
తెలుగు సాహిత్యం, పత్రికారంగాలలో ప్రాతః స్మరణీయుడు. ప్రాకృత, సంస్కృతాం ధ్ర సారస్వతాల్లో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించిన మహనీయులు…
స్వాతంత్ర్య సమర యోధునిగా, మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు…
పత్రకార శిరోమణి,కళా సరస్వతి,మహామహోపాధ్యాయ బిరుదులను పొందారు.
పరిశోదన పత్రికసంపాదకులు. “మనలిపి-పుట్టుపూర్వోత్తరాలు” పుస్తక రచయిత.
ఈ పుస్తకం ద్వార ఎన్నో విషయాలు తెలిపి భాషాచరిత్ర కే తలమానికమైయ్యారు. ఆయనే తిరుమల రామచంద్ర.
అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని రేగటిపల్లె లో తిరుమల రామచంద్ర
1913 జూన్17నజన్మించారు.
హంపీ శిథిలాలలోని గ్రామమైన కమలాపురంలో తన బాల్యం గడిపారు. వీరు విజయనగర సామ్రాజ్యంలో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు. తిరుపతిలోని కళాశాలలో తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ గా హిందీలో ప్రభాకర పట్టాలు పొందారు.
తిరుపతిలో చదువుతున్నపుడు
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పిలుపు ప్రకారం వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొని ఏడాది జైలుశిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు.
స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు.మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా
జైలు శిక్ష అనుభవించారు.
ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. ఆ ఉద్యోగాన్ని ఆత్మాగౌరవానికి భంగం కలిగిన కారణంగా విడిచిపెట్టారు.
రామచంద్ర ఆ సమయంలోనే ఉత్తర భారతదేశంలో విస్తృతమైన పర్యటన చేశారు. ఉమ్మడి పంజాబులో భాగమైన లాహోర్ పట్టణంలో కొందరు మహాపండితులను, పంజాబు పల్లెల్లో భారతీయ గ్రామీణ జీవితం, మొహెంజదారో, హరప్పా ప్రాంతాల్లో ప్రాచీన నాగరికతా చిహ్నాలను దర్శించారు.
తిరుమల రామచంద్ర
పదమూడవ యేట ఒక శృంగార రచన చేసినా మానపల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశ భక్తి గీతాలవైపు మళ్ళారు రామచంద్ర.

కొన్ని వందల వ్యాసాలు సమీక్షలు రాశారు. “హైదరాబాద్ నోట్ బుక్” వంటి 15 శీర్షికలు నిర్వహించారు.”సత్యాగ్రహ విజయం” నాటకం, రణన్నినాదం గీతాన్ని సంస్కృతంలో రాశారు.
తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవితంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకితమైనారు.
భారతావనిలో ప్రసిద్ధులైన కవిపండితులు, కళాకారులు, భాషావేత్తలు, తత్వ్త చింతకులు అయిన అనేక మందిని ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆయన రచించిన సుమారు 50 పుస్తకాల ప్రచురితమైనాయి.
తిరుమల రామచంద్ర
విద్వాన్ విశ్వం వంటి సహాధ్యాయులతో కలసి పత్రికలలో పనిచేశాడు. ఢిల్లీ లో డెయిలీ టెలిగ్రాఫ్ ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డాడు.
మీజాన్ పత్రిక లో చేరి ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలాడు.మీజాన్ 1944 నుండి 1948 వరకు హైదరాబాదు నుండి వెలువడిన దినపత్రిక.

బొంబాయికి చెందిన వ్యాపారవేత్త గులాం మహమ్మద్ కలకత్తావాలా ఈ పత్రికకు యజమాని ఏకకాలంలో ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషలలో వెలువడిన ఏకైక పత్రిక మీజాన్ .
తెలుగు సంచిక నిజాం వ్యతిరేక శక్తులకు అనుకూలమైన వార్తలను ప్రచురించేది. మీజాన్ ఆంగ్ల సంచికకు మిర్జా అబీద్ అలీ బేగ్ సంపాదకుడు కాగా ఉర్దూ సంచికకు హబీబుల్లా ఔజ్ సంపాదకుడు. అడవి బాపిరాజు మీజాన్ తెలుగు సంచికకు సంపాదకునిగా పనిచేశాడు.
తిరుమల రామచంద్ర ఆంధ్రప్రభలో పనిచేస్తుండగా నార్ల వెంకటేశ్వరరావు తో విభేధించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నాడు.తర్వాత
ఆంధ్రపత్రిక,ఆంధ్రభూమి,
హిందుస్తాన్ సమాచార్ లలో వివిధ హోదాలలో పనిచేశాడు. భారతి మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేశారు.
భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది.

భారతి తొలి సంచిక జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. మార్చి 1991 చివరి సంచిక.
ఇందులో పనిచేసిన కాలంలో దేవరకోండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురించిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశాడు.
అనంతరం పరిశోధన అనే ద్వైమాసపత్రికకు సంపాదకత్వం వహించి 1953-1956 మధ్యకాలంలో ప్రచురించాడు.
పరిశోధన పత్రిక తిరుమల రామచంద్ర సంపాదకత్వంలో వెలువడిన ద్వైమాస పత్రిక.
మద్రాసు నుండి వెలువడింది. తొలి సంచిక ఏప్రిల్, 1954న వెలువడింది. సుమారు 20 సంచికలు ప్రచురితమైంది. తెలుగు సాహిత్యంలో ఉన్నత ప్రమాణాలకు ఆదర్శంగా, నిస్పక్షపాతం, నిర్భీతి సాధనాలుగా ఈ పత్రిక వెలువడింది.
ప్రభాకర సంస్మరణ సంచిక, సోమనాథ సంచిక, ఆంధ్ర నాటక పితామహ సంచిక, గురజాడ అప్పారావు సంస్మరణ సంచిక, బుద్ధ సంచిక మొదలైన ప్రత్యేక సంచికల ద్వారా దేశంలోని ప్రముఖ పరిశోధకుల వ్యాసాలను ఆంధ్ర పాఠకలోకానికి అందించారు.
ఈ పత్రికద్వారా కుంటిమద్ది శేషశర్మ అలంకార సర్వస్వం, బులుసు వేంకటరమణయ్య అలంకార చరిత్ర మొదలైన గ్రంథాలను ప్రకటించబడ్డాయి.
ఈ పత్రికలో విద్వాన్ విశ్వం, దేవరపల్లి వెంకటకృష్ణారెడ్డి, బాణగిరి రాజమ్మ, కఱ్ఱి సాంబమూర్తి శాస్త్రి, నార్ల వేంకటేశ్వరరావు, నిడదవోలు వేంకటరావు, వేటూరి ఆనందమూర్తి, కోరాడ రామకృష్ణయ్య, దివాకర్ల వేంకటావధాని, పుట్టపర్తి నారాయణాచార్యులు, పాల్కురికి సోమనాథుడు, బులుసు వేంకటరమణయ్య, రావూరి దొరస్వామిశర్మ,
తాపీ ధర్మారావు, శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ), టేకుమళ్ల కామేశ్వరరావు, సంధ్యావందనం శ్రీనివాసరావు, ఎం.ఆదిలక్ష్మి, బండారు తమ్మయ్య, చల్లా రాధాకృష్ణశర్మ, కుంటిమద్ది శేషశర్మ, తిమ్మావజ్ఝల కోదండరామయ్య, బాలాంత్రపు రజనీకాంతరావు, కప్పగల్లు సంజీవమూర్తి, ధర్మవరము వేణుగోపాలాచార్యులు, శ్రీనివాస చక్రవర్తి,
ఖండవల్లి లక్ష్మీరంజనము, కంఠీరవ నరసరాజు, ఆలూరి బైరాగి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, బిరుదురాజు రామరాజు, పోణంగి శ్రీరామ అప్పారావు, గిడుగు వేంకట సీతాపతి, గుత్తి రామకృష్ణ, స్థానం నరసింహారావు, నీలంరాజు వేంకటశేషయ్య, రాంభట్ల కృష్ణమూర్తి, ఆరుద్ర, సెట్టి ఈశ్వరరావు తదితరులు రచనలు చేశారు.
బహుభాషా కోవిదుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్థించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూపలేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినది కాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.
‘మన లిపి – పుట్టు పూర్వోత్తరాలు’ భాషా చరిత్రకే తలమానికం.ఇతర భాషలలో కూడా ఇలాంటి రచన లేదనిఆంధ్ర విశారద తాపీ ధర్మారావు అన్నారు.
ఆయనకు ఎనలేని కీర్తి ఆర్జించి పెట్టిన పుస్తకాలు ” మన లిపి-పుట్టుపూర్వోత్తరాలు” ,
” నుడి నానుడి” , ” సాహితీ సుగతుని స్వగతం” , ” గాధా సప్తసతి తెలుగు పదాలు” , ” తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర ” రచనలున్నాయి

సాహితీ సుగతుని స్వగతం ” గ్రంధానికి 1970 లో రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం , “గాధా సప్తసతి లో తెలుగు పదాలు” కు 1986 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుండి అవార్డులభించాయి.
