నాగసూరి వేణుగోపాల్

                      “తాను ఇష్టపడ్డ రంగంలో పనిచేసే అవకాశం చాలా కొద్దిమందికి కలుగుతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకుంటే నేను పొందిన పురస్కారాలు, బహుమతుల కంటే నా వృత్తి లో కలిగిన సంతృప్తి నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది.” అంటారు వేణుగోపాల్. సుదీర్ఘ కాలంగా ఆకాశవాణి లో పనిచేయడం ద్వారా జర్నలిజంతో పాటు సాహిత్యం మీద తనకున్న మమకారాన్ని తీర్చుకోవడానికి అవకాశం కలిగిందంటారాయన. దాంతో పాటు తాను చదివిన వైజ్ఞానిక శాస్త్రం (భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు, ఎం.ఫిల్., చేశారు.) తార్కికంగా, అర్థవంతంగా రచనలను ముగించడానికి అంతర్లీన ప్రవాహంగా ఉపయోగ పడుతుందని భావిస్తారు. జర్నలిజం పట్ల తీరని దాహం లోతైన అధ్యాయానికి దారి తీస్తే, సాహిత్యం పట్ల గల అపారమైన ప్రేమ ప్రభావవంతమైన వ్యక్తీకరణను కలిగించడానికి తోడ్పడిందంటారు.          ఫిబ్రవరి 1, 1961 న అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లి గ్రామంలోనాగసూరి గౌరమ్మ, సంజీవయ్య దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించారు. శ్రీవెంకటేశ్వరవిశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో ఎం.ఎస్పి., ఎం.ఫిల్., తర్వాత ఆంధ్రా విశ్వ విద్యాలయం నుండి జర్నలిజంలో పి.హెచ్.డి. చేశారు. గ్రామీణ నేపథ్యం, తాను చవిచూసిన పేదరికం, చదివిన వైజ్ఞానిక శాస్త్ర పాఠాలు, ఆధునిక సామాజిక దృక్పథం, తానెంతో ఇష్టపడే సాహిత్యం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఆకాశవాణి ఉద్యోగం, కొనసాగిస్తున్న మీడియా పరిశోధనలు, వెరసి వేణుగోపాల్ గారిని మానవతా విలువలు కలిగిన, హేతుబద్ధమైన, రచయితగా, ప్రయోక్తగా, మేధావిగా తీర్చిదిద్దాయి.   

    1978 లో ఆంధ్ర పత్రిక లో ఎన్నికల నేపథ్యంలో ప్రచురితమైన మొట్టమొదటి రచన నుండి వీరిరచనా ప్రయాణం జనరంజక విజ్ఞానం, పర్యావరణం, పత్రికారంగం, టీవీ చానళ్ళు, సాహిత్యం, సామాజికఅంశాలు ఇలా అనేక రంగాలలో రెండు వేలకు పైగా వ్యాసాలతో విస్తరించిందంటే దాని వెనక ఎంతఅధ్యయనం, ఆసక్తి, అనురక్తి దాగివున్నాయో అర్ధం చేసుకోవచ్చు. 1998 లో ప్రచురించిన మొట్టమొదటిపుస్తకం ‘సైన్స్ పైతాళికులు’ మొదలు నేటి వరకు దాదాపు 60 కి పైగా పుస్తకాలు రచయితగా,సంపాదకునిగా ప్రచురించారు. ఆయన రాసిన పుస్తకాలలో అనేకం డిగ్రీ, ఎం.ఎ. (తెలుగు). ఎం.ఎ.(జర్నలిజం), బి.ఎడ్. విద్యార్థుల సిలబస్ లో చేర్చబడ్డాయి.          పాపులర్ సైన్స్ కు సంబంధించి వైజ్ఞానిక వైతాళికులు (1998), మూఢ నమ్మకాలు – సైన్స్,సైన్స్ వీకణం, సైన్స్ క్యాలెండర్, సైన్స్ వాచ్, సైన్స్ వైతాళికులు (2002), సైన్స్ ధ్రువతారలు, సైన్స్ -అత్యున్నత కళా రూపం, శాస్త్రము – సమాజము, ఇండియా 2020 – (డాక్టర్ ఎపిజే అబ్దుల్ కలాంరచనకు అనువాదం), ద్రవిడ శాస్త్రవేత్తలు, ప్రగతికి ప్రస్థానం సైన్స్, ఆధునికతకు చిరునామా సైన్స్, వైజ్ఞానిక కథలు (సంపాదకత్వం), సైన్స్ ఎందుకు రాస్తున్నాము. (సంపాదకత్వం) మొదలైన పుస్తకాలుప్రచురించారు. “సైన్స్ అంటే ఎంసెట్ అనీ, చదువు అంటే ఉద్యోగమనీ – సాగే విద్యావిధానంలో సమాచారం, సమీకరణాలుంటాయి కానీ మనసుకు స్పందన కల్గించే జీవిత గాధలుండే అవకాశం లేదు. ఈ నేపధ్యంలో ఈ పుస్తకంలో వివరించబడిన శాస్త్రవేత్తల జీవిత విశేషాలు విద్యార్థులకు స్ఫూర్తిని కల్గిస్తాయని నా నమ్మకం.” అంటారు నాగసూరి వేణుగోపాల్ సైన్స్ వైతాళికులు పుస్తకంలో. 2003 నుంచి 2014 దాకా సంయుక్త ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలలో బి.ఎడ్.. కోర్సులో ఫిజికల్ సైన్స్ శిక్షణార్ధులకు వారి సిలబస్ లో పొందు పరిచారు.

