
“కవిత్వం దృశ్య వస్తువుల్లో అదృశ్య వస్తువుల్ని చూసే నేత్ర విద్య”అన్నారు శేషేంద్ర శర్మ.అలాంటి దృశ్య వస్తువుల్లో అదృశ్య వస్తువులను చూసి అనితరసాధ్యంగా స్పందించిన నిఖార్సయిన కవి,నిబద్ధత కలిగిన సంఘసేవకులు,తరిమెల అమరనాథ్ రెడ్డి.
ఆయన మాట్లాడితే కవిత్వం జలజలా పూలు రాలినట్టుంటుంది.ఆయన మాండలిక భాషపలికితే గలగలా సెలయేరు పారినట్టుంటుంది.
ఆయన నవ్వితే హాస్యం వెన్నెల కురిసినట్టుంటుంది.
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు ,ప్రజల మనిషి తరిమెల నాగిరెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్న తరిమెల అమరనాథ్ రెడ్డి అనంతపురంలో మానవతా రక్తదాతల సంస్థను స్థాపించి పేద ప్రజలకు సేవలు చేస్తూ పేదప్రజల ప్రాణదాతగా విశేషకీర్తి గడించారు.ఈ క్రమంలో ఆయన అనుభవాలను కథలుగా ,కవితలుగా ,వ్యాసాలుగా పుస్తకాలరూపంలో ప్రచురించారు.అందులో”అమర్ ఆలోచనలు” పేరుతో ఆయన వెలువరించిన కవితా సంపుటి కాకు మహాద్భుతం అనిపించింది.ఎందుకంటే “ఉద్యమాల ఉన్మాదంలో ఉత్పాదిత మౌతున్పది ఆర్తి.కవిత్వాల సేద్యానికి అనువైనది కాదీ కార్తి”అని ఆరుద్ర అన్నట్టు కవిత్వం ఉద్యమాలు,కవితా సేద్యాలు అన్నిట్లో క్రియా శూన్యత,స్తబ్ధత,డొల్లతనం,కీర్తికండూతి పెరిగిపోయిన..ఈ పోస్టుమోడ్రనిజం ,కంజ్యూమర్ కాలంలో..నీతి, నిజాయితి, నిబద్ధతలతో నిరంతర సంఘసేవలో నిమగ్నమైన తరిమెల అమరనాథ్ రెడ్డి లాంటి సంఘసేవకులు కవిత్వం రాయడం,రచనలు చేయడం ముదావహం.ఎంతో అవసరం కూడా…వాస్తవానికి ఇలాంటివారు రాసిందే అసలు సిసలైన కవిత్వం.ఈ కవితా సంపుటి ప్రారంభంలోనే “గుండె కదిలితే పెన్ను కదపాలి…మనసుతో రాస్తే జీవితాంతం గుర్తుంటుంది”అన్న ఆత్రేయ కొటేషన్ ఉండటమే కాదు అమరనాథరెడ్డి కవిత్వం కూడా నిజంగానే అలానే ఉంది.ఇక కవిత్వంలోకి వెళితే …”అపవిత్రుని చేతిలో అక్షరాలు మైలపడతాయి..పవిత్రుని చేతిలో అగ్ని రవ్వలై మెరుపులు చిందుతాయి(కాలం నాది ఒడ్డున)అన్నట్టు ఈ కవి చేతుల్లో అక్షరాలు అగ్ని రవ్వలుగా ఎగసిపడి నగ్న సత్యాలు ఆవిష్కరించాయి. అదెలాగంటే…
“జెండా ఏదైనా అది ఇస్తూంది అవినీతికి అండ!
ఎవరు ఏ జెండా పట్టినా అక్రమ సంపాదనే వాని అజెండా”
అంటూ నేటి నాయకుల పార్టీల అంజెండా అవినీతే అంటూ నేటి వాస్తవిక రాజకీయ దుస్థితిని తూర్పార బట్టారు.అంతేకాదు..ప్రజల్లో చైతన్యం కరువై పోయిందని ఓ కవితలో వాపోతూ..
