అనంత కలికితురాయి దళవాయిచలపతిరావు

చిన్న పల్లెటూరు ను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడమే కాకుండా ఓ గుర్తింపు తెచ్చిపెట్టాడు. భారత దేశంలో ఆ గ్రామానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. దశదిశలా వ్యాపింపజేశారు. కళాసంపద సువాసనలు గుప్పించారు. అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకొని గ్రామానికేకాదు ,జిల్లా,రాష్ట్రానికే పేరు సంపాదించారు. అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు దళవాయిచలపతిరావు.
ఈయనకు 2020 సంవత్సరానికి కళాకారుల విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. తోలుబొమ్మలాటకే ఓ గుర్తింపు. చలపతిరావు గురించి చేప్పే ముందు తోలుబొమ్మలాట గురించి కొంత క్లుప్తంగా చెప్పాలి.


కల… నిద్రలో వచ్చేది… కళ… సమాజాన్ని నిద్ర లేపేది.
తోలుబొమ్మలాట
ఒక జానపద కళారూపం.
తొంభై ఆమడ నడిచిపొయి అయినా తోలుబొమ్మలాట చూడాలని తెలుగు నాట ఓ సామెత .
తానుస్వయంగాఅనుకరించ
లేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒకదృశ్యాన్నిప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.

ఒక సామూహిక సంగీత, నాట్యప్రదర్శనకళారూపమైన తోలుబొమ్మలాట చారిత్రక పరిణామాలు గమనిస్తే ఒకప్పుడు విలక్షణమైన ఉన్నతిని అనుభవించిన ఈ కళ మొత్తం భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొంది ఉంటుందని చెప్పవచ్చు. నృత్య దశలో నుండి మానవుడు నాటక దశలోనికి ఎదిగే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ప్రముఖ పాత్ర వహించింది. జానపదుని మొదటి రంగస్థల ప్రదర్శనకళగా ఈకళారూపాన్ని గుర్తించవచ్చు.
భారతీయ జానపద ప్రదర్శన కళల్లో అతి ప్రాచీనమైన దృశ్య రూపకానికి చెందినది తోలుబొమ్మలాట.

క్రీ.పూ 3 వ శతాబ్దం నాటికే దేశంలో తోలుబొమ్మలాట ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. తేరి గాథ అను బౌద్ధ గ్రంథంలో బొమ్మలాటకు సంబంధించిన ప్రస్తావన ఉంది.వాత్సాయనుని కామసూత్రాల్లో బొమ్మలలోని రకాలు, బొమ్మలాటల్లోని తేడాలు చర్చింపబడినాయి. కన్యలను ఆకర్షించడానికి బొమ్మలాటల ప్రదర్శన అవసరమని వాత్సాయనుని వివరణ. ప్రాచీన భారతదేశంలో బొమ్మలాట ఒక పవిత్రమైన కళగా భావించబడింది. ఇది ప్రాచీన కాలపు సినిమాగా భావించబడింది. జానపదుని కళత్మక సృష్టికి ఇది నిదర్శనం.
రామాయణ, మహాభారత, భాగవత కథ లను అలవోకగా చెప్పే తోలుబొమ్మల కళాకారుల మాతృభాష మరాఠీ అంటే ఆశ్చర్యం కలిగించక మానదు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కళారూపం ఆంధ్రదేశంలో ఒక ప్రముఖ కళా రూపంగా అభివృద్ధిచెంది, తెలుగు సంస్కృతిలో మిళితమై, మన జాతీయ సంపదకే వన్నె తెచ్చింది.


తోలుబొమ్మలాటలో ప్రధానకథకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఈ హస్యపాత్రలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రలను సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలిపి, పాత్రల ద్వారా సమాజంలో ఉండే దురాచారాలను, మూఢనమ్మకాలను ఎండగడతారు. ఇందులో సామెతలు, లోకోక్తులు, పొడుపుకథలు, నీతికథలు మొదలైనవి చోటు చేసుకుంటాయి.
సుమారు 500 యేండ్లక్రితం మహారాష్ట్ర ప్రాంతం నుండి వలసవచ్చి, అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో స్థిరపడిన కుటుంబాలు. కుటుంబనియంత్రణ గురించి బొమ్మలాట ద్వారా ప్రచారం చేసేవారు. తోలుబొమ్మల కళాకారుల కుటుంబాలు ను సంస్కృతిని , కళారూపాలు ను ప్రచారం చేయమని వందల ఏళ్ల క్రితం మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ కోరడంతో దేశమంతట వివిధ ప్రాంతాలకు వలస వచ్చారు. అలా వచ్చిన వారు జిల్లా లో అక్కడక్కడ స్థిరపడ్డారు.


