
కొండప్ప యర్రమల, అనంతపురం నివాసి. ‘ దేశప్రియ కొండప్ప’ గా ప్రసిద్ధుడు. స్వాతంత్ర్యోద్యమకాలంలో చాల సార్లు కోర్టు శిక్ష విధించింది. అనంతపురము పర్యటనకు వచ్చిన మహాత్మాగాంధీగారికి హరిజన హాస్టలుకు రెండెకరాల భూమిని దానంగా యిచ్చినాడు. మార్చి 24, 1971న నూరేండ్ల వయస్సులో చనిపోయినాడు.
— WHO’ S WHO OF FREEDOM STRUGGLE IN AP
రైతాంగఊరేగింపులలో, కేశవ విద్యానికేతన్ కోసము నిధులు సమీకరించడంలో ఎర్రమల కొండప్ప గారితో కలసి పనిచేసిన, జిల్లా రాజకీయాలలో చురుకుగా పాల్గొన్న కమ్యూనిస్టు నాయకులు జి.రామకృష్ణ గారు చెప్పిన ప్రకారం ఎర్రమల కొండప్ప గారు దగ్గర దగ్గర 110 జీవించినారు. అంటే ఎర్రమల కొండప్పగారి పుట్టిన సంవత్సరం 1861-1871మద్య వుంటుంది. అంటే ఆయన జీవించిన కాలం 1861-1871 — 24-03-1971.
ఎర్రమల కొండప్పఅనంతపురం నివాసి. తండ్రి ఎర్రమల వెంకటప్ప, తల్లి ఎర్రమల సుబ్బమ్మ. ఈయన పెద్దకుమారుడు.
కొండప్పకు చదువుపట్ల ఆసక్తి లేదు. అందువల్ల ప్రాథమిక విద్యకూడా పూర్తీ కాకుండానే విద్యాభ్యాసం ముగిసింది. సేద్యపు పనులకు నాన్న పురమాయించినాడు. ఆ పనులూ అంతంత మాత్రమే. ఆటికీ ఈటికీ తిరగడమే ఎక్కువ గా వుండేది. ప్రతి రాజకీయ సభలకు హాజరు అయ్యేవాడు. మారుతాడేమోనని బలవంతంగా ఒప్పించి పెండ్లి చేసినారు. తొలికాన్పులోనే తల్లీబిడ్డా మరణించినారు. ఆ తరు వాత ఇంటిపాటున ఉండక తిరగడం మోపైంది( ఎక్కువైంది ). రెండో పెండ్లి చేసినారు.
యింత వయసు వచ్చినా యింకా తిరగడమేమిటి? అనే మాటలు ఎక్కువైనాయి. సేద్యం యిష్టం లేదు.అందువల్ల పోలీసు ఉద్యోగంలో చేరినాడు.
1902 లోకమాన్య తిలక్ బెంగుళూరు నుండి బొంబాయి పోతూ గుంతకల్లులో ఆగినపుడు స్టేషనులో ఉపన్యాసం యిచ్చినా డు. ఎర్రమల కొండప్ప అక్కడ పోలీసువిధుల్లో ఉన్నాడు. అయన తిలక్ ఉపన్యాసం విని పోలీసు బట్టలు అక్కడే విప్పేసి కాంగ్రె సు ఉద్యమము లో చేరినాడు. చేరిన తరువాత తాగుడు వ్యసనం మానివేసినాడు.కాంగ్రెసు ప్రచారంలో నిమగ్నమైనాడు .పస లూరు ఎరికిలప్పతో కలిసి చుట్టుపట్ల పల్లెలు తిరిగి కాంగ్రెసుప్రచారము చేసేవారు. స్థానిక యువకులకు రాజకీయాలు చెప్పి, వారిని సమీకరించి కల్లంగల్ల పికెటింగు చేసేవారు. రైతులను సమీకరించి,ఊరేగింపుగా వెళ్ళి రైతు సమస్యలపై జిల్లా కలెక్టరు గారికి మెమొరాండం సమర్పించేవారు.
1921 సహాయ నిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. బ్రిటీషుప్రభుత్వము కొండప్పగారికి జైలు శిక్ష విధించి, బళ్ళారిజైలులో నిర్బంధించింది. ఆ జైలులో పృథ్వీసింగ్ ,గయాప్రసాద్ కూడా వున్నారు. పృథ్వీసింగ్( 1892 – 1989) విప్లవకారుడు. గదర్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. గయాప్రసాద్( 1867 – 1938 ) హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యుడు, గణేష్ శంకర్ విద్యార్థి, భగత్ సింగ్ , రాజగురు బృంద సభ్యుడు. బాంబు తయారికి తన ఇంటినే రహస్య స్థావరంగా ఏర్పా టుచేసినవాడు. వీరిద్దరిని బ్రిటీషుప్రభుత్వము ఒకే జైలులో వుంచక అనేక జైళ్ళకు మార్చేది.ఆ క్రమములోవీరిని కొంతకాలం
బళ్ళారిజైలులో కూడా వుంచింది. వీరితో ఎర్రమల కొండప్పకు బాగా పరిచయం ఏర్పడింది. ఎర్రమల కొండప్ప తపన, అంకిత భావము, దేశ సేవగురించి తప్ప వేరే ఏ ఆలోచన లేకపోవడం, స్వచ్చత వల్ల పృథ్వీసింగ్ ,గయాప్రసాద్ లకు చాలా ఇష్టుడు అయినాడు. జి.రామకృష్ణ చెప్పింది ఏమంటే —-పృథ్వీసింగ్ ,గయాప్రసాద్ లు ఎర్రమలకొండప్పకు “ కపాస్ ” బాంబులు చేయడం నేర్పించినారు. అయితే గాంధీగారి అహింసా సిద్ధాంతం పట్ల అచంచల విశ్వాసంగల ఎర్రమల కొండప్ప ఆ ప్రక్రియను ఉపయోగించలేదు. –
1930 మార్చిలో ఉప్పుసత్యాగ్రహము ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటినాటికి ఉద్యమములో ఒక సడలింపు చేసినారు —– “ సముద్రము అందుబాటులో లేనివారు ఎక్కడికక్కడ వున్న అవకాశాలను ఉపయోగించుకొని ఉప్పు తయారు చేసుకోవచ్చు” అని. ఏప్రిల్ 1930లో అనంతపురంలో చవుడు భూములు ( ఉప్పు భూములు)ఉపయోగించి ఉప్పు తయారుచేసి, వేలం వేసినా రు. ఉప్పు తయారుకోసం నెల్లూరునుంచి టాంకరు ద్వారా ఉప్పునీటిని తెప్పించినారని కూడా చెప్తారు. బ్రిటీషు ప్రభుత్వం ఉప్పు తయారును నిషేధించింది. ఆ నిషేధాన్ని ధిక్కరించడం మహత్తర కార్యంగా నిర్వహించినారు అనంత దేశభక్తులు. ఏప్రిల్ 10న పప్పూరు రామాచార్యులు, కల్లూరు సుబ్బారావు, రాళ్ళపల్లి రామకృష్ణమాచార్యులు, R.పద్మనాభాదాస్, D.గోవిందరెడ్డి, C.P, ఓబిరెడ్డి, వీరి సతీమణి పార్వతమ్మ ఉప్పు తయారులో పాల్గొన్నారు. ధర్మవరములో కూడా ఉప్పు తయారు చేసి, ఉప్పు పొట్లాలు వేలం వేసినారు. ఎర్రమల కొండప్ప స్వంతంగా ఉప్పు తయారుచేసి,ఉద్యోగస్తులకు, బజార్లు తిరిగీ అమ్మినాడు. —–“అనంతపురమున ఎఱ్ఱమల కొండప్ప అనునతడు ఉప్పు తయారుచేసి పురజనులందరకు రుచిచూపెను. మామూలు ఉప్పు న కంటె అది తెల్లగను, రుచిగను ఉండినది.” — అని సాధన 1930 ఏప్రిల్ 19 సంచికలో వార్తను ప్రచురించింది. ఉప్పు అమ్ముతున్న 65 ఏండ్లుపైబడిన వృద్ధుడైన ఎర్రమల కొండప్పను అరెస్టు చేయడానికి పోలీసులే సిగ్గుపడి అరెస్టు చేయలేదు.
