శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం తిరుచానూరు

తిరుచానూరు’ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని ‘మంగపట్నం అనీ, ‘పద్మావతి మందిరం’ అనీ, ‘శ్రీశుకపురం’ అని చెప్పబడింది కాలగమనంలో శ్రీశుకపురమే ‘తిరుచ్చుకపురం’’గా ‘తిరుచ్చుకనూరు’గా తిరుచానూరు’గా పిలువబడిన ఈ క్షేత్రం తిరుపతి పట్టణానికి ఆగ్నేయ దిశగా 3 మైళ్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శిద్దాం.. రండి…

శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం

ప్రధానంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఊంజల్ మండపం, ధ్వజస్తంభమండపం, ముఖమండపం, అర్ధమండపం, అంతరాళం, గర్భాలయం అని ఆరుభాగా లుగా పరిశీలించవచ్చు

ఆశీర్వాదమండపం

ధ్వజస్తంభమండపానికి తూర్పున సుమారు 4 అడుగుల ఎత్తైన రాతి అధిష్ఠానంపై నిర్మింపబడిన 16 రాతి స్తంభాల మండపమే ‘ఊంజల్ మండపం’:. పూర్వం, ఈ మండపం మధ్యలో వున్న వేదికలో అలమేలు మంగమ్మకు డోలోత్సవం జరుపబడేది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కొలువు మేళాలు (భజంత్రీ) వాయింపబడుతున్నాయి

ఇంకా, ప్రముఖులు అమ్మవారి దర్శనానంతరం ఈ మండపంలో కూర్చుని తీర్థప్రసాదాలను ఆశీర్వాదాన్ని
స్వీకరిస్తుంటారు.

ధ్వజస్తంభమండపం

ఒక వరుసకు ఆరుస్తంభాల వంతున ఆరు వరుస లతో మొత్తం 36 రాతిస్తంభాల ఎత్తైన మండపం మధ్యలో బంగారు బలిపీఠం, దానికి పశ్చిమంగా ఆనుకొని ఉన్న బంగారు ధ్వజ స్తంభం ఉండడంచేత ఈ మండపం ధ్వజస్తంభ మండపం అని పిలువబడుతున్నది. అమ్మవారికి నివేదనలు జరిగిన మూడుపూటల చివర్లో ఆలయాన్ని అంటి పెట్టుకొన్న భూతగణాలకు శుద్ధాన్నం బలిగా ఈ పీఠం పైన సమర్పింపబడుతుంది. కనుక ఇది బలిపీఠం. దీనికి ఆనుకొని ఎత్తైన బంగారు ధ్వజస్తంభం ఉంది. అమ్మవారికి ఎదురుగా ఈ స్తంభంలో కింది భాగంలో పశ్చిమాభిముఖంగా గజవాహనం, ఉత్తరదక్షిణ వైపున శంఖచక్రాలు, తూర్పుముఖంగా శ్రీ పద్మావతి అమ్మ వారి ప్రతిమ ఇలా నలువైపులా ఈ ధ్వజస్తంభంపై ప్రతిష్టింపబడినాయి. ప్రతిసంవత్సరం కార్తికమాసంలో వైభవంగా జరిగే బ్రహ్మోత్సవ ప్రారంభంలో ఈ బంగారు ధ్వజస్తంభం పైన గజపతాకం ఎగుర వేయబడుతుంది. బ్రహ్మోత్సవానంతరం చివర్లో, ఈ ధ్వజం అవరోహణ జరుపబడుతుంది.

కల్యాణోత్సవమండపం

అమ్మవారి ధ్వజస్తంభమండపానికి దక్షిణంగా శ్రీబలరామకృష్ణస్వామి ఆలయానికి ముందు భాగంలో వున్న కల్యాణ మండపంలో శ్రీ పద్మావతీ శ్రీనివాసులకు ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు కల్యాణోత్సవం జరుగుతుంది.

ముఖమండపం

శ్రీపద్మావతి అమ్మవారి ప్రధాన ఆలయానికి ముందు భాగంలో చుట్టూ ఇనుపకటాంజనంతో మధ్యలో నాలుగుస్తంభాల మధ్యలో ఎత్తైన రాతి వేదికతో విరాజిల్లుతున్న మండపమే ముఖమండపం. శ్రీపద్మావతి అమ్మవారికి ఈ మండపంలో ఆస్థానాలు, కొలువులు జరుగుతుంటాయి.

