Raabiyaabi, Chiyyedu

అనంతపురం జిల్లాలో ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం  మొదలు కొని అన్ని జాతీయోద్యమాలలోనూ  పాల్గొన్నారు. అబ్దుల్లా సాహేబ్,  కాంట్రాక్టర్ సులేమాన్ సాహెబ్ , షామాలిక్ షక్కర్ బాబా , మహబూబ్ సాహెబ్ పీరా సాహెబ్, ముల్లా మోదీన్ సాహేబ్ , వీరి సతీమణి  రాబియాబీ మొదలగువారుపాల్గొన్నారు.
      ముల్లా మోదీన్ సాహెబ్ 02-02-1917 న అనంతపురము తాలూకా, పూలకుంట గ్రామంలో జన్మించినాడు.  తండ్రి ముల్లా గౌస్ సాహెబ్, తల్లి ముల్లా ఇమాంబీ. గౌస్ సాహెబ్ పూలకుంటలో  ఉపాధ్యాయుడుగా ఉండేవారు.ఆయనకు తెలుగు సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. కవీ, పండితుడు. “నానార్థ పద్మాకరం”  అనే నిఘంటువును రాసినట్లు చెబుతారు. రామాయణ కావ్యం రాసినాడనీ చెబుతారు. శ్రీ రాముడు “ తన రామను ఆరామమున  వెదకుచు “ వంటి ఆయన రాసిన రామాయణ కావ్యంలోని కొన్ని వాక్యాలను జ్ఞప్తికి  తెచ్చుకుంటారు. ఆయన భజనలు చేయటంలో ప్రసిద్ది పొందిన వాడు.  పురాణ పఠనం వినసొంపుగా చేసేవాడు. కాంగ్రెసు ప్రచార పాటలు రాసి పాడేవాడు. 
     మోదీన్ సాబ్ ఎనిమిదో తరగతి చదివి, ఉపాధ్యాయ శిక్షణ పూర్తీ చేసినాడు. అయితే  ఉపాధ్యాయుడుగా చేరలేదు.   ఓ పదిమంది  యువకులను  గుంపేసి నాటకాలు ఆడేవాడు. పద్యాలు , పాటలు పాడించేవాడు.  నాటకంలో    ఆంజనేయ పాత్రకు  ఈయన  ప్రసిద్ది.  తన కోతిచేష్టలతో, శ్రావ్యమైన  రాగాలాపనతో  జనాలను బాగా ఆకట్టుకొనేవాడు.  నాటకం  మధ్య,మద్య విరామంలో   హాస్య పాత్ర ధారిగా వచ్చి మాటలతో, చేష్టలతో  కడుపుబ్బా నవ్వించేవాడు.    “ కోడి పాయ లక్ష్మమ్మ కోడి పాయనే ; కోడిపోతే పీడపాయ గంపెడంత  బొచ్చుపాయ “  వంటి జానపద గేయాలను కేవలం పాడటం కాక నటిస్తూ  పాడేటప్పుడు ఎంత వద్దనుకున్నా కడుపుబ్బా నవ్వే వాళ్ళు.

