
ప్రతి భారతీయుడూ ఏదో ఒకవిధంగా భారతమాత దాస్యశృంఖలాలను తెగగొట్టడానికి ఎంతో కొంత ప్రయత్నించారు. ఈ పోరాటంలో కవులు, రచయితల పాత్ర కూడా ఉదాత్తమైందే.
అప్పట్లో ఏ ప్రాంత కవులు ఆ ప్రాంత స్వాతంత్య్ర సమర సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి, తమ అక్షరయజ్ఞం కొనసాగించారు.
కవులు ఉత్తేజితులై ఉద్యమాలకు తమ రచనలతో ఊపిరిపోశారు.
సాహితీమూర్తులు స్వాతంత్య్రోద్యమాన్ని అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ ఆవిష్కరించారు.
తెలుగునాట అన్ని మారుమూలల నుంచి కూడా ఈ స్వాతంత్య్రోద్యమ కవితా స్రవంతి చైతన్యవంతంగా,ప్రబోధాత్మకంగా పోరాటపటిమను ప్రేరేపిస్తూ సాగింది.
కవి హృదయంలో గాంధీజీ ప్రబోధించిన జాతీయభావాలు ఎంతలా మెదిలాయో చెప్పడానికిది నిదర్శనం.
రాట్నం మీద కవిత కట్టిన కవి కల్లూరు అహోబలరావు .
ఈయన అనంతపురానికి చెందినవారే. తన ‘పూదోట’ ఖండ కావ్యంలో ఇలా చెబుతారాయన… ఉదాహరణకు మొదటి లైన్లన మాత్రమే ఇది.
రాటమా! కాదు- పోరాటంబు లుడిగించు ,
విష్ణుచక్రంబిద్ది పృథివియందు …. .
రాటమా! కాదు- ఆరాటంబు బోకార్పు
కల్పవృక్షంబిద్ది ఖండితముగ
ఇలా వివరించారు.
అనంతలో కవుల చిరునామా అనంతం. స్వాతంత్ర్య సమరాంగనానికి ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించాలని ఆరాట పడిన రచయిత ,కవి
కల్లూరు అహోబలరావు.

కల్లూరు అహోబలరావు అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో 1901 జూన్ లో
జన్మించాడు. బడగనాడు నియోగి శాఖకు చెందిన బ్రాహ్మణుడు. కాశ్యపశ గోత్రుడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు ఇతనికి మేనమామ.
ఈయన తన ప్రాథమిక విద్య హిందూపురం, ధర్మవరం గ్రామాలలో చదివారు. బెంగళూరులో యస్.యస్.ఎల్.సి చదివారు. బళ్లారిలో సెకండరీగ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చేశారు. తెలుగులో విద్వాన్ ఉత్తీర్ణుడయ్యారు.
1931 లో బళ్లారిలో సెకండరీగ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కృష్ణదేవరాయల గ్రంథమాల సంస్థ స్థాపించి రచనలు రాశారు. సంస్థ ఏర్పాటు కు ఘూళీ కృష్ణమూర్తి,హెచ్.దేవదానం లు సహకారం అందించారు . ఈ సంస్థ ద్వారా 40కు పైగా గ్రంథాలను పాఠకలోకానికి అందించారు.

లీలాశుకుని శ్రీ కృష్ణ కర్ణామృతము నకు కవిరత్న కవిభూషణ, కవికోకిల, కవిశేఖర కల్లూరు అహోబలరావుగారి తెలుగు అనువాదం ఇది. 1981లో మొదటి ముద్రణ పొందిన ఈ గ్రంథం.శ్లోకాలకు సీసము, తేటగీతి, మంజరీ ద్విపద, కందము మొదలైన ఛందస్సులో 352 పద్యాలు తెలుగు అనువాదంఉంది.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో
బళ్లారిలోని సెయింట్ జాన్స్ హైస్కూలులో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా, తెలుగు పండితునిగా పనిచేశాడు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకాలోని
గంగవరం, కళ్యాణదుర్గం, బెలుగుప్ప ఇలాఅనేక గ్రామాల పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేశాడు.
1934లో కల్లూరు అహోబలరావు అనంతపురం మన్సిపల్ హైస్కూల్ కు బదిలీ కావడంతో ఈ గ్రంథమాల కూడా అనంతపురానికి మారింది. 1956 లో అనంతపురం రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హైస్కూలులో పదవీ విరమణ పొందారు.
