ఆయనో సృజనాత్మక రచయిత… భాషా పరిశోధకులు …సాహిత్య పిపాసి… అనువాద రచయిత… హిందీ తెలుగు భాషలను అధ్యయనం చేసిన సాహితీ వేత్త… మంచి విశ్లేషకులు.. హిందీ భాషా ప్రవీణుడు .హిందీ చందమామ సంపాదకుడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గ్రహీత డాక్టర్ వై బాలశౌరి రెడ్డి.

1928 జూలై 1న కడప జిల్లా గొల్లల గూడూరు లో బాలశౌరి రెడ్డి జన్మించారు. తండ్రి గంగి రెడ్డి తల్లి ఓబులమ్మ . కడప నెల్లూరు అలహాబాద్ బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.

బాలశౌరిరెడ్డి. 1946లో మద్రాసు హిందీ ప్రచార సభలో గాంధీజీని కలిశారు; హిందీలో ఆయన ‘ఆటోగ్రాఫ్’ తీసుకున్నారు. ‘ఆ సంతకం నాలో ఆసక్తిని, హిందీభాష పట్ల అభిలాషను తీవ్రంగా పెంచిం’దని తరచూ చెప్పేవారు.

హిందీ తెలుగు భాషల మధ్య బాట పరచిన మహోన్నతుడు. ఉభయభాషల్లో వారికున్న పాండిత్యం వల్ల డాక్టర్ ఎస్.ఎస్.వ్యాస్ రాసిన హిందీ రచనను తెలుగు లో
‘రామాయణ కాలంలో భారతీ సంస్కృతి’ అనువాదం చేశారు.

తెలుగువారిని హిందీవారికి పరిచయం చేసిన చాలాకొద్దిమందిలో డాక్టర్ బాలశౌరిరెడ్డి ఒకరు.
‘తెలుగు వాఙ్మయ చరిత్ర’ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేత ప్రచురించిన ఘనత కూడా ఆయనదే.

ఒక తాత్వికునిగా మనకు కనిపించే బాలశౌరిరెడ్డి గారిని గురించి మనకన్నా ఉత్తరాది వారికి బాగాతెలుసు.డాక్టర్ బాలశౌరి రెడ్డి రచనలతో హిందీ సుసంపంనమయిందనే
విమర్శకులెందరో ఉన్నారు.

తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని ఉత్తరాది వాసులకు అందించడం ద్వారా ఉభయ భారతాలకూ మధ్య వారధిని నిర్మించిన వాడు బాలశౌరి అని
డాక్టర్ రావూరి భరద్వాజ ఓ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన గురించి ఇలా అంటారు.

మదరాసులో ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలీచాలని జీతం తో సతమతమయిపోతున్న రోజుల్లో నన్ను ఆదుకొన్న మిత్రులు బాలశౌరిరెడ్డి గారున్నారు. నా కథను హిందీలోకి అనువదించి ఆ పత్రిక వారు పంపిన పారితోషికం నా ఇంటి దాకా తెచ్చి నాకిచ్చిన సన్నివేశాన్ని నేనింకా మరిచిపోలేను.

బాలశౌరిరెడ్డి గారి సాహితీసేవను గురించి మదింపు చేయగల అర్హతలు నాకు లేవు. కానీ ఆయన సచ్చీల సౌరభాన్ని పదిమందికీ పంచుదామన్న ఉత్సాహాన్ని నేను అదుపు చేసుకోలేక పోతున్నాను ఎక్కడా నాన్పుడు లేకుండా స్పష్టంగా, మరుచిరంగా చెప్పడం ఆయనగారి అలవాటు.

సిగరెట్లు, లిక్కర్ వాడడం వల్ల నువ్వు నష్టపోతావు. నీ కుటుంబం నష్టపోతుంది. కానీ అబద్దాలు, అక్రమాలు ప్రారంభిస్తే మొత్తం సమాజమే నాశనమవుతుంది. నీ కారణంగా నా కుటుంబం నష్టపడకూడదు, నీ సమకాలీన సమాజం అంతకన్నా నష్టపడకూడదు” అంటారాయన.

కృషి, పట్టుదల, దీక్ష, నిజాయితీల పట్ల పరమ విశ్వాసం ఉన్న బాలశౌరిరెడ్డి గారు తన వారందరకూ అదే చెబుతుంటారు. “మన వృత్తిలో మనం సమర్థులు కాకపొతే, మనం నిలబడలేం, బతకలేము కూడా! ఈ సమర్ధతను కృషితోనే సాధించవలసి ఉంటుంది

అదృష్టం కూడా కృషీవలున్ని వరిస్తుందేగానీ సోమరి చెంతకు పోనన్నా పోదు” అంటారాయన అంటూ రావూరి అభిప్రాయం వెలిబుచ్చారు.