వ్యష్టి సత్యాగ్రహ సమయంలో సత్యగ్రహులను సిద్దం చేసే బాద్యత  సదాశివన్ కు యిచ్చింది కాంగ్రెసు పార్టీ. ఆయన గ్రామాలు తిరిగి చాలామందిని సిద్దం చేసినాడు.పూలకుంటలో మోదీన్సాబ్, పూలకుంట సంజీవులు వారి మిత్రులను  సిద్దం చేసినాడు. 27-02-1941న కరాది లక్ష్మిరెడ్డి,   02-03  -1941న యం ఖాజా హుసేన్, 03-03-1941న పూలకుంట  సంజీవులు పెద్ద  వూరేగింపుతో సత్యాగ్రహం చేసినారు.   కానీ ప్రభుత్వం వీరిని అరెస్టు చేయ లేదు.  అందువల్ల వీరికి చాలా నిరాశకలిగింది. మోదీన్ సాబ్  బదులు ఆయన సతీమణి శ్రీమతి రాబియాబీతో సత్యాగ్రహం చేయిద్దాం అని సదాశివన్ గారు ప్రతిపాదించినారు. అందుకు మోదీన్ సాబ్, రాబియమ్మలు సంతోషంగా అంగీకరించి నారు                 బయటకు వచ్చిన స్త్రీలను అనేకులు అనేక రకాలుగా అనుకొనే సామజిక స్థితి అది.  కాని,స్వాతంత్ర్యోద్యమంలో  పాల్గొన్న స్త్రీలపట్ల జనం చాలా వినయవంతులై , గౌరవాభిమానాలు చూపినారు.సహాయ సహకారాలు అందించినారు. శ్రీమతి రాబియాబీ పుట్టపర్తి  దగ్గరవున్న కొత్తచెర్వులో  06-04-1926 న జన్మించింది.వీరి తండ్రి యస్.మోదీన్ సాబ్ , తల్లి  జైనబీ. ఏడవ తరగతి వరకు చదువుకుంది. హట్టిశంకరరావు అధ్యక్షతన 04 -03 -1941న అనంతపురంలో కో ఆపరేటివ్  బ్యాంక్ ఆవరణలో శ్రీమతి రాబియాబీ సత్యాగ్రహం చేసింది. రాష్ట్రంలోనే  మొదటి ముస్లిం యువతి సత్యాగ్రహిగా  చరిత్రకెక్కింది.  జవహర్ లాల్ నెహ్రూ , మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈమెకు ప్రశంసా పత్రాలు పంపినారు.  Reference Asia companion- vol 11 లో  Asia’s  first who’s who of men & women of Achivevements and Distinction  అనే పుస్తకంలో  శ్రీమతి రాబియాబీ సంక్షిప్త జీవిత చరిత్రను ఫోటోతో సహా ప్రచురించినారు.                           దేశమంతటా జరిగినట్లే  అనంతపురం జిల్లాలో  కూడా  1942లో క్విట్ యిండియా ఉద్యమం ఉధృతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు,  పోస్టాఫీసులు, ఫారెస్ట్ బంగళాలు కాల్చడం,  టెలిఫోను తీగలు తెగ్గొట్టడం  వగైరా  విధ్వంసకర కార్యక్రమాలు చేపట్టినారు దేశభక్తులు. మోదీన్ సాబ్  మిత్రబృందం తాము కూడా ఏదో ఒక  వీరోచిత కార్యక్రమం  చేయాలని  కాలేపెనుం మీద గింజలా  చిటపట లాడినారు.  చిగిచెర్ల దగ్గరకు పోయి 06-09-1942  రాత్రి “భారతమాతాకి జై “ అనే నినాదాలు చేస్తూ రైలు పట్టాలు పెరికేసినారు.సంఘవ్యతిరేకులు  పోలీసులకు ఈ సమాచారం అందజేసినారు. 07-09 -1942 ఉదయమే పోలీసులు వచ్చి మోదీన్ సాబ్,  కె.నరసింహా రెడ్డి,  పూలకుంట సంజీవులు, చాకల గురప్ప, పాటూరు అక్కులప్ప , మన్నీల నరసింహా రెడ్డి మొత్తం  ఆరుమందిని అరెస్టు చేసినారు. ఆ రోజంతా అనంతపురం పోలీసు స్టేషన్ లోనే వుంచి, మరుసటి రోజు కోర్టులో హాజరు పరచినారు. కోర్టు తీర్పు మేరకు సబ్ జైలులో ఉంచినారు. అదే జైలులో వివిధ కేసులకింద శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులు  జి. వెంకట రెడ్డి, కె.యస్.రాఘవాచారి,  గొంది కొండప్ప,  బెల్లం కొండ నారాయణ శెట్టి ;  కమ్యూనిస్టు నాయకులు  నీలం  రాజశేఖర్ రెడ్డి, ఐదుకల్లు సదాశివన్,  వి.కె.ఆదినారాయణ రెడ్డి, ఆ జైలులోనే ఉన్నారు .               మోదీన్ సాబ్   07-09-1942 నుండి  30-12 -1942 వరకు శిక్ష అనుభవించినారు. జైలునుండి  బయటకు వచ్చిన తరువాత  ఉపాద్యాయ వృత్తి  చేపట్టినాడు. వివిధ ప్రాంతాలలో పనిచేసి చివర చియ్యేడు లో  పదవీవిరమణ  చేసినారు. శ్రీమతి రాబియాబీ గారు చియ్యేడులోనే పోస్టు మాస్టారుగా  పదవీవిరమణ చేసినారు. వీరిద్దరూ జీవితాంతం కాంగ్రెసువారుగానే వున్నారు.

రచన:-విద్వాన్ దస్తగిరి

విద్వాన్ దస్తగిరి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s