి వచ్చినాడు –అంటాడు. గాంధీగారు దీక్ష విరమిస్తే “చెవులకు చల్లనై చిత్త మలరె……..తృప్తి కలిగెను లోకత్రయమ్మునకు అంటాడు. “ గాంధీ భారత భూమి కేకైక నేత “ అంటారు కుంటిమద్ది గారు.బండమీదపల్లె కరణము రామచంద్ర రాజుగారు 1936లో దేశోద్ధారక నాగేశ్వర రావు గారిపై ఒక పద్య ఖండిక రాసినారు.-“బ్రహ్మ, విష్ణు , మహేశ్వరుల దైవాంశ మూర్తీభవించిన వ్యక్తి విశ్వదాత” అని ప్రశంసిస్తాడు.
లేపాక్షి నివాసి పంచాగం సూరప్పగారు 1936 లో “ నీచుల కపారత దాస్యము సేవజేసి నిస్సారత నున్నది “ అని బానిసత్వంలోని దేశదుస్థితిని “ భూదేవి మొర” పేరిట వర్ణించినాడు.” ఎన్నడు శౌరి వచ్చు? భువి ఎన్నడు అసాధు లడంగి పోదురు? ఎన్నడు హర్షభాష్పములు కన్నులవెంట కారు?” అని ఆశతో ఎదురు చూస్తాడు.

బాబూ రాజేంద్ర ప్రసాదుగారు నవంబర్ 1935 అనతపురం జిల్లాలో పర్యటించినారు. అనంతలో హరిజన హాస్టలు “కేశవవిద్యానికేతన్ “ ను ప్రారంభించిన సందర్భంగా అనుముల వెంకటకవి స్వాగత పంచరత్నములు సమర్పించినాడు.
ఘట్టు వెంకట రమణప్పగారు ఉరవకొండ నివాసి. చేనేతకార్మికుడు. నలబై ఏండ్ల తన జీవితంలో ఇరవై ఏండ్లు దేశసేవలో గడిపినవాడు. హరిజన ఉద్యమానికే ఎక్కువ సమయం గడిపినాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించినాడు. తిరువాన్కూరు దేవాలయంలో హరిజనుల ప్రవేశం సందర్భంగా -అనతపురం జిల్లా హరిజనసేవా సంఘం –తరఫున ప్రతినిధిగా పాల్గొన్నారు.

జిల్లాలో మొదటి హరిజన హాస్టలును నెలకొల్పినాడు. ఐదుకల్లు సదాశివన్ గారిని కలుపుకొని గ్రామాలు తిరిగి ధాన్యం వసూలు చేసి ఆ హాస్టలు నడిపినారు. ఆయన మరణించినపుడు టి.వి. రాఘవులుగారు “స్మృతి” పేరిట సీసపద్య ఖండిక రాసినారు.— “ దేశ దేశ మెల్ల తిరిగి చందాలెత్తి హరిజనాశ్రమము జరిపినావు./ దిక్కు మొక్కు లేని దీనబాలులను కారుణ్య బుద్దితో గాచినావు/ అంటుదోషము నడుగంట ద్రొక్కుటకునై పడరాని యిడుములబడితివి”—అని గట్టు వెంకటరమణప్ప గారి ఉద్యమ జీవితాన్ని కీర్తిస్తూ “ మఱచు నెట్టుల నిన్ను మాన్య చరిత”—అంటాడు. అంటరానితనం అనే అగౌరవంతో పాటు అలవిగాని దారిద్ర్య బాధనూ అనుభవిస్తున్న హరిజనుల దుస్థితిని తలమర్ల కొల్లప్పగారు(1939) యిలా వర్ణిస్తారు ---
.” కుడువ నొకపూట కూటికే యెడరుగల్గె
దుర్భరులైన దారిద్ర్య తోయరాశి
నెన్నియా యహోరాత్రంబు లిటులబుత్తు
ఎన్ని యుపవాసములయందు నెటుల మనుదు?
కూడు కూడో యటంచును కూనలేడ్వ
వీరి నిర్వేదభరము నే వినగలేక
కృంగి కృ శియించి పోవుదు హృదయమునందు
-దుర్భరంబాయెనే దయ దోపదాయె!
