మొక్కుబడుల దేవుడు.

శ్రీవేంకటేశ్వరస్వామి ఆపద మొక్కులవాడనేది లోకప్రసిద్ధం. అనాదిగా రాజులు, రాణు లెందరో స్వామికి మొక్కులు చెల్లించారు. పల్లవరాణి స్వామివారి వెండి విగ్రహాన్ని ఆలయానికి బహూకరించింది. ఆయనే పవళింపు సేవలందుకొనే భోగశ్రీనివాసమూర్తి, భగవంతుడికి మనకి కలిగినంతలో తృణమో పణమో సమర్పిస్తామని మొక్కుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. మొక్కు అంటే ప్రార్థన, మొక్కుబడి అంటే ప్రార్ధించ బడింది అని అర్థాలు. “నా మొక్కు నెరవేరితే నేను కృతజ్ఞతగా చెల్లించబోయేది” అని భక్తుడు స్వామితో ఒక ఒడంబడిక చేసుకోవడం, భగవంతుడికి భక్తుడికి సాన్నిహిత్యం కల్పిస్తున్నది
ఈ మొక్కు ఇది నమ్ముకానికి సంబంధించింది.
స్వామికి చిన్న మొక్కు మొక్కినా అందుకు వేయిరెట్లు మిన్నగా మనకు సహాయం చేస్తాడు. భగవంతునిదయ అపారం .పవిట పేలిక చించి కట్టు కట్టినందుకు ద్రౌపదికి అక్షయవస్తాన్ని ప్రసాదించాడు, కుచేలుని పిడికెడు అటుకులు ఆరగించి అష్టైశ్వార్యా లిచ్చాడు. విద్య నేర్చుకున్నందుకు చనిపోయిన కొడుకునే బ్రతికించి గురువుగారికి ఇచ్చాడు. అంతటి స్వామికి మొక్కే మొక్కులు రెండు రకాలు, ధనప్రమేయం లేకుండా చేసేవి. సంపదలను, ధనధాన్యాలను ఇస్తామనేవి. అంగప్రదక్షిణం, జోలితో తిరుమలకు రావడం, శనివార వ్రతం ధనంతో ప్రమేయం లేనివి. తలనీలాలు ఇవ్వడం, స్వామిని దర్శిస్తాననడం, హుండీకి కానుకలర్పిస్తాననడం
తులాభారం, నిలువుదోపిడి ధనప్రమేయంతో కూడినవి.
అంగప్రదక్షిణం
సాష్టాంగం అంటే ఎనిమిది అంగాలతో స్వామిని నమస్కరించడం. అంగప్రదక్షిణకు శరీరంలోని సర్వాంగాలు భూమిని తాకి స్వామికి నమస్కరిస్తాయి. శ్రీవేంకటేశ్వరుడికి సర్వాంగాలతో పొర్లిపొర్లి తృప్తిగా నమస్క రించడంవల్ల శరీరం, మనస్సు మమేకం చెంది, భక్తి పరాకాష్ఠకు చేరుతుంది. వేకువజామున రెండు గంటలలోపే స్వామి పుష్కరిణిలో స్నానంచేసి, తడిబట్టలతో దండాలు పెట్టాలి. దీన్ని శుద్ధాంగప్రదక్షిణం అంటారు. స్నానంవల్ల శరీరం పవిత్రమౌతుంది. స్వామిపుష్కరిణిలో చేసే స్నానం బహుపుణ్యవంతం. ఈ పుష్కరిణిని గరుత్మంతుడు వైకుంఠం నుంచి తెచ్చి ఈ క్షేత్రంలో నిలిపాడు, పుష్కరిణిని దర్శించినా, తీర్ధ సేవనం చేసినా, స్మరించినా పుణ్యం. కుమారస్వామి బ్రహ్మహత్యాపాతకం ఈ పుష్కరిణిలో స్నానం చేయడంవల్లే పోయిందని, ఆత్మారాముడు ఈ తీర్థానికి మొక్కే సంపన్ను డయ్యాడని, దశరథ మహారాజు పుత్రసంతానాన్ని పొందాడని పుష్కరిణీ స్నానంవల్ల లబ్ది పొందిన వారికథలు అనేకం
తీర్థాలలోకెల్ల పరమపావనమైన పుష్కరిణిలో స్నానం చేసి, ప్రదక్షిణం మొదలుపెడతారు. శాస్త్రబద్ధంగా పరిశీలిస్తే ప్రదక్షిణం అంటే ఎక్కడ ఆరంభిస్తామో – అక్కడే ముగించాలి. “ప్రదక్షిణ ప్రణామానాం యుగ్మాన్యేవ సమాచరేత్” అంటే ప్రదక్షిణాలు గాని, ప్రణామాలు గానీ రెండేసిమార్లు చేయాలి.
