K.Balagopal

ఇరవై ఐదేళ్ల ఉద్యమ ప్రస్థానంలో నిత్యం పాలకులతో పోరాటమే. వేలాదిమంది విద్యార్ధులకు మానవ హక్కులపై చైతన్యం రగిలించిన స్ఫూర్తి ప్రదాత.

రాష్ట్రంలోని తాడిత, పీడిత జనాలకు అండగా, కార్మికవర్గాని చేదోడువాదోడుగా అటు ప్రజా వేదికలపైన, ఇటు న్యాయస్థానాల్లోనూ నిలబడిన హక్కుల నేత.

హింస ఎవరు చేసినా ఒకటే దానికి వ్యతిరేకంగా నిలవడమే ఆయన లక్ష్యం. పీపుల్స్ వార్, ఫ్యాక్ష్యనిస్టులు ,పాలకులు ఎవరూ చట్టవ్యతిరేకమైన చర్యలు చేసినా పధ్ధతి కాదని హక్కులు కాలరాసే స్వేచ్ఛ ఎవరికీ లేదని నిర్మొహమాటంగా వ్యతిరేకించవాడే కె.బాలగోపాల్.

నక్సల్స్‌ ఎన్‌కౌంటర్లన్నీ పోలీసు హత్యలేనంటూ న్యాయస్థానంలోవాదించిన బాలగోపాల్‌ బడుగు, బలహీనవర్గాల కోసం చేసిన పోరాటం అసామాన్యం.

కె. బాలగోపాల్ స్వగ్రామం అనంతపురం జిల్లాలోని కంబదూరు రాళ్ల అనంతపురం.
కందల్ల బాలగోపాల్
1952, జూన్ 10 న జన్మించారు. వీరి తండ్రి పార్థనాథశర్మ తల్లి రాళ్ళపల్లి నాగమణి. వీరికి 8మంది సంతానం. ఈయన 5 వ వాడు. వీరిది మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం.

తండ్రి భీమా రంగ సంస్థలో ఉద్యోగి.తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు నుండి విజయనగరం వరకు వివిధ పట్టణాల్లో ప్రాథమిక, మాథ్యమిక విద్య కొనసాగింది. కావలి పట్టణంలో ఇంటర్ మీడియెట్, తిరుపతి లో బి.యస్సీ వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ లో యం.యస్సీ, డిల్లీలోని ఇండియన్ స్టాటస్టికల్ ఇనిస్టిట్యూట్ లో పి.హెచ్.డి చేశారు. 1981 లో కాకతీయ యూనివర్సిటీలో గణిత ఉపన్యాసకులు గా చేరారు.

1985లో ఉద్యోగానికి రాజీనామా చేసి హక్కుల ఉద్యమానికే పూర్తిగా అంకితం అయ్యారు. మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి సలిపిన ప్రముఖ హక్కుల నేత, న్యాయవాది, హేతువాది మేధావి.

ఆచరణకు, వ్యక్తిగత జీవితానికి మధ్య ఆయన తేడాను పాటించలేదు. తాను చెబుతున్న విలువలను ఆయన తన వ్యక్తిగత జీవితంలో అనుసరించారు. ఆయన తన అనుభవాల నేపథ్యం నుంచి, కార్యాచరణ నుంచి ప్రజా ఉద్యమాలను ప్రశ్నించారు. భరించలేని విప్లవోద్యమ మేధావులు సహించలేకపోయారు.

పౌరహక్కలకు ఊపిరినిచ్చారు. ఆయన బాహ్య ప్రపంచం దాడులకు, బెదిరింపులకు ఏనాడూ లొంగిపోలేదు. విప్లవోద్యమంలోని లోటు పాట్లను ప్రశ్నించినందుకు ఆయనపై దారి తప్పిన బాలగోపాల్ అంటూ, ఇతరత్రా విమర్శల దాడి జరిగింది.