రెండువేల ఏళ్ళనాటి భారతీయుల సాంఘిక జీవనాన్ని కమనీయంగా వ్యాఖ్యానించడమే కాక, గాధా సప్తసతిలో ఏయే సందర్భాలలో ఏయే అర్థాల్లో తెలుగు పదాలు ఎలా కనబడతాయో వివరించారు.
కాళిదాసుపై గాధా సప్తసతి ప్రభావం ఉందని తేల్చి చెప్పారు.
రామచంద్ర గారు, చాలా చిన్న వయసులోనే భారతి పత్రిక కు వ్యాసాలు రాసే వారట. అప్పట్లో భారతి పత్రికలో వ్యాసం పడ్డం అంటే, అదో గొప్ప గౌరవమట.
తిరుమల రామచంద్ర రచించిన సాహితీ సుగతుని స్వగతం –గురించి ఓ సమీక్ష లో రవి ఇలా పేర్కొన్నారు.
సుగతుడు – అంటే మంచి మార్గమున వెళ్ళినవాడు అని అర్థం.
బుద్ధుడికి గల ఒకానొక పేరిది. (సర్వజ్ఞస్సుగతో బుద్ధః – అమరం). బహుశా బుద్ధుడి మీద అభిమానంతోనేమో, తిరుమల రామచంద్ర గారు తనని సాహితీ సుగతుడని చెప్పుకున్నారు.
ఈ పుస్తకం అట్ట చూశారుగా. పదేళ్ళ ముందు కొన్నప్పుడే దాదాపుగా జీర్ణస్థితిలో ఉన్నది ఈ పుస్తకం. ఇప్పుడు ముద్రణలో లేదు
భారతి – ఒకప్పుడు ఈ పత్రికలో వ్యాసం అచ్చవడమంటే, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి.లిట్. పొందినంత గౌరవమట. ఈ పత్రికలో రామచంద్ర గారి మొదటి వ్యాసం తమ 22 వ యేట – అంటే 1935 లో ప్రచురింపబడిందట. ఈ వ్యాసం పేరు – ఆంధ్రచ్ఛందోవిశేషములు.
ద్విపదలో ప్రాసయతిని కొందరు పండితులు పాటించలేదని బ్రహ్మశ్రీ శ్రీ వజ్ఞలసీతారామస్వామి శాస్త్రులు గారు ఆక్షేపిస్తే, ఆ వాదాన్ని పూర్వపక్షం చేస్తూ, వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వాదాన్ని సమర్థిస్తూ రామచంద్రగారు వ్రాసిన వ్యాసం ఇది.
గిడుగు రామమూర్తిపంతులు గారు ప్రభాకర శాస్త్రి గారిని ఓ మాటు కలిసినప్పుడు, ఈ వ్యాసం గురించి ప్రస్తావిస్తే, శాస్త్రిగారు రామచంద్ర గారిని చూపారట. గిడుగు రామమూర్తి పంతులు గారు ఒకింత ఆశ్చర్యపడి, “ఈ కుర్రాడా? ఎవరో శాలువా పండితుడనుకున్నాను” అన్నారట. (మూలం – హంపీ నుంచి హరప్పా దాక)
అదే యేడు డిసెంబరులో రామచంద్ర గారు “ఎసగు – పొసగు” అని మరో వ్యాసం వ్రాశారు. “ఎసగు” లో అరసున్న ఉందా లేదా అని ఆ వ్యాసం సారాంశం.
ఇటువంటి గంభీరమైన చర్చలతో బాటు, హృద్యమైన వ్యాసాలు ఈ పుస్తకంలో ఏర్చికూర్చారు. ఈ వ్యాసాలు, ప్రముఖంగా భారతి పత్రికలోనూ, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక, తదితర పత్రికలలో ప్రచురింపబడినవి.
మనలిపి – పుట్టుపూర్వోత్తరాలు : లిపి పైన తెలుగులో కానీ, మరే భాషలో కానీ ఇంత సాధికారికమైన, సమగ్రమైన గ్రంథం వెలువడలేదు అంటే అతిశయోక్తి కాదు. రామచంద్ర గారు ప్రాకృతం పరిష్కరింపబడి, సంస్కృతం గా మారిందని, సంస్కృత, ప్రాకృతాల మధ్య జన్య జనక సంబంధం లేదని ఎన్నో ఋజువులు (ఆచార్య హేమచంద్రుడు, గాథా సప్తశతి వగైరా) చూపించారు. ఈ రచనలో పాళీ నుండి సాగిన లిపి ప్రస్థానం ప్రస్తుత తెలుగు లిపి పరిణామం వరకు ఎంతో అద్భుతంగా వివరించబడింది.