భగవంతుడు సర్వాంతర్యామి అంటారు. ఆయన్ను దర్శించుకోనీకుండా మత,సంఘ కట్టుబాట్లు అడ్డుపడుతున్నాయని కుంటిమద్ది రాఘవాచార్ గారు (1939) విలపిస్తారు.—
నీ గుడికి దురాన నిలిపినారు
ఎట్లు రానేర్తు గుడిలోనికేను సామి? అని అంటాడు
జీవకారుణ్య మూర్తి మా జీవములకు
ఇట్టు వెలివేయ మనసెట్టు లొప్పే? – అని దేవున్నే నిలదీస్తాడు
“ లెండీ! ఉద్దరించండీ! దిక్కులేక పోయే మాల! “ అంటూ గాంధీగారు చెప్పినట్లుగా హరిజనోద్దరణకు పూనుకొమ్మని ప్రబోధిస్తారు పామిడి నివాసి జె. గుండప్పగారు. (1938)
మతమురా ! ఘనమతమురా ! శ్రీ గాంధీ మతమె మతమురా
వారి వీరిని వేరు జేసెడి మతము మతము గాదని తెలియరా!” అని మనిషిని చీల్చకుండ సమైక్యపరిచేదే మతమని మంచి నిర్వచనం ఇస్తారు. బత్తలపల్లె నరసింహారావు గారు.(1938)
1919 మాంటేoగు సంస్కరణల ఫలితంగా ఎన్నికల సౌకర్యం ఏర్పడింది. ఓటు హక్కు వచ్చింది.1926లో తన పేరు చెప్పడానికి యిష్టపడని ఒక కవి ఆదితాళంలో “ఓటరు నిర్వేదం” అనే పేరుతొ ఒక పాట రాసినారు.(14-ఆగస్టు -1926౦)
ఓటరు నిర్వేదము
గేయము –ఆదితాళము
ఎవ్వరికీవలేనో? నా వో టెవ్వరికీవలెనో “చుట్టాలోకనికి, పక్కాలోకనికి కరణాలోకనికి, కాపోళ్ళొ కనికి పెండ్లా మొకనికి, పేష్కారొకనికి వోటిమ్మని నన్నోత్తడి పెడతారు // ఎవ్వని// పన్నులు తగ్గిస్తామని ఒకడు రాజ్యము తెప్పిస్తామని ఒకడు ఉద్యోగాలిస్తామని ఒకడు ఊరూరకే నా కాశలు చెపుతారు //ఎవ్వని// పిళ్ళలకిస్తే రెడ్లకు కోపం రెడ్లకు యిస్తే పిళ్ళల కోపం తలకొకటిస్తే బాపల కోపం బాపలకిస్తే అందరు కోపం //ఎవ్వని// బావులు చెరువులు బయలైపోగా వానలు కురువక పంట పండక క్షామములో మేం చస్తావుంటే చాలక వోటని పీక్కో తింటారు //ఎవ్వని// పన్నులు హెచ్చెను పదవులు సున్న కష్టాలెక్కువ మునుపటి కన్న వోటీకుండ వుందామంటే ఉణ్ణీయక బలు పీడిస్తున్నారు //ఎవ్వని// --ఒక ఓటరు
ఇంకో కవి —
–“ విందు తిండికి లొంగవలదన్నా! ఒక్క పూట తింటే
ముందు ఆకలి తీరదన్నా! విందు తిండికి మోసపోయి
మందభాగ్యులకు ఓటు నిచ్చిన : అందు లోపము దెలిసి
యావల కుంద లాభము లేదు నిజముగా “ –అని ఓటును సద్వినియోగం చేయాలని బత్తలపల్లె నరసింహరావుగారు(1935) చైతన్య పరుస్తారు.
దత్తమండలం అనే పదాన్ని నిరసిస్తూ “దత్తునందురు నన్ను: దత్తు నెట్లు నగుదు?….. ఇచ్చినదెవరో? పుచ్చిన దెవరో” అంటూ 28 గీత పద్యాలను చిలుకూరి నారాయణరావుగారు రాసినారు. గురజాడ వారి పూర్ణమ్మ గేయ కావ్యాన్ని అనుకరిస్తూ ఆయనే — ప్రజలకోసం ప్రాణత్యాగం చేసిన బుక్కరాయ సముద్రానికి చెందిన యువతి—ఒక పసిపాప తల్లి అయిన ‘ ముసలమ్మ” జీవిత చరిత్రను “ముసలమ్మ మరణం “ అనే గేయ కావ్యంగా రాసినారు.
దోపిడీవల్ల సమాజంలో హెచ్చు తగ్గులు ఏర్పడినాయి. పేద,ధనిక తారతమ్యాలు పీడిస్తున్నాయి.వాటిని తగ్గించి పేదలకింత సాయం చేయమని ఈశ్వరుని వేడుకుంటున్నారు హిందూపురానికి చెందిన టి. గురుమూర్తి గారు(1936). –
“కూటికి గుడ్డకున్ ప్రజలు కూలి యొనర్చియు చాలకున్న దీ
మేటి ధనాఢ్యులెల్ల నిల మేలిమి బంగరు తూగు టుయ్యెలలన్
సాటిగలడె మాకనుచు సంతస మాఱగ నూగుచుండ, నీ
పాటి యధర్మమున్ నిలుప బాల్పడ వేలవో దెల్పు మీశ్వరా!
