
పల్లిపట్టు నాగరాజు కవితలన్నింటినీ కవిసంగమం లో ఫాలో అవుతున్నాను దగ్గరగా. యువకవుల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభా వంతుడైన కవి పల్లిపట్టు. బడుగు వర్గాల,దళిత బహుజనుల బతుకుల్లోని కడగండ్లను కళ్ళకు కట్టినట్లు మాండలికభాష యాసల్లో ప్రాంతీయపలుకుబడి నుడికారాల నేటివిటీ సొబగు ను పొదివిపట్టుకొని కవిత్వరచన కొనసాగిస్తున్నాడు.ఇదివరకు వచ్చిన అనేక కవితలలో అత్యంత శక్తివంతమైన వ్యక్తీకరణలతో తనదైన ప్రత్యేక కవితాశిల్పంతో ప్రవహిస్తున్న కవి.ఎక్కడ అన్యాయం,సామాజికమైన అణచివేత, అగ్రవర్ణాల ఆధిపత్యధోరణి,ప్రభుత్వాల వివక్ష కనిపించినా “చిరుతపులి” లా విరుచుకుపడతాడు సత్యాగ్హంతో,ధర్మావేశంతో,విప్లవకవిలా..పవిలా.(పవి అంటే వజ్రాయుధం)ఒక కవితలో శ్రీశ్రీ వప్లవోద్యమస్వరంతో”నిన్న కవిని..నేడు పవిని”అన్నాడు. పల్లెబతుకులతో మూలబంధం ముడిపడివున్న కవి అయినా ప్రపంచవ్యాప్తంగా జరిగే జాతివివక్షపట్లకూడా సద్యఃస్ఫూర్తి తో చలనశీలతతోకవిగా తన ఆగ్రహం నిర్భీతితో ప్రకటించే అగ్నిజ్వాల ,పోరుసముద్రం పల్లిపట్టు.ఇటీవల అమెరికాలో నల్లజాతి పౌరుని హత్యోదంతంపైన శక్తివంతమైన కవిత రాశాడు.నంగి నంగి మాటలుండవు.శతఘ్నిలా లావాలా విస్ఫోటనం కనిపిస్తుంది ఆయా క్రిటికల్జంక్చర్స ల్లో. అణచివేత,దౌర్జన్యాలపట్ల నిరసన,ప్రతిఘటన తన కవిత్వంలో జ్వలింపచేస్తాడు. సబాల్టర్న్ తాత్వికతతో అనేక కవితలు రాశాడు.చర్మకారుని బతుకు,సఫాయికార్మికుల బతుకుల గతుకులు ఎంతో ఉదాత్తంగా చిత్రీకరించినాడు.వస్తువైవిధ్యం కూడ పల్లిపట్టు కవిత్వంలో ని మరొక మేలిమి గుణం.తన ఇంటిలోని ఆవుదూడను గురించి విలక్షణంగా రాశాడు.తన చెల్లెలను గురించి భిన్నరీతిలో కవిత రాశాడు.తాను నిత్యం పని చేసే పొలాల్లో మట్టిని,మట్టిమనుషుల్ని,పైరుని పంటని,ఎద్దుఎనుములుగిత్తల్నిసేద్యాన్ని గురించి పచ్చి కవనసేద్యంచేశాడు.చేస్తున్నాడు.తన కళ్ళముందటి సమాజం భౌతిక వాస్తవికతను ఒడిసిపట్టుకొని కవితగా రూపొందుతున్న నిరంతర కవిశిల్పి పల్లిపట్టు మెట్టా తగుళ్ళగోపాల్ ప్రభృతులు.ఈ కవి కవిత్వపుటేరు పాయ ప్రసుతుత రుక్కమ్మత్త.చాలా సొంపైన సంపంగి లాంటి కవిత.శ్రామికస్త్ర్రీ శాపలమ్మే రుక్కమ్మ త్త. అందుకే అంత అందంగా వుంది.సౌందర్యం ఊహాజనితం కాదిక్కడ.శ్రమోత్పాద్యం అని గమనించాలి.శ్రమైకజీవనసౌందర్యం భావన కు మూలం ప్రాతిపదిక.భూమిక.ప్రసిధ్ధ పాశ్చాత్యవిమర్శకుడు బిషప్ కాడ్వెల్ సౌందర్యాన్ని గురించి మూలాన్ని చెబుతూ ఇలా అంటాడు. “BEAUTY IS THE PROCESS OF LABOUR”అన్నాడు. జాలరి పగ్గం,సాలెలమగ్గం,కమ్మరి,కుమ్మరి సమస్తవృత్తుల సమస్రచిహ్నాలివే. పల్లిపట్టు రుక్కమ్మ కవితావస్తువును ఎంచుకోవటంలో తన బతుకు మూలాలు శ్రమపాదులోంచే కనుక.నేను నా మట్టిమనిషి కవితలో కష్టం చేసి బతికే మా రైతుతల్లి ..”ఉదయాన్నే సూర్యున్ని ఎర్రబొట్టుగా పెట్టుకొని పొలాని కెళ్ళేది మా అమ్మ.పల్లెతల్లి మా అమ్మ..పాలపిట్ట మా అమ్మ..మట్టి మనిషి మా అమ్మ..ప్రపంచమంత సౌందర్యంతో పరిమళించేది మా అమ్మ..బడిలో అక్షరాలు దిద్దని మా అమ్మ మడిలో విత్తనాలు చల్లి జీవనవేదం వల్లించేది .”.ఇలాంటి పనితల్లులు రుక్కమ్మలాంటి అత్తలూ.తమ రెక్కలకష్టంతో నడుస్తూ కుటుంబాలను నడిపిస్తూవుంటారు.నవ్వుతూ కళగా బతుకును సాధన చేస్తుంటారు. THE ART OF LIVING”అంటే ఇది.రుక్కత్త కవితలో నాకు ఈ కళాత్మక జీవనం కనిపించింది.అందుకే ఈ కవి కవితను కళాత్మకం చేశాడు.చేయగలిగాడు.ఆమెలోకళనుదర్శించగలగటం కవిగా పల్లిపట్టు సృజనకారునిగా తన చూపులోని నైశిత్యం.దర్శనానైశిత్యం.”BEAUTY LIES IN THE EYES OF BEHOLDER”. ఎరుకలసానులు,గంగిరెద్దులోళ్ళు,ఆసాదోళ్ళు.తప్పెటకొట్టేవాళ్ళు.జముకు వాయిద్యగాళ్ళు, గొరవయ్యలు,మొదలైన శ్రామిక కళాకారులు. ఉన్నతమైన కవితను సమున్తంగా మా మెట్టా నాగేశ్వరరావు వ్ద్భుతంగా విశ్లేషించాడు. పల్లిపట్టు ప్రయోగించిన మాండలికపదాలవల్ల మన తెలుగుభాష పదిలంగా వుండటమే కాక వసివాడకుండ తన సొంతకాంతితో జానపద ప్రాంతీయ సొబగులతో పరిమళిస్తుందని ఆశపడుతున్నాను.ఆనందపడుతున్నాను.
__మల్లెల నరసింహమూర్తి, కవి,విమర్శకులు.అనంతపురం