వేంపల్లి ఇలా అన్నారు
65 ఏళ్లు మద్రాసులోనే ప్రవాసజీవితం గడిపిన బాలశౌరిరెడ్డి ‘నేను ఇంట ఓడి, రచ్చ గెలిచాను’ అని ఆవేదన చెందేవారు. ‘కడప నేల మట్టిలో సాహిత్య శక్తి వుంది’ అని గర్వంగా చెప్పేవారు.

కడపోత్సవాల సందర్భంగా వారికి ఘనసత్కారం జరిగింది. వారి ‘జ్ఞాపకాలు’ నేను సావనీరులో రాశాను. ఆ అక్షరాల్ని చూస్కొని కళ్లనిండా ఆత్మీయతను వర్షించారు. వారిప్పుడు లేరు. వారి రచనలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి అని డాక్టర్ వేంపల్లి గంగాధర్ ఓ విశ్లేషణ లో తెలిపారు.

1954లోనే తిక్కన, పోతన, పెద్దన, వేమన, చేమకూర వేంకటకవుల పద్యాల్ని హిందీలోకి అనువాద చేశారు.

ఆంధ్ర హిందీ పరిషత్తు, హైదరాబాద్ వారు ఆ 625 పద్యాలనూ ‘పంచామృత్’ పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకాన్ని చదివి అప్పటి గవర్నర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య బాలశౌరిని అభినందించారు.

1969లో నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’ని బాలశౌరి హిందీ పాఠకులకు పరిచయం చేశారు. 1971లో కందుకూరి వీరేశలింగం పంతులు ‘రాజశేఖర చరిత్రము’ను అనువదించారు. తర్వాతి యేడు రావిశాస్త్రి ‘అల్పజీవి’ని హిందీలోకితర్జుమచేశారు.

1966-1988 వరకు రెండు దశాబ్దాల కాలం హిందీ ‘చందమామ’కు సంపాదకుడుగా పనిచేశారు.
వీరి ఆలోచనా విధానం, ఎంపిక శైలి వంటి కారణాల వల్ల చందమామ పత్రిక సర్క్యులేషన్ 75 వేలను దాటి 1,67,000కు చేరుకోగలిగింది.

బాలశౌరిరెడ్డిగారు పరిశోధకులు, సృజనాత్మక రచయితలు. తెలుగు పత్రికా రంగం గురించి పరిశోధించి ఆయన రచించిన ‘తెలుగు పత్రికల చరిత్ర (1947-2006)’ ఒక ప్రామాణిక రచన. ఇది అర్ధ శతాబ్ది తెలుగు పత్రిక చరిత్రను వివరించి విశ్లేషించిన ఉత్తమ గ్రంథం.

బాలశౌరి రెడ్డి హిందీనవల ‘లకుమ’ కూడా ఈ ఇలాంటిదే పి.రాజగోపాలనాయుడు సాహిత్యాభిరుచి కలిగిన అతికొద్ది మంది ఆధునిక రాజకీయ వేత్తలలో పేర్కొనదగినవారు. వారు స్వయంగా నవలా రచన చేశారు. అనువాదాలు చేశారు.

బాలశౌరి రెడ్డిగారి ‘లకుమ’ను రాజగోపాలనాయుడు గారు తెలుగు అనువాదం చేశారు. 1977లో తొలిసారి ప్రచురితమైన ఈ నవలను మళ్లీ తెలుగు పాఠకుల కోసం ఎమెస్కో వారు ప్రచురించారు.ఎంతో సంతోషం.

హిందీ, తెలుగు భాషల్లో బాలశౌరిరెడ్డి అనేక రచనలు రాయటమే కాకుండా హిందీలో నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి అనువాదాలు చేశారు.

హిందీలో 72 పుస్తకాలు, తెలుగు నుంచి హిందీలోకి 24 గ్రంథాలు అనువదించారు. శౌరిరెడ్డి రచనలపై దేశవ్యాప్తంగా అనేక విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు 18 పీహెచ్‌డీలు, 11 ఎంఫిల్ డిగ్రీలు వచ్చాయి. బాలశౌరిరెడ్డి అనేక తెలుగు నవలను హిందీలోకి అనువదించారు.

బాలశౌరి రెడ్డి ఉత్తరాదిన రచనా వ్యాసాంగాన్ని చేపట్టి, తమిళనాట స్థిరపడి ఇక్కడి తెలుగు వారికి ఆత్మీయులుగా మారారు. దశాబ్దాల పాటు హిందీ సాహిత్యానికి కృషి సేసిన కృషీవలుడు డాక్టర్ బాలశౌరిరెడ్డి. ఆయన రచనలు ఆబాలగోపాలాన్ని అలరించాయి.