ఎల్లరు నీకు బిడ్డలట, యెప్పుడు వీరలనెల్ల సత్కృపన్
జల్లగ నేలుచుందువట, చాలును నీ దురితంబు, బీదలన్
గొల్లలు గొట్టి నీచులిల కోటలు, మేడలు గట్టుచుండ, నీ
చల్లని తండ్రిచూపులకు సాక్ష్యము నియ్యది గాదొ యీశ్వరా!
నిరుద్యోగి బాధను వర్ణిస్తూ లేపాక్షి శొంటి శ్రీనివాసమూర్తి గారు
“రోగమ్ము లేకనే రోగి జేతువు నిరుద్యోగమా! నా నుండి తొలగి పొమ్ము
సరివారిలో చౌక జేతువు నిరుద్యోగమా ! నా నుండి తొలగిపోమ్ము “ అంటాడు. రోజంతా ఇల్లిల్లూ తిరిగి , పిల్లల్ని పోగుచేసి , చదువు చెప్పే ఉపాద్యాయునికి సరైన జీతము లేదని 18పద్యాలలో ఉపాధ్యాయుని దినావస్థను సరసకవి కరణం కృష్ణారావు గారు వర్ణిస్తారు. ఒక పద్యాన్ని గమనిం చండి --
జీతము గొర్రెతోక, పని సేతకు గాడిదవీపు, తృప్తియౌ
మేతకు నొంటెయున్, పనికి మేకల గాచెడు గొల్లవాడు, ప్ర
ఖ్యాతికి మాడ, యింక నధికారము జూడగ బోడిమేక యీ
రీతిగ నుండు మనుచు విరించి లిఖించి సృజియించె నొజ్జలన్ అనంత కరువు ఆది మధ్యాంత రహితం. ఈ కరువు పీడగురించి ఎంత చెప్పినా , ఎంత మంది చెప్పినా యింకా చెప్పాల్సింది మిగిలే వుంటుంది. టి . గురుమూర్తి గారు ఆ బాధను యిలా వర్ణిస్తారు.
ఆకసంబును చూచి, యాసలు నడగంటు
చూడ్కుల భూమిపై చుపువారు
ఎండిన పంటల యండనే నిలుచుండి
కన్నీరు నవనిపై గార్చువారు
బక్కయెద్దులు గట్టి డొక్కలు గనుపింప
పాతాళగంగ పైకెత్తు వారు
భార్య బిడ్డల వీడి బ్రదుకు జీవుడ యంచు
పారిపోయెదమని బలుకువారు
ఒక్క పూటకు కూటికి చిక్కకుండ
యన్నమో రాముడా యని యఱచు వారు
నకట ! మా రైతు సోదరులరయ నేడు
క్షామదేవత జిహ్వాగ్ర సీమ జిక్కి
“ ఆస్తులు అప్పులకిచ్చి, అస్థులతో నిల్చి ,/ రైతు సామాన్యము రామ రామ యేమి దురవస్థ రాయలసీమలోన : తల్లి పాలిండ్లలో క్షీరధార లేక శిశువు: గాట
గ్రాసము లేక పశువు సమయు “ అని విలపిస్తారు కడప కసిరెడ్డి వెంకట రెడ్డిగారు. సామ్రాజ్యవాద దోపిడీ, దేశీయ భూస్వామ్య దోపిడీ, దౌర్జన్యం ; కరువు పీడల
భీభత్స దృశ్య చిత్రణమే ‘ పెన్నేటి పాట ‘ కావ్యం. ఇది రాయలసీమలోనే మొదటి ఆదునిక అభ్యుదయ కథా కావ్యం. సామ్రాజ్యవాద నరహంతక ఆంగ్లసైనికుల దౌష్ట్యాల నుండి స్థానిక తెలుగు మహిళల మానాలను కాపాడటానికి గూళపాళ్యం హంపన్న గారి పోరాటాన్ని తెలియ జేసేదే ‘ ఒకనాడు “ కావ్యం. ఈ రెండింటి కవి విద్వాన్ విశ్వం గారు. ఆయన –“ మన ఆకలి ఇది పోయే మార్గం ఎట్లా? ఇదెందుకు వచ్చింది?” అని ప్రశ్నించ మంటాడు. కారణాలు తెలుసుకొని కార్యాచరణకు దిగమంటాడు. స్వేచ్చ కోసం తల్లడిల్లుతూ “అనంతపురం షెల్లీ” – బెళ్ళూరి శ్రీనివాస మూర్తి గారు “ ఏను స్వేచ్చా విహంగమనే మహిరు హాగ్ర శాఖకా వితతులందధి వసించి కాలమును బుత్తునో, మది గలంచివైచు దారుణ విషాద బంధముల్ తలగె నేడు “ అంటారు.