పర్యావరణానికి సంబంధించి ప్రకృతి – పర్యావరణం, పర్యావరణం -సమాజం, పర్యావరణ శాస్త్రం, కధావరణం (పర్యావరణానికి సంబంధించిన కథా సంకలనం -సంపాదకత్వం) మొదలైనవ పుస్తకాలు ప్రచురించారు.          పత్రికా రంగానికి సంబంధించి ఎడిటర్లు ఏమంటున్నారు. (సంపాదకత్వం), నార్ల బాట,పాత్రికేయపాళి, నవతరానికి నార్ల, మీడియా నాడి, మీడియా స్కాన్, విద్వాన్ విశ్వం (సాహిత్య అకాడమీ వారి కోసం రాసిన మోనోగ్రాఫ్), సాహితీ విరూపాక్షుడు, మీడియా వాచ్, శ్రీపాద ప్రబుద్ధాంధ్ర పోరాటాలు (రెండు భాగాలు)(సంపాదకత్వం) ఇలా అనేక పుస్తకాలు రాశారు.

“ఈ అన్ని పుస్తకాలలో, ఇంకా పత్రికా వ్యాసాలలో పత్రికలు తాము ప్రజల పక్షం అని చెప్పడానికి ప్రయత్నించాలని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ జ్ఞాపకం చేస్తున్నారు” అంటారు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు.                 నిర్మొహమాటంగా పత్రికల పోకడలనుప్రశ్నించారు. మంచి సంపాదకీయాలను ప్రశంసించారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కు సంబంధించి టీవీ ముచ్చట్లు, ఛానళ్ళు విస్తృతి – సీరియళ్ళ వికృతి, వార్తా మాధ్యమాల విశ్వసనీయత (సంపాదకత్వం), చానళ్ళ సందడి – టెక్నాలజీ హడావుడి, సమాచారం బాట – సంచలనాల వేట, బుల్లితెర విశ్వరూపం, ప్రసార భాషగా తెలుగు (సంపాదకత్వం) , ఛానళ్ళ హోరు – భాష తీరు, చర్చనీయాంశాలుగా ఛానళ్ళు, ‘ప్రశ్నార్థకమవుతున్న విశ్వసనీయత’ వంటిఅనేక పుస్తకాలలో టీవీ చానళ్ళ తీరుతెన్నులను, బాధ్యతారాహిత్యాన్ని ఏకిపారేశారు.   

