Burrakatha

జానపద ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలవుతాయి.ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటుంబ నియంత్రణ, రాజకీయ ప్రచారం, ప్రజలను విజ్ఙానవంతులను చేయడం వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.జంగంకథ, పంబలకథ, జముకులకథ, పిచ్చుకుంట్ల కథ, తరువాతవచ్చింది.డాలు, కత్తితో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు.

దీనికి విస్తృత ప్రచారాన్ని కల్పించి పద్మశ్రీ బిరుదు సంపాదించుకున్నవారు షేక్ నాజర్. పేరునుబట్టి వీరు ఇస్లాం మతానికి చెందిన వారైనా చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ దేవీదేవతలకు చెందినవే. శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలియుద్ధం కథ కోరారు. దానితో నాజర్ తానే కథారచనకూ నడుం బిగించాడు. అంతేకాదు సామ్యవాద దృక్పథం గల వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది.

Naazar

నాజర్ బొబ్బిలియుద్ధం, అల్లూరి సీతారామరాజు ప్రహ్లాద, క్రీస్తు, పల్నాటి యుద్ధం బెంగాల్ కరువు వంటి వస్తు వైవిధ్యంగల కథలను చెప్పి రక్తికట్టించారు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా సాగింది.

బుర్రకథల పుట్టుక

బుర్రల సహాయంతో కథ చెప్పబడుతుండడం వల్ల ఈ కళారూపానికి బుర్రకథ అని పేరువచ్చింది. ప్రదర్శనకు సంబంధించి ప్రధాన కథకుడు వాడేది తంబూరా. అతనికి ఇరువైపులా ఇద్దరు వంతగాండ్లు ఉంటారు. వాళ్లు గుమ్మెట అనే పేరుగల వాయిద్యాన్ని ప్రదర్శన సందర్భంలో ఉపయోగిస్తారు. ఆ గుమ్మెటలను కొన్ని ప్రాంతాలలో బుర్రలు అంటారు. ఇలా బుర్రల సహాయంతో నడిచే కళ కాబట్టి ఈ కథా రూపానికి బుర్రకథ అని పేరు వచ్చింది.

నాయని కృష్ణకుమారి జానపద గేయగాథల్లో ముఖ్యంగా జంగం కథలే బుర్రకథలకు మూలమని నిరూపించారు.

Jangam janapada art

బుర్రకథ సంగీతం, నృత్యం, అభినయం, రూపకం- అనే జానపద ప్రదర్శన కళారూపాల సమ్మేళనం. బుర్రకథల్లో వినిపించే
చెవికింపు గొలిపే సంగీతం, కంటికి విందొనర్చే నృత్యాభినయం, మనస్సును మురిపించే చమత్కారాలు , పాటలు, పద్యాలు, హాస్యం, వంతల వింతల వినోదం చిన్నలను, పెద్దలను ఆకర్షిస్తాయి . ఇవి బహుశా అతి ప్రాచీనమై ఉండవచ్చు. కానీ కాలాన్ని నిర్ణయించే చరిత్ర లేదు. జానపద గేయగాథల ప్రారంభ వికాసాలను పరికిస్తే బుర్రకథ ప్రాచీనత కొంతమేరకు తెలుస్తుంది.

జంగాలు చెప్పే కథలు గనుక జంగం కథలు. ఈ జంగాల గూర్చి ఆచార్య బి. రామరాజుగారు వివరంగా తెలిపారు. ఈ జంగం కథలను పాల్కురికి సోమనాథుడు పేర్కొన్నాడు. అయితే ఈ జంగాలు కథలు చెప్పే తీరును పాల్కురికి పేర్కొనలేదు. పిచ్చుకుంట్లు, ఎర్రగొల్లలు, వీరముష్టులు, శారదకాండ్రు మొదలైన వారందరూ శైవులు. జంగం అంటే శివసంబంధి, శివభక్త సంబంధి కథలను చెప్పేవారని ఆచార్య కృష్ణకుమారిగారు వివరించారు. ఈ జంగాలను వారు వాయించే బుడిగెను బట్టి బుడిగ జంగాలని అంటారు. ఇంకా పిడికి జంగాలు, ఈతముక్కల జంగాలు, సెట్టి బలిజలు జంగమ తెగకు చెందినవారని తెలుస్తుంది. ఈ జంగాలు చెప్పే కథలే జంగం కథలు. ఇవి ఈనాటి బుర్రకథలకు పూర్వరూపాలు.