1957లో హిందూపురం కు చేరుకొన్నారు.
కల్లూరు తన రచనలను మొదట శతకాలతో ప్రారంభించాడు. ఎన్నో గ్రంథాలను వ్రాశాడు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు క్రమం తప్పకుండా శుభాకాంక్షలను పద్యరూపంలో ముద్రించి బంధుమిత్రులకు పంపేవాడు.
1921 నుండి 1990 లో మరణించే వరకు ఇలాగే శుభాకాంక్షలు తెలిపేవారు.
ప్రమోదూత ఉగాది శుభాకాంక్షల పద్యం ఆఖరిది.
అవి కేవలం శుభాకాంక్ష పద్యాలు మాత్రమే కావు. గత సంవత్సరంలో ప్రజానీకం పడిన కష్టనష్టాలకు, దేశకాల పరిస్థితులకు దర్పణం పట్టాయి.
1921 నుంచి బంగ్లాదేశ్ విభజన వరకు జరిగిన అనేకరాజకీయ, సామాజిక, స్వాతంత్ర్య విశేషాలను వివరిస్తూ రాసిన 50 ఉగాది శుభాకాంక్షల పద్యాలను పొందుపరుస్తూ 1972 లో
ఉగాది స్వర్ణభారతి పుస్తకం ప్రచురించారు.
మరో 19 పద్యాలు ప్రచురితం కాలేదు. వీరి కుమారులు అన్ని పద్యాలు కలపి ఓ పుస్తకం తీసుకరావలని ప్రయత్నిస్తున్నారు.
రాయలసీమలో పుట్టిపెరిగిన 141మంది కవుల జీవిత చరిత్రలను,వారి రచనలను పరిచయంచేస్తూ నాలుగు సంపుటాలలో “రాయలసీమ రచయితల చరిత్ర”ను వెలువరించారు
రాయలసీమ రచయితల చరిత్ర-1 వ సంపటి 1975 జూలై నెలలో గ్రంథమాల 22 వ పుస్తకంగా విడుదలైంది. ఇందులో 20 మంది కవుల చరిత్రలు కలవు. రెండవ సంపుటి 1977 జూలై నెలలో విడుదలైంది. ఇందులో 31 మంది కవిజీవితములు చేర్చబడినవి.
3వ సంపుటి1981 ఆగస్టు విడుదలైంది. ఇందులో 50 మంది కవుల జీవిత చరిత్రలు కలవు. 4వ సంపుటి 1986 జూలై నెలలో వెలువడినది. పీఠిక జానమద్ది హనుమద్ శాస్ర్తి రాశారు. రచయితలు రచయిత్రుల జీవిత చరిత్రలు మొత్తం 141 మంది జీవిత చరిత్రలను ప్రచురించడం జరిగింది.
కల్లూరు అహోబలరావు
“రాయలసీమ రచయితల చరిత్ర” 4వ సంపుటి లో ముందు మాట ఇలా రాశారు.
రాయలసీమలో అజ్ఞాతంగా యెందరో కవులు కవయిత్రులున్నారు. వారి నందరిని చేర్చికూర్చిన మరికొన్ని సంపుటములు కాగలవు. కాని నా వయస్సు 85సంవత్సరాలు. నిత్యం ఎక్కువ ఓపిక తక్కువ.
గ్రంథమాల పనులన్నీ నా పుత్రుడికి కల్లూరు రాఘవేంద్రరావుకప్ప జెప్పినా ను. అతడే మున్ముందు ఈశ్వరుని కృపవల్ల – ఈపని కొనసాగింప గలడు ఈ నాగం నందలి కవుల జీవితములను వ్యావహారిక భాషలో రాయుట జరిగినది. ఈ పద్ధతిని వ్రాయుటలో నా కుమారుడు నేర్పు గడించాడు. అని పేర్కొన్నారు.
1923లొ కుమార శతకము ,
భరతమాతృ శతకము రచించారు.భావతరంగములు -ఖండికలు,పూదోట – ఖండికలు,భక్తమందారము – ద్విశతి,ఉగాది స్వర్ణభారతి,
రాయలసీమ రచయితల చరిత్ర – 4 సంపుటాలు ,
శ్రీరామకర్ణామృతము,ఉగాది వజ్రభారతి,పుష్పబాణ విలాసము ఇలా అనేక రచనలు చేశారు.

