
మారుమూల గ్రామంలో జన్మించి అరకొర సౌకర్యాలు ఉన్న పరిస్థితుల్లో వాటిని జయించి సరస్వతి పుత్రునిగా పేరు గడించారు. స్వాతంత్ర్యం కూడా రాకమునుపే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించిన శాస్త్రవేత్త ఆయన. రాయలసీమకే కాదు దేశానికి ఎన్నో సేవలు అందించారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న అనంతపురం ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి ఆయన. ఆర్ట్స్ కాలేజీ మణి మకుటాల్లో ఈయన ఒకరు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు గా, శాస్త్రవేత్తగా ఆయన ఎంతో కీర్తి గడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్త లలో యం.శాంతప్ప ఒకరు.
1923, అక్టోబర్ 2 న కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో మూషి శాంతప్ప జన్మించారు.తండ్రి అరికెరి బసప్ప ,తల్లి రజొలి. ఈయన బాల్యంలోనే తండ్రి బసప్ప కుటుంబం అనంతపురం జిల్లా ఉరవకొండ లో స్థిరపడింది. ఉరవకొండలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య కొనసాగింది. అనంతపురంలోని దత్తమండల కళాశాల(ఆర్ట్స్ కళాశాల) లో ఇంటర్మీడియట్ 1939లో పూర్తి చేశారు.ఇంటర్మీడియట్ చదవుతన్నరోజల్లో
ఇతని తల్లిదండ్రులు సంవత్సరం వ్యవధిలో మరణించడం, తీవ్ర అస్వస్థతకు గురికావడం వంటి ప్రతికూల పరిస్థితులలో రెవెన్యూ శాఖలో గుమాస్తాగిరీ కోసం పరీక్ష వ్రాసి రెవెన్యూ శాఖలో కొంతకాలం, పోలీసు శాఖలో మరికొంతకాలం పనిచేశాడు. చదువు పై ఉన్న ఆసక్తి తో ఉద్యోగం వదలుకొని దత్తమండల కళాశాలలోనే బి.ఎ. రసాయనిక శాస్త్రం లోచేరి 1943 లో డిగ్రీ ఉత్తీర్ణుడయ్యాడు.ఆ తర్వాత ఇతడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1944-46లో ఎం.ఎస్.సి చేశారు. అనంతరం అప్పట్లో భారత ప్రభుత్వ స్కాలర్ షిప్ తో విదేశాలకు వెళ్లారు.
లండన్ విశ్వవిద్యాలయం లో
ఆర్.డబ్ల్యు. వెస్ట్ పర్యవేక్షణలో
1946-49లో ఆర్గానిక్ కెమిస్ట్రీ లో పి.హెచ్.డి చేశారు . 1949-51లో మరొక పి.హెచ్.డి మాంచెస్టర్ విశ్వవిద్యాలయం లో
ఫిజికల్ కెమిస్ట్రీ ఆఫ్ పాలిమర్స్ చేశారు.
ఉష్ణ గతి ప్రేరణ విధానం మీద నూతన పరిశోధనలు అనేకం చేశాడు. థర్మల్ శక్తి పరంగా, ఫోటో కెమికల్ పరంగా వినైల్ పోలిమెరైజేషన్ గూర్చి, విశేష అధ్యయనం చేశాడు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మాంగనీస్ ప్రభావం వినైల్ పోలియెరైజేషన్ వద్ద, జీరో డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండగల విధానాలను శోధించి విజయం సాధించాడు. పోలిమెర్స్, గ్రాప్ట్ కోపోలిమెర్స్ నూతన విచ్ఛేదన సంశ్లేషణ (సంయోగం) కనుగొన్నాడు.
1952లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో రీడర్‌గా ఉద్యోగం లో చేరారు.1958లో ప్రొఫెసర్ గా,1966 యు.జి.సి ప్రొఫెసర్ గా , ప్రిన్సిపాల్ గా వివిధ హోదాల్లో పనిచేశారు.1958నుంచి 1963 వరకు మధురై ఎక్స్టెన్షన్ సెంటర్‌కు ప్రొఫెసర్ గా ఉన్నాడు. 1963 లో తిరిగి మద్రాస్ విశ్వవిద్యాలయం లో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగం అధిపతిగా చేశారు.
ఇతడు అనేక జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో సుమారు 350 పరిశోధనాపత్రాలను ప్రచురించాడు. “ఇండియన్ జర్నల్ ఆఫ్ టెక్నాలజీ” మాస పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా చాలా కాలం వ్యవహరించాడు.
ఇతని ఆధ్వర్యంలో 59మంది విద్యార్థులు పరిశోధనలు జరిపి డాక్టరేట్ పట్టాలు పొందారు.
1972 నుంచి 1979 వరకు కేంద్రీయ చర్మ పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
కేంద్ర చర్మ పరిశోధనా సంస్థకు డైరెక్టరుగా ఆ సంస్థ పురోగతికి విశేష కృషి చేశాడు. యలవర్తి నాయుడమ్మ ప్రణాళికలన్నింటికి కార్యరూపం ఇచ్చాడు.