పూర్వ అంగప్రదక్షిణ మార్గంలో పైన రంగనాథుడు వరుసగా దక్షిణంవైపు శ్రీవరదరాజస్వామి ఆలయం పోటు (వంటశాల) బంగారుబావి, అంకురార్పణ మండపం, యాగ శాల, నాణేలపరకామణి, నోట్లపరకామణి మండపాలు చందనపుఅర, విమాన వేంకటేశ్వరస్వామి, వేదపారాయణం, తాళ్లపాక అర, సన్నిధిభాష్యకారులు, శ్రీరామానుజాచార్యుల సన్నిధి. శ్రీయోగనరసింహస్వామిని దర్శించుకుంటూ శ్రీరంగనాథుని వద్దకు వచ్చి, ఆగితే అది ప్రదక్షిణం అవుతుంది
ఈనాడు అంగప్రదక్షిణం చేసే భక్తులు వేలసంఖ్యలో ఉండడంవల్ల బంగారుబావినుండి హుండీవరకే పొర్లు దండాలు ఆగిపోతున్నాయి. పొర్లినప్పుడంతా భక్తులు గోవింద నామస్మరణ చేస్తారు. శరణాగతి, భక్తిరీతులకు, ఈ మొక్కు ప్రతీతి.
నిలువుదోపిడి
నిలువుదోపిడి మొక్కినవారు మొక్కుకున్న సమయంలో ధరించి ఉన్న ఆభరణాలన్నీ స్వామిహుండీలో నూతనవస్త్రంలో మూటగట్టి వేసి, పసుపుకొమ్ము గట్టిన పసుపు తాడును మాంగ ల్యానికి బదులుగా ధరించి, వెనుదిరిగి రావాలి. నిలువుదోపిడి ఇచ్చేవారు ముందుగా కేశఖండనం చేయించు కోవాలి. పూర్వం స్త్రీ పురుషులిద్దరు కేశాల్ని పెంచుకొనేవారు. స్త్రీలు పుష్పాలతో ఎంతో ఇంపుగా అలంకరించుకుని, కేశపోషణలో అత్యంత శ్రద్ధ వహిస్తారు. తలవెంట్రుకలు తీయించు కోకుండా నిలువు దోపిడి ఇవ్వడం, శాస్త్ర సమ్మతం గాదు. భగవంతుడి సమక్షంలో సొమ్మునూ, అందం తెచ్చే అహాన్ని వదలుకోవడమే నిలువు దోపిడి. ధనగర్వం, సౌందర్యగర్వం మటుమాయమయ్యే మొక్కిది.

తులాభారం
త్రాసులో తులాభారం తూగేవారు ఒకవైపు, మరోవైపు ధనం, ధాన్యం, బంగారు, వెండి, కర్పూరం, బెల్లం, కలకండ వంటి వస్తువుతో సరితూగి స్వామికి అర్పించవచ్చు. స్వామి కరుణాకటాక్షాలవల్ల పుట్టినసంతానాన్ని ఇలా తూచడం ఆన వాయితీగా వస్తున్న మొక్కు తులాభారం తూగేవరకు ఆ బిడ్డ స్వామిబిడ్డ. తూచిన తర్వాతే ఆ బిడ్డ కన్నవారి బిడ్డ. కొండపై తులాదండం మహాద్వారం దగ్గర రంగనాథమండపం ముందుంటుంది. మొదట్లో ఇది హుండీ దగ్గర ఉండేది.