“మన నేలకు నీటి కరువు
మన నేతలకు నీతి కరువు
మనలో చైతన్యం కరువు
మనకందుకే ఈ కరువోయ్”
అంటూ కరువును symbolic గా చెబుతూ’అనఫొర’ కవితా రూపానిర్మాణ కౌశలంతో కవితను వ్యంగాత్మకంగా చిత్రించారు.anaphora(rhetoric)అన్నది గ్రీకు పదం.ఈ కవితా నిర్మాణంలో ఆలోచనలను,భావాలను,ఉద్వేగాలను బలంగా అభివ్యక్తీకరించవచ్చు.ఇందులో పాదాలు రిపీట్ అవుతుంటాయి.ఈ కవితలో ”కరువు “అన్న పదం పదే పదే రిపీట్ అయింది.కవి భావోద్వేగం బలమైన అభివ్యక్తి వక్రోక్తిగా (కుంతకుడు)మారింది.

మతోన్మాదం ఎంత క్రూరమైందో,దారుణమైందో,అమానుషమైందో అమరనాథ్ రెడ్డి ఓ కవితలో వర్ణిస్తూ…
“భర్త ఎదుట గర్భిణీ భార్యనే చెరుస్తూ
కడకు కడుపులోని శిశువునే శూలాలతో చీలుస్తూ
సంసారాన్నే సజీవదహనం చేస్తుంది మతోన్మాదం”
అంటూ వాపోతారు.ఇలా మతోన్మాదం ఎందరి అమాయక జీవుల ప్రాణాలను బలిగొందో ఆలోచించమంటున్నాడీ కవి.రాజకీయమే అన్ని అనర్థాలకు కారణమని,మతం దానికి రంగు(కాషాయం)అని ప్రతీకాత్మకంగా చెప్పాడు కవి.అంతేకాదు …
‘మతం,రాజకీయాల అక్రమ దాంపత్యానికి విడాకులు యిప్పించన్నా!”
అంటారు మరో కవితలో…ఇలా కవి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సమస్యకు పరిష్కారం కూడా తానే సూచిస్తాడు..

“లౌకిక రాజ్యం కావాలంటే
భావ విప్లవం రావాలి
మతం కన్నా మానవత మిన్నని చాటాలి
ప్రతిమందిర్ ,మసీదు,చర్చిలు బ్లడ్ బ్యాంకులు కావాలి
మానవతా బ్యాంకులు కావాలి”
అంటాడు ఈ కవి.ప్రజల మధ్య ఉంటూ ‘రూసో’ ఇలానే ఫ్రెంచి ప్రజల్లో ఆనాడు భావవిప్లవం తెచ్చాడు.ఇప్పుడు అమరనాథ్ రెడ్డి కూడా నిత్యం ప్రజల మధ్య ఉంటూ మానవతను బోధిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు .మతాల సింబల్స్ అయిన మందిర్ ,మసీదు,చర్చిలను బ్లడ్ బ్యాంకులు కావాలనడంలోని అంతరార్థం..అందరి మనుషుల రక్తం ఎరుపేనని కవితలో పరోక్షంగా ధ్వనింపజేయడమే!.
నేటి కుహనా కవుల కన్నా ,సమాజసేవ చేయని సృజనకారుల కన్నా,కరువుసీమలో రైతుల కష్టాలపై కథలు రాసి కీర్తి పొంది కిరీటాలు ధరించిన కవులు,రచయితలకన్నా ఈ కవి తక్కువేం కాదు. ,కరువు దెబ్బతో రైతులు భిక్షగాళ్ళుగా మారిపోయి అనంతపురం బస్టాండులో అడుక్కు తింటూ అయ్యా! ఆకలేస్తుంది రెండు ఇడ్లీలు ఇప్పించండని ప్రాధేయపడితే కసరుకొంటున్న కవుల కన్నా తరిమెల కవి వేయిరెట్లు మిన్న అనిపిస్తుంది.”మానవత్వం లేనివాడు కవిత్వం రాయడానికి అర్హుడు కాడు”.అమరనాథరెడ్డి అపార మానవత్వమున్న..సేవామూర్తి.పేదల కష్టాలు చూసి విలవలలాడిపోయే మానవతా మూర్తి.అందుకే..