అర్ధమండపం-

ముఖ మండపం దాటి లోనికి వెళితే ఉండేదే అర్ధమండపం, ఇది గర్భాల యానికి ప్రదక్షిణా మండపంగా కూడ ఉప యోగపడుతున్నది. ఈ అర్ధమండపంలో గర్భాలయానికి ముందుభాగంలో దక్షిణవారకు ఉత్తరాభిముఖంగా ఉన్న రాతి అరలో సుదర్శన భగవానుని, విష్యక్సేనులవారి పంచ లోహవిగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు విష్వక్సేనులవారు, గరుత్మంతులవారి శిలావిగ్ర హాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. అలాగే ఉత్తరం వారకు దక్షిణాభిముఖంగావున్న రాతి అరలో శ్రీభగవద్రామానుజులవారి శిలా మూర్తితో పాటు, పంచలోహమూర్తి కూడ ప్రతిష్ఠింపబడివున్నాయి.

అంతరాళం-

అర్ధమండపం దాటి లోనికి వెళితే ఉండే మండపమే అంతరాళం. ఈ అంతరాళంలో ప్రవేశించే ద్వారాన్ని ఇరు వైపులా ఉండే అమ్మవారి సేవికలు ‘వనమాలిని, బలాకిని కాపలా కాస్తుంటారు. ఈ అంతరాళంలో శ్రీ పద్మావతి అమ్మవారి పంచ లోహ ఉత్సవమూర్తితో పాటు శ్రీపద్మావతి శ్రీనివాసుల భోగమూర్తుల విగ్రహాలు కూడ చోటుచేసుకున్నాయి.

గర్భాలయం-

అంతరాళం దాటిన తర్వాత గర్భాలయం మధ్యలో పద్మపీఠం పై, కూర్చొన్న భంగిమలో శ్రీపద్మావతి అమ్మవారి శిలా మూర్తి ప్రతిష్ఠింపబడింది. చతుర్భుజి అయిన అమ్మవారికి పై రెండు చేతుల్లో పద్మాలు ఉన్నాయి. క్రింది కుడి ఎడమచేతులు వరుసగా అభయ, వరద ముద్రలు కలిగి దర్శనమిస్తున్నది.

అలమేలుమంగ’ అని పిలువబడుతున్న పద్మావతి అమ్మవారి మూలమూర్తికి ప్రతిరోజు ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన అనే కుంకుమార్చన, నివేదన చేస్తారు భక్తులు సర్వదర్శనవేళల్లో కూడ ఈ తల్లికి ‘కుంకుమార్చన నిర్వహించుకోవచ్చు

ఇదిగాక ప్రతిసోమవారం ‘అష్టదళపాదపద్మారాధన’, ప్రతి గురువారం ‘తిరుప్పావడ సేవ ప్రతి శుక్రవారం ‘అభిషేకం ప్రతి శనివారం ‘పుష్పాంజలి సేవ అమ్మవారి మూలమూర్తికి నిర్వహింపబడతాయి.

శాంతినిలయవిమానం

శ్రీపద్మావతి అమ్మవారి గర్భాలయంపైన “శాంతి నిలయ విమానం” అనే పేరుతో బంగారు కవచంతో ఏకకలశగోపురం నిర్మింపబడింది ఈ బంగారు విమానంపైన అష్టలక్ష్ముల విగ్రహమూర్తులు అష్టదిక్కుల్లో ప్రతిష్టింపబడినందువల్ల ఈ అష్టలక్ష్ముల సమన్వయసమాహార రూపమే ఈ అలమేలుమంగ! అన్ని కోరికలను తీర్చగల సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి! అని స్పష్టమవుతున్నది.

విశేషంగా శాంతినిలయ విమానంమీద వాయవ్యమూలలో విల సిల్లే “విమానలక్ష్మి”గా కూడ దర్శనమిస్తున్నది అలమేలుమంగ ఈ శాంతి నిలయం మీది “విమానపద్మావతి” తిరుమలకొండవైపు చూస్తున్నట్లుగా దర్శనమిస్తూ శ్రీనివాసుని స్మరింపజేస్తుంది. శ్రీపద్మావతి అమ్మవారికి పాంచరాత్రాగమం ప్రకారంగా ఏడాది పొడవునా నిత్సోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు ఎన్నెన్నో వైభవంగా జరుపబడుతుంటాయి. తిరు మల యాత్రికులతో, భక్తులతో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం కోలాహలంగా సందడిగా.. అలరారుతూఉంటుంది.

శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవాలు-

దివ్యక్షేత్రమైన తిరుచానూరులో పవిత్రమైన పద్మసరోవర పుణ్యజలాల నుండి బంగారు సహస్రపద్మంలో ఆవిర్భవించిన అలమేలు మంగమ్మకు పద్మావతి అనే పేరుతో పాటుగా “స్వతంత్ర వీరలక్ష్మి” అనే మరో పేరు ప్రసిద్ధంగా ఉంది.

తిరుమల స్వామివారికి వైఖానసాగమశాస్త్ర రీతిగ స్వతంత్రంగా షట్కాలార్చనలు ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతున్నట్లుగా, తిరుచానూరులో శ్రీమహారాజిణి అయిన పద్మావతి అమ్మవారికి పాంచరాత్రాగమ శాస్త్రరీతిగా స్వతంత్ర వీరలక్ష్య్మారాధన” పేరుతో నిత్యారాధనలు, ఉత్స వాలు, ఊరేగింపులు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీనివాసుని పట్టపురాణి అయిన పద్మావతికి తిరుమలేశుని మాదిరిగానే స్వతంత్రంగా జరుగుతున్న సేవలను క్లుప్తంగా జరిగే విధానాన్ని తెలుసుకుందాం

నిత్యోత్సవాలు-

ప్రతిరోజు విధిగా జరిగే ఉత్సవాలను నిత్యోత్సవాలు అంటారు. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై వరుసగా శ్రీపద్మావతి అమ్మవారి మూల మూర్తికి సహస్ర నామార్చన, జరిగిన తర్వాత- నివేదన జరుగుతుంది.

పద్మావతి పరిణయం” పేరుతో శ్రీపద్మావతీ శ్రీనివాసులకు నిత్యకల్యాణోత్సవం, ప్రతి సాయంత్రం అమ్మవారికి డోలోత్సవం (ఊంజల్ సేవ) జరుగుతాయి. రాత్రి “ఏకాంత సేవ”తో ఆలయ కార్యక్రమం పూర్తి అవుతుంది. సర్వదర్శన వేళల్లో భక్తులు అమ్మవారి మూలమూర్తికి కుంకుమార్చన చేయించుకోవచ్చు.

వారోత్సవాలు –

వారానికి ఒక రోజు ప్రత్యేకమైన ఉత్సవం విధిగా జరుగుతుంది. ఈ సేవల్లో భక్తులు నిర్ణీత ఆర్జిత రుసుమును చెల్లించి పాల్గొనవచ్చు. సోమవారం- అష్టదళ పాదపద్మారాధన, గురువారం- తిరుప్పావడ (అన్నకూటోత్సవం) మూలమూర్తికి జరుగుతుంది.

అభిషేకం-

శుక్రవారం-అమ్మవారి మూలమూర్తికి అభిషేకం నిర్వహింపబడుతుంది.

లక్ష్మీపూజ-

ప్రతి శుక్రవారం కల్యాణోత్సవానికి ముందుగా కల్యాణమండపంలో “లక్ష్మీపూజ” జరుగుతుంది.

తోట ఉత్సవం-

ప్రతి శుక్ర వారంనాడు నిత్యకల్యాణం తర్వాత అమ్మవారు గుడికి దక్షిణ దిక్కులో ఉన్న శుక్రవారపు తోటకు వెళ్లిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటల వేళలో ఆ తోటలో పసుపు చందనం మున్నగు ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకాన్ని భక్తులు అందరూ దర్శించవచ్చు.

ఊంజల్ సేవ-

ప్రతిరోజు అస్థానమండపంలో ఊంజల్ సేవ జరుగుతుంది. ఈ సేవ జరిగిన తర్వాత ప్రతి శుక్రవారం మాత్రమే ఊరేగింపుగా గ్రామోత్సవం జరుగుతుంది

పుష్పాంజలి సేవ

ప్రతి శనివారం ఉదయం 6.30 గం||లకు పుష్పాంజలి సేవగా పద్మాలతో మూలమూర్తికి పుష్పార్చన జరుగుతుంది.