‘హరిజన నిధి’ వసూలుకు దేశపర్యటన లో భాగంగా గాంధీ గారు అనంతపురానికి 03-01-1934 న వచ్చినారు. గాంధీగారి అవసరాలను తీర్చడానికి జిల్లా కాంగ్రెసు కొంతమంది కార్యకర్తలను నియమించింది. ఒకో కార్యకర్తకు ఒకో బాధ్యతను నిర్దేశించింది. రైతు అయిన ఎర్రమల కొండప్పగారికి చెనిక్కాయ విత్తనాలు, మేకపాలు సరఫరా చేసే బాధ్యత కేటాయిం చినారు. గాంధీజీ అనంతపుర పర్యటనలో ఉద్యమానికి పెద్దవడుగూరు చిన్నారపరెడ్డి 1116/- విరాళము గాంధీగారికి అందజేసినారు తన ఊర్లోనే, తన ఇంటికాడనే. C.N వెంకటరావు ( చిత్రకారుడు, పెనుకొండ వాసి ) గాంధీగారికి తను వేసిన చిత్రాలను బహూకరించినారు. గాంధీగారు ఆ చిత్రాలను అప్పటికప్పుడే వేలం వేసినాడు. వాటిలో ఒకదాన్ని మేడా సుబ్బయ్య, ఒకదాన్ని నీలం సంజీవరెడ్డి కొన్నారు.( సంజీవరెడ్డి గారు ఆ చిత్రాన్ని అపురూపంగా దాచుకు న్నా రు. ఆ సంఘటనను గొప్ప మధుర స్మృతిగా చెప్పేవారు. ) ఆ డబ్బును హరిజనహా స్టలుకు ఇచ్చినాడు గాంధీజీ. అదంతా గమనించిన కొండప్ప ఉత్తేజితుడై తన వంతుగా రెండెకరాల భూమిని దానంగా ఇస్తానన్నాడు. మొదట నమ్మలేదు గాంధీజీ. ‘సచ్ బోల్తా?’ అని యితరులతో విచారించినాడు .అనువాదకుడుగా వున్న పప్పూరు రామాచారి,నిర్వాహకుడుగా వున్న కల్లూరు సుబ్బారావు కొండప్ప నిజమే చెప్తున్నాడని, ఆయనకు భూమి వుందని, చెప్పినారు. కొండప్ప అప్పటి కప్పుడే రెండెకరాలకు పత్రాలు రాసి గాంధీగారికి అందజేసినాడు. ఆ స్థలంలోనే ‘కేశవ విద్యా నికేతన్’ రాజేంద్రప్రసాద్ గారిచే ప్రారంభించబడినది. ఇప్పుడున్న అంబేద్కర్ భవన్, హాస్టలు ఉన్న స్థలం వారు దానంగా యిచ్చిన స్థలంమే.
లవణ సత్యాగ్రహము సాధన – 1930 ఏప్రిల్ 19
మద్రాసులో 15-4-30 నాడు వెళ్ళిన రెండవజట్టు సత్యాగ్రహులలో మ.రా.( మహా రాజశ్రీ) శ్రీ కల్లూరు సుబ్బరావు గారి పేరు మొదటనే కనబడుచున్నది. కార్యాంతరమున మద్రాసునకు వెళ్లియుండియును, నాడు సత్యాగ్రహులలో చేరి, తమ కర్తవ్యం నెర వేర్చి సుబ్బరావుగారు మన మండలమునకు కీర్తి దెచ్చిరి. ఆ జట్టును నడిపిన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుగారికి ఆనా డే 500 జరిమానా విధింపబడెను.
అనంతపురమున ఎఱ్ఱమల కొండప్ప అనునతడు ఉప్పు తయారుచేసి పురజనులందరకు రుచిచూపెను. మామూలు ఉప్పు న కంటె అది తెల్లగను, రుచిగను ఉండినది.
యర్రమల కొండప్ప ‘శివ ‘ ( ఐదుకల్లు సదాశివన్ ) సాధన 1940 మే 18
ఇతడు మొదట పోలీసు ఉద్యోగమునందుండెను. అసహకారోద్యమము వచ్చిన వెంటనే త్రాగుడు వదలి కల్లంగడి పికటింగు చేయమొదలిడినాడు. కల్లంగడి పికటింగు చాలతీవ్రంగా జరుగుతూంటే, ప్రభుత్వమువారు సహింపలేక ఇతనికి 4 నెలలు శిక్ష విధించి జైలునందుంచిరి. జైలునుండి విడుదలై వచ్చినప్పటినుండియు నేటి వరకు ఖద్దరు దీక్షగా ధరించుచున్నాడు.
ఇతడు 1930 లో తన స్వగృహంలోనే ఉప్పు తయారు చేసి ఉద్యోగస్తులకు తానే స్వయముగా పంచినాడు. కాని, అప్పుడు ఇత నిని ప్రభుత్వమువారు అరెస్టు చేయలేదు. కాంగ్రెసు సందేశాన్ని చుట్టుపట్ల పల్లెలకు అందజేస్తుండేవాడు. 1934 లో గాంధీగా రు అనంతపురము వచ్చినపుడు హరిజనోద్ధరణకు రెండెకరముల భూమిని దానముగా యిచ్చినాడు. ప్రస్తుతము ఆ జమీనులో నే ‘శ్రీ కేశవవిద్యానికేతనము నెలకొల్పబడియున్నది. కాంగ్రెసు ఎన్నికలందు కొంచమయినను విసుగుజెందక రాత్రింబవళ్ళు పని చేసినాడు. రెండు సార్లు ఐ. సదాశివన్ తో పాటు రైతుయాత్రాదళములను తీసికొని జిల్లా కలెక్టరు దగ్గరకు పోయి రైతుల కనీసపు కోర్కెలను తీర్చవలసినదని అడిగెను
ఆధారము : – సాధన పత్రిక; ఐదుకల్లు సదాశివన్, జి.రామకృష్ణ, నాగేటి శివసంకర్, బి. నల్లప్ప గార్లతో ఇంటర్ వ్యూలు
రచయిత:- విద్వాన్ దస్తగిరి. రిటైర్డ్ టీచర్.
