
సాహిత్యం సమాజానికి ప్రతిబింబం. ఏ సాహిత్యమైనా ఆ నాటి సామాజిక ఉద్యమాలను, సామాజిక స్థితిగతులను రికార్డు చేస్తుంది. ఉద్యమాలకు సాహిత్యం ప్రేరేకంలా పనిచేస్తుంది. ఉద్యమాలు సాహిత్యకారులకు ఒక ఊపునిస్తాయి.దానితో సాహిత్యం విరివిగా ఉత్పన్నమవు తుంది. అనంతపురం జిల్లాలో ఉద్యమకారులకు సాహిత్య కారులకు కొదవలేదు. అలాంటి ఈ జిల్లాలో స్వాతంత్ర్యోద్యమ సాహిత్యాన్ని సంపూర్ణంగా వివరించలేకపోయినా రేఖామాత్రంగా పరిచయం చేయడమే ఈ వ్యాసం లక్ష్యం.
ఆలయంబునకేగ ననుమతివ్వరు మాకుస్వరాజ్యమెటుల జేకూరు మాకుఅంగళ్లపై కేగ ననుమతివ్వరు మాకుస్వరాజ్య మెటుల జేకూరు మీకుభ్రాతలము మమ్ము నేడిట్లుభ్రాంతి చేత కడకు ద్రోచినకలుగునే ఘన స్వరాజ్య మకటఇకనైనా దెలియుడే ప్రకటితముగఐకమత్యమే స్వరాజ్యకై పతాకఅంటూ ఆనాటి ‘సాధనపత్రిక (1929)’లో ‘అరుంధతీయ సమాజం’ పేరుతో పై కవితను ప్రచురించారు.

స్వాతంత్ర్యం దళితులను కలుపుకొని పోరాడటం ద్వారానే వస్తుందని, సామాజిక కులవివక్ష సరియైనది కాదని ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమంలో స్పష్టం చేసినారు. ఇది పూర్తిగా గాంధీ గారి ‘హరిజనాభ్యుదయం’ కృషి మేరకు జరిగిందని చెప్పవచ్చు. 1934లో వచ్చిన కరువు గురించి టి. గురు మూర్తి (హిందూపురం) తన కవితను ఇలా వివరిస్తాడు.
ఆకసంబు చూచి యాసలు నడగంటుచూడ్కుల భూమిపై చూపువారుఎండిన పంటలు యండని నిలుచుండికన్నీరు నవనిపై గార్చువారుబక్క ఎద్దుల గట్టి డొక్కలు గనుపింపపాతాళ గంగ పైకెత్తు వారుభార్యా బిడ్డల వీడి బ్రతుకు జీవుడా యనుచుపారిపోయెదమని బలుకువారు
ఇలా అనంతపురం జిల్లాను స్వాతంత్ర్య కాలం నుండే కరువు ఎలా పీడిస్తోందో తెలుస్తుంది. గొట్టిపాటి సుబ్బరాయలు (ధర్మవరం) గాంధీగారి పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ‘వికాస భారతం’ పేరుతో మానవుని ప్రగతి చరిత్రను శాస్త్రీయంగా తన కవిత్వంలో చెప్పేందుకు ప్రయత్నించారు. ‘గాంధీ గీత’ను కూడా రాశాడు. ఆదిమానవుడు తన భావాలను ఎలా వ్యక్తం చేసేవాడో ఎదుటి వారి భావాలను ఎలా అర్థం చేసుకునే తన కవిత్వంలో ఇలా వివరిస్తాడు సుబ్బరాయులు.
చూపులో ఊపులో నిల్చుమోపులోనుతాపులో కాలు సేతుల చావులోనుబొమల ముడిలోను భావముల్ పుణికి కౌనుచునెదుటి వారేలు హృదయ నెరుగుచుండి. రాప్తాడు సుబ్బదాసు (ధర్మవరం) 1941లో గాంధీ పిలుపుతో ‘వ్యక్తి సత్యాగ్రహం’ లో పాల్గొన్నా డు. నాలుగు నెలల జైలు శిక్ష అనుభవించాడు. అలీపూర్ జైలులో 1948లో గాంధీ తత్వములను గేయ రూపంలో రాసి ఇలా రాశారు.
“భరతమాత దాస్య బంధము తొలగవరు తెల్లశ్రీ గాంధీ తత్వమునెరిగిసత్యహింస పరిపూర్ణ సిద్ధులైచెరసాలలకు వెళ్లు రామతత్వంబు’
ఆనాటి జాతీయోద్యమ స్ఫూర్తితో కవులు తమ దేశంలో, ప్రాంతంలో ఉన్న ప్రాముఖ్యతకు సాహిత్యంలో ప్రాణం పోశారు. ఆ నేపథ్యంలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పెనుకొండ ప్రాశస్థాన్ని ఇలా వర్ణిస్తాడు తన పెనుకొండ కావ్యంలో

