శ్రీ గండి క్షేత్రం.

“యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ | బాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకమ్” ||
ఎక్కడెక్కడ శ్రీరామకీర్తనం, రామనామస్మరణం జరుగుతుంటుందో అక్కడక్కడ శ్రీ ఆంజనేయస్వామి చేతులు జోడించి, ఆనందంతో వింటూ ఉంటాడని ఆర్షవచనం. అంతటి మహోన్నతమైన శ్రీరామభక్తుడు ఆంజనేయుడు.
అందుకు నిదర్శనంగా మనభారతదేశంలో గల దేవాలయాలలో ఎక్కువభాగం ఆంజనేయుని దేవాలయాలే నిర్మించబడినవి. ఇది అక్షరసత్యం. మహామహిమాన్వితుడైన ఆంజనేయుని ఆలయాలలో ముఖ్యమైనదిగా పేరుగాంచి, పవిత్ర పాపాఘ్నినది ఒడ్డున స్వయానా రఘుకులేతునిచేతులమీదుగా రూపుదిద్దుకున్న క్షేత్రమే “శ్రీ గండి క్షేత్రం”. ఇది కడపజిల్లా పులివెందుల తాలూకా చక్రాయపేట మండలంలో వేంపల్లెకు సమీపమున వెలసిన వీరాంజనేయ క్షేత్రం.

స్థలపురాణం
త్రేతాయుగంలో అవతారమూర్తియైన శ్రీరామచంద్రుడు తండ్రిఆజ్ఞపాలించుటకై అరణ్యవాసం చేస్తున్న సమయంలో లంకాధిపతియైనరావణాసురుడు శ్రీరామచంద్రుని సతీమణి మహాసాధ్వి సీతమ్మగారిని మాయోపాయంతో ఎత్తుకొనిపోయి, లంకలో నిర్బంధించాడు. అప్పుడు రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యంనుండి గండి క్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట, సీతాన్వేషియై వచ్చిన రామలక్ష్మణులకు స్వాగతవచనాలు పలికి తన ఆతిథ్యం స్వీకరించవలసిందని వాయుదేవుడు వేడుకొనగా, అందుకు శ్రీరామచంద్రుడు తక్షణకర్తవ్యమైన రావణవధానంతరం సీతాసమేతుడనై తిరిగి వచ్చునపుడు నీకోరిక తప్పక తీర్చెదనని వాగ్దానం చేసి, వాయుదేవునిదగ్గర సెలవు తీసుకొని బయలుదేరాడు.

చెప్పిన మాట ప్రకారం రావణాసురుని వధించి, సీతమ్మతో కూడా సర్వవానర సైన్యసమేతుడై శ్రీరాచంద్రుడు వస్తున్నవార్త విన్న వాయుదేవుడు సంతోషంతో అక్కడ గల రెండు కొండల మధ్య బంగారు మామిడాకులతోరణం కట్టి స్వాగతం పలికాడట! అందుకు ఆనందించిన శ్రీరామచంద్రునికి విందుభోజనానికి వాయుదేవుడు ఏర్పాటు చేసిన సమయంలో, అక్కడి పాపఘ్నినదీ పరీవాహక ప్రదేశంలో ఆ ప్రకృతివాతావరణం (శేషాచల పర్వత శ్రేణులలో గండి ఏర్పడడం, అందు నది కిరువైపుల ఉన్న వృక్షరాజములు, ఆచెట్లపై పక్షుల కిలకిలా రవములు కనులకు, చెవులకు పండువుగా) తిలకించిన శ్రీరామచంద్రుడు ఆ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై, సీతాన్వేషణం మొదలుగా రావణాసురునిపై తనవిజయానికి మూలకారణమైన “వీరాంజనేయుని” రౌద్రరూపమును అక్కడ ఒకశిలాగ్రహంపై తన బాణం ములికిచే సర్వాంగసుందరంగా చిత్రించాడు. చిత్రం చివరి దశలో లక్ష్మణుడు వచ్చి, అన్నగారికి కాలహరణం సంగతి గుర్తు చేయగా, ఆ ఆత్రంలో శ్రీరామచంద్రుడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిటికెన వ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు. ఆ చిత్రరూపమే శ్రీ వీరాంజనేయుని విగ్రహముగా విరాజిల్లుచున్నది, భక్తులపై భగవంతుడికి గల ప్రేమాభిమానాలకు గండి క్షేత్రములో నాటినుండి నేటి వరకు పూజింపబడుచున్నది ఈ విగ్రహం, కుడిచేతిని పైకెత్తి, ఎడమచేతిని నడుము పైనుంచుకొని, ఉగ్రరూపంతో రాక్షసులకు భయంగొల్పే విధంగా ఉండడంచేత స్వామివారిని వీరాంజనేయు డని పిలువడం పరిపాటియైనది, పిమ్మట కొంతకాలానికి వసంతాచార్యులనే భక్తుడు చిన్న గుడి నిర్మించి, ఆ రేఖాచిత్రానికి పూజలు చేయడం జరిగింది.
ఆ తరువాత మరికొంతకాలానికి వ్యాసరాయలనే శిల్పాచార్యుడు ఆ రేఖాచిత్రమును విగ్రహముగా మార్చాలని ఉలితో చెక్కుచుండగా వీరాంజనేయ స్వామివారి ఎడమచేతి చిటికెనవ్రేలు విడదీసే సందర్భంలో రక్తం ధారలుగా స్రవించిందట! అంతట ఆ శిల్పాచార్యులు అది గమనించి తన ప్రయత్నము విరమించి, పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వామివారి చిటికెనవ్రేలి విషయం నిశితంగా గమనించినగానీ కనిపించదు. స్వామివారి పాదాల క్రింద ఒక చిన్న విగ్రహం ఉంటుంది, ఆమూర్తిని రావణాసురుని కుమారుడగు అక్ష కుమారునిగా గుర్తించవచ్చు, కాలానుగుణంగా దేవాలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది.

