Pendekanti Venkata subbaya

సాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటేరియన్‌,విద్యావేత్త,
పారిశ్రామిక వేత్త. మాజీమంత్రి
దేశ నిర్మాణానికి పలు విధాలుగా కృషి చేశారు. ఈ క్రమంలోనే ఆయన జాతీయోద్యమకారుడుగా, కాంగ్రెస్‌ నాయకుడుగా, ప్రజాప్రతినిధిగా, గవర్నర్‌గా ఎన్నో పదవులు నిర్వహించారు. మంచి వక్త, చక్కని పాలనాదక్షుడు, ప్రతిభా మూర్తి, జాతీయ వాది…రాయలసీమ వాసి పెండేకంటి వెంకటసుబ్బయ్య.

కాంగ్రెస్ సీనియర్ నేత పెండేకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యుడు గా నాలుగుసార్లు, ఆదోని పార్లమెంట్ సభ్యుడు గా రెండుసార్లు గెలుపొందారు.

పెండేకంటి వెంకటసుబ్బయ్య కర్నూలు జిల్లా, బనగానపల్లె సంస్థానంలోని సంజామల గ్రామంలో ఒక సంపన్న రైతు కుటుంబంలో, 1921 జూన్ 18న జన్మించారు.

నంద్యాల, మదనపల్లె లో వీరి విద్యాబ్యాసం జరిగింది.
నంద్యాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే జాతీయోద్యమ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు.

విద్యార్థి సంఘ నాయకునిగా జయప్రకాశ్‌ నారాయణ, బాబూ రాజేంద్ర ప్రసాద్‌లను కర్నూలు జిల్లాకు రప్పించి ఉపన్యాసాలు ఇప్పించారు. 15 సంవత్సరాల ప్రాయంలోనే గాంధీజీ పిలుపు మేరకు ఖద్దరు వస్ర్తధారణను ఆరంభించారు.

మదనపల్లె బీటీ కళాశాలలో
చదువుతున్న వెంకటసుబ్బయ్య
బీటీ కాలేజి ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మగాంధీ బహిరంగ సభకు హాజరయ్యారు. గాంధీజీ ఉపన్యాసానికి ఆకర్షితులై ఎంతో మంది మదనపల్లె యువకులు ఉద్యమబాట పట్టారు.

క్విట్ ఇండియా, హోం రూల్ ఉద్యమంలో భాగంగా ఇప్పటి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీటీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు.

అప్పట్లో ధర్నాలంటే ఆషామాషీ కాదు. చాలా పెద్ద నేరం కింద జమకడతారు. ఆందోళన చేసే వారిపై బ్రిటీష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారు. అప్పటి బీటీ కాలేజి విద్యార్థులైన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే సిదాస్, నూతి రాధా కృష్ణయ్యలతోపాటు 40మందిని అరెస్టు చేశారు.

కర్ణాటక రాష్ట్రం, బళ్ళారి జిల్లాలోని అలేపురం జైల్లో నిర్భందించారు. వీరిలో 28 మందికి కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది.

బనగానపల్లె సంస్థానంలో కాంగ్రేస్ ను స్థాపించి, స్వాతంత్ర్యం తర్వాత 1948లో బనగానపల్లె సంస్థానం భారతదేశంలో విలీనం కావటానికి దోహదపడ్డాడు.

1949లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో వెంకటసుబ్బయ్య సభ్యునిగా చేశారు. ఆంధ్ర రాష్ర్టానికి కర్నూలును రాజధానిగా చేయడంలో కీలక పాత్ర పోషించారు.

1950వ దశకం నుంచి 1985 వరకు రాష్ట్రరాజకీయాల్లో వెంకటసుబ్బయ్య చక్రం తిప్పారు. 1952నుంచి1957 వరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, 1969నుంచి 1971వరకు ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రదాన కార్యదర్శి గా పని చేశారు.

నంద్యాల కేంద్రంగా కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడుగాను ,
నంద్యాల సహకార చెక్కెర కర్మాగారం అధ్యక్షులు గా , న్యూడిల్లీ దక్షిణ భారత నటీ నటుల సమాఖ్య అధ్యక్షుడు గా పనిచేశారు.