లిపి గురించి తెలుసుకోవాలన్న వారు ఈ గ్రంథం చదవకపోతే, వారి ఆసక్తి, అనురక్తి, అసమగ్రం అని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఇంకో గొప్ప విషయం. ఈ రచన వ్యవహార భాషలో సాగటం. ఇలాంటి గ్రంథం వ్యవహార భాషలో అదీ 1957 కాలంలో రాయడం ఓ నేర్పు. ఇదీ విశాలాంధ్ర ప్రచురణే.
మనవి మాటలు : ఇదో చక్కని వ్యాస సంకలనం. ఇందులో కేరళ వారి “ఓణం” గురించీ, మాఘుని జ్యోటిశ్శాస్త్ర పాండిత్యం మీద, వినాయక చవితి మీద చక్కటి వ్యాసాలు.
ప్రాకృత వాఙ్ఞ్మయంలో రామకథ : పైన ఇందాక చెప్పినట్టుగా, ప్రాకృతం అన్నది జనపదాల్లో వాడుకలో ఉన్న భాష కాగా, సంస్కృతం సంస్కరింపబడి, సమాజంలో ఉన్నత వర్గాల ఆదరణకు నోచుకున్న భాష. పల్లె సీమల్లో ఉన్న జీవన రామణీయత, వారి గాథలు మొట్టమొదట సంకలనం చేసిన సహృదయుడు హాలుడు. ఆ గాథలు గాథా సప్తశతి గా పొందుపరుచబడ్డాయి.
హంపీ నుంచి హరప్పా దాక కేంద్ర సాహిత్య అకాడమీ 2002 లో పురస్కారం పొందిన పుస్తకం . తిరుమల రామచంద్ర రచనా వ్యాసంగంలో ప్రముఖమైన స్వీయచరిత్ర . దీని తొలి ముద్రణ ఆయన మరణం తరువాత రెండునెలలకు
ప్రచురించబడింది.
దీనికి ముందు మాట రాసిన అక్కిరాజు రమాపతిరావు ఈ పుస్తకం నవలకన్నా వేగంగా , ఆకర్షకంగా, ఉత్తేజభరితంగా చదివిస్తుంది అని పేర్కొన్నాడు. దీనిలో బొమ్మలు ఆకర్షణీయంగా వున్నాయని
జి.వి.అమరేశ్వరరావు
అన్నాడు. కరుణం, శుచిరుజ్జ్వలమైన శృంగారం, సుకుమార హాస్యం, పరమ మనస్విత ఈ గ్రంథం నిండా పాఠకులు పూలతోటలో విహరించేంత సంతోషాన్ని కలిగిస్తాయని పేర్కొన్నాడు.
చెప్పుడు మాటలు నాటికల సంపుటిని కన్నడంలో శ్రీరంగ ఎన్.కస్తూరి రాశారు. ఆ పుస్తకాన్ని తిరుమల రామచంద్ర తెలుగులోకి అనువాదం చేశారు.
ఇంకా తెలుగు పత్రిక సాహిత్య సేవ, బృహదారణ్యకం, మరపురాని మనీషులు, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు – పర్వాలు, హాల గాథలు, వీరగాథలు, దక్షిణాంధ్రవీరులు, కాటమరాజు కథ, శశాంకవతి, ధర్మదీక్ష మొదలైన పుస్తకాలు వ్రాశాడు.
సంస్కృతంలో సత్యాగ్రహవిజయం, సుమతీశతకం వ్రాశాడు. అనువాదకుడిగా కన్నడనవలలు శాంతల, మరల సేద్యానికి తమిళం నుండి రాజాజీ కథలు, ఆంగ్లం నుండి భక్తి వేదాంతస్వామి కమింగ్ బ్యాక్, హిందీనుండి సుశీలా నయ్యర్ వ్రాసిన గాంధీజీ కారాగారగాథ, సంస్కృతం నుండి క్షేమేంద్రుని బృహత్కథామంజరి, ప్రాకృతం నుండి లీలావతి కావ్యం తెలుగులోనికి అనువదించాడు.
1991లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం,1993లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం అందుకొన్నారు.
పత్రకార శిరోమణి
కళాసరస్వతి
మహామహోపాధ్యాయ బిరుదులను పొందారు.1997 అక్టోబరు12న హైదరాబాద్ లో మరణించారు.
రచన:- చందమూరి నరసింహారెడ్డి
