
ఒక కళ చిరస్మరణీయం కావడానికి అది ప్రతిఫలించే విధంగా ఉండాలంటే ఒక వ్యక్తి భావనా శక్తి పై ఆధారపడి ఉంటుందనే వాస్తవానికి చక్కటి నిదర్శనం కలంకారి కళలో రాష్ట్రపతి చేతుల మీదుగా రెండు సార్లు జాతీయ అవార్డు అందుకొన్న మన రాయలసీమ రత్నం కాచిరెడ్డి శివప్రసాదరెడ్డి.
మనుషుల్లో సృజనాత్మకత వికసించడానికి మనిషి మనిషిగా జీవించడానికి సాంస్కృతిక చైతన్యం అవసరం. సాంస్కృతిక చైతన్యం అనేక రూపాల్లో ఉంటుంది. అందులో కళారూపం ఒకటి. రాయలసీమ సాహిత్యంలో ఇలా ఎన్నో కళలు రూపుదిద్దుకున్నాయి. అందులో బొమ్మలు చిత్రించే కళ ఒకటి. చిత్రించే కళలో “కలంకారీ” ఒక కళ. ఈ కళే కర్నూలు జిల్లా, బనగానపల్లె మండలం, టంగుటూరు గ్రామ వాసి అయిన “కాచిరెడ్డి శివప్రసాదరెడ్డి”లో చైతన్యం నింపింది.
చిత్తూరు జిల్లా, శ్రీ కాళ హస్తిలో పుట్టిన ఈ “కలంకారీ” కళ పురాతనమైనదిగా గుర్తించారు.
కలంకారీ కళ అంటే వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలను చిత్రించడం.
కుటుంబ కారణాల వల్ల చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి శ్రీ కాళహస్తి చేరుకున్నాడు. ముందుగా మనిషి మనిషిగా జీవించడానికి ఈ కళను నేర్చుకున్నాడు. పోను పోనూ ఆయనలో ఈ కళ చైతన్యం నింపింది. కేవలం బతుకు తెరువుగా ఉన్న ఈ కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలనే ఉద్దేశ్యంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ కలం కారీ విద్యలో ప్రావీణ్యం పొందాడు.

రామాయణం, భాగవతం,భారతంలతో పాటు ప్రకృతి దృశ్యాలను “కలంకారీ” బొమ్మలుగా 47 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు కలిగిన వస్త్రం మీద రెండువేల చిత్రాలను చిత్రించాడు. ఆ కళకు రాష్ట్రపతి “ప్రణబ్ ముఖర్జీ” ముగ్దుడై జాతీయ స్థాయి అవార్డు మన రాయలసీమ రత్నం శ్రీ.కె.శివప్రసాదరెడ్డికి అందించాడు.
ప్రాకృతిక దృశ్యాలు కలంకారీ బొమ్మలుగా గీసినందుకు దక్షిణ ఆసియా దేశాలు యునెస్కో అవార్డుకు ఆయనను ఎంపిక చేశాయి. ఆయా దేశాల అధినేతల సమక్షంలో యునెస్కో అవార్డు అందుకున్నాడు. ఇంకా దేశీయంగా ఎన్నో అవార్డులు అందుకున్నాడు.

రచయిత :–సుధాకర రెడ్డి గంగిరెడ్డి.