శ్రావణ శనివార వ్రతం
వీటినే తిరు శనివారాలు అని పిలుస్తారు తిరు అనేది తమిళపదం. తిరు అంటే ‘శ్రీ’ అని గౌరవసూచన. తమిళ మాసం ప్రకారం పురట్టాసి వచ్చే శనివారం శ్రావణమాసంలో వస్తుంది. నాలుగు లేదా ఐదు శనివారాలు పూజలు, వ్రతాలు చేస్తారు. ‘కన్యాశ్రవణ సంభూతం’ అని స్వామి అవతరించిన మాసం శ్రావణం, రాశి కన్యారాశి అని చెబుతారు.
ఆ శనివారాలే ఎందుకు పూజ చేయాలనేది ఉదయించే ప్రశ్న. ప్రతి శనివారం పూజ, ఉపవాసం నెరపవచ్చు. శని గ్రహానికి పూజ ఉపవాసం నెరపవచ్చు. శనిగ్రహానికి ఇష్ట, మైన ఆహారం నువ్వులు, బెల్లం. చిమ్మిలి నైవేద్యాలారగించి శ్రీనివాసుడు, శనిదేవతను ప్రసన్నుడిగా చేసుకుంటాడు. అందువల్లే ఆ స్వామిసన్నిధి నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. అలాంటి స్వామిని ఆయన కిష్టమైన శనివార ప్రతాలతో కొలిస్తే శనిగ్రహం మనజోలికి రాడనే నమ్మకం ఎంతటి పేదవారైనా ఈ వ్రతం ఆచరించవచ్చు.

తిరుశనివారప్రతం
జోలెతో తిరుమలకు వచ్చే మొక్కు ఇది. పుణ్యక్షేత్ర దర్శనానికి పునాది వేస్తున్న మొక్కు శ్రీ వేంకటేశ్వర నామాలు ధరించి, రెండు చెరుగులా ఒడిసిపట్టి ముడివేసి, జోలె చేతికితగిలించుకుంటారు. ఇంటింటికిపోయి భిక్షాటన చేస్తూ, ఆ వచ్చిన కానుకలు బియ్యం దారిపొడుగునా ఖర్చు పెట్టుకుంటారు. మిగిలింది స్వామికి సమర్పిస్తారు. ఊర్లో అందరూ స్వామిదర్శ నానికి రాలేరు గదా! అందుకని వారికానుకలు అర్పించి, జోలి. కట్టినవాళ్ళు అందరికీ పుణ్యం పంచిపెడుతుంటారు.
మొక్కుల్లో లౌకిక ప్రయోజనం, ఆధ్యాత్మిక ప్రయోజనం అనే రెండు అంశాలున్నాయి. నడకవల్ల శరీరంలోని కొవ్వు కరిగి శరీరం ఆరోగ్యవంతమౌతుంది. దారిలోని దేవాలయాల దర్శనం వల్ల దైవభక్తి వెల్లివిరుస్తుంది. తీర్థస్నానాదులు శారీరక స్వస్త లను కల్గిస్తాయి
స్థలాభివృద్ధి, ఆర్థికసమానత్వం, విద్య, వైద్యం, కళాభివృద్ధి, లక్షలాది ప్రజలకు జీవనోపాధి వంటి అనేక సామాజిక ప్రయోజనాలు మొక్కుబడులు చెల్లించడంవల్లే కలుగుతున్నాయి కాబట్టి ఆపదసమయాల్లో మొక్కులు మొక్కి అందరం శ్రీవారి కృపకు పాత్రులమౌదాం.
రచన :–ప్రాచర్య కట్టమంచి మహాలక్ష్మి.
మూలం:–సప్తగిరి సెప్టెంబర్2020 సంచిక పేజీ నెంబర్స్ 20,21,22