పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఆమె బాల్యం నుంచే నటనలో అధ్బుతమైన ప్రతిభ ను కనపరిచింది. ఆమె నటనకే పరిమితము కాలేదు. సినీ గాయని గా, క్రీడాకారిణి గా, రంగస్థల నటి గా, రేడియో గాయని గా అనేక రంగాల్లో పేరు గడిచింది.

కమలాదేవి అందం అభినయం శ్రావ్యమైన గొంతు ఆమె సొంతం. ఆమె తన గానంతో,నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మైమరపించింది.

రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం వంటి నాలుగు మాధ్యమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి కమాలదేవి.

టి.జి.కమలాదేవి 1930, డిసెంబర్‌ 29వ తేదీన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో జన్మించింది. ఈమె తల్లి లక్ష్మమ్మ, తండ్రి కృష్ణస్వామి నాయుడు. కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. కమలాదేవి అసలు పేరు గోవిందమ్మ.
తండ్రి వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా నివాసాన్ని కార్వేటినగరం నుండి పుత్తూరుకు మార్చాడు.

కమలాదేవి పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి వరకు చదివింది. క్రిస్టియన్‌ మిషనరీ స్కూల్ లోఐదవక్లాస్‌ వరకు చదివింది.

ఏడో ఏట నుండి తల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రముఖ గాత్ర విద్వాంసుడు చెంచురామయ్య ఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచురామయ్య వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది.

ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి నాటి సరస్వతి స్టార్స్‌ తరపున ఓపెన్‌ రికార్డింగ్‌లో ఓ పాట పాడేందుకు తొలిసారిగా చెన్నై వెళ్ళింది.

టి.చలపతిరావు ఈమెకు నేను కనలేని జీవితము… అనే పాటను సుమారు 20 రోజుల పాటు నేర్పించి ఓపెన్‌ రికార్డింగ్‌లో పాడించాడు. చిన్న వయస్సులోనే కనకతార, భూపుత్రి, ఐదు పువ్వుల రాణి వంటి పలు నాటకాల్లో ఈవిడ నటించింది.

ఈమె అక్క జయమ్మ వివాహం చిత్తూరు నాగయ్యతో జరగడంతో ఈవిడ మిగతా బాల్యం చెన్నై లోని మైలాపూర్, మాంబళంలలో వారింట్లో కొనసాగింది. అప్పట్లోనే చెన్నై ఆకాశవాణి కేంద్రంలో సంగీత, పౌరాణిక నాటకాలలో, లైట్ మ్యూజిక్ కచేరిలలోను తన ప్రతిభ కనబరిచింది.

పాఠశాల, సంగీతానికి తోడుగా బాల్యం నుండి నాటకాల్లో కూడా నటించింది. ఓసారి కమలాదేవి జ్ఞాన సుందరి నాటకంలో నటిస్తుండగా నాగయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూసారు.

మరో సంఘటనలో సక్కుబాయి నాటకంలో ఈమె నటనకు ముగ్ధుడైన పిఠాపురం రాజా బంగారపు గొలుసు బహూకరిస్తానని చెప్పినా, సమయానికి ఆయన మెడలో గొలుసు లేకపోవడంతో, మరో కార్యక్రమంలో గొలుసును బహూకరించాడు.

ఆంధ్ర సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో రుక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది.

ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి.
1941లో పి.కె. రాజా శాండో జానకి పిక్చర్స్‌ పతాకం మీద ‘ చూడామణి ’ అనే చిత్రాన్ని నిర్మిస్తూ అందులో నటించే అవకాశం కలిపించారు. ఇదే ఆమె మొదటి సినిమా.
అందులో సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు చెల్లెలుగా నటించింది. సినిమా టైటిల్స్‌లో ఆమె పేరును గోవిందమ్మగానే ఉంది.

