
కళ్యాణ మండపం :-
శ్రీవారి గర్భాలయానికి దక్షిణంవైపు క్రీ.శ.1586లో శ్రీ అవసరం చెన్నప్ప అనే నాయకుడు కల్యాణ మండపాన్ని నిర్మించారు. 80 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో 27 స్థంబాలతో నిర్మించారు. ఇందులో మధ్య భాగంలో నాలుగు చిన్న స్తంభాలు ఉన్న గ్రానైట్ వేదిక ఉన్నాది.సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటు చేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది.
ఉగ్రాణం :-
స్వామివారి పూజా సంభారాలు నిల్వ ఉంచేగది.
సంపంగి ప్రదక్షిణకు (north west) వాయువ్య మూలగా ఉంటుంది.
విరజానది :-
వైకుంఠంలోని పరమ పవిత్రమైన నది శ్రీవారి పాదాలక్రిందగా ప్రవహిస్తూ ఉంటుందని నమ్మకం.
ఆలయం లోపలి బావులలో ఈనది నీరు ప్రవహిస్తుందని అందుకే ఆలయ బావులలోని నీరు పరమ పవిత్రమైనవిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వాడతారు.
నాలుగు స్థంభాల మండపం :-
దీనిని 1470లో సాళువ నరసింహరాయులు నిర్మించారు. సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వ నరసింహ రాయలు ఆయన భార్య , ఇద్దరు కుమారులు పేర స్థంభాలు కట్టించాడు.ఈ మండపంలో ఉట్లోత్సవాన్ని నిర్వహిస్తారు.
పూలబావి :-
పూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామి వారికి ఉపయోగించిన పూల నిర్మాల్యాలన్నీ ఇందులో వేస్తారు.
దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్ళేటపుడు ఎత్తైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.
వగపడి :-
భక్తులు సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది.
ముఖ మండపం :-
అద్దాల మండపంనకు ముందుభాగంలో ఉంటుంది.
కళ్యాణం చేయుచుకున్న భక్తులకు ప్రసాదాలు దీని ప్రక్కమార్గంలో అందచేస్తారు.
2 వ ప్రాకారం :-
వెండి వాకిలి – నడిమి పడికావలి…

ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామి వారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశ ద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు.
ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న శిల్పం ఉంది.
వెండివాకిలి… ధ్వజస్థంభానికి ఎదురుగా ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి. ఇది స్వామివారి సన్నిధికి వెళ్లే రెండవ ప్రవేశద్వారమన్నమాట. ధ్వజస్తంభం దాటిన తరువాత ఉన్న రెండవ ప్రవేశం ద్వారా గోపురం మహాద్వార గోపురం కంటే కొంచెం ఉంది. ఈ గోపురం ధృఢమైన నల్లరాతితో నిర్మితమైన చౌకట్టుపై నెలకొల్పబడింది. ఈ రాతి చట్రం కొలతలు తూర్పు పడమరలుగా 24 అడుగులు, ఉత్తర దక్షిణ దిక్కులుగా 36 అడుగులు కలిగి, వీటి మధ్య 9.5 అడుగులు వెడల్పు గల ప్రవేశమార్గంతో ఒప్పుతూ ఉంది. ఈ ద్వారం అనేక శిల్పశోభితంగా నిర్మింపబడిన మూడు అంతస్థుల గోపురాన్ని ఆ గోపురంపై ప్రతిష్టించబడ్డ ఏడు బంగారు కలశాలు ఉన్నాయి.
ఈ ప్రవేశమార్గంలో తూర్పు పడమరల్లో ఇరువైపులా సమాన దూరంలో రెండు రాతి ద్వార బంధాలు బిగింపబడి ఉన్నాయి. ముందువైపు (తూర్పున) ఉన్న ద్వార బంధానికి ఎత్తైన చెక్కవాకిళ్ళు అమర్పబడి ఉన్నాయి. ఈ వాకిళ్ళకూ గడపలకూ పక్కల ఉన్న గోడలపై ప్రవేశమార్గంలో అంతటా వెండి రేకు తాపడం చేయబడింది. తెల్లగా మిరుమిట్లు గొలుపుతూ ఆనందం కలిగిస్తూ ఉంది. అందువల్లే ఈ నడిమి పడికావలి ద్వారాన్ని వెండి వాకిలి అంటారు.
1929 అక్టోబరు 1వ తేదీన నైజాం ఎస్టేట్‌కు సంబంధించిన శ్రీరాం ద్వారక దాస్ పరభణీ అను వారు ఈ వాకిళ్ళకు వెండి రేకుల తాపడం చేయించినట్లు ఈ వాకిళ్లలో ఒకదానిపై హిందీలోను, మరొక వాకిలిపై ఇంగ్లీషులోను రాయబడి ఉంటుంది. ఈ వాకిళ్ళ మీద ఇంకా ప్రవేశద్వార మార్గంలో పక్కన గోడల మీద శ్రీనివాస కళ్యాణం, మహంతు బావాజీ, శ్రీనివాసుల పాచికలాట, శ్రీరామ పట్టాభిషేకం వంటి మనోజ్ఞమైన శిల్పాలు మలచబడ్డాయి. ఈ వెండివాకిలి గోపురానికి అనుసంధించి ఉత్తర – దక్షిణం 160 అడుగులు, తూర్పు పడమన 235 అడుగుల పొడవుతో మూడు అడుగుల మందంతో 30 అడుగుల ఎత్తు రాతి ప్రాకారం నిర్మింపబడి ఉంది.
ఈ రెండవ ప్రవేశద్వారం, గోపురం, ప్రాకార కుడ్యాలు క్రీ.శ 12వ శతాబ్దంలో ప్రారంభింపబడి క్రమేణ అంచెలంచెలుగా నిర్మింపబడుతూ 13వ శతాబ్దానికి పూర్తయ్యాయని చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ గోపురం క్రీ.శ.1472-82 సంవత్సరాల మధ్య పదేళ్ళలోను మళ్ళీ ఇటీవల 1950-53 సంవత్సరాల మధ్య మూడేళ్ళలోను సడలిన చోట్ల స్వల్పంగా మరమ్మత్తులు చేయబడి పునర్నిర్మింపబడింది

విమాన ప్రదక్షిణం :-
వెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అనికూడా అంటారు. సుప్రభాత సేవ జరిగేటపుడు వెలుపల అంగప్రదక్షిణం చేసే భక్తులు కూడా ఉంటారు.
ఈ ప్రదక్షిణ మార్గంలో వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాధ స్వామి, వరదరాజస్వామి, ప్రధానవంటశాల,
పూలబావి,
అంకురార్పణ మండపం,
యాగశాల,
నాణాల పరకామణి,
నోట్ల పరకామణి,
చందనపు అర
విమాన వేంకటేశ్వర స్వామి,
రికార్డుల గది,
భాష్యకారుల సన్నిధి,
యోగనరసింహస్వామి సన్నిధి,
ప్రధాన హుండి
విష్వక్సేనుల వారి ఆలయం
మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్ళుగా పేర్కొంటున్నారు.
శ్రీరంగనాథుడు :-
వెండి వాకిలి గుండా లోపలకు ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపైన కనిపించేది శ్రీరంగనాథుడు. ఈయనకు పైన వరదరాజస్వామి క్రింద వెంకటేశ్వరస్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి.
అంగప్రదక్షిణం ఇక్కడి నుంచే మొదలవుతుంది.
వీనినే పొర్లుదండాలు అంటారు.
శ్రీ వరదరాజస్వామి ఆలయం :-
విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో (సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామి వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడింది.

బంగారు బావి :-
దర్శనానంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడంతో ఉంటుంది. ఇందులోని నీటినే స్వామి వారి అభిషేకాలకు ప్రసాదాలకు వాడతారు. ఇందులో వైకుంఠం లోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనది గా చెపుతారు.
వకుళాదేవి :-
బంగారుబావి ప్రక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది.
శ్రీవారి తల్లి (పెంచిన). ద్వాపరయుగంలో యశోదయే ఈ కలియుగంలో స్వామి వారి కళ్యాణం చూడడానికి వకుళాదేవిగా అవతరించింది.
అంకురార్పణ మండపం :-

బంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు.
ఇంకా గరుడ, విష్వక్సేనుల, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.
యాగశాల :-
హోమాది క్రతువులు నిర్వహించే ప్రదేశం. కాని ఇప్పడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.
సభ అర :-
కైంకర్యాలకై ఉపయోగించే బంగారు వెండి పాత్రలు కంచాలు గొడుగులు ఉంచే ప్రదేశం.
ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విశనకర్రలను కూడా ఇక్కడే భద్రపరుస్తారు.
సంకీర్తన భాండాగారం :-
సభ అర ప్రక్కనే ఉన్న గది. దీనికి ఇరువైపులా తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్ళపాక వంశం వారు రచించిన దాదాపు 32000 సంకీర్తనలను భద్రపరిచారు.
సాధుసుబ్రమణ్యశాస్త్రి* గారి విశేష కృషి వలన ఈనాడు మనం వాటిని మననం చేసుకోగలుగుతున్నాము (3మిగతా భాగం రేపు)
2 comments