చిత్తూరు,కడప ,అనంతపురం, నెల్లూరు జిల్లాలో చాల కుటుంబాలు చిత్తూరు జిల్లా రెడ్డెమ్మ తల్లి ని ఆరాదిస్తున్నారు. చాలా మందికి వారి పేరు ముందు రెడ్డి, రెడ్డెమ్మ అని పెట్టుకొంటారు. రెడ్డెమ్మ గుడి రెడ్డెమ్మ కొండ లో ఉంది.ఇది చెర్లోపల్లి సమీపంలో ఉంటుంది. చెర్లోపల్లె, చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలానికి చెందిన గ్రామం. ఇక్కడి రెడ్డెమ్మ కొండ లోని “రెడ్డెమ్మ దేవత” చాల శక్తులు కలదని ప్రజల నమ్మకం . చెర్లోపల్లి లోని రెడ్డెమ్మ కొండకు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వందల సంఖ్యలో రోజు తరలి వస్తుంటారు .మదనపల్లె 33 కి.మీ దూరములో ఉంది.

గుర్రంకొండ నవాబు రెడ్డెమ్మతో వాగ్వాదం.
పెండ్లి చేసుకొమ్మని ఒత్తిడి
మాట వినని రెడ్డెమ్మని బలాత్కారం చెయ్యాలని ప్రయత్నించడం.రెడ్డెమ్మ గుర్రంకొండ నవాబును శపించడం.
సిపాయి మాటలు విన్న నవాబుకు మితిమీరిన కోపం వచ్చింది. ఒక ఆడమనిషి తన దోరతనాన్ని సవాలు చెయ్యడమా? సిపాయిదే తప్పు కావచ్చు అనుకుందాము.సిపాయిని ఎదిరించడం అంటే ఎక్కడో ఆ నవాబు అహంకారం మీద, దోరతనం మీద చెప్పుతో చెల్లున కొట్టినట్లు అయ్యింది. సిపాయిలను సిద్ధం చేసి రెడ్డెమ్మ దగ్గరికి బయలుదేరాడు. పొద్దు వాలుతూవుంది. ఆ సాయంకాలం పొద్దు బంగారు రంగులో తలతలలాడుతూ ఉంది. కోపంతో ఊగిపోతు వచ్చిన నవాబు శ్రమ చూసిన ఆ కాపు వాళ్ళ పిల్ల అందానికి, శరీర సౌష్టవానికి ఆశ్చర్యపోయాడు. దండించడానికి వచ్చిన నవాబు కాపు పడుచు అందానికి గులాం అయ్యాడు. అతనికి నోట మాట రాలేదు. మా సిపాయిని దండించడం నువ్వు చేసిన తప్పు నువ్వు ఉండే ఊరు,ఈ భూములు మా స్వాధీనంలో ఉండేవే. కావాలనే మా సిపాయి గుర్రాన్ని చేలో మేపినా, నువ్వు మాకు ఫిర్యాదు చెయ్యాలి తప్ప, చెయ్యి చేసుకోవడం పెద్ద తప్పు. నువ్వు కొట్టింది సిపాయిని కాదు మా దోరతనం మీద సంజాయిషీ చెప్పు అని కాపు వాళ్ళ పిల్లని నవాబు నిలదీసాడు.
రాజ్యాన్ని పాలించే రాజులే ఇలా అన్యాయంగా మాట్లాడితే ఎలా?
మీ భుజ బలంతో
ఆయుధ బలంతో
సిపాయి బలంతో
ఈ రాజ్యాన్ని ఎలుతున్నావు. బలవంతునితో కొట్లాట ఎందుకులే అని మేము నీకు పన్నులు కడుతున్నాము. పన్నులు కట్టినంత మాత్రాన నీకు మేము బానిసలం కాదు. రాజు బలవంతుడు అయినంత మాత్రాన దౌర్జన్యానికి దిగడం న్యాయం ఎలా అవుతుంది. ఈ భూములు మా వెనుక తరాల నుండి చేసుకుంటూ ఉన్నాము. ఈ పైర్లు మా కష్టం. మా కష్టంతో పండిన పైరులో ని సిపాయి గిర్రాన్ని మేపడం ని సిపాయి తప్పు. పొగరుగా మాట్లాడటం రెండో తప్పు.
ప్రజలందరూ నీ బిడ్డలే అని నువ్వు అనుకున్నట్లయితే ముందు నువ్వు నీ సిపాయిని దండించు నాకు జరిగిన నష్టాన్ని కట్టించి నీ గుర్రాన్ని విడిపించుకునిపో న్యాయం అందరకి ఒక్కటే. పెదవానికోకటి,రాజుకోకటి న్యాయం ఉండదు.. అంతేగాని ఆడొల్లా మీదకి యుద్ధానికి వచ్చిన రాజుని చూసి నాకు నవ్వు వస్తోంది అని రెడ్డెమ్మ నవాబుతో అన్నది.