నక్షత్రోత్సవాలు-

ప్రతినెలా ఉత్తరాషాఢ, ఏకాదశి రోజుల్లో అమ్మవారి ఉత్సవమూర్తికి ఏకాంతంగా అభిషేకం జరుగు తుంది. ఉత్తరాషాఢానక్షత్రం రోజు సాయంత్రం శ్రీపద్మావతి అమ్మవారికి గజవాహనోత్సవం జరుపబడుతుంది

సంవత్సరోత్సవాలు-

ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయ ముఖమండపంలో ఉగాది ఆస్థానంరోజున పంచాంగ శ్రవణం జరుగుతుంది.

వసంతోత్సవాలు-

వైశాఖమాసం పూర్ణిమకు, మూడు రోజులపాటు అమ్మవారికి వసంతోత్సవాలు జరుగుతాయి. చివరి రోజు పున్నమిరోజున స్వర్ణరథోత్సవం జరుగుతుంది.

తెప్పోత్సవాలు-

జ్యేష్ఠమాసం పూర్ణిమకు పూర్తయ్యేట్లుగా ఐదు రోజులపాటు తెప్పోత్సవాలు జరుగుతాయి.మొదటి రోజున ఏకాదశినాడు శ్రీకృష్ణస్వామికి, రెండవ రోజు ద్వాదశిరోజున శ్రీ సుందరరాజస్వామికి చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారికి పద్మపుష్కరిణిలో తెప్పోత్స వాలు జరుగుతాయి.

పవిత్రోత్సవాలు-

ప్రతి సంవత్సరం భాద్రపద మాసం పున్నమనాటికి పూర్తి అయ్యేట్లుగా 3 రోజులపాటు పవిత్రో త్సవాలు జరుగుతాయి.

బ్రహ్మోత్సవాలు-

ప్రతి సంవత్సరం కార్తిక శుద్ధ పంచమికి పూర్తగునట్లు, పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు వేళల్లో మహారాజ్ఞి అయిన పద్మావతి అమ్మవారికి మాత్రమే వాహన సేవలు జరుగుతాయి. చివరి రోజున పంచమిరోజున పద్మసరోవరంలో వేలాదిమంది భక్తుల మధ్య జరిగే పంచమి తీర్థవేడుకలతో బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి లక్షకుంకుమార్చన బ్రహ్మోత్సవాలు ప్రారంభమగుటకు ముందు రోజున పద్మావతి అమ్మవారికి లక్షకుంకుమార్చన సేవ జరుగుతుంది.

పుష్పయాగం –

బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరునాడు శ్రవణనక్షత్రం రోజున ఆలయంలోనే శ్రీ పద్మావతి అమ్మ వారికి వివిధరకాల సుగంధ పుష్పాలతో “పుష్పయాగం ఘనంగా జరుగుతుంది.

తైమాసంలో ప్రత్యేకపూజలు –

ప్రతి సంవత్సరం పుష్య మాసంలో (అరవనెల తైమాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా, అమ్మవారికి పూజలు జరుగుతాయి. సుమంగళులకు పసుపుదారాలు ప్రసాదంగా పంచబడతాయి.

శ్రీనివాస భగవానుని పట్టపుదేవేరి అయిన పద్మావతి అమ్మవారు అర్చామూర్తిగా వేంచేసి వున్న తిరుచానూరుక్షేత్రం అంగరంగ వైభవంగా ఉత్సవాలతో, ఊరేగింపులతో ఏడాది పొడవునా జరిగే ఆ తల్లి ఉత్సవ వైభవాన్ని వర్ణించడం సాధ్యం కాదు. ప్రతి భక్తుడు తిరుమలను సందర్శించే ముందు పద్మ సరోవరాన్ని దర్శించడం, స్పృశించడం, స్నానం చెయ్యడం విధిగా ఆచరించాలి. తర్వాత శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకొన్న తర్వాతనే తిరుమలకు వెళితే తమయాత్ర సంపూర్ణంగా సిద్ధిస్తుంది

శ్లో॥ మాతస్సమస్తజగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే |
శ్రీస్వామిని శ్రితజన ప్రియ దానశీలే
శ్రీవేంకటేశదయితే తవ సుప్రభాతమ్ ||

రచన- శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం
అక్టోబరు, 2020 సప్తగిరి సంచిక Page 51 to 54 నుంచి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s