అదే సంవత్సరం వరసగా మూడు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. రోహిణీ పిక్చర్స్‌ నిర్మాత హెచ్‌.ఎం. రెడ్డి నిర్మించిన ‘ తెనాలి రామకృష్ణ’ లో ఆమె సహాయ పాత్ర పోషించింది. పార్వతి కళ్యాణం సినిమాలోనే తన పేరును కమలాదేవి గా మార్చుకుంది. ఈ సినిమా లో ఐదు పాటలను ఆమె పాడింది.

తరవాత దక్షయజ్ఞం ’ సినిమాలో ‘రోహిణి’ పాత్రను పోషించింది. అందులో చంద్రుడుగా నటించిన ఆదిశేషయ్యతో కలిసి ‘ఆహా జగమంతా ప్రేమా, ఆనందముగా శశిధర కళల పులకాంకితమౌ ఘనమోహన లీలా’ అనే పాటను కూడా పాడింది. ఈ మూడు సినిమాలు కూడా విజయవంతమయ్యాయి.

1943లో ‘ గరుడ గర్వభంగం’ సినిమా లో కమల పాత్రకోసం ‘ పురుషులు సామాన్యులా, మురిపించి నమ్మింతురే…ఈ పురుషులు సామాన్యులా’ అనే పాటను పాడింది.

1944లో ‘ సీతారామ జననం’ సినిమాలో అహల్య పాత్రను కమలాదేవి పోషించింది. ‘ అహో…నే ధన్యనైతినిగా తారకనామా శ్రీరామా’ అనే పాటను ఈమె పాడింది. ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

‘మల్లీశ్వరి’ చిత్రంలో ‘ తుమ్మెదా తుమ్మెదా.. దిగులెందుకు తుమ్మెదా’ అనే పాటను పాడుతూ నటించింది కమలాదేవి.

మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది

తరువాత ఈమె పార్వతీ కళ్యాణం, గరుడ గర్వభంగం, మాయలోకం, ముగ్గురు మరాఠీలు, పల్లెటూరు, చక్రపాణి, తోడుదొంగలు, గుణసుందరి కథ, మల్లీశ్వరి, పాతాళభైరవి, చంద్రవంక, పల్లెటూరు వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపుగల పాత్రలు ధరించింది.

కమలాదేవి తనపాత్రలకు పాడుకోవడమే కాకుండా ఇతర నటీమణులకు డబ్బింగ్ చెప్పింది. 1964లో చిత్తూరు నాగయ్య నిర్మించిన భక్తరామదాసు సినిమాలో కన్నాంబకు, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలో జి.వరలక్ష్మికి ప్లేబ్యాక్‌ పాడింది.

టి.జి.కమలకుమారి మంచి డబ్బింగ్‌ కళాకారిణి కూడా. ఆమె ‘పాండురంగ మహాత్మ్యం’లో బి.సరోజాదేవికి, ‘సంపూర్ణ రామాయణం’లో పద్మినికి డబ్బింగ్‌ చెప్పింది.

జూపిటర్‌ ఫిలిమ్స్‌ భాగస్వామి కోవై అయ్యముత్తు 1947లో తమిళంలో నిర్మించిన ‘కంజన్‌’(పిసినారి) సినిమాలో హీరోయిన్‌గా కమలాదేవి నటించింది.

ఈమె తొలినుండి ఆకాశవాణి ఆస్థాన గాయని. ప్రయాగ నరసింహశాస్త్రి ప్రేరణతో రేడియోలో లలిత సంగీతం, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకుంది.

1945 నుంచే ఆకాశవాణిలో ‘ఎ’ గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది బాలాంత్రపు రజనీకాంతరావు, వింజమూరి అనసూయ, సీత, రావు బాల సరస్వతీదేవి, మల్లిక్, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో కలసి చాలా మార్లు గానం చేసింది.

కమలాదేవికి చిన్నతనం నుండి రంగస్థలం అంటే ఎంతో అభిమానం. సతీసావిత్రి, తులాభారం, కీచక వథ వంటి నాటకాలు ఈమెను నటిగా నిలబెట్టాయి. పాఠశాలలోనే కనకతార వంటి నాటకాల్లో నటిస్తూ బాల కళాకారిణి గుర్తింపు పొందింది.

