
కొండల పైనే కోటలు ఎందుకు కడతారు ముందుగా తెలుసుకోవాలి . శత్రువులు , క్రూరమృగాల నుంచి రక్షణ కోసం. ఇలాంటి వాటిని అధ్యయనం చేస్తే చరిత్ర తెలుస్తుంది. అలాంటి చరిత్ర కలిగిన గుత్తి కోట గుట్టు ను ఇప్పుడు తెలుసుకుందాం. గుత్తి ఆంద్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఒక చిన్న పట్టణం.జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుత్తి పట్టణానికి తూర్పున ఉన్న రెండు కొండల మధ్య దాదాపుగా 300 మీటర్ల ఎత్తున ఉంది గుత్తి కోట. శాసనాలే ఆధారాలు , గుత్తి కోటను 1500 ఏళ్ల కు పూర్వం బాదామి చాళుక్యులు కట్టినట్లు చరిత్ర కారుల అధ్యాయనం . తరువాత కోటను ఏలిన రాజులు కోటను పటిష్ట పరిచారు. వారిలో విజయనగర రాజులు ఎక్కువ గా అభివృద్ధి పరిచారు. గుత్తి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2250 సంవత్సరాల పూర్వం అశోక చక్రవర్తి 14 శాసనాలను వేయించాడు. వీటిని జొన్నగిరి , స్వర్ణగిరి , లేదా ఎర్రగుడి శాసనాలంటారు.గుత్తి కోట గురించి చెప్పిన తొలి శాసనాలన్ని కన్నడ , సంసృతం భాషాల్లో లికించబడ్డాయి. ఈ శాసనాల్లో ఈ కోట పేరు ‘” గధ ‘” అని , విజయనగర చక్రవర్తి బుక్కరాయల శాసనం లో ‘ ‘ ‘రాజదుర్గం ‘ అని ఉంది. గుత్తి పట్టణాన్ని ఈ కొండ 3 వైపుల చుట్టుముట్టి ఉండడం , ఈ కొండల చుట్టూ 13 కిలోమీటర్ల పొడవునా రాతి గోడలు శంఖు ఆకృతి లో నిర్మిoచారు. కోట గోడ 5 మీటర్ల ఎత్తు , 2.5 మీటర్ల వెడల్పు తో ఉంటుంది. కోటకు 15 బురుజులు , 15 ప్రధాన ముఖ ద్వారాలున్నాయి. అందుకే ఒక చరిత్రకారుడు ఇంత పటిష్టమైన కోటను “మోసం” “కరువు” మాత్రమే ఈ గుత్తి కోటను ఓడించగలవు అన్నాడు. అంటే అంత గొప్ప నిర్మాణం ఈ గుత్తి కోట .

ఇక్కడి కొండలు దూరంనుంచి ఒక పుష్ప గుత్తి లాగా కనిపించడం తో ఈ ఊరిని గుత్తి అన్న పేరుతో పిలవడం జరిగింది. కోటను ఎక్కాలంటే ముందుగా చరిత్ర కలిగిన యూరోపియన్ సమాధులు గురించి తెలుసుకోవాలి .200 సంవత్సరాల ముందు బ్రిటిష్ వారి పాలనలో ఇక్కడ ఉన్న దత్త మండలాల కలెక్టర్ శ్రీ సర్ థామస్ మన్రో సమాధి ఉంది.మన్రో గారు రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నో ఉపయోగకరమైన సంస్కరణలు చేశారు. రైత్వారి విధానం తో ఇక్కడి రైతులకు మేలుజరిగింది. అప్పుడు వచ్చిన కలరా వ్యాధి తో మన్రో గారు చనిపోయారు. 3 రోజులు ఈ గుత్తి కోట దగ్గర ఆయన దేహాన్ని ఉంచి , తరువాత వారి దేశానికి తరలించినట్లు గుత్తి కోట చరిత్ర లో ఉంది.