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ముందు పాపాఘ్ని నదిలో స్నానమాచరించి, తదుపరి స్వామివారిని దర్శిస్తే సర్వపాపాలు, గ్రహబాధలు తొలగిపోయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి మూలవిరాట్ విగ్రహానికి హృదయపూర్వక నిష్టతో, మండలారాధన సేవచేస్తూ ప్రదక్షిణలు తిరిగితే, ఎటువంటి గ్రహబాధలైనా తొలగిపోతాయని నమ్మకంతో భక్తులు భజనలు చేస్తూ, ప్రదక్షిణలు చేస్తూ ఉండడం గమనార్హం

పాపాఘ్నినదీ ప్రశస్తి
పాపాఘ్ని నది పరమపవిత్రమైనదిగా పురాణాలలో పేర్కొనబడింది, ఈ నది కర్ణాటక రాష్ట్రంలోని నందికొండల్లో పుట్టి అక్కడనుండి చిత్తూరు, అనంతపురం జిల్లాల మీదుగా సాగుతూ. కడపజిల్లాలోని గాలివీడునుండి గండి క్షేత్రంలో ప్రవహిస్తున్నది. ఇక్కడనుండి ఉత్తరంవైపుగా సాగి ‘కమలాపురం తాలూకాలో ఉన్న సంగమేశ్వరస్వామి దేవాలయం తాకుతూ-సమీపంలోని పెన్నానదిలో కలుస్తున్నది, పాపాఘ్నినది పవిత్రతనూ అనేకపురాణాలు ప్రస్తుతించాయి.
బంగారుతోరణం
గండి క్షేత్రంలో ఆనాడు వాయుదేవుడు శ్రీరామచంద్రుణ్ణి స్వాగతిస్తూ రెండు కొండల మధ్య కట్టించిన బంగారు మామిడాకులు తోరణం నేటికిని అలాగే ఉన్నదని రుజువైంది. 18వ శతాబ్దిలో అప్పటి ఉమ్మడి మద్రాసురాష్ట్రంలో ఉన్న కడపజిల్లా కలెక్టరు సర్ థామస్ మన్రో (బ్రిటిష్ ప్రభుత్వ అధికారి) తన కడపటి ప్రయాణంలో గండి క్షేత్రం మీదుగా వచ్చినపుడు ఇక్కడ రెండు కొండల నడుమ దేదీప్యమానంగా వెలుగొందుచున్న బంగారు మామిడాకుల తోరణాన్ని దర్శించెనట! తరువాత ఆరునెలలకు మన్రో గారు
గుత్తికోటలో మరణించారు. కలియుగంలో ఈ తోరణం ఎవరికి కనిపించదని, ఒకవేళ సచ్చీలురైనవారికి కనిపిస్తే వారు ఆరునెలలో తప్పక మరణిస్తారని శాస్త్రవచనం

గండిక్షేత్రం తితిదే యాజమాన్యంలో విలీనం
2007 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు గండి క్షేత్రాన్ని దత్తత తీసుకొని, ఎంతో అభివృద్ధి చేశారు. శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయానికి ప్రహరీ నిర్మించి, ఉత్తరంవైపు గొప్పగాలిగోవురం కట్టించారు. కల్యాణమండపం. అన్నదాన సత్రం ఇంకా భక్తుల వసతినిమిత్తం గొప్పభవనాలు నిర్మించడం జరిగింది.

కొంతమంది ఉదారభక్తులు అన్ని సదుపాయాలు గల భవనాలూ కట్టించారు. వీరాంజనేయస్వామివారి నిత్యపూజలు మరియు శ్రావణమాసోత్సవాలు ఘనంగా నిర్వహించడం విశేషం. ప్రతినెల మొదటి, రెండవ, మూడవ, నాల్గవ శనివారాలలో సుమారు 500ల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గండి క్షేత్రం అందరూ చూడవలసిన ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం.
రచన:–వి.శ్రీరామరెడ్డి
మార్చి 2015 సప్తగిరి సంచిక నుంచి.