కల్లూరు అహోబలరావు రాసిన భక్త మందారము
200 సీసపద్యాలున్న శతకం ఇది. దీనిని మొదట శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల తన 14వ పుసకంగా వెలువరించింది .ఇది భక్తి, జ్ఞాన,నీతి వైరాగ్య, ఆర్తి నివేదనలతో కూడిన సీసపద్య ద్విశతిగా ముఖచిత్రంపై పేర్కొన్నారు. ఈ గ్రంథానికి మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి తొలిపలుకు, వేదము వేంకటకృష్ణశర్మ అభిప్రాయము, కిరికెర రెడ్డి భీమరావు ప్రశంస అందించారు.
విశ్వమేవ’లో విద్వాన్ విశ్వం మొదటి అధ్యాయంలో సాహితీ ప్రముఖులైన విశ్వనాథ, వేలూరి, దివాకర్ల, దాశరథి, ఆరుద్ర, అనంత కృష్ణశర్మ, మిక్కిలినేని, ఏటుకూరి బలరామమూర్తి, కల్లూరు అహోబలరావు, మహీధర రామ్మోహనరావు వంటి వారి వ్యాసాలు రాశారు.
కల్లూరు అహోబలరావు ను
హిందూపురంలోని రాయలకళాపరిషత్ పక్షాన శ్రీశారదాపీఠము వారు ‘కవిభూషణ’ బిరుదుతో సత్కరించారు.
1960లో కూడ్లీ శృంగేరీ జగద్గురు సచ్చిదానంద శంకర భారతీస్వామిచే ‘కవితిలక’ బిరుదు ప్రదానం చేశారు.
బరోడా మహారాజు బంగారు పతకం ప్రదానం చేశారు.
ఇంకా కవికోకిల, కవిశేఖర బిరుదులు లభించాయి.
ఘూళీ కృష్ణమూర్తి ,
కల్లూరు అహోబలరావు
హెచ్.దేవదానము,రావాడ వేంకట రామాశాస్త్రులు,
రూపనగుడి నారాయణరావు,
గుంటి సుబ్రహ్మణ్యశర్మ ,
శీరిపి ఆంజనేయులు,
కిరికెర భీమరావు,
బెళ్లూరి శ్రీనివాసమూర్తి,
కల్లూరు వేంకట నారాయణ రావు ,డి.బాబన్న ,మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ తదితరుల రచనలను కృష్ణదేవరాయలుగ్రంథమాల సంస్థ గ్రంథాలు గా వెలువరించింది.
అహోబలరావు
పన్నెండవయేటనే వివాహమైనది. భార్య సీతమ్మకు అప్పటికి ఎనిమిదేండ్లు మాత్రమే. వీరికి ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు.
4 గురు కుమారులు చనిపోయారు.మరో ఇద్దరిలో
కల్లూరు జానకిరామారావు హిందూపురం మున్సిపల్ హైస్కూలు ప్రధానోపాధ్యాయులు గా పదవీ విరమణ పొందారు. హిందూపురం లో ఉంటున్నారు. వీరు తెలుగు,కన్నడ రచనలను అనువాదం చేస్తుంటారు.
కల్లూరు రాఘవేంద్రరావు హిందూపురం మున్సిపల్ హైస్కూల్ యల్.యం.యల్
ప్రధానోపాధ్యాయులు గా 2004లో పదవీ విరమణ పొందారు.వీరు రచయిత.
మూడు కాళ్ల మేక
స్వర్గానికి దుప్పట్లు
చిలకలతోట రచనలు చేశారు.
వీరి తమ్ముడు నంజుండరావు.
ఈయన స్వతంత్ర్య సమర యోధుడు.
జ్ఞానాంబ ,సరోజమ్మ ,విజయలక్ష్మి కూతుళ్లు. అహోబలరావుభార్య సీతమ్మ కూడ రచయిత్రి . పాండురంగ భక్తి మాల రచించారు. తెలుగు, కన్నడ బాషలలో ప్రచురితమైంది.
అహోబలరావు 1990 డిసెంబర్ 25 న హిందూపురం లో మరణించారు.
