గండికోట వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలం లోని గ్రామం.ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కి. మీ. దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది.పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. ఈ గ్రామంలో గల చారిత్రక కోట గండికోట ప్రముఖ పర్యాటక కేంద్రం.

” రాజులు పోయినా, రాజ్యాలు పోయినా…” వారికి గుర్తుగా ఉన్న గండికోట మాత్రం మిగిలే ఉంది. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈకోట దాదాపు ఐదు దశాబ్దాలపాటు నాలుగు సామ్రాజ్యాలకు వెన్నుదన్నుగా… హిందూ, ముస్లిం సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా విరాజిల్లింది. శతాబ్దాల కాలంనాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఈ గండికోట కాకతీయుల పాలనలోనూ, ఆ తరువాత మీర్ జుమ్లా నవాబు పాలనలోనూ సకల కళా వైభవంతోనూ అలరారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున గల ఒక చిన్న గ్రామమే “గండికోట”. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది.

ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచమేర్పడింది.

గండికోట ప్రాకారంలోని కొంత భాగం వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి, ఆ తలుపులపై ఇనుప సూది మేకులను ఏర్పాటు చేశారు. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.

కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. ఆనాటి శిధిల శిల్పాలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి.

మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.

గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.

గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్నది. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చినది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి.

ఇక్కడ చూడదగిన ప్రదేశాల విషయానికి వస్తే… గండికోటలోపల ఉండే మాధవరాయ ఆలయం, రంగనాథ ఆలయాలు చెప్పుకోదగ్గవి. మాధవరాయ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ. పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు.

ఇక రంగనాథ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయ నిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథ ఆలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణమేనని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ. 15 శతాబ్దంలో నిర్మించినట్లుగా చెప్పవచ్చు.

గండికోట ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగములో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వరచే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (క్రీ.శ. 1123 జనవరి 9) నాడు చిన్న మట్టికోటను కట్టించెను అని పేర్కొనబడింది. ఐతే ఇది నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు.

త్రిపురాంతకము వద్ద గల శా.1212 (క్రీ.శ. 1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు (క్రీ.శ. 1314) చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తోంది. గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలం (ప్రాంతము) లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మసాని కమ్మ నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు పాలించారు. విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా పెమ్మసాని కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు. కమ్మ నాయకులు గండికోటను మూడు వందలయేళ్ళకు పైగా పరిపాలించారు.
వీరి పాలనలో గ్రామాలని మూడు విధాలుగా విభజించారు. బండారువాడ, అమర, మాన్య విభాగాలుగా విభజించారు. ఇందులో బండారువాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి. మాన్య గ్రామాలు దేవాలయాల, బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. అమర గ్రామాలు అమరులైన కోట అధ్యక్షుల ఆధీనంలో ఉండేవి.


మూలం :–టీం రాయలసీమ విమోచన సమితి,రాజ రాయలసీమ ఫేస్బుక్ వాల్ .వికీపీడియా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s