         ‘సమాజంసంస్కృతి-నాగరికత వీటి మనుగడకు టీవీ కర్తల్లో ఎవరి కర్తవ్యం వారు నిర్వహించకపోతే అధోగతి తప్పదు.క్రియగా ఆటవిక సమాజానికి మన పయనం – అనే హెచ్చరికను చేయగల ధైర్యం నాగసూరి కలం బలం.ఉత్తమ విమర్శకుడుగా నాగసూరి ‘మెత్తని పులి!” అంటారు విహారి. “రోజుల వ్యవధి లోనే అమెరికాలోనో,‌ ఇంగ్లాండులోనే ఒకానొక బుర్రలో మెదిలిన ఆలోచన మన దేశపు గ్రామంలో కూడా గంగవెర్రులెత్తించగలిగే స్థాయి ఎలా సంత రించుకుంది? కేవలం టెక్నాలజీయే కారణం! అదే పది సంవత్సరాల క్రితం అయితే ఇంతవేగంగా అది మనల్ని చుట్టుముట్టి ఉండేది కాదు.” పందొమ్మిదేళ్ళ క్రితం మిలీనియం అంటూ ఉవ్వెత్తునసాగిన హడావిడి ఎందుకని ప్రశ్నిస్తూ, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తానే చెప్పిన సమాధానం ఇది.       ఇప్పుడు గనుక ఆ వ్యాసం రాస్తే రోజుల వ్యవధి కాదు, కణాల వ్యవధి అని రాసి వారేమో.డాక్టర్ వేణుగోపాల్ ప్రచురించిన సాహితీ గ్రంథాలలో ముఖ్యమైనవి శత వసంత సాహితీ మంజీరాలు(సంపాదకత్వం), వెలుగుజాడ (సంపాదకత్వం), నేటి శ్రీపాద (సంపాదకత్వం), సాహితీ వీక్షణం, జ్ఞానసింధు – సర్దేశాయి తిరుమల రావు (సంపాదకత్వం), సాహితీ స్పర్శ, చెరగని స్ఫూర్తి – తాపీ ధర్మారావు(సంపాదకత్వం), సంక్రాంతి కథా తోరణం (సంపాదకత్వం), మన తెలుగు (సంపాదకత్వం), మదరాసు బదుకులు (సంపాదకత్వం)నేషనల్ బుక్ ట్రస్ట్, సాహిత్య అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ద్రావిడవిశ్వవిద్యాలయం, విశాలాంధ్ర బుక్ హౌస్, జన విజ్ఞాన వేదిక, ప్రజాశక్తి బుక్ హౌస్, ఎమెస్కో, ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, నవచేతన ప్రచురణ సంస్థ, చినుకు ప్రచురణలు తాపీ ధర్మారావు వేదిక వంటి అనేక సంస్థలు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పుస్తకాలను ప్రచురించాయి.        డాక్టర్ ఎన్. భాస్కర రావు, కె.పి.శ్రీనివాసన్, ప్రయోగ వేదవతి, విహారి, పున్న మరాజు నాగేశ్వరరావు, సామల రమేష్ బాబు. నామిని సుబ్రమణ్యం నాయుడు, భువనచంద్ర, రాయదుర్గం విజయలక్ష్మి మొదలగు వారితో కలసి చేసిన సమిష్టి ప్రయోగాలు పుస్తకాలుగా గౌరవం పొందుతున్నాయి.సహస్రాబ్ది గా మారిన సమయంలో విజయవాడ, ప్రాంతీయ జానపద కళా సాహిత్యాల గురించిఅనంతపురం, అన్నమయ్య సారస్వతం గురించి కడప, గిరిజనుల గురించి విశాఖపట్నం, హెచ్.ఐ.వి.ఎయిడ్స్ గురించి విజయవాడ, మద్రాసు తెలుగు వారి గురించి చెన్నై ఆకాశవాణి కేంద్రాలలో నాగసూరి నిరుపమానమైన కృషి చేశారు.