రెడ్డెమ్మ మాటలకు ఆశ్చర్యపోయిన నవాబు నీలా ధైర్యం,అందం కలిగిన ఆడదాన్ని ఇంతవరకు నేను చూడలేదు. ఎండముఖ్జం చూడని అందగత్తెలు ఎందరో నా జమానాలో ఉన్నా,నీలాంటి పొగరు,అందం ఉన్న అందగత్తె లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటా అని నవాబు రెడ్డెమ్మతో అన్నాడు.నేను నువ్వు పెంచుకునే కుక్కనో,గుర్రాన్నో అనుకున్నట్లున్నావు.నీ జమానాలో పడి ఉండటానికి నేను పశువును కాను అని జవాబు ఇచ్చింది రెడ్డెమ్మ.పశువును గాని,డోలుని గాని, ఆడదాన్ని గాని కొట్టందే మాట వినవు అని మా ఖురాన్ చెప్తుంది. చెట్టు నుండి పండుని కోసేటప్పుడు ఎవ్వరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, పైగా నువ్వు మా రాజ్యంలో వుండేదానివి కాబట్టి నిన్ను పొందడానికి నాకు నీ అనుమతి అవసరం లేదన్నాడు. అంతటితో ఆగకుండా రెడ్డెమ్మ దగ్గరికి వెళ్లబోయాడు.మంచే మీద ఉన్న రెడ్డెమ్మ ఆగు ప్రాణాలతో నన్ను తాకాలేవు. ముందుకు వచ్చావంటే నీ శవం వెళ్తుంది ఇంటికి అని హెచ్చరించింది.
రెడ్డెమ్మ మాటలు లెక్క చేయని నవాబు రెడ్డెమ్మని బంధించి తెమ్మని సిపాయిలను ఆదేశించాడు. జొన్నచేను ఇరగదొక్కుకుంటు మూకుమ్ముడిగా వచ్చే సిపాయిలను చూసి రెడ్డెమ్మ కోపంతో రగిలిపోయింది. చేతిలోకి ఒడిసెలను తీసికొని ఒడిసెలను తిప్పి సూటిగా సిపాయిల మీదకీ రాళ్లు రువ్వడం మొదలు పెట్టింది. రెడ్డెమ్మ రాళ్ళ దెబ్బలకు మార్ గయారే అంటూ సిపాయిలు పరిగెత్తారు. కొంచెంసేపటికి రెడ్డెమ్మ దగ్గర రాళ్లు అయిపోయాయి.
రాళ్లు అయిపోయాయన్న సంగతి గ్రహించిన నవాబు రెడ్డెమ్మని పట్టుకోవడానికి ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చిన నవాబును రెడ్డెమ్మ ఎగిరి గుండెల మీద తన్ని పరుగు తీసింది.