1976 లో అవంతి లెదర్ లిమిటెడ్ కంపెనీ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కో ఫౌండర్. ఈ కంపెనీ లెదర్ గూడ్స్ విదేశాలకు ఏగుమతులు చేసే స్థాయిలో కృషి చేశారు.
చర్మ పరిశ్రమకు సంబంధించి ఈయన చేసిన ప్రత్యేక పరిశోధనల ఫలితంగా చర్మ పారిశ్రామికరంగాభివృద్ధి జరిగి ఉత్పాదనా సామర్థ్యం వృద్ధి చెందింది.
మరో వైపు ఈయన చేసిన పరిశోధనల మూలంగా మన దేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. కాలుష్య రహితంగా ప్లాస్టిక్ వినిమయం అభివృద్ధి ఒకే శాస్త్రవేత్త ద్వారా ఘనతరమైన కృషి జరగడం విశేషం.
1979-80లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశాడు.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఉంటూ అనేక నూతన బోధనా విధానాలను ప్రవేశపెట్టాడు.
1980లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగం అధిపతిగా పదవీ విరమణ చేశాడు.
1981-84 మధ్యకాలంలో మద్రాసు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశాడు.
మద్రాసు విశ్వవిద్యాలయంలో అనేక నూతన విస్తరణ కార్యక్రమాలను చేపట్టాడు. నూతన విశ్వవిద్యాలయాలకు బీజం వేశాడు.
తమిళనాడు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా ఉన్నాడు.1984 లో తమిళనాడు అకాడమీ ఆఫ్ సైన్సెస్ చైర్మన్‌గా, యుజిసి రిటైర్డ్ ప్రొఫెసరుగా, 1988నుంచి91వరకు అన్నా యూనివర్శిటీ (మద్రాసు) లోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీకి సీనియర్ సైంటిస్టుగా కేంద్ర ప్రభుత్వ పథకంలో రిటైర్డ్ సైంటిస్ట్ గా,
1989నుంచి2002 వరకు
తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సైంటిఫిక్ అడ్వయిజర్ గా పదవులను నిర్వహించాడు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గౌరవ సలహాదారుగా దశాబ్దం పైగా వ్యవహరించి కాలుష్య రహిత వాతావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశాడు.
ది సొసైటీ ఫర్ పాలిమర్ సైన్స్, ఇండియా శాంతప్ప సేవలను గుర్తించి గౌరవసూచకంగా ఈయన పేరుతో శాస్త్ర సాంకేతిక పరిశోధనలలో విశిష్టమైన కృషిచేసిన శాస్త్రవేత్తకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి పురస్కారాన్ని అందిస్తోంది.
ఈయన ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ పాలిమర్స్ (ప్లాస్టిక్స్), ఫోటో కెమిస్ట్రీ, ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ,సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ లెదర్ రంగాలలో అవిశ్రాంత పరిశోధనలు చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇన్ సైన్స్ అవార్డుతో శాంతప్ప ను సత్కరించాయి. గుల్బర్గా విశ్వవిద్యాలయం ఈయన సేవలను గుర్తించి డి.లిట్ ప్రదానం చేసింది.
1967లో రసాయన శాస్త్రంలో ఎస్.ఎస్.భట్నాగర్ బహుమతి,
1982 లో ఇండియన్ కెమికల్ సొసైటీ వారి సర్ జె.సి.ఘోష్ మెమోరియల్ మెడల్,
1985 లో ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్&ఇండస్ట్రీ) చే సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు – సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ పాలిమెర్స్ లో అద్వితీయ కృషికి బహుమతులు పొందారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ లెదర్ లో కృషికి1990 లో ” వాయిస్” అవార్డు అందుకొన్నారు.
ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సస్ – బెంగళూరు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సస్ (ఇండియా) – అలహాబాదు, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ – న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సస్, తమిళనాడు అకాడెమీ ఆఫ్ సైన్సస్ లకు ఫెలోగా ఎంపికయ్యాడు. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ ఇంగ్లాండులో సభ్యులు .
శాంతప్ప లక్షీదేవి ని పెళ్లి చేసుకొన్నారు. వీరికి 3 గురు కుమార్తెలు,2 కుమారులు.
ఈయన ముగ్గురు కుమార్తెలలో ఇద్దరు డాక్టర్లు, ఒక ఇంజనీరు. ఇద్దరు కొడుకులలో ఒకరు డాక్టరు ఒకరు ఇంజనీరు. మద్రాసులోనే స్థిరపడ్డాడు. చెన్నైలో, కస్తూర్బానగర్ లో నివసిస్తున్నాడు.
93 ఏళ్ల వయస్సు లో 2017ఫిబ్రవరి26న మద్రాసు లో మరణించారు. వీరు సైన్స్ రంగంలో చేసిన కృషి చిరస్మరణీయం.
రచన:– చందమూరి నరసింహారెడ్డి 9440683219