అయినా ఆయన చలించలేదు. సమాజాన్ని మార్చాలని, కనీస విలువల వైపు సమాజాన్ని నడిపించాలని ఆయన ప్రయత్నించారు. జీవితంలో ఆయన ఏ రోజు కూడా రాజీపడలేదు.

పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన బాలగోపాల్ జీవితాంతం ఉద్యమంలో కొనసాగారు.
రాష్ట్రంలో ‘పౌర హక్కులు’ అనే మాట చెవినపడగానే గుర్తుకొచ్చే వ్యక్తి ఆయనే. హక్కుల ఉద్యమానికి తన జీవితాన్నే ఆయన చిరునామాగా చేసుకున్నాడు.

ఎక్కడ అసహాయుల హక్కులు బలవంతుల ఉక్కు పాదాల కింద అణగారిపోతున్నట్టు తెలిసినా అక్కడ వాలడం ఆయన తనకు తాను విధించుకున్న ప్రథమ కర్తవ్యం. నిజానిజాలు శోధించడం, హక్కుల హననానికి ఆనవాళ్లు కనిపించగానే ఆ సంగతి లోకానికి చాటింపు వేయడం, వీలైన ప్రతిమార్గంలో దానిపై పోరాటం చేయడం- ఇదే గత మూడు దశాబ్దాలుగా ఆయన ప్రధాన కార్యక్షేత్రం.

గణితశాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన మానవతా విలువలకోసం పోరాడారు. ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకుపోయిన నాయకుడాయన.

ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడారు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై ఎన్నోసార్లు భౌతిక దాడులు జరిగినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు.

పౌర హక్కుల ఉద్యమ పరిధి ఆయనకు సరిపోలేదు. అభివృద్ధికి ఆవల ఉన్న సమూహాల కోసం పోరాడేందుకు అది పరిమితులు విధించిందని అనుకోవాలి. అందుకే ఆయన మానవ హక్కుల వేదికను స్థాపించారు.

గణితంలో దిట్ట అయిన బాలగోపాల్ సమాజం లెక్కలను తీశారు. ఆయన రాసిన రూపం – సారం పుస్తకం తెలుగు సాహిత్య విమర్శకు ఒక నమూనాగా పనికి వస్తుంది.

కన్యాశుల్కం – రాజ్యం – రాజ్యాంగ యంత్రం! పేరుతో ‘నూరేళ్ల కన్యాశుల్కం’ ప్రత్యేక సంచిక బాలగోపాల్ రాసిన వ్యాసంలో కోర్ట్ ల గురించి
ఇలా అంటారు.

బ్రిటిష్ వాళ్ల కోర్టులు వాళ్ల దేశంలో ఎట్లా పని చేస్తాయోగానీ ఇక్కడ మట్టుకు వాటిని నెలకొల్పిన నాటి నుండి ఈనాటి దాకా ఒకే రకంగా భ్రష్టు పట్టి ఉన్నాయి. ఒక్క కోర్టు సంగతే ఎందుకు, రాజ్యాంగ యంత్రమంతా అంతే. రాశిలో నానాటికీ పతనం లేకపోలేదుగానీ గుణం మట్టుకు ఆనాడూ ఈనాడు ఒక్కటే. ‘మా చట్టాలు మంచివే కానీ మా రామప్ప పంతులు వినియోగం తెలివితేటలు వాటిని భ్రష్టు పట్టించాయని తెల్లవాళ్లంటారేమో.

కానీ, నిష్పాక్షికంగా మాట్లాడు కుంటే ఆ చట్టాలు ఈ కరణీకపు తెలివితేటలకూ సరిగ్గా అతికింది దానికోసం ఇది, దీని కోసం అదీ అన్నట్లు సరిపోయాయి రెండూ. అగ్ని హోత్రావధాన్లుకు మెకాలే గురించి తెలీదుగానీ తెలిసి వుంటే ‘అత గాడు కూడ కరణమేనష’ అని వుండేవాడేమో.

