
ఆర్ సి కృష్ణస్వామి రాజు జీవిత బీమా సంస్థలో అభివృద్ధి అధికారి గా పనిచేస్తూ మధ్యలో వదిలేసిన తన సాహితీ ప్రస్థానాన్ని మళ్లీ కొనసాగిస్తూ గత రెండేళ్లుగా 150 పైగా కథలు రాశారు. వాటిల్లో తనకు నచ్చిన 18 కథలను ‘ముగ్గురాళ్ళ మిట్ట’ పేరుతో కథా సంపుటిని తీసుకొచ్చారు. ఇందులో చాలా కథలు వివిధ సమస్యల నుంచి పురస్కారాన్ని పొందినవే. ఆయన చెబుతున్నట్లు ఇందులోని కథలన్నీ ఆయన బాల్యం, ఊరు, కుటుంబం నేపథ్యంలో జరిగిన సంఘటనల నుంచి వచ్చినవే.
మంచి కథకు క్లుప్తత, అనుభూతిఐక్యత, సంఘర్షణ,నిర్మాణ సౌష్టవం ఉండాల్సిన లక్షణాలనీ ప్రముఖ సాహితీ విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. మంచి కథ ఎప్పుడూ పాఠకుని హృదయంలో నిలిచిపోతుంది అది కథా లక్షణాలతో ఒక్కోసారి లేకపోయినా కూడా.కథ పాఠకుని వేలు పట్టుకుని నడిపించుకుంటూ చదివించేది గా ఉంటే ఆ కథ నల్లేరుపై నడక లాగా ఆహ్లాదంగా ఉంటుంది.కథలో ఎలాంటి సస్పెన్స్ మలుపులు లేకపోయినా చివరకు ముగింపు పాఠకునిలో దాగిఉన్న మానవీయ గుణాలుప్రేరేపించబడితే అదే కథకు మంచి ఆభరణంగా నిలుస్తుంది. పాఠకుని తనతోపాటు తీసుకెళ్లి గలిగే లక్షణం కృష్ణస్వామి రాజు లో పుష్కలంగా ఉంది. తమ జానపద సంస్కృతుల్ని కళల్ని తమ రచనల్లో విరివిగా ఉపయోగించుకొని కథలు రాస్తే అవి సహజత్వానికి దగ్గరగా ఉంటాయని ఆఫ్రికా దక్షిణ అమెరికా రచయితలు విమర్శకులు భావిస్తారు. మన తెలుగు రచయితలలో చాలామంది రాయలసీమ జానపద కళలను సంస్కృతులను మాండలికాలను తమ కథల్లో ఉపయోగిస్తున్నారు. ఈ కథలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఈ కథల్లో సీమ సంస్కృతులు ముఖ్యంగా చిత్తూరు జిల్లా యాస,నుడికారం, సామెతలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. కథకు ఒక సామాజిక ప్రయోజనం ఉంటుందని చెప్తాడు త్రిపురనేని మధుసూదనరావు. గురజాడ పాఠకుని సంస్కారవంతుని చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తే బాలగోపాల్ అది పాఠకుల చైతన్యపరచడానికి ఉపయోగపడుతుందని భావించాడు. సామాజిక సమస్యలకు కథ ద్వారా పరిష్కారం చెప్పవచ్చని రాచపాలెం లాంటి విమర్శకులు చెబుతున్నారు . ఏ రచన పాఠకుని మానసిక ప్రక్షాళనం చేస్తుందో అది ఉత్తమ రచనగా వర్ణించాడు అరిస్టాటిల్. కృష్ణస్వామి కథల్లో అతని శిల్ప రచన పాఠకుల్ని మంత్రముగ్ధున్ని చేస్తుంది. అంతేగాక బడి బియ్యం, గొర్రెదాటు ,బామ్మ బొచ్చు కుక్క కథలు పాఠకునిిి హృదయ వైశాల్యాన్ని పెంచుతూ గుండెలోని తడిని ఆరనివ్వకుండా చేస్తాయి. చిన్ననాటి మధురస్మృతులు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాయి. ‘ఆ కాలాలే వేరు’ అనుకుంటూ ఆ తీయ తీయని తడారని జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి మదిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వాటన్నిటినీ రెడ్డోళ్ల బావి, కొక్కిరాళ్ల కొండ కథల్లో చూడొచ్చు. పల్లెల్లో పసివాడని బాల్యం, మాయ మర్మాలు లేని బాల్యం ఉంటుందని అదే పట్టణాల్లో అయితే బాల్యం అత్తపత్తి లాంటి స్నేహాల మధ్య నడుస్తుందని రచయిత ఈ కథల్లో వ్యక్తం చేస్తాడు. శీను ఒకచోట “స్నేహమంటే ఏమిటో మిమ్మల్ని చూస్తే తెలిసింది. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడం, ఏమైనా చేయడం. మా సిటీ లో మా కాన్వెంట్లో అంత టచ్ మీ నాట్ స్నేహాలే .ఇరుకు గదుల్లో కూర్చోవడం ,పోటీపడి చదవడం,ట్యూషన్ ..పరుగో పరుగు …ఆటల్లేవ్ పాటల్లేవ్” అంటూ కిష్టడు, దీనదయాలు తో చెబుతూ ఏడుస్తాడు.ఇలాంటివి ఈ కథల్లో మనం నేటి సామాజిక వాస్తవికతగా చూడొచ్చు.
“అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరు నిలిచి”అనే పాట అందరికీ తెలుసు. ఇలాంటి సందేశాన్ని ఇచ్చే కథా చిత్రణ ముగ్గురాళ్ళ మిట్ట , ఊరు వుప్పు కథల్లో మనం చూడగలం. ముగ్గురాళ్ళ మిట్టలో ప్రమీల పరీక్ష రాయడానికి ఉప్పలివంక నుంచి నెత్త యూత్ త కుప్పం కు పోవాలంటే ఆటో పంచరై ఉంటుంది. అప్పుడు ‘మన ఊరి పిల్ల పది పరీక్ష మిస్ అయితే ఊరుకుంటామా? ఏంది!మేము లేమా! ఏంది ‘అంటూ అందరూ ప్రమీల కు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతలో ప్రెసిడెంట్ సిబ్బాల సుధక్క కారులో ఆ పాపను తీసుకెళ్తుంది.ఇందులో మారుతున్న రాజకీయ ముఖచిత్రాన్ని కూడా అంతర్లీనంగా గమనించవచ్చు. ఊరు వుప్పు కథలో ఒకే ఊరు నుంచి ఐదు మంది డాక్టర్లు అవుతారు. వాళ్లు “మన ఊరి బిడ్డలం మేము. మేమంతా ఆడిపాడిన నేల ఇది. అందరం కలిసి మెలిసి బతికినోళ్లం .ఇక్కడ గాలి పిల్చి ఇక్కడ నీళ్లు తాగినోళ్ళం .మా వంతు సాయంగా ప్రతినెల రెండో ఆదివారం నాలుగో ఆదివారం ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తాం” అని ప్రకటిస్తారు. భవిష్యత్తులో రాబోతున్న మార్పుకు సంకేతంగా నిలుస్తుందీ కథ. జీవితంలో కలిగే అనుభవాలే కథలుగా రూపుదిద్దుకుంటాయి.అవి సార్వజనీకం కూడా అవుతాయి.ఎందుకంటే అలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో సంభవించే ఉంటాయి. అనుభవంలోంచి సున్నితమైన అంశాలను కథగా మలిచే నేర్పు కృష్ణస్వామికి ఉంది. నమస్కారం తోఎన్నో పనులు నిత్యజీవితంలో జరగడం చూస్తుంటాం.కుటుంబంలో, ఆఫీసులో, రాజకీయాల్లో నమస్కారం ఎలా పనిచేస్తుందో పనులు జరిపించడానికి నమస్కారం ఎంతలా పనికి వస్తుందో ‘నమస్కారం ‘కథ చెబుతుంది. నమస్కారాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా చెప్తాడు రచయిత.దొంగ నమస్కారం నుంచి మొక్కుబడి నమస్కారం వరకు ఉన్న అనేక రకాల నమస్కారాలను లౌక్యం తెలిసిన వారు ఎలా ఉపయోగిస్తారో సుబ్బరాజు నంజుండప్పతో చెబుతాడీకథలో. కూతురు తన భర్తతో కలిసి అమెరికా నుండి తండ్రికి డబ్బులు పంపి ఒక అపార్ట్మెంట్ కొనమని, అది తల్లిదండ్రులకు లేదంటే చెల్లెలుకో ఉపయోగపడుతుందని చెప్తుంది కొరమీను గుంట కథలో. ఆడ బిడ్డైైై నా మగ బిడ్డైనా అమ్మ నాన్న ల్ని, తోడబుట్టిన వాళ్లను ఆదుకుంటామనే ఆలోచన ఉంటే ఎంత మేలో అన్న విషయాన్ని వివరిస్తుందీ కథ.తన విద్యార్థుల యోగక్షేమాల గురించి ఆలోచించే ఉపాధ్యాయురాలి కథే ‘గురుదేవోభవ’.అరుణ ఒక టీచర్. ఆమె తన ఆపరేషన్ను విద్యార్థుల కోసం వాయిదా వేసుకుంటుంది. ఇలాంటి వారి వల్లే విద్యావ్యవస్థ వర్ధిల్లుతోందనే సందేశాన్ని ఇస్తాడు రచయిత. సమాజంలో అనేక మూఢ విశ్వాసాలుంటాయి. ప్రజలు తెలిసో తెలియకో వాటిని పాటిస్తుంటారు.కానీ రచయితకు మాత్రం వాటి పట్ల సానుభూతి ఉండరాదు. విమర్శనాత్మక దృష్టితో పాటు శాస్త్రీయ దృక్పథం కూడా రచయిత కు ఉండాల్సిన అవసరం ఉంది. కథల్లో వాటిని చెప్పేటప్పుడు వాటి వల్ల సామాజిక ప్రయోజనం లేదన్న విషయాన్ని ఎక్కడో ఒకచోట ఒక పాత్ర ద్వారా చెప్పించాలి.ఇక్కడే రచయిత చైతన్యం బహిర్గతమవుతుంది. రామక్కవ్వ కథ లో ఇలాంటి దృష్టి లేకపోవడం వల్ల వర్షం పడడానికికప్పలకు పెళ్లిళ్లు చేసినట్లు, అందువల్ల వర్షం పడినట్లు రచయిత చూపించారు. వాస్తవంలో ఇలా జరగదు. అదే నిజమైతే రాయలసీమలో కరువు ఉండేది కాదు కదా! పైగా వర్షం పడాలంటే పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలో చెప్తే ఇంకా ప్రయోజనం ఉంటుంది.ఇలాంటి కథలు రాసేటప్పుడు రచయిత కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం.