‘చవిన నాళుల తెలుగు కత్తులసాన బట్టిన బండఈ పెనుకొండ కొండ”
అనంతపురం జిల్లా స్వాతంత్ర్యోదమ రూపశిల్పి పప్పూరు రామాచార్యులు 1921లో గాంధీజీతో తాడిపత్రిలో కలుసుకుని ఉప్పు సత్యాగ్రహంలోపాల్గొన్నారు. 1923లో పినాకినీ పత్రికను, 1926లో ‘సాధన’ అనే పేరుతో మరో పత్రికను నడిపాడు. జాతీయోద్యమం జరుగుతున్న సందర్భంలో మద్యనిషేధం ప్రచారం కోసం ‘కల్లు పెంట’ నాటకాన్ని రచించాడు.
చెట్లుమీద కోట్లు చిగురాకు పువ్వులుఒకటి తొడనొకటి యెరసె కొనవునీతిపరుల బ్రతుకు రీతి నిట్లుండురావిశ్వ విరుత నామ వినుము రామ. అంటూ, ఆ నాడు నీతిమంతులుగా ఉండిన వారి హృదయ సంస్కారాన్ని తన పద్యంలో వివరించాడు.
కల్లూరు అహోబిలరావు 1923లో భరమాత శతకం, 1951లో పూదోట ఖండికలు ప్రచురించారు. ‘స్వాతంత్ర్య పోరాటంలో రాట్నం’ ఎలా ఉపయోగ పడిందో తన పద్యంలో చెబుతాడు.రాట్నామా ! కాదు – పోరాటంబు లుడిగించువిష్ణు చక్రంబద్ధి పృథివియందు’

గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1922లో కౌతు వెంకటరెడ్డి, సంకటి కొండారెడ్డి గార్ల సహకారంతో తాడిపత్రి నుండి ‘మాతృసేవ’ అనే పత్రికను నడిపారు. ఈ పత్రిక ఆ రోజుల్లో మంచి రాజకీయ చైతన్యం కలిగించింది. జిల్లాలో రాజకీయ చైతన్యాన్ని తెచ్చేందుకు తరిమెల నాగిరెడ్డి, విద్వాన్ విశ్వంలు ఇద్దరూ కలిసి ‘నవ్యసాహిత్యమాల’ అనే సంస్థను స్థాపించారు. ఈసంస్థ ద్వారా ఫాసిజం, లెనినిజం, అన్నా కెరినినా (టాల్ స్టాయ్ నవల) రచనలను తెలుగులోకి అనువాదం చేసి ప్రచురించారు. యుద్ధం వల్ల వచ్చే ఆర్థిక ఫలితాలు (ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది వార్) అనే కరపత్రాన్ని ప్రచురించడంతో వారిద్దరినీ ప్రభుత్వంఅరెస్టు అరెస్టు చేసింది.యుద్దం పేరుతో బ్రిటీషు సామ్రాజ్య వాదం ప్రజలను ఎట్లా పీల్చి పిప్పి చేస్తుందో ఈ కరపత్రం బట్టబయలు చేసింది. 1942లో వచ్చిన క్షామం రెండేళ్ళు ఉండింది. అప్పటి క్షామనివారణ సంఘానికి విద్వాన్ విశ్వం కార్యదర్శిగా ఉండేవారు.

తరువాత 1955లో పెన్నేటి పాటను విశ్వం రాశారు. ఈ కావ్యం సాహిత్య లోకంలో అజరామరంగా నిలిచిపోయింది. ఇలా సాహిత్యవేత్తలు, పత్రికా సంపాదకులు స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజాచైతన్య కృషిలో తమ వంతు పాత్రను నిర్వహించారు.
