ఆత్మహత్యలు లేని అనంతపురం కావాలి

అమరావతి నేడు ఏపి ప్రజల చెవులలో మారు మ్రోగుతున్న పదం. వెలగపూడి తాత్కలిక సచివాలయం నుంచి విధులను నిర్వహించడానికి ఒక్కోశాఖ తరిలి వస్తుండటంతో ప్రచార సాధనాలు, అధికార పార్టీ నేతలు తాము పులకించి ఏపి ప్రజలందరిని కూడా తమతో బాటు పులకించమని, అమరావతి వైపు ముందుకు సాగాలని హితబోద చేస్తున్నారు. ఇక సిబ్బంది అయితే తాము నూతనంగా ఉద్యోగంలో చేరినంత ఆనందంగా ఉందని సెలవిస్తున్నారు. కరువుతో అల్లాడుతున్న సీమ జనం ఏమి పాలుపోక దిగాలుగా ఆకాశం వైపు చూస్తున్నారు.
గౌతమ బుద్దుని అస్థికల తో పునీతమైన ప్రాంతంగా అమరావతిని రాయలసీమ ప్రజలు అభిమానిస్తారు. అక్కడి ప్రజలను ప్రేమిస్తారు కూడా. కాని శ్రీబాగ్ ఒప్పందానికి భిన్నంగా సీమలో ఉండాల్సిన రాజధానిని అమరావతిలో నిర్మించడాన్ని రాయలసీమ ప్రజలు అంగీకరించరు. విభజన అనంతరం 13 జిల్లాల ఆంద్రప్రదేశ్ లోని మొత్తం ప్రజల జీవన ప్రమాణాలు ఒకే రకంగా లేవు. రాయలసీమ, ఉత్తరాంధ్ర తీవ్రమైన కరువుతో అల్లాడు తున్నాయి. మిగిలిన నాలుగు జిల్లాలు అటు, ఇటుగా అభివృద్ధి చెందాయి. బాధ్యత గల ప్రభుత్వం ఏదైయినా తమ ప్రాదాన్యతల లో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిని ప్రథమ ప్రాధాన్యత గా నిర్ణయించుకుంటాయి. కాని మన బాబు గారి ప్రభుత్వం మాత్రం అందుకు బిన్నంగా అభివృద్ధి చెందిన ప్రాంతాన్నే మరింత అభివృద్ది చెందేలా తమ విధానాలను నిర్ణయించుకుంది. పలితంగా వెనుక బడిన రాయలసీమ మరింత నష్టపోతున్నది. అధికారిక లెక్కల ప్రకారమే ఏపి మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో సింహ బాగం సీమవారే అందులోను అనంతపురం పరిస్దితి అత్యంత దయనీయం. ఒక్క అనంత నుంచే ఈ కాలంలోనే బ్రతుకు కోసం లక్ష మంది వలసబాట పట్టారు అంటే తీవ్రత అర్దం అవుతుంది.

ఇలాంటి స్దితిలో బాధ్యత గల ప్రభుత్వం చేయాల్సిన పని ఆత్మహత్యల నివారణ, రైతులలో భరోసా కల్పించడం. అందుకు సమగ్ర ప్రణాళికను రూపోందించడం. కాని బాబుగారి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో ఏదైనా సమగ్ర ప్రణాళిక అంటూ రూపొందించింది అంటే అది అమరావతికి మాత్రమే. రాజధాని, పట్టిసీమ, వివిధ ప్రతిష్టాత్మక సంస్దలు, పోలవరం లాంటివి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి చాలదంటు వేల కోట్ల రూపాయిలను నిన్న గోదావరి, నేడు క్రిష్టా పుష్కరాలకు వెచ్చించుతున్నది. కనీసం ఆ నిధులనైనా సీమ ప్రాజెక్టులకు వెచ్చించి ఉంటే అనేక ప్రాజెక్టులు పూర్తి అయి ఉండేవి. ప్రభుత్వ వివక్ష ఎంత దారుణంగా ఉంది అంటే ఆకలితో అలమటిస్తున్న అనంతలో కాకుండా అన్న క్యాంటీన్లలను సైయితం అమరావతిలో ప్రారంభించారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి.
రాజరికం లో సైతం కరువుతో ఒక ప్రాంతం ఉన్నపుడు దేశ రాజు అద్బత కట్టడాలను కాకుండా కరువుతో అల్లాడుతున్న జనాన్ని ఆదుకునే చర్యలు చేపట్టినట్లు చరిత్ర చెపుతున్నది. కాని ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకునే మన పాలకులు మాత్రం సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్న సీమ జనాన్ని పట్టించు కోకుండా అద్భుత రాజధాని అమరావతి అంటూ ముందుకు వెల్లడం అత్యంత అప్రజాస్వామికమే కాదు అమానవీయం కూడాను. అందుకే నేడు రాయలసీమ ప్రజల పయనం అద్భుత అమరావతి వైపుకాదు తమ అనంతపురం ప్రజల ఆత్మహత్యల నివారణ కోసం పోరాటం వైపు, రాయలసీమ ప్రజల గమనం బ్రతుకు కోసం వలస వెల్లనవసరం లేని తమ కాళ్లాపై తాము నిలబడగలిగే రోజు వైపు.అంతిమంగా రాయలసీమ ప్రజల గమ్యం ప్రపంచం ముందు సాయం కోసం ఎదురు చూచే పరిస్థితి నుంచి ధైర్యంగా తలెత్తుకుని నిలబడే సమాజం కోసం.
(M.purushotham Reddy, june 2016)