1952లో జరిగిన తొలి ఎన్నికల అనంతరం నంద్యాల లోక్‌సభ స్థానం రద్దయింది.
కొత్తగా ఆదోని లోక్‌సభ ఏర్పడింది.1957లోఆ స్థానం నుంచి పెండెకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేశారు. తన ప్రత్యర్థి వైజీ గౌడ్‌ పై విజయం సాధించి ఆదోని పార్లమెంట్ మొదటి సభ్యులు, రెండవ లోకసభ సభ్యులు గా లోకసభలో తొలిసారి అడుగు పెట్టాడు.

1962లో కూడా ఆదోని ఎంపీ స్థానం నుంచే పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి శంకర్‌రెడ్డిపై
రెండో సారి గెలిచారు. పార్లమెంట్ అకౌంట్ కమిటీ లో 1963 నుంచి 1965 వరకు పని చేశారు.

1967లో తిరిగి నంద్యాల ప్రత్యేక పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది.
అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో పెండేకంటి వెంకటసుబ్బయ్య
మూడోసారి పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 1967 నుంచి1969 వరకు ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు.
బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ప్రివిలైజ్ కమిటీ సభ్యులు గా పనిచేశారు.

1971లో పెండేకంటి వెంకటసుబ్బయ్య
యన్.సి. ఎ. అభ్యర్థి కానాల అంకిరెడ్డి పై గెలిచి నాలుగో సారి లోక్‌సభలో అడుగు పెట్టారు.

1977 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈయన
బి.యల్. డి పార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డి చేతిలో ఓడిపోయారు.

1978లో నీలం రాష్టప్రతి గా ఎన్నికైయ్యారు.దీంతో 1978లో ఉపఎన్నికలు జరిగాయి.

1978లో జరిగిన ఉప ఎన్నికల్లో పెండేకంటి పోటీచేశారు ఆ ఎన్నికల్లో యస్.ఆర్. బి.సి పూర్తి చేయించి నీళ్లు ఇస్తానని పెండేకంటి ప్రచారం చేసాడు.
ఈ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి గోమాంగో పై పెండేకంటి గెలిచిఐదోసారి యం.పి అయ్యారు.

అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద పెండేకంటి ఒత్తిడి తెచ్చి పనులు త్వరగా మొదలు కావటానికి దోహదం చేశారు.
యస్.ఆర్. బి.సి పోతిరెడ్డిపాడు పనులు మొదలు కావటం వెనుక పెండేకంటి వెంకటసుబ్బయ్య కృషి ఎంతో ఉంది.

1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌-యూ అభ్యర్థి ఆసీఫ్‌బాషాపై పెండేకంటి విజయం సాధించారు. ఆరోసారి ఎంపీగా ఎన్నికై జిల్లా నుంచి అత్యధి సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి నాయకుడిగా రికార్డుకెక్కారు .

1980 నుంచి 1984 వరకు
ఇందిరాగాంధీ ప్రభుత్వంలోకేంద్ర హోంశాఖ సహాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి గా పనిచేశారు. బనగానపల్లె మీదుగా రైల్వే మార్గం కోసం ఈయన చాలా కృషి చేశారు

పార్లమెంట్ సభ్యులు గా
రష్యా, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, శ్రీలంక, రుమేనియా దేశాలలో వివిధ కమిటీ ల్లో అద్యయనం కోసం పర్యటించారు.

1984 లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థి మద్దూరి సుబ్బారెడ్డి చేతిలో పెండేకంటి ఓడిపోయారు.

ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ, ఆయన్ను గవర్నర్ గా నియమించారు.

1985 మార్చి1988 ఫిబ్రవరి వరకు బీహార్ రాష్ట్ర 11 వ గవర్నర్‌గా పనిచేశారు.

1988 ఫిబ్రవరి నుంచి1990 ఫిబ్రవరి వరకు కర్ణాటక రాష్ట్ర 10వ గవర్నర్ గా పని చేశారు.
మన రాజ్యాంగం’ అనే గ్రంథాన్ని రాశారు.

పెండేకంటివెంకటసుబ్బయ్య వాసవీ విద్యాసంస్థలను స్థాపించారు.
వాసవీఇంజనీరింగ్ కళాశాల, పెండేకంటి న్యాయ కళాశాల, పెండేకంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్, వాసవీ సంగీత, నాట్య కళాశాల మొదలైన అనేక విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశారు.

పెండేకంటి వెంకటసుబ్బయ్య
1943 ఫిబ్రవరిలో కనకమ్మ ను పెళ్లి చేసుకొన్నారు.వీరికి
ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.1993 అక్టోబర్‌ 12న వెంకటసుబ్బయ్య మరణించారు.

రచన :– చందమూరి నరసింహా రెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s