“నాది ‘వేదభాష కాదు స్వేదభాష,అదే పేదభాష”
“నాకు శిల్పమే కాదు బల్పమే తెలీదు
కనుకనే అంటున్నా నాది మేధోభాష కాదు
పేదోని భాష,ఇది పేదోని ఘోష”
అంటూ ..నిజాయితీగా తన భావాలు ప్రకటించుకున్న నిష్కళంక కవి.’నాకు శిల్పమే కాదు బల్పమే తెలీదు’ అనడంలో ఎంతో నిగూడార్థం దాగుంది.శిల్పం కవిత్వానికి చెందినది.బల్పం చదువుకు ప్రతీక.నేను సాహిత్యం చదువుకోలేదని,శిల్పం తెలియదని ఈ కవి భావం కావచ్చు.కాని శీలం లేని(మానవతా)శిల్ప కవులు అల్పకవులన్న విషయం లోక విదితమే.అందుకే నేను “వ్యక్తిత్వం లేని వాడు ఎంత గొప్ప కవిత్వం రాసినా అది శిల్పశోభితం కావచ్చునేమోగాని శీలవంతం కాదని”ఒక విమర్శా వ్యాసంలో రాశాను.ఈ కవి శీలమున్న కవి.కనుకనే ప్రతి కవిత గొప్పదనే నేనంటాను.తరిమెల అమరనాథ్ రెడ్డి తన కవితల్లో పుక్కిటి పురాణాల గుట్టును రట్టు చేశాడు.దేవతల నిజ స్వరూపాలను బట్టబయలు చేస్తూ వ్యంగ్యాత్మక కవితాస్త్రాలను సంధించారు…
“అదేంటో నరుడు వ్యభిచరిస్తే
నరకమంటుంది గరుడపురాణం
మరేమో పరమ వ్యభిచారి దేవేంద్రుడు
స్వర్గానికి అధిపతి అంటుంది మరో పురాణం”
అంటూ తూర్పరబడతాడు.హేతుబద్ధమైన తర్కం,సున్నిత హాస్యం,సుకుమారహృదయ స్పందన,బలమైన కవితాభివ్యక్తి తరిమెల అమరనాథ్ రెడ్డి కవితల్లోని ప్రత్యేకతలు.
కరువు సీమ విషాద దృశ్యాలను,చిత్రమైన రైతుల,నిరుద్యోగుల,బడుగు జీవుల వ్యథార్థ,గాధలను,యథార్థ బతుకు చిత్రాలను హృదయ విదారకంగా కవిత్వీకరించారు అమరనాథ్ రెడ్డి…

“నీ సేద్యమే జూదమాయె..ఇల్లంతా గుల్లాయె,రైను లేక,రేటులేక,మెట్టపంటలు గిట్టవాయె
తాతల నాటి పట్టాలన్ని బ్యాంకులోన తాకట్టాయె
పెళ్ళీడు బిడ్డేమొ సూయి సైడే
సేఫ్ సైడని పెస్టిసైడుతో పీనుగాయె!
పాడిముళ్ళే మూడుముళ్ళుగా మురిసిపాయె!
పొట్టనింపని పట్టాతో
నిరుద్యోగి నీ కొడుకు కిరాయికిల్లరాయే!
కడకు ఎన్ కౌంటరాయె
అప్పుతీరే దారిలేక ఆత్మహత్య రహదారాయె”
ఇలా కరువు సీమ విషాద దృశ్యాలను ఆర్ద్రంగా అక్షరీకరిస్తూ గుండెలను పిండేస్తాడీకవి.”కిరాయికిల్లర్”,పాడిముళ్ళుమూడుముళ్ళు”లాంటి అద్భుత పదబంధాలు అమరనాథ్ రెడ్డి మాత్రమే సృష్టించగలడు.ఇవి గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన బాధాగ్నిదగ్ధ భావనలు. “కారణాలు కాలానికి తెలుసు,కారల్ మార్క్స్ కు తెలుసని” నగ్నముని అన్నట్టు కరువు సీమలో ఎన్నో అనర్థాలకు, విషాదదృశ్యాలకు కారణాలు తరిమెల కవికి తెలుసు.అందుకే ఆడపిల్లల,రైతుల ఆత్మ హత్యలకు,నిరుద్యోగులు కిరాయి హంతకులు గా మారడానికి ఎవరు కారణమని కవిత్వమై ధ్వనిస్తారు.నినదిస్తారు.నిలదీస్తారు.అణ్యం పుణ్యం ఎరుగని కరువు సీమ బిడ్డలు,అమాయక రైతుల బలిదానాలను ఆర్ద్రంగా అక్షరీకరిస్తారు.అంతే కాదు..ఎందుకీ దురవస్థ?అంటూ ప్రశ్నిస్తూ..
“మన నేలకు నీటి కొరత
మన నేతలకు నీతి కొరత,
మనలో చైతన్యం కొరత
ప్రజలే ఉద్యమించాలి
ఉద్యమిస్తేనే ఉంటుంది భవిత”
అంటూ కవిత్వంలోనే పరిష్కారమై ధ్వనిస్తారు.చెప్పేవారు చేస్తూ చెప్పినపుడు,వినేవారు విని ఆచరించినపుడే సమాజంలో మనం ఆశించిన మార్పు ఉంటుందంటాడీ కవి.