నాటకాలలో ఆమె వేసిన అలెగ్జాండర్ పాత్ర గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది.

సావిత్రి, వరూధిని, కీచకవధ వంటి నాటకాల్లో ఆడుతూ పాడుతూ నటిస్తూ నటిగా పేరుతో పాటు అనుభవమూ గడించింది.

బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, సి.ఎస్.ఆర్‌,ఎ.వి.సుబ్బారావు, రఘురామయ్య, సూరిబాబు, జగ్గయ్య వంటి మహానటుల సరసన కథానాయకి గానో, సహనటిగానో నటించి రంగస్థల చరిత్రలో తన స్థానం పదిలం చేసుకుంది.

అన్నా చెల్లెలు, రోషనార, కబీరు, నూర్జహాన్, పరివర్తన వంటి నాటకాలు ఆమెకు ఆంధ్రలోను, కబీరు, నూర్జహాన్ తమిళనాడులోను మంచి పేరు తెచ్చాయి. ఆంధ్ర మహాసభలో ఎన్నో వందల నాటకాలలో నటించింది.

సావిత్రి నాటకంలో నారడుడుగా, కీచకవధలో ఉత్తరగా, తులాభారంలో నళినిగా, విడాకులు అనే సాంఘిక నాటకంలో సోదరి పాత‌్రన్రు, గాలివాన సాంఘిక నాటకంలో ఇందిర అనే హీరోయిన్‌ పాత్రను సమర్ధవంతంగా పోషించి ఆమె మంచి పేరుతెచ్చుకుంది.

1947లో సరదాగా ఆమె బిలియర్డ్స్ నేర్చుకుంది. 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ ఆడటం ప్రారంభించింది1956లో ఆస్ట్రేలియా ఛాంపియన్ బాబ్ మార్షల్ తో బెంగళూరులో తలపడింది. ఆ తరువాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడింది.

1994, 1995లలో బెంగళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిచింది.

జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా ఈమె ఆడింది. బిలియర్డ్స్ ఆడి, విజేత అయిన మొదటి భారత స్త్రీ కమలాదేవి.

బిలియర్డ్స్ ఆటలో 1991లో జెంషెడ్ పూర్ లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది.

ప్రముఖ నటుడు, దర్శకుడు ఆవుల చంద్రబాబు నాయుడు ని కమలాదేవి 1946 అక్టోబరులో ప్రేమ వివాహం చేసుకుంది. ఆయన మద్రాసు నగర నీటి సరఫరా సంస్థలో ఇంజనీరుగా పనిచేసేవారు.

వారిద్దరూ అనార్కలి నాటకంలో కలిసి నటించారు. ఆయనతో పెళ్ళయిన తరువాత కమలాదేవి సినిమాలకు దూరమైంది.
వీరి కుమారుడు జయచంద్ర న్యాయవాది వృత్తిలో వున్నాడు. 1984 లో నటించిన కుటుంబగౌరవం
ఆమె చివరి సినిమా .

మద్రాసులో ఉన్న చెన్నపురి ఆంధ్రమహాసభ లో 1950లో సభ్యత్వం పొంది 1956 నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవ చేసింది.

చిత్తూరు నాగయ్య జ్ఞాపకార్ధం నెలకొల్పిన చిత్తూరు నాగయ్య మెమోరియల్ అకాడమీకి ఈమె ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది.
నాటకాలలో ఆమెకు ఒక బంగారు పతకం, 25 వెండి పతకాలు లభించాయి.

1983లో కర్నూలులో
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఆమెను నాటక కళాపూర్ణ అవార్డుతో సత్కరించింది.

ఈస్ట్‌ బెర్లిన్‌ లో జరిగిన మ్యూజికల్‌ థియట్రికల్‌ వేడుకల్లో భారత ప్రతినిధిగా
కమలాదేవి పాల్గొంది.

కమలదేవి సెన్సార్ బోర్డు చైర్మన్ గాపనిచేశారు.
ఆగస్టు 16, 2012
చెన్నై లో మరణించారు.

రచన:– చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s