1991లో అనంతపురంలో ప్రారంభించిన ‘విజ్ఞానపథం’ నుంచి తిరుపతి ఆకాశవాణిలో ఇటీవలి వరకు ప్రసారం అయిన ‘రండి చూపొద్దాం తారామండలం’, ‘అడగండి, తెలుసుకోండి’ దాకా ప్రతీది విలక్షణమైన ప్రయోగమే! ఢిల్లీ నుండి 1995 లోనే “రేడియోస్కోపు’ అనే ఆంగ్ల సైన్స్ సంచికాకార్యక్రమం దేశంలో అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమై వారికి ఎంతో గుర్తింపు తెచ్చింది.పర్యావరణ కార్యక్రమాల రూపకల్పనలో ఆకాశవాణి తరపున ‘ఆసియా పసిఫిక్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ’మనీలా (ఫిలిప్పీన్స్) లో నిర్వహించిన సదస్సులో 2010 లో పాల్గొన్నారు. ఆకాశవాణిలో పనిచేసేక్రమంలో పరిశీలన, పరిశోధన, ప్రణాళికతో వీరు నిర్వహించే ఆకాశవాణి కార్యక్రమాలలో విభిన్న వర్గాలభాగస్వామ్యం, సామాజిక ప్రయోజనం, బహుళ ప్రాచుర్యం తప్పనిసరిగా అంతర్భాగమయ్యేలారూపొందించారు.            వార్త, ఆంధ్రభూమి, ప్రజాశక్తి, యోజన, ఆంధ్రజ్యోతి, నడుస్తున్న చరిత్ర, ఆంధ్ర ప్రభ, ఆహ్వానం వంటి అనేక పత్రికలలో ఏళ్ల తరబడి 40 కి మించిన మీడియా, సైన్స్ కాలం, సైన్స్ మొగ్గ, టీవీంద్రజాలం,‌టీవీక్షణం, మన శాస్త్రవేత్తలు వంటి వివిధ కాలమ్ శీర్షికలతో 2000 కు పైగా వ్యాసాలు రాశారు, ఇంకా రాస్తున్నారు. ప్రస్తుతం న్యూ వేవ్స్.కాం న్యూస్ పోర్టల్ లో మీడియా పల్స్ రాస్తున్నారు.
అవార్డులు – పురస్కారాలు:         మీడియా సంబంధమైన కృషికీ రాపీ ధర్మారావు పురస్కారం, నార్ల వెంకటేశ్వరరావు పురస్కారం పాపులర్ సైన్స్ వ్యాస ప్రచురణకు డా|| పరుచూరి రాజారాం గౌరవం, జమ్మి శకుంతల పురస్కారం, మల్లాది సూరిబాబు పురస్కారం, సాహిత్య సంబంధమైన పరిశ్రమకు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం, భాషా సంబంధమైన కృషికి అధికారభాషా సంఘం అవార్డు, 2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారం, లేపాక్షి పురస్కారం పొందారు. 

        తక్కోలు మాచిరెడ్డి అక్షర చిత్రంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మూర్తిమత్వం ఇలా చిత్రించబడింది. “విస్తృత అధ్యయన, లోతైన ఆలోచన, సృజనాత్మక అనువర్తన, సమాజ శాస్త్రాల ప్రాముఖ్యాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం, పారిభాషిక పదాల అన్వేషణ, పర్యావరణ ప్రాముఖ్య అవగాహన, విజ్ఞాన శాస్త్రం పట్ల నిబద్ధత, నిజాయితీ, శాస్త్రవేత్తల పరిశోధక జీవితాలను, మానవీయ పార్శ్వాల్ని ప్రామాణికంగాపరామర్శించి చూపించడం, సైన్స్ కూ, కళకూ మధ్య ఉండే అగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేయడం,సూచనప్రాయంగా, సవినయంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, సొంపైన నుడికారం, మానవ విలువల కోసం తాపత్రయం, మూఢ నమ్మకాలని నిరసించడం, పెట్టుబడివాద సామాజిక రుగ్మత అయిన వస్తు వినియోగతత్వాన్ని ఈ నదిన్చుకోవాడ, డబ్బు వ్యామోహాన్ని నిరసిస్తూ, సమాజవాదవిలువలైన ప్రేమ, సమిష్టి భవన, ప్రాపంచిక దృక్పథం ఉండటం, సూపర్ కంప్యూటర్ కన్నా మనిషి మెదడు గొప్పదనడం,సంప్రదాయం, ఆధునికతల మధ్య వారధి నిర్మించడం, వీటన్నిటినీ మించి మాతృభాషను ప్రేమతో, మమతతో అభివృద్ధి పరచి, ఆదరించి, స్వీకరించాలని భావించడం, అందుకు అన్ని స్థాయిలలోనూ తెలుగేబోధనా మాధ్యమంగా ఉండాలని ప్రతిపాదించడం, ఆంగ్ల ఆధిపత్యాన్ని ఎదిరించడం. ”       ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ హైదరాబాదు లోని ఆకాశవాణి రీజనల్ అకాడమి ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్అండ్ మల్టీమీడియా విభాగానికి సంచాలకులుగా పనిచేస్తున్నారు. 
           ఏ రంగంలో సాగినా అందులో సృజన, పరిశోధన, ప్రణాళిక, సామాజిక స్ఫూర్తి, మానవత, సైన్స్ దృష్టి ఆకట్టుకునే గుణం ఉన్న నాగసూరి వేణుగోపాల్ భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలని కోరుకుందాం.
 

__ డా.యం.ప్రగతి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s