నిమ్మలకుంటలోనే గాదు కనగానపల్లి, నెమలివరం, ఎరికల నాండ్లపల్లి, కోనాపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాలలో కొన్ని గ్రామాలు, మేకల చెరువు, సంజీవరాయని పల్లె – ఇలా చాలా ఊళ్ళలో తోలుబొమ్మలాట ఒకప్పుడు కళకళలాడేది. దళవాయి చలపతికంటే ముందు దళవాయి గోవిందు, సింధే లక్ష్మీనారాయణప్ప, సింధే మోహనరావువంటి కళాకారులు పేరు పొందారు.


దళవాయి చలపతి రావు అనంతపూర్ జిల్లాకు చెందిన తోలు తోలుబొమ్మలాట కళాకారుడు. తోలుబొమ్మలాట కళలో చేసిన కృషికి 2020 లో అతనికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది.
దళవాయి చలపతి రావు వివిధ అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకోన్నారు. జాతీయ ఎక్సలెన్సీ అవార్డు, శిల్ప గురు , జర్మనీ నుండి ప్రశంసా పత్రం,ఫ్రాన్స్ నుంచి ప్రశంసా పత్రం 2020లో పద్మశ్రీ పురస్కారం పొందారు.


అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో నిమ్మలకుంట గ్రామంలో 1936లో జన్మించారు. అమ్మ పార్వతమ్మ, నాన్న ఖడే రావు. చలపతిరావు భార్య సరోజమ్మ, వీరికి ఇద్దరు కుమారులు రమణ, వెంకటేష్‌, ముగ్గురుకుమార్తెలు తిరుపతమ్మ , వెంకటమ్మ ,లలితమ్మ ఉన్నారు. వీరుందరూ తోలుబొమ్మలకళాకారులే.
అతను తన పదేళ్ల వయసులో తోలుబొమ్మలాట ప్రారంభించాడు. ఆరు దశాబ్దాలుగా తోలుబొమ్మల తయారీ, తోలుబొమ్మల ప్రదర్శనలో ఆయన నిమగ్నమయ్యాడు. 1988 లో తన కళకు జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. అతను 2016 లో కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. తొలుబొమ్మల తయారీ, ప్రదర్శనలో యువతకు ఆయన శిక్షణనిస్తుండేవారు.ప్రస్తుతం వయస్సు పైబడటంతో ఇంటికి పరిమితమయ్యారు.


చారిత్రకం.. పౌరాణికం.. ఇతిహాసం.. సాంఘికం.. ఇలా అంశం ఏదైనా సరే కళ్లకు కట్టినట్లు చూపేదే… తోలుబొమ్మల కళ. తరతరాలుగా ఇదే కళను ఆయన ప్రాణంగా భావించారు. వృత్తిగా స్వీకరించారు. అకుంఠిత దీక్షతో సాగారు. అనునిత్యం వన్నెలద్దారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మెరిశారు.. అద్భుత ప్రతిభతో అపూర్వ ప్రశంసలు సొంతం చేసుకున్నారు. బిడ్డలకూ వారసత్వంగా ఇచ్చారు. ఖండాంతరాలు దాటిన ఖ్యాతి సిగలో మరో కలికితురాయి. మనసు దోచిన.. ‘దళవాయి’.
ఆరు దశాబ్దాలుగా తోలుబొమ్మల తయారీ, తోలుబొమ్మల ప్రదర్శనలో ఖ్యాతి గాంచిన 84 ఏళ్ల వయసున్న చలపతిరావు సీనియర్‌ కళాకారుడు.


దేశ దేశాల్లో తోలు బొమ్మలాట వైభవాన్ని చాటిచెప్పిన అపురూపమైన కళాకారుడు దళవాయి చలపతిరావు.
పెద్దగా చదువుకోలేదు. తాత ముత్తాతల కాలంలో మహారాష్ట్ర నుంచి ఇక్కడకు వలస వచ్చినట్టు పెద్దలు చెప్పారు. అప్పటి నుంచీ వారి వృత్తి తోలుబొమ్మలాట. బతుకుతెరువు తోలుబొమ్మలాట కావడంతో అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచీపల్లెలు తిప్పేవారట! ఊహ తెలిసినప్పటి నుంచీ బొమ్మలాట నేర్పించారు. చిన్నతనమంతా జిల్లా పల్లెల్లోనే గడిచింది. నెలపాటు ఒక్కో ఊళ్ళో ఉండే వాళ్లు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తోలుబొమ్మలాటలు ఆడేవాళ్లు. అందుకే చదువు అబ్బలేదు. చదివింది ఐదోతరగతే. అమ్మా నాన్నలే గురువులు. ఐదేళ్ల వయసు నుంచీ జీవితం తోలుతోనే పెనవేసుకుపోయింది. వీరి నాన్న మేక తోలుపై బొమ్మ గీస్తే, ఈయన దానికి రంగులు వేసేవారు. ఆ తరవాత ప్రభుత్వ హస్త కళల సంస్థ వారు కొంత శిక్షణ ఇచ్చారు. పెద్దగా చదువుకోకపోయినా రామాయణ మహాభారతాలు కొట్టిన పిండి. ఆ కథలు చెబుతూ తోలుబొమ్మలాట ప్రక్రియను కొనసాగిస్తారు.


