
దత్త మండలాల తొలి కలెక్టర్ థామస్ మన్రో. ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు ఆదర్శప్రాయుడు.1802-07 సంవత్సరాలలో దత్త మండలాల ప్రిన్సిపల్ కలెక్టర్ గా ఉన్న మన్రో కార్యాలయంఅనంతపురంలో వుండేది. 1780లో థామస్ మన్రో తూర్పు ఇండియా వర్తక సంఘం సైన్యంలోఒక కెడేట్ గా ఇండియా వచ్చారు. మంచి సైనికుడిగా ఒక దశాబ్దకాలం పనిచేసిన తర్వాత ఆయనను అలెగ్జాండర్ రీడ్ వద్ద సహాయకునిగా పనిచేయడానికి బరంహార్ (సేలం)కు పంపారు. థామస్ మన్రో ఇక్కడ తన శిక్షణాకాలంలో రెవెన్యూ విధానంలో రూపొందించడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 18వ శతాబ్దపు చివరి భాగంలో ల్యాండ్ సెటిల్ మెంట్ నిర్వహణకు దక్షిణ కెనడాకు పంపారు. 1800-1807 సంవత్సరాల మధ్య ఆయన ప్రజలకు ముఖ్యంగా రైతులకు చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన అమలు పరచిన రెన్యూవిధానం మన్రో విధానంగా చారిత్రక ప్రాముఖ్యతను సంత రించుకుంది. ఆనాటి పాలనాధ్యక్షులైన ఎలిఫెస్టన్, మెటకాఫ్ మెకంజీ తదితరులు ఈ విధానాన్నిభారతదేశంలోని ఇతరప్రాంతాలకు వ్యాపింపజేశారు. రైత్వారీ పద్ధతి, జమీందారీ విధానం కంటే శాస్త్రీయమైందిగానూ, న్యాయబద్ధమైంది గానూ రుజువైంది. ఇది నిరంకుశమైన జమిందారీ విధానంకంటే ప్రజాతంత్ర స్వభావం గల వ్యవసాయ విప్లవంగా కార్ల్ మార్క్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరచారు.

మన్రో రైతుల నుండి గ్రామాధికారుల నుండి కానుకలు స్వీకరించేవారు కాదు. ఒకసారిమన్రోకు స్వాగతం ఇవ్వడానికి ఒక గ్రామాధికారి పెద్ద పందిరి వేయించాడు. పందిరి నిర్మించడానికికూలీలకు డబ్బేమీ ఇవ్వలేదని తెలిసిన మన్రో పందిరిలో విడిది చేయడానికి నిరాకరించడమే కాకుండ ఒక చెట్టు నీడన చిన్న డేరా వేసుకుని అందులోకి మారాడు. కనీసం పాలు, పండ్లు కూడారైతులనుండి స్వీకరించేవారు కాదు. తన కింది అధికారులకు కూడా రైతులనుండి ఉచితంగాకానుకలు స్వీకరించరాదని సూచించేవారు. రైతులనుండి ఎక్కువ మోతాదులో శిస్తు వసూలుచేయడం నాయ్యమైన పద్దతి కాదని, ఎక్కువ పన్నులు వసూలు చేసి ఖజానాలో వుంచడం కంటేరైతుల వద్ద ఉంచడమే దేశానికి లాభకరమైందని భావించేవారు. రాయలసీమ ప్రాంతంలో తానున్నఏడేళ్ళ కాలంలో మన్రో దాదాపు 2,06, 819 పట్టాలు రైతులకు పంపిణీ చేశారు. అంతే కాకుండారైతులకు భూమి మీద యాజమాన్యపు హక్కులు వచ్చినాయని, వారు ఆ భూములను అమ్ముకోవడానికి కూడా హక్కులు కలిగివున్నారని ప్రకటించారు. ఇందువల్ల రైతులు తమ భూములను అమ్ముకునే వీలు కలిగింది. ఈ మార్పు వలన సాగుభూమి గణనీయంగా పెరగడమే కాకుండా ప్రభుత్వ ఆదