హరినామాన్ని కథగా ప్రచారం చేయడమే హరికథ. పురాణాలలో నారదుడు హరి నామాన్ని ప్రచారం చేసినట్లు, దానివల్ల మొదటి కథకుడు నారదుడే అని కొంత మంది అభిప్రాయం. ఈ ప్రదర్శన కళ ఆంధ్రదేశంలో అన్ని జానపద కళారూపా లతో కలసి ప్రదర్శింపబడుతూ నేటికీ మంచి ప్రజాధారణ పాందిన కళగా చెప్పవచ్చు. ఈ కళారుూపం అటు పండితుల్ని ఇటు పామరుల్ని కూడా రంజింప చేయగల శక్తి కలిగినది. ఈ కళకు ఆంధ్ర ప్రాంతాల్లో మంచి వన్నె తెచ్చిన వారు ‘ఆదిభట్ల నారాయణ దాసు’.

ఈ కళారూప ప్రదర్శన గురించి పరిశీలిస్తే, హరికథ కళారూపంలో ఒక పాత్రధారి రాత్రి పది గంటలు మొదలుకొని తెల్లవార్లూ నాలుగు గంటల వరకు కథాగానం చేస్తాడు.హరికథకుడు చేతిలో చిరతలు, కాలికి మువ్వలు, పట్టుధోవతి పంచెకట్టు, పట్టుకండువా నడుముకి బిగించి, మెడలో పూలమాల కలిగి చక్కటి విగ్రహపుష్టితో, ఆడిపాడి, కథచెప్పి సభారంజనం చేస్తాడు.ఇతనికి సహాయకులుగా మృదంగం వాయులీనం, హార్మోనియం పై ఇతర కళాకారుల సహ కారం ఉంటుంది. అయితే వ్యక్తి అన్ని పాత్రలలో జీవించి రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచకం చెబుతూ, మృదుమధుర మైన గానం పాడుతూ ముఖంలో సాత్వికం, కాలితో నృత్యం, చేతులతో ఆంగికం సృష్టిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. హరికథలలో ఉన్న ప్రత్యేకం. అందుకే హరికథ అంటే సర్వకళల సమాహారం వారంలో సంగీత సాహిత్యాల తో పాటు నాట్యం, నటన, హాస్యం కూడా ఉన్నవి. ప్రేక్షకులు విసుగు చెందకుండా మధ్య మధ్యలో పిట్టకథలు ఎతూ జోకులువేస్తూ నవ్విస్తుంటాడు. ఇందులో పురాణ ప్రవచనమూ ఉంది. హరికథకుడు గొప్ప ఉపన్యాసకుడు కూడా.

యక్షగానాలే హరికథలుగా రూపొందినట్లు కవిత్వవేది మొదలైన పండితులు పేర్కొన్నారు. యక్షగాన కర్తల్లో శ్రీ బాగేపల్లి అనంతరామాచార్యులుగారు ప్రప్రథమంగా హరికథా యక్షగానాలొక్కటే అన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇలాగే నారాయణదాసుగారూ, పసుమర్తి కృష్ణమూర్తిగారూ తలంచారు. కానీ ఇవి అభిన్నాలని డా. యస్వీ జోగారావుగా రంగీకరించలేదు. అందుకువారిచ్చిన కారణాలివి. హరికథ మహారాష్ట్రలో 17శ. లో ఆరంభమైంది. దీన్ని ఆభాషలో ‘అభంగ్’ అంటారు. తంజావూరు నాయకరాజులు స్వయంగా యక్షగానాలు రచించారు; ఆస్థానకవులచే రచింప జేశారు. వారెవరూ ఈ యక్షగానాలను హరికథలుగా పేర్కొనలేదు, కానీ ఆధునిక యుగంలో తెలుగులో ఆరంభించిన హరికథకులు మాత్రమే తమ హరికథలను యక్షగానాలుగా పేర్కొన్నారు.యక్షగాన రచనాకాలంలో హరికథారచన చేయబడినట్లు తెలియరాదు. కేవలం ఆధునిక యుగంలో ఈ హరికథలు వెలిశాయి. మహారాష్ట్రలో ‘అభంగ్’ అనీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కథాకాలక్షేపమనీ, కాలక్షేపమనీ పిలువబడుతోంది.

హరికథ ప్రదర్శన సందర్భంలో గానం చేసే పాటలకు సంబంధించిన ఇతివృత్తాల గురించి పరిశీలిస్తే ముఖ్యంగా రామాయణం, మహాభారతానికి సంబంధించిన కథాంశాలే ఆధారం. అటుతరువాత నర్తన శాల, భక్త మార్కండేయ, శివలీలలు, భక్త నందన, వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, భక్త సిరియాల, ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కల్యాణం మొదలయిన వృత్తాంతాలను నేడు కథలుగా చెబుతున్నారు. హరికథ చెప్పి కథకుడు ఎంతో నిష్టగా ఉండాలి అవసరమయిన సందర్భాలలో ఉపవాసాలు కూడా చేయాలి. హరికథ నేర్చుకుంటే వచ్చే విద్యకాదు. కథకుడికి స్వయంగా ఓ ప్రత్యేకత ఉండాలి.
ఆంధ్రదేశంలో అన్ని జానపద రూపాలతోపాటు వర్ధిల్లి ప్రజాభిమానాన్ని చూరగొన్న కళారూపాల్లో ముఖ్యమైంది హరికథాగానం.” అని మిక్కిలేని రాధాకృష్ణమూర్తిగారు హరికథను జానపదకళారూపాల్లో ఒకటిగా పేర్కొన్నా, ఇది కేవలం పామర ప్రజానీకాన్నేగాక, పండితులనుసైతం మెప్పించగల కళారూప మనడంలో సందేహంలేదు
ఈ ప్రదర్శన కళ ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాలొనే కాకుండా రాయలసీమ లోనూ, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో చిన్న చిన్న తేడాలతో ప్రదర్శింపబడుతోంది.అయితే హరికథా కాలక్షేపం ఎవరైనా మరణించి నప్పుడో,దశరా సందర్భంలోనో, శివరాత్రి కో ఏర్పాటు చేస్తున్నారు. కాలం మారింది.కళలకు గ్రహణం పట్టింది. కోవిడ్ వ్యాధితో ఇలాంటి కళల ప్రదర్శన కు అనుమతి లేకపోయింది.2019 సంవత్సరం లాక్ డౌన్ తో ఆంక్షలతో కళాభిరుచులకు ఆటంకం కలిగించింది.