నిజమే చేతల్లో చేసిందే రాతల్లో చూపించాలి.అలా చేతల్లో రాతల్లో చూపించిన నిబద్ధత కలిగిన సంఘసేవ కుడు,కవి,రచయిత తరిమెల అమరనాథ్ రెడ్డి.అందుకే ఆయన ఆలస్యంగానైనా తన అనుభవాలకు,అనుభూతులకు,ఆవేదనలకు అక్షరాకృతి కల్పించారు.

“మా తరిమెల కథలు”,”అమర్ హార్ట్”,”అమర్ టాక్స్” అన్న అపూర్వ,అద్భుత గ్రంథాలు ఆవిష్కరించారు.కొన్నేళ్ళ క్రితమే ఆయన “ఘోష”అన్న అద్భుతగ్రంథం వెలువరించారు..అందులో ఆయన..
“కరువు పనులా?వచ్చినా అవి నాయకుల జేబులు నింపుకోడానికే”అంటూ ఆనాడే దుయ్య బట్టారు.అమర్ నాథ్ రెడ్డి రాసిన అన్ని పుస్తకాల్లో మానవత్వం వస్తువుగా,హాస్యం ఆత్మగా ,అభివ్యక్తి నవ్యత గా కనిపిస్తుంది.సమాజాభ్యుదయమే ఆయన లక్ష్యం.”కష్ట జీవికి అటు ఇటుగా ఉన్నవాడే నిజమైన కవి”అని శ్రీశ్రీ అన్నాడు,తరిమెల అమరనాథ్ రెడ్డి కష్టజీవి కి తోడుగా ఉన్నాడు.మానవత్వంతో సేవలు చేస్తున్నాడు.తన సేవల అనుభవాలనే పుస్తకాలుగా రాశారు.ఏదో పెద్ద కవినో ,రచయితనో కావాలని ఆయన రచనలు చేయలేదు.తన హృదయం ఎలా కంపిస్తే అలా తన స్పందనలకు మాండలికపదాలతో మాటల పరిమళమద్ది,కవితలు,కథలు,వ్యాసాలు రాశారు.సమాజ శ్రేయస్సుకే రచనలు చేశారు.ఒక పక్క తన హాస్య,వ్యంగ్య అద్భుత ఉపన్యాసాలతో,ప్రజలను చైతన్య పరుస్తూ,మరో పక్క తన అపుర్వ చైతన్యపూరిత,ఆలోచనాత్మక(thought provoking) రచనలతో,మేధావులను మెప్పించి, ఆలోచింపజేస్తున్నారు.అందుకు మనం తరిమెల అమర్నాథ్ రెడ్డి గారిని అభినందించాలి.మనమే కాదు….ప్రజాకవి కాళోజి..
“వీడెవడో పేదోని బాధలు పేదోని మాటల్లో రాసి ఏడిపిచ్చిండే”అని తరిమెల అమర్నాథ్ రెడ్డిని కొనియాడాడంటే అంతకంటే మెగసెసే అవార్డు గొప్పదని నేననుకోను. పేద ప్రజలు కట్టిన పన్నులతో లక్షలాది జీతాలు తీసుకుంటూ ఆ నిరుపేదలఈతి బాధల గురించి నాలుగు అక్షరాలు రాయిని కుహనా మేధావుల కన్నా ..ప్రజలమధ్యే ప్రజల్లో ఒకడుగా జీవిస్తూ,పేదప్రజలకు రక్తదానాలు చేస్తూ,చేయిస్తూ,మానవత్వాన్నే తన ప్రజాసాహిత్య కేతనంగా ఎగరేస్తూ అద్భుత రచనలు చేస్తున్న తరిమెల అమరనాథ్ రెడ్డిని..మనసారా అభినందిస్తున్నాను..అమరన్నా..నీకు నీవే సాటి..నీ కెవరులేరు పోటి!”అనంత బడుగు జీవుల సజీవజీవితాల అక్షరాకృతి అమరనాథ్ సాహిత్యం”అన్నా!నీ సాహిత్యం అజరామరం.అద్భుతం.అపూర్వం.

పుస్తకాలకు:తరిమెల అమరనాథ్ రెడ్డి
సెల్:9346735480,9393723881
.