అనంత కవి పిల్లల గేయంలోనూ ఆకలిబాధ తీర్చుకోవటమే ప్రస్తావిస్తాడు.
“ఆకాశానికి నిచ్చెన వేసీ
నిచ్చెన మీదకు ఎక్కి నిలబడి
రూపాయలనూ అర రూపాయలనూ
ఏరుదామా? ఆకలి తీర్చుదామా?” ఇది అనంతవాసి దురవస్థ
హాయి పాటలు కాక ఆకలి పాటలే నేర్పవలసిన దుస్థితి.
సాధన పత్రికలో (1940) “యుద్ధము – శాంతి” పేరుతో తరిమెల నాగిరెడ్డి గారు ఒక వ్యాసం రాసినారు. అందులో ఆయన ఒక ఖండికను పరిచయం చేసినారు. వినాశకరమైన సామ్రాజ్యవాద యుద్ధనీతిని, కుయుక్తిని కొద్ది పదాలతో కొండంత అర్థం ఇమిడ్చి చెప్పిన ఆ ఖండిక పేరు “ పిచ్చివాడి ప్రశ్న”. గమనించండి— “ఒక పిచ్చి వెధవ ఒక రోడ్డు పక్కన నిల్చున్నాడొక రోజు . ఒక గొప్ప సైన్యము మార్చ్ చేస్తోంది రోడ్డుమీద . ‘ ఎక్కడినుంఛి వస్తున్నారు నాయనా వీళ్ళంతా?” అని పక్కనున్న వాణ్ణి అడిగాడు. “ శాంతి నగరు నుండి “ అన్న జవాబు వచ్చింది. “ ఎక్కడికెడుతున్నారు?” “ యుద్ధానికి “ “యుద్ధంలో ఏం చేస్తారు?” శత్రువులను చంపి వాళ్ళ పట్టణాలను నాశనం చేస్తారు.” “ ఎందుకు?”
“ శాంతిని స్థాపించేందుకు.” పిచ్చివాడన్నాడు కదా ! “ నా కర్థం కాలేదింతా. శాంతి నుండి వచ్చి యుద్ధం చేయడం ఎందుకు? శాంతి స్థాపించేందుకట. అసలు శాంతి నగరంలోనే వుండి వుంటే?” ఈ పిచ్చివాడి చొప్పదంటు ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారందరు. “ అనంతవాసి సాదాసీదా బతుకు మాదిరి సాహిత్యరచన కూడా సాదా సీదాగానే వుంటుంది. వస్తు ప్రాధాన్యత తప్ప శిల్పఆకర్షణ వుండదు. గాఢమైన
.jpeg)
బావజాల చింతనలు వుండవుగానీ అనంతకవి సామాన్యజన పక్షపాతి. చెయ్యి తిరిగిన శిల్ప నైపుణ్యము కనపడదు గానీ రచనల్లోని బాధ మనల్ని కదలించ గలదు. పదిమంది తపనను మరో పదింతల మందికి తెలియ జేయాలనే తపన తప్ప పేరు ప్రతిష్టలు పొందాలనే యావ లేదు. సామ్రాజ్యవాదులను వెళ్ళగొట్టడమే స్వాతంత్ర్యం కాదనీ, దేశీయంగా వుండే భూస్వామిక పీడ, మత సాంఘిక కట్టుబాట్ల పీడ వదలించు కోవడం ; ప్రతి ఒక్కరూ జీవనోపాధి పొంది జీవితావసరాలు సమకూర్చుకోగలిగి యుండటమే నిజమైన స్వాతంత్ర్యం అని
గుర్తించినవాడు అనంతకవి. దాదాపు ఎనభైయేండ్ల కిందట అనంతకవి
లేవనెత్తిన సమస్యలు – మాయమాటలతో ఓటరును ప్రలోభ పెట్టే రాజకీయాలు ; కరువు, ఆకలి, అస్పృస్యత , నిరుద్యోగం, సామ్రాజ్యవాదుల దోపిడీ వంటి విషాదకర సమస్యలు పరిష్కారం కాకపోగా పరిస్థితి మరింత బాధాకరంగా వుండటం విషాదకరం
—అనంతపురం ఆకాశవాణి నుండి 2003 లో ప్రసారితం.
రచన:–విద్వాన్ దస్తగిరి