సిపాయిలు,నవాబు రెడ్డెమ్మని పట్టుకోవడానికి వెంటబడ్డారు.
చెను దాటిన రెడ్డెమ్మ కాస్త దూరంలోని కొండ దిక్కుకు పరుగెత్తింది. చెట్లలో పరిగెత్తుతూ అడవిలోకి వెళ్ళింది. వెనుక నవాబు, సిపాయిలూ వెంటపడుతూ వచ్చారు. ఆ అడవిలో ఒక కొండ గుహ దగ్గర రెడ్డెమ్మ ఆగింది. నవాబు,సిపాయిలూ దగ్గరికి రాగానే సింహం మాదిరి గర్జించింది రెడ్డెమ్మ. ఒక ఆడదాని మీద ప్రతాపం చూపించి, అఘాయిత్యం చెయ్యాలని చూసిన రాజు రాజ్యాన్ని పాలించడానికి పనికి రాడు ఇలాంటి రాజు నాశనం అవుతాడు అని మల్లన్న ను మనస్సులో తలచుకుని ఇంకా ఇలా అంది నీ రాజ్యం ఆరు నెలల్లో నాశనం అవుతుంది. నీ కోటలో గబ్బిలాలు కాపురం ఉంటాయి. నీ తలకాయ నరికి కోటకు యాలాడగట్టే రోజోకటి వస్తుంది అని కొండ గుహలోకి వెళ్ళిపోయింది. అప్పటికే చీకటి పడింది. నవాబు, సిపాయిలూ వెనక్కి వచ్చేసారు.ఆ రోజు నుండి రెడ్డెమ్మ కనబడలేదు. ఆ తరువాత ఆరు నెలలకు మైసూరు నవాబు టిప్పు సుల్తాన్ గుర్రంకొండ నవాబు మీద దండెత్తాడు. గుర్రంకొండ నవాబు తలకాయ నరికి కోటకు యాలాడగట్టాడు.
కొన్నాళ్ల తర్వాత మేకలు మెపేవాళ్ళు మేకలు మేపుకుంటూ రెడ్డెమ్మ దూరిన గుహలోకి వెళ్లారు. గుహలో రెడ్డెమ్మ రాతి శిలగా మారిపోవడాన్ని వారు చూసారు. రెడ్డెమ్మ సాహసాన్ని పాటలు కట్టి పాడారు, పూజలు చేశారు, దేవతగా కొలిచారు. బిడ్డలు లెనోళ్లు బిడ్డల కోసం పూజలు చేశారు. బిడ్డలు కలిగినోళ్లు రెడ్డెమ్మ పెరు పెట్టుకున్నారు. కులం లేదు.మతం లేదు.జాతి లేదు. అందరూ ఏకమై కొలిచారు. అఘాయిత్యం చెయ్యబోయిన రాజు చనిపోయాడు. ఎదిరించిన రెడ్డెమ్మని ప్రజలు గుండెల్లో నిలుపుకున్నారు.
చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలే కాక, దేశవిదేశాల నుంచి కూడా వచ్చి రెడ్డెమ్మ దేవతను దర్శించుకుంటారు. తమిళనాడు,కర్ణాటక నుండి కూడా భక్తులు వస్తుంటారు. హిందువులు కాదు ప్రతి మతస్థులు కూడా రెడ్డెమ్మ దేవతను పూజిస్తారు.ప్రతి ఆదివారం ఆ ఆలయం వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది.

బిడ్డలు పుట్టి వెంటనే చనిపోతూ ఉంటే,సంతానం కలగనివారురెడ్డెమ్మతల్లి దీవెనలతో సంతానం పొందినవారు కుల, మత, వర్గ, వర్ణ, భాషాభేదాలు లేకుండా వారి పిల్లలకు విధిగా పేరుకు ముందు రెడ్డి శబ్దం వచ్చేలాగా పేరు పెట్టుకొంటారు.అందుకే రెడ్డెప్ప ,రెడ్డి పంతులు, రెడ్డి నాయుడు, రెడ్డెయ్య, రెడ్డి బాషా, రెడ్డి జోసఫ్, రెడ్డెప్పరెడ్డి, రెడ్డెన్న , రెడ్డెమ్మ , రెడ్డెన్న శెట్టి లాంటి పేర్లు వచ్చాయి.

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నుండి కడప వెళ్లే మార్గంలో గుర్రంకొండ అనే ఊరు దాటిన తరువాత “చెర్లోపల్లె” గ్రామం వస్తుంది. అక్కడే రెడ్డెమ్మ కొండ ఉంటుంది.

సేకరణ:–చందమూరి నరసింహారెడ్డి

చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s