ధేనువకొండ వెంకయ్య రాసిన విరాటపర్వం జంగం కథ లో జంగం కథకుల లక్షణాలను, కథా తీరును వివరించారు. అందులో

నీటుగ విభూతిరేఖలు దీర్చియు నిల్వుటంగీల్దొడిగి
వేటురుమాలాల్‌ పేటుపాగాల్వల్లెవాటు లొనరదాల్చి
జోడుగుమ్మెటల్‌ దట్టుచు వంతలు బాడుచు మరియొకడు
పొడిమగా చేబూని సితారా భుజమున ధరియించీ
గజ్జెలు మువ్వలు అందెలు పదముల ఘల్లని మ్రోయగనూ
తఝనిత తకయని నాట్యము సల్పుచు దంబుర మీటుచునూ
సంగతిగా సభవారికెల్ల పైసల పూర్వకముగా
చెంగున దుముకుచు జంగంబులకును జీవ కథనముగా
అనే జంగం కథల లక్షణాలన్నీ దాదాపుగా బుర్రకథా లక్షణాలే. ఇందులో బుర్రలు కాక బుడిగెలనే గుమ్మెటలుగా చెప్పినారని ఆచార్య గంగప్ప పేర్కొన్నారు.

బుర్రకథను తెలుగుజాతి ప్రాచీన సంగీత రూపకమని నిరూపించిన తిరుమల రామచంద్రగారు దీని లక్షణాలను వివరించారు.

“బుర్రకథ అనే వ్యవహారం ప్రధాన కథకుడు శృతిసారించే తంబూర బుర్రను బట్టి వచ్చింది. తందాన కథ, తందాన పాట అనే వాడుక తందాన తందాన అని వంతలవారు చేసే అనుశృతిని బట్టి వచ్చింది.

ప్రధాన కథకుడు ఒక చేత్తో శృతి కోసం తంబూర మీటుతూ, జేబురుమాలు వంటి గుడ్డకొసను కట్టిన జంతరను బొటనవ్రేలికి తొడుక్కున్న మరొక చేత్తో తాళంవేస్తూ కథ చెబుతాడు. (తాళం వేసే జంతరను గుంబీలు, అందెలు అనడం కూడా కద్దు.) ఆ వెనుక ఇద్దరు స్త్రీలు గుమ్మెటలు వాయిస్తూ వంత పాడుతారు. వంతకు (బహుశా ప్రధాన కథకుడు కాబోలు) ఇద్దరు ఇంతులు కావాలని సిరి జంగాలు రెండు పెండ్లిండ్లు చేసుకొనడం కూడా ఆచారం. ఇది దీని ప్రత్యేకత.”

కళారూపానికి సంబంధించిన ప్రదర్శన వివరాల గురించి పరిశీలిస్తే కథకుడు ఇద్దరు వంతలకు మధ్యలో ఉండి ముఖ్యకథని గానం చేస్తుంటాడు. కథతో పాటు మధ్య మధ్యలో ఇతర విషయాలు చెబుతూ ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి చూస్తుంటాడు. మధ్యలో ఇద్దరు వంతలలో ఒకరు కథకుడు పాడుతున్న పాటని వచన రూపంలో వివరిస్తుంటాడు. దానికి కొంత స్థానిక రాజకీయాల్ని సందర్భాన్నిబట్టి జోడిస్తుంటాడు. అతని తరువాత మరొక వంత హాస్య సంబంధమైన సంభాషణలను జోడిస్తాడు ఇలా ప్రధాన కథ జరుగుతుంటే అప్పుడప్పుడు కథా వేగాన్ని ఆపి కథను ఇంకా రసవత్తరం చేసి ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి వంతలు ఇలాంటి ముక్తాయింపులు ఇస్తుంటారు. ముక్తాయింపు అంటే సాగిపోతున్న కథను తాత్కాలికంగా ఆపడం. ఆ సందర్భంగా వాళ్లు వాడే ముక్తాయింపు మాటలు ఇలా ఉంటాయి. ‘తరికిట ఝంతరిత, తకిట తకిట తకదరికట దరికటత, తకతకరుంత తకతక ఝుంట ధింత, తధిమితకిటతక ఝుంతరికిటకత, తధిమిత కిటతక తధిమి తకిట తకత’ అనేవి సాధారణంగా వాళ్ళు ఉపయోగించే ముక్తాయింపులు. మొత్తం మీద ప్రధాన కథకు భంగం కలిగించకుండా ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంటారు. బుర్రకథకు సంబంధించిన సాహిత్యం గురించి సంభాషిస్తే పౌరాణిక అంశాలతో పాటు సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s