న్యాయవ్యవస్థ ఈ మధ్యనే మరీ పాడయిపోయిందనీ, ఒకప్పుడు ముఖ్యంగా తెల్లవాళ్ల పాలనలో చాలా బాగుండిందనీ మనల్ని నమ్మించడానికి పెద్దలు ప్రయత్నం చేస్తుంటారు.

నానాటికీ పాతాళా నికి చేరువ అవుతున్న అధోగమనాన్ని కాదనవసరం లేదుగానీ ఈ చెట్టుకు చీడ విత్తనం
నాడే పట్టిందని గుర్తించకపోతే మాత్రం చరిత్ర గమనాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లమవుతాం.

“వకీళ్లు అబద్ధాలాడిస్తే
న్యాయం కనుక్కోవడానికి జీతం పుచ్చుకునే జడ్జి
ఏంజేస్తాడండీ? అని అడిగితే, “ఉభయ పార్టీల
వకీళ్లు అడించే అబద్దాలు చేయి పీకినట్టు రాసు
కుంటాడు”. ఈ మాటలు ఇవ్వాళ కొత్తగా వృత్తిలోకి
దిగి అధర్మాలు ఇంకా చెడని యువ న్యాయవాది
అంటుంది కావు. 100 ఏళ్ల క్రితం సౌజన్యారావు అన్నమాటలు
ఇవ్వాళ అదనంగా ఏమనగలం?

జడ్జిగారు ఇరు పార్టీల అబద్ధాలను చేయి పీకేటట్టు రాసుకోవడమేకాక ‘ఆ రెండు అబద్ధాలు దేనిని తాను
సత్యంగా గుర్తించాలో నిర్ణయించుకోవడానికి చేయితడుపుకుంటాడు’ కూడా అని ఈనాడు
వాళ్లు అంటారేమో. ఆనాడు మట్టుకు ఇది లేదా ?
సమాజంలో నీతికీ నడవడికకూ ప్రమాణాలను
నిర్దేశించేవిధాయకులుంటారు. వాళ్లపట్ల విధేయత
మన ధర్మం అంటూ బాలగోపాల్ పేర్కొన్నారు.

రాజ్యహింసతోపాటు ప్రైవేటుహింసను ఆయన వ్యతిరేకించాడు. పౌరహక్కుల సంఘం నుంచి ఆయన 1996లో విభేదించి బయటకొచ్చి మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ను ఏర్పాటుచేశారు. ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసీ నక్సలైట్లు రాజ్యహింసకు వ్యతిరేకంగా హింసా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆయన ఖండించారు.

రాజ్యహింసతో పాటు ప్రజలపై గుండాలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు చేసే హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించారు. నక్సల్బరీ ఉద్యమానికి ఎంతోమంది కార్యకర్తలను అందించిన ఆయన ఆ తర్వాత క్రమంలో విప్లవపార్టీల వైఖరిని తప్పుబట్టారు.

ప్రజలకు చేరువకావడంలో ఎం.ఎల్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆయన రాసిన ‘నక్సల్బరీ ఉద్యమం, గమ్యం, గమనం’, ‘చీకటి కోణం’ పుస్తకాలు సంచలనం సృష్టించాయి.

ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన హత్యానేరం నమోదు చేయాలని ఆయన గట్టిగా వాదించి విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టని పల్లె లేదు, పట్టణం లేదు. అరణ్యాల నుంచి జనారణ్యాల వరకూ ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయనతప్పనిసరిగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్యయనం చేసేవారు.

