
రాష్ట్రంలో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి. వాటిలోని ప్రముఖ ప్రాంతాలలో కడప జిల్లాకు చెందిన దేవునికడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి విశేషఖ్యాతిగల, పురాణ ప్రసిద్ధిగల పర్యాటక ప్రాంతంగా ఈ ఆలయానికి ఎంతో పేరుంది. దీన్ని తిరుమలకు తొలి గడపగా భావిస్తారు. తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి అయితే, ఈ క్షేత్రపాలకుడు హనుమంతుడు. ఇలాంటి మరెన్నో విశేషాలున్నాయి. దీని గురించి కడప కైఫీయత్తు లలో సమాచారం ఉంది
జనమేజయుని ప్రతిష్ఠ
దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ మూలవిరాట్ను సాక్షాత్తు జనమేజయుడు ప్రతిష్ఠించాడని కడప కైఫీయత్తులో ఉంది. ఇందులోని సమాచారం ప్రకారం ఈ ప్రాంతానికి దేవుని కడపగా పేరుండేది. కాలక్రమంలో కడప గడపగా మారింది. జనమేజయుడు పుణ్యక్షేత్రాలనుదర్శించుకుంటూ తిరుమల వచ్చాడని, స్వామిని దర్శించుకుని ఆ రాత్రి అక్కడే నిద్ర చేశాడని కలలో శ్రీవేంకటేశ్వరుడు కనిపించి తిరుమలలోని చెరువుకట్టపై తవ్వితే విగ్రహం కనిపిస్తుందని, దాన్ని ఫలానాచోట ప్రతిష్ఠించుమని సూచించి నట్లు తెలుస్తోంది. తెల్లవారాక ఆయన చెరువుకట్ట పై దాదాపు పూడిపోయి ఉన్న శ్రీవేంకటేశ్వరుని విగ్రహాన్ని గమనించి ప్రతిష్ఠ చేసేందుకు సరైన ప్రాంతం కోసం అన్వేషించాడు.
తిరుమలకు వాయవ్యంగా పది ఆమడల (ఆమడ అంటే పదిమైళ్లు) దూరాన పుష్కరిణి సహితంగా వాయుపుత్రుడైన ఆంజనేయుని క్షేత్రం ఉన్నట్లు తెలుసుకుని, ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం మంచిదని భావించాడు. ఇందుకునిదర్శనంగా నేటికీ కడపరాయని మూలవిరాట్ వెనుక పది అడుగులకు పైగా ఎత్తుగల ఆంజనేయుని విగ్రహం ఉంది. తొలుత ఈ స్వామిని కడప వెంకటేశ్వర్లు అని పిలిచే వారు. ఆంజనేయుడు శివుని అంశ గనుక శ్రీవారి ఆలయంతో పాటు ఆ ప్రక్కనే శివాలయాన్ని నిర్మించారు

ఈ ఆలయ ముఖమండపం అద్భుతమైన శిల్ప సోయగంతో కనులవిందు చేస్తోంది. ఆలయ వార్షిక బ్రహ్మో త్సవాల సందర్భంగా ఆలయ రంగమండపం, ఆ ప్రాంగణం లోని ఇతర మందిరాలు కనువిందు చేస్తాయి. రంగ మండపంలో నాటి కళారూపాల ప్రదర్శనను గుర్తు చేస్తూ నృత్య సంగీతాలకు సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి అటు క్షేత్రపాలకుడైన హనుమంతుడు, ఇటు దశావతారాలు, మహర్షుల శిల్పాలు కూడా మండపం స్తంభాలపై చూడవచ్చు.
దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పలు శాసనాలున్నాయి. ఆలయ చరిత్రను తెలుపుతూ నాటి రాజుల ఆధ్యాత్మిక చింతన, ఆలయపోషణల గురించి తెలుపుతూ నేటికీ నిలిచి ఉన్న ఆ శాసనాలు ఆలయ విశిష్టతను చాటు తున్నాయి. ఈ శాసనాలగురించి ఇంతకుముందు పెద్దగా ప్రచారం లేదు. కడపజిల్లా శాసనాలు గ్రంథంతోపాటు కడప కైఫియత్తులలో వీటి గురించిన క్లుప్తమైన ప్రస్తావన ఉంది
అపరవైకుంఠం
అపర వైకుంఠంగా అలరారుతున్న శ్రీనివాసుని ప్రతిరూపం కడపరాయడు శ్రీలక్ష్మివేంకటేశ్వరుడు. ఆ బ్రహ్మాండ నాయకుడి క్షేత్రం అపర వైకుంఠమే. దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం వైకుంఠాన్ని తలపిస్తోంది. తిరుమలకు తొలిగడపగా భావిస్తున్న ఈ పవిత్ర క్షేత్రంలో కొలువై ఉన్న కడపరాయడిని పూజిస్తే సాక్షాత్తు తిరుమలే శుడిని పూజించినట్లేనని చెబు తారు తిరుమలకు వెళ్లే ముందుగా ఈ ప్రాంతానికి చెందిన భక్తులు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఉత్తరప్రాంతం నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు కడప నగరంలోని ఈ క్షేత్రంలో విశ్రమించి అనంతరం స్వామిని దర్శించుకుని తిరుమలేశుని సన్నిధికి బయలు దేరేవారని తెలుస్తోంది. ఏ కారణాలచేతనైనా తిరుమలకు వెళ్ళలేక ఆగినవారు ఇక్కడే మొక్కులు తీర్చు కుంటారు. నేటికీ ఆ ఆనవాయితీ కొనసాగుతోంది

ఆలయంలో
గర్భాలయం ఎదురుగా రంగమండపం పూరి స్థాయి శిల్పసంపదతో అలరారుతోంది. భక్తులు కొద్ది సేపైనా ఆ ప్రాంగణంలో కూర్చొని ప్రశాంతత పొందా లని ఆశిస్తుంటారు. ఆలయంలో ఉత్తరంవైపున ప్రహరీకి దగ్గరగా చెట్టుక్రింద నాగుల విగ్రహాలున్నాయి. ఆ ప్రక్కనే స్వామికి సర్వసేనాని విష్వక్సేనుని మందిరం, శ్రీగణపతి మందిరం ఉంది. ఈ రెండు దక్షిణముఖంగా ఉన్నాయి తర్వాత ఉత్తరద్వారం దగ్గరగా శ్రీఆండాళ్ తాయారు అమ్మవారి మందిరం పడమరముఖంగా ఉంది. ఈ మందిరాల మండపాలు, గోడలు శిల్పమయమై కను విందు చేస్తున్నాయి. స్వామిని దర్శించుకునే ముందు భక్తులు ఈ మందిరాలలో కూడా పూజలు నిర్వహిస్తారు

పాదమండపం
రాజగోపురం నుంచి ఆలయంలోకి అడుగు పెట్ట గానే ఎదురుగా పాదమండపం కనిపిస్తుంది. ఇందులో శ్రీవారి పాదాలున్నాయి. ఈ పాదాలపై ప్రస్తుతం ఇత్తడితొడుగు ఉంది. భక్తులు తొలుత పాడాలను దర్శించుకుని ప్రదక్షిణలు చేసి ఆ వెనుకే గల బలిపీఠం వద్ద కొబ్బరి కాయలు సమర్పిస్తారు, ఆ వెనుక రంగమండపం ఎదుటగల జ్యోతి మందిరంలో దీపం వెలిగించి మొక్కుకుంటారు. ఆల యానికి దక్షిణగోపురం వద్ద ప్రహరీకి అనుకుని పెద్ద హాలులో దాదాపు పది ఆళ్వార్ల విగ్రహాలు ఉన్నాయి. ఇదే మందిరంలో అత్యంత పురాతనమైన శ్రీ చెన్నకేశవస్వామి మూర్తి ఉంది. స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు చెన్నకేశవునితోపాటు ఆళ్వార్లకు పూజలు నిర్వహిస్తారు ఉత్తరద్వారంవైపు పురాతన జమ్మిచెట్టు ఉంది. భక్తులు దీనికి ప్రదక్షిణలు చేసి సంతానం, ఇతర కోర్కెలు తీరడం కోసం మొక్కుకుంటారు
బంగారుబల్లి
కంచి ఆలయానికి వెళ్లిన వారు అక్కడి బంగారు బల్లిని తాకి దోష నివారణ చేసుకుంటారు. ఆ తర్వాత అలాంటి అవకాశం కడపరాయనిఆలయంలో మాత్రమే ఉంది. ఇక్కడి అమ్మవారి ఆలయం ద్వారం వద్ద పైకప్పులో రెండు రాతిబల్లులు ఇత్తడి తొడుగుతో కనిపిస్తాయి. కంచికి వెళ్ల(లే)ని వారు, వెళ్లినా అక్కడి ఆలయంలో బల్లులను తాకని వారు కడపరాయని ఆలయంలోగల బల్లులను తాకి తృప్తి పొందుతారు. అమ్మవారి దర్శనానంతరం భక్తులు తప్పక ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారుపుష్కరిణి (కోనేరు) …
ఆలయం ఎదుట పెద్ద పుష్కరిణి ఉంది జిల్లా లోని ఇతర అన్ని పుష్కరిణిలకంటే ఇది పెద్దది. ఇది ఇటు శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం అటు ఎదురుగా గల శ్రీ సోమేశ్వరస్వామి ఆలయానికి కూడా చెందినదనీ ఈ ఆలయాలు రెండూ ఈ పుష్కరిణిని పూజాదికాలకు వాడ వచ్చునని అర్చకులు చెబుతున్నారు. ముఖ్యంగా
తెప్పోత్సవాలు, బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చక్ర స్నానం ఈ పుష్కరిణిలోనే నిర్వహిస్తారు. ఈ పుష్కరిణి నిర్మాణ వివరాలుగల శాసనం కడపరాయని ఆలయ రంగమండపం పరుపుబండగా ఉండేదనీ, పగిలిపోవడంతో దాన్ని అక్కడి నుంచి తీసేశారనీ తెలుస్తోంది. కానీ ఆలయ గోడలపై గల ఇతర శాసనాలతోబాటు శాసనపాఠం కూడా రికార్డుల్లో ఉంది.నాలుగు గడపలు
ఈ ప్రాంతంలో తొలుత దేవరగడప (దేవుని కడప) మాత్రమే ఉండేది. ఆలయానికి పెన్నానదికీ మధ్యలోగల భూమిలో వ్యవసాయం చేసే క్రమంలో నదీతీరంలో కాపు రైతు)లు నివాసాలు ఏర్పరచుకున్నారు. అది కాపు కడప అయింది. ఓ మారు నదికి భారీగా వరదరాగా ఆ గ్రామం కొట్టుకుపోయింది. దానితో గ్రామస్థులు ఆలయానికి ఫర్లాంగు దూరంలో నివాసం ఏర్పరచుకున్నారు. నవాబులుఈ ప్రాంత పాలకులయ్యాక ప్రస్తుతం కడపనగరం గల ప్రాంతాన్ని ‘కడప షహర్’గా నిర్మాణాలు చేశారు. తమ సైనికులు మినహా ఇంకెవ్వరూ లేకపోవడంతో గల లోటు అసౌకర్యాలను గమనించిన నవాబు స్థానికుల సూచన మేరకు దేవర కడపలోని అర్చక కుటుంబాలను ‘కడప షహర్’కు రమ్మని ఆహ్వానించారు
సంప్రదాయాల అంతరం కారణంగా రాలేమని అర్చకులు చెప్పగా, వారి సంప్రదాయాలకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని హామీ ఇచ్చి షహలో కోట సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం కట్టించి వారికి ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చేయించారు. ఆ ప్రాంతం తర్వాత బ్రాహ్మణ వీథిగా మారింది.
కడపనగరానికి ఉత్తరాన దేవునికడప రెండుమైళ్ళ దూరంలో ఉండగా, దేవునికడప, పాతకడప దాదాపు కలిసే ఉన్నాయి. అందుకే బ్రహ్మోత్సవాలలో ఒక రోజున దేవుని కడపలోను, మరో రోజు కడప నగరంలోను గ్రామోత్సవం నిర్వహిస్తారు.
ఉత్సవాలు
వైకుంఠ ఏకాదశినాడు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉత్తర (వైకుంఠ) ద్వారం వద్ద ఉంచి భక్తులకు ఉత్తరంవైపునుంచి దర్శించుకొనే భాగ్యం కల్పిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మ వార్ల ఆస్థానం, పండితుల పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలు
ఏటా మాఘశుద్ధ పాడ్యమినుంచి నవమివరకు కడపరాయని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 2020 సంవ త్సరం జనవరి 25 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కాను న్నాయి. తొలిరోజు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభ మౌతాయి. ఆలయ అర్చకులు, తిరుమల తిరుపతి దేవ స్థానాల వేదపండితులు దీక్షా తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలుత విశ్వక్సేనునికి పూజచేసి పుణ్యాహ వాచనం, రక్షా కంకణధారణ నిర్వహించిన అనంతరం పల్లకీలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువస్తారు అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మృత్సం గ్రహణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాన్ని పల్లకీలో
ఊరేగింపుగా ఆలయానికి చేర్చి అంకురార్పణ చేస్తారు ప్రత్యేక విద్వాంసుల నాదస్వర, మంగళవాద్యాల విన్యా సాలు ఉత్సవాలకు భక్తులను ఆహ్వానిస్తాయి. ఈ ఉత్స వాలలో హనుమ, గరుడవాహనాల అలంకారాల రోజుల్లో గ్రామోత్సవానికి భక్తులు విశేషసంఖ్యలో వస్తారు.
కల్యాణోత్సవం, పుష్పయాగాన్ని కూడా వైభవంగా నిర్వహిస్తారు. వేసవిలో ఐదురోజుల పాటు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. 2007 సంవ త్సరం నుంచి ఈ క్షేత్రం తిరుమల తిరుపతి దేవ స్థానాల పరిధిలోకి చేరింది. ఈ కార్యక్రమాన్ని తిలకిం చేందుకు భక్తులు విశేషసంఖ్యలో హాజరవుతారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటోతేదీన రథసప్తమినాడు రథో త్సవం వైభవంగా నిర్వహిస్తారు.
సప్తగిరి2020 జనవరి సంచిక లోని వ్యాసం యథాతథంగా….
శ్రీ పంతుల నాగాంజనేయులు, 9885506765