వీరి సమాధి తో పాటు అప్పట్లో కలరా వ్యాధి బారిన పడిన ఎందరో ఆంగ్లేయుల సమాధులు మనము చూడవచ్చు.వాటి ముందర కోటకు ఇరువైపులా 2 ఫిరంగులు మనము చూడవచ్చు. కాలి నడకన కొండమీదకు వెళ్ళాలి.మొదట విశాలమైన మైదానం కనిపిస్తుంది. అక్కడ వ్యాయామశాల , ఆయుధ గిడ్డంగి , సైనికులు కవాతు చెయ్యడానికి , అశ్వములు , ఏనుగుల శాలలు , రంగ మంటపం , వంట గది , ఒక నేల మాలిగ అందులో శ్రీ కృష్ణ దేవరాయలు కూడా కొంత కాలం ఖైదు చేశారని ప్రతీతి. కదిరి దగ్గర తలుపుల కోటను ఏలిన రహీంఖాన్ టిప్పుసుల్తాన్ పెత్తనాన్ని అంగీకరించక పోవడంతో గుత్తి నవాబు ద్వారా గుత్తి కి రప్పించి చీకటి గదిలో ఖైదు చేశారట.
కోట పైకి ఎక్కే కొద్ది మనకు , బావులు , కోట గోడలు దర్శనం ఇస్తాయి. ఈ కోట ప్రత్యేకత 101 బావుల నిర్మాణం , వీటి వల్ల కోట ద్వారాలు మూసివేసినా ప్రజలకు నీటి కరవనేది ఉండేది కాదు , కొన్ని బావులలో నీటి ఊటలు ఉన్నాయి. అంటే నీరు నిరంతరం ఊరుతూనే ఉంటుంది. కోటలో బురుజులు , కోట గోడలకు ఉన్న రంధ్రాలలో తుపాకీ పెట్టి దూరాన ఉన్న శత్రువులను ఎక్కుపెట్టే వారు , కోట చుట్టు కందక నిర్మాణం ఒక అద్భుతమైన కట్టడం , రాణివాసాలు , నేలమాళిగలు , దాన్యాగారాలు , మురారి రావ్ గారి గద్దె, గుత్తి కోట నిర్మాణం జరిగి వందల ఏళ్లయిన , 500 సంవత్సరాల కిందట విజయనగర సామ్రాజ్యకాలంలోనే పూర్తిస్థాయిలో కట్టించడం జరిగింది . తరువాత మైసూర్ టైగర్ టిప్పుసుల్తాన్ , ఆంగ్లేయులు కోటకు యెన్నో సౌకర్యాలను సమకూర్చారు , కోటను మరింత దృఢ పరిచారు. చివరిగా విచారించ దగ్గ విషయం ఏమిటంటే ఆనాటి పాలకులు దాచిపెట్టిన గుప్త నిధులు ఉన్నాయనే భ్రమ తో దుండగులు త్రవ్వకాలు మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘాల కృషితో ప్రభుత్వం కొంతమందిని కోట కు కాపాలదారులను నియమించారు. వారు కోటను కాపాడడమే కాక కోట లోపలికి వెళ్లాలంటే కొన్ని నిబంధనలు తో అనుమతిని ఇవ్వడంతో కొద్దిగా గుప్త నిధుల కోసం వెళ్లే వారి సంఖ్య ను కట్టడి చేశారు.

అలాగే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గుత్తి కోటను ఎక్కువగా ప్రచారం చెయ్యడం జరిగింది. స్థానిక సంఘాలు గుత్తి కోటను పర్యాటక స్థలంగా చేయాలని గత 15 సంవత్సరాలు గా యెన్నో ర్యాలీలు , ధర్నాలు , సంఘాల సొంత డబ్బుతో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు. కానీ పోయిన ప్రభుత్వాలు ఏవి పట్టించుకోకుండా , మొన్న పడిన వర్షాలకు కోట లోని చాలా గోడలు దెబ్బతిన్నాయి , వాటిని పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టి గుత్తి కోటను వెంటనే పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి. గుత్తి కోటను ఒక్కసారైనా ప్రతిఒక్కరు చూడాలి.గుత్తి కోటను పురావస్తు శాఖ , టూరిజం శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
రచన :–భాష , గుత్తి కోట సంరక్షణ సమితి.