అందుకే మన భౌగోళిక, నైసర్గిక స్థితిగతులపై ఆయనకున్న జ్ఞానం అపారం. కాలుష్యం, విద్యా వ్యాపారం, సెజ్‌లు, నిర్వాసితులు, మురికివాడలు, కాశ్మీర్ సంక్షోభం, మైనారిటీ హక్కులు, మహిళా హక్కులు, విద్యార్థి హక్కులు, సంప్రదాయ వృత్తులు, అణుపరిజ్ఞానం, గిరిజనుల ఆనారోగ్యం.. ఇలా మన రాష్ట్రం, దేశం ఎదర్కొంటున్న ఏ సమస్యపైన అయినా ఆయన లోతైన అవగాహన కనబరుస్తూ మాట్లాడేవారు.

కల్లోల లోయ పుస్తకాన్ని పౌరహక్కుల ఉద్యమనేత, సాహిత్యవేత్త కె.బాలగోపాల్ రచించారు. ఇందులో
1995 నుండి 2003 మధ్యకాలంలో 5సార్లు కాశ్మీరులో పర్యటించిన మానవ హక్కుల సంఘాల నిజనిర్ధారణ కమిటీ నివేదికల సారాంశం పొందుపరచడం జరిగింది.ఈ పుస్తకం లో ఆంగ్లంలో ముద్రితమైన ఆ నివేదికలను తెలుగులోకి అనువదించి క్రమానుగత కథనాన్ని అందించే ప్రయత్నం చేశారు.

చారిత్రిక నేపథ్యాన్ని మాత్రం వివిధ చరిత్ర గ్రంథాలు, కశ్మీరీ మేధావులతో జరిపిన సంభాషణలపైన ఆధారపడి రచించినట్టు స్వయంగా బాలగోపాల్ పేర్కొన్నారు.

ఎంత సంక్లిష్టమైన అంశాన్ని అయినా సూటిగా, తేటగా వివరించి చెప్పగల రచయిత ఆయన. అలాగే లోతుల్ని తరచి చూసి మరుగుపడిన వాస్తవాలను వెలికిలాగి కొత్త కోణాలను, అన్వయాలను ఆవిష్కరించిన కలం ఆయనది. చివరివరకూ పత్రికలకు వ్యాసాలు రాస్తూనే ఉన్న బాలగోపాల్ తాను మంచిదని నమ్మిన ప్రతి అభిప్రాయాన్ని కుండ బద్దలుకొట్టినట్లు వెల్లడించడానికి ఎన్నడూ వెనుకాడని వ్యక్తి.

దళిత,నిగాహ్,
మతతత్వం పై బాలగొపాల్,
రాజ్యం సంక్షేమం,
సాహిత్యం పై బాలగొపాల్,
హక్కుల ఉద్యమం,
ముస్లిం ఐడెంటిటీ : హిందుత్వ రాజకీయాలు,కల్లొల లోయ,
జల పాఠాలు తదితర రచనలు ఆయన కలం నుంచి జాలువారినవే.

ఎన్నో చరిత్ర గ్రంథాలను, డీడీ కోశాంబి వంటి తత్వవేత్తలను తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ పుస్తకాలు రాశారు. హైకోర్టులో పేదలు, కార్మికులు, నిర్వాసితుల వంటి బాధితుల పక్షానే వాదించారు. నేల, నీరు, అడవులు వంటి ప్రకృతి సంపదను కోట్లాది మంది జీవనోపాధికి ఉపయోగించాలి.

సెజ్‌లు వంటి అభివృద్ధి పథకాల పేరుతో ప్రభుత్వం స్థానిక ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తోందని, వారి జీవనోపాధికి విఘాతం కలిగిస్తోందని నిర్భయంగా చెప్పే వాడు.

ఆయన భార్య వసంత లక్ష్మి ఆంధ్రజ్యోతి పత్రికలో పాత్రికేయురాలు. కుమారుడు ప్రభాత్. బాలగోపాల్ దీర్ఘకాలంగా అల్సర్‌తో బాధపడ్డారు. 2009 అక్టోబర్ 8 వతేది రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.

రచన:– చందమూరి నరసింహారెడ్డి 9440683219

చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s