తోలుబొమ్మలాటగా ‘గాంధీ చరిత్ర’
ఇందిరాగాంధీ ముందు ప్రదర్శించిన వీరి నాన్న ఖడేరావును అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధి పిలిపించు కున్నారు. ‘గాంధీ చరిత్ర’ను తోలుబొమ్మలాట రూపంలో ఆడించే వాడు. దీన్ని గుర్తించి ఢిల్లీలో బంగళాలోనే వీరినాన్నకు రెండేళ్లపాటు బస ఏర్పాటు చేశారు. కొందరికి శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత అనారోగ్యం రావడంతో ఇంటికి వచ్చేశాడు. బొమ్మలు ఆడించడానికి కనీసం ముగ్గురు, హార్మోనియం, మద్దెలకు ఇద్దరు, తాళాలు, సామగ్రి అందించడానికి మరో ఇద్దరు ముగ్గురు… ఇలా ఒక నాటకానికి ఏడెనిమిది మంది అవసరమవుతారు. దేశంలో ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగినా అక్కడకు వెళ్తారు. వీరు తయారు చేసిన తోలు వస్తువులను విక్రయిస్తున్నారు.


ఇప్పటిదాకా పది దేశాల్లో తోలుబొమ్మలాటను ప్రదర్శించారు. అన్నిచోట్లా వీరి బృందానికి అభినందనలు లభించాయి. జర్మనీలో 24,ఫ్రాన్స్ లో 10, అమెరికాలో 30 దాక ప్రదర్శన లిచ్చారు.
పద్మశ్రీ పురస్కారం 2020జనవరి26 న ప్రకటించారు. మార్చిలో ఈ పురస్కారం అందుకోవాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవల ఆయన ఓ పత్రిక ఇంటర్వ్యూ యథాతథంగా ఇస్తున్నా..


కళకు దక్కిన గౌరవమిది: దళవాయి చలపతిరావు.


కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉంది. తోలుబొమ్మల కళకు దక్కిన గౌరవం ఇది. ఆరు దశాబ్దాలుగా తోలుబొమ్మల వేయడం, ప్రదర్శనలు నిర్వహించడం చేస్తున్నా. 12 ఏళ్ల వయస్సు నుంచే ఈ కళపై పట్టు సాధించా. ఇది వరకు శిల్పగురు అవార్డు, జాతీయ అవార్డు అందుకున్నా. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తోలుబొమ్మల కళ అంతరించకుండా భావితరాలకు అందించాలనేదే నా ఆశయం.
తోలుబొమ్మలాట కు ఆదరణ లేకపోవడంతో ఆ కుటుంబాలు చర్మాలతో అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఆర్డీటీ వారు వీరికి ప్రోత్సాహం అందిస్తున్నారు.
పేదరికంతో, కుటుంబ భారంతో చిన్న గ్రామంలో మగ్గిపోయిన 84 సంవత్సరాల దళవాయి చలపతి రావుకు పద్మశ్రీ రావడం నిజంగా గొప్ప విషయం. ఏ కొలబద్దలో ఎంపిక చేశారో కానీ, గుర్తించినవారికి కోటి దండాలు. ఏ రకంగా చూసినా ఇది శ్లాఘనీయం.

బళ్ళారి రాఘవ వంటి నటుడిని, తరిమెల నాగిరెడ్డి వంటి నాయకుడిని, ప్రభాకర్ జీ వంటి గాంధీ అనుయాయుని, తిరుమల రామచంద్రవంటి పండితుణ్ణి, విద్వాన్ విశ్వం వంటి సంపాదక కవిని ఇచ్చిన అనంతపురం జిల్లాకు ఈ ఆరున్నర దశాబ్దాల కాలంలో ఇది రెండవ పద్మశ్రీ. అంతకుముందు 1967లో మహానుభావుడు కల్లూరి సుబ్బారావుకు పద్మశ్రీ లభించింది. అందువల్ల నేడు దళవాయి పద్మశ్రీ అయ్యారని పొంగిపోవాలని ఓ సీనియర్ జర్నలిస్ట్ పేర్కొన్నారు. దళవాయి చలపతి కి అభినందనలు. దళవాయి కి పద్మశ్రీ పురస్కారం రావడం తోలుబొమ్మల కళాకారులందరికీ ఈ పురస్కారం లభించినట్లు అనంత వాసులు భావిస్తున్నారు .

✍️రచన:– చందమూరి నరసింహారెడ్డి 9440683219

చందమూరి నరసింహారెడ్డి

తోలుబొమ్మలాట చరిత్ర చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చేయండి. తోలుబొమ్మలాట

1 comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s