బాలశౌరిరెడ్డి నవలల్లో బారిస్టర్‌ ,లకుమ,కాలచక్ర ఎంతో పేరు తెచ్చాయి. సంస్కృతం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సమాన ప్రతిభ కలిగిన బాలశౌరిరెడ్డి వ్యక్తిగతంగా నిగర్విగా పేరుపడ్డారు.

తెలుగు, హిందీ భాషల్లో ఆయన పలు రచనలు చేశారు. ఆంగ్లం, కన్నడలోనూ మంచి ప్రావీణ్యం ఉంది హిందీలో ఆయన శబరి, జిందగీ కి రాహ్, యహ్ బస్తీ ఏ లోగ్, స్వప్న ఔర్ సత్య, ధర్తీ మేరీ మా, కాల్ చక్కెర తదితర నవలలను రచించారు.

వాటిలో చాలా వరకు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాలల కోసం హిందీలో తెలుగు కీ కథాయే, ఆంధ్రా మహాపురుష, తెనాలి రామ్ కి లతీఫ్ ఆముక్త మాల్యద్, దక్షిణ్ కి లోక్ కథాయేన్, తెనాలిరామ్ కికహానియాన్ వంటివి రాశారు. పంచామృత్, ఆంధ్రభారతి తదితర రచనలు కూడా ఆయనకు కీర్తి తెచ్చాయి.

బాలశౌరి రచనలు చరిత్రాత్మకంగానే కాకుండా మానవతా విలువలు కలిగి ఉండేవి. హృదయాన్ని హత్తుకునేలా సహజ నాటకీయతకు దర్పణం పట్టేవి. 1975 నుంచి 2015 వరకు జరిగిన అన్ని విశ్వ హిందీ సమ్మేళనాల్లోనూ ఆయన పాల్గొన్నారు.

పలు దేశాల్లో సాహిత్య కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయన రచించిన పంచామృతం నవలకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం, ఆంధ్రభారతి రచనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు.

ఇటీవలే ఆయన భోపాల్ జరిగిన పదో విశ్వ హిందీ సమ్మేళనంలో పాల్గొన్నారు అక్కడ బాల సాహిత్య సదస్సులో ప్రసంగించారు.

మద్రాస్ హిందీ శిక్షణ కళాశాలలో సుదీర్ఘకాలం ప్రిన్సిపాల్‌గా పని చేశారు. కోల్‌కత్తాలోని భారతీయ భాషా పరిషత్తుకు 1990-94 మధ్య డెరైక్టర్‌గా, ఆంధ్ర హిందీ అకాడమీ – హైదరాబాదుకు చైర్మన్‌గాను పనిచేశారు.

హిందీ సాహిత్య సమ్మేళన, ప్రయోగ, తమిళనాడు హిందీ అకాడమీకి అధ్యక్షులుగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వందకుపైగా అందుకున్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ 2006లో సాహిత్య పురస్కారాన్ని అందించింది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి సన్మానంతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి ప్రముఖులు నుంచి సన్మానాలు పొందిన బాల శౌరిరెడ్డి సాహిత్య ప్రేమికుడిగా కొనసాగారు.

భారత ప్రధాని చైర్మన్‌గా వ్యవహరించే కేంద్రీయ హిందీ సమితికి సలహాదారుడుగా స్థానం పొందడం ఆయన మేధస్సుకు నిదర్శనం.

సామాన్యమైన కుటుంబంలో
జన్మించి అసామాన్యమైన విజయాలను బాలశౌరిరెడ్డి సాధించారు మన లక్ష్యం మంచిది కావాలి. దాన్ని చేరడానికి ఎన్నుకునే మార్గం మంచిది కావాలి.

మార్గమధ్యంలో ఎదురయ్యే
అడ్డంకులను ఎదుర్కోగల
ఆత్మస్థయిర్యం ఆత్మవిశ్వాసం మనకుండాలి . ఇన్ని సమకూర్చుకొన్నాక, ఫలితం కోసం బాధ పడకూడదు అపజయం నీకు స్ఫూర్తినివ్వాలి గానీ, నిన్ను
నిరాశపరచకూడదు అంటారు బాలశౌరి రెడ్డి గారు

సాహితీ వినీలాకాశంలో ఓ ధ్రువతార ,తెలుగువారి ఖ్యాతిని నిలిపిన కలం యోధుడు బాలశౌరిరెడ్డి చెన్నైలోని తన స్వగృహంలో 2015 సెప్టెంబరు 15 న మరణించారు.

బాలశౌరిరెడ్డికి భార్య సుభద్రాదేవి, కుమారుడు వై.వెంకటరమణారెడ్డి, కుమార్తె భారతి ఉన్నారు.

రచన :– చందమూరి నరసింహారెడ్డి
9440683219

చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s