‘పాఠాలు వేరు ప్రాక్టికల్ వేరు’అన్న సూత్రాన్ని విభేదిస్తూ నేర్చుకున్న పాఠాలు సరైన పరిష్కార జ్ఞానాన్నిస్తాయని నిరూపించిన కథ అడవిపంది కథ. రామ తులసి వ్యవసాయ సంబంధ చదువు చదివినమ్మాయి.ఆమె సలహాతో ఎర్రగడ్డ తెల్లగడ్డ కలిపి మెత్తగా నూరి గోధుమపిండిలో కలిపి ఉండలుగా పొలాల్లో పందులకు ఎరగా వేస్తారు కమలక్క, కుప్పడు మొదలైనవారు. అవి తిని పందులు పారిపోతాయి.అట్లా పొలాలను రక్షించు కుంటారు. విద్య వేరు వాస్తవం వేరు అని చెబుతూనే చివరకు విద్య వల్లే మంచి నిర్ణయాలు వస్తాయనే సందేశాన్నిస్తాడు రచయిత. ఈ కథలో రచయిత ఏం చెప్పాలనుకున్నారో స్పష్టం కాలేదు. కథన శిల్పంలో కొంత శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది.
కథల్లో కృష్ణస్వామి రాజు తన స్వానుభవం వల్ల ,పల్లె ప్రజలతో మమేకం కావడంవల్ల అలవోకగా రామలక్క, పడిశం ప్రకాశం,దగ్గుల జగ్గయ్య, కత్తుల కాంతారావు ఇలా ఎన్నో పేర్లున్న వారిని ఆయన తన కథల్లో పాత్రలు గా వచ్చి నిలుపుతారు. సామెతల కైతే కొదవే లేదు.సామెత లేని కథ లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ‘తలగడ తిరిగేస్తే తలనొప్పి పోతుందా ‘,గుండ్రాయి దాస్తే పెళ్లి ఆగిపోతుందా”,’ ఒంటికి ఓర్వలేనమ్మ రెంటికి నేర్చునా’,’వంగిన వెదురు పెళ్ళిపందిరికి ,నిగుడు కున్న వెదురు పాడెకు వాడుతారు’ మాకే లేదు నాకుడు బెల్లం, నీకు ఎక్కడ నుంచి తెచ్చేది గోకుడు బెల్లం,’ ‘ కాశీ కి పోయినా కావడి మోయాల్సిందే కదా ‘,ఇలా ఎన్నో తెలుగు సామెతలు కథల్లో చక్కగా ఒదిగిపోయాయి. కృష్ణస్వామి రాజు ప్రతి కథను కవితాత్మక వాక్యంతో ముగించడం ద్వారా కథకు మంచి బలం ఇస్తాడు. ఇది ఆయన కథన శిల్పానికి వన్నె తెచ్చింది. రాయలసీమ యాసను, భాషను, నుడికారాన్ని చక్కగా పట్టుకుని జీవనగమనంలో వచ్చిన ప్రతి చిన్న సందర్భాన్ని ఎంతో నేర్పుగా కథగా మార్చగలిగే నైపుణ్యం కృష్ణస్వామి రాజుకుంది.అయితే బలమైన కథా వస్తువును గుర్తించి కథలో సంఘర్షణను ప్రవేశపెడితే కథకు బిగువు వస్తుంది.అప్పుడు పాఠకుల్లో చైతన్యాన్ని పెంచడమే గాక ఆ కథ నాలుగు కాలాలు పాటు సాహిత్య లోకంలో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.ఆ దిశగా ఆయన తన కథ ప్రస్థానాన్ని సాగిస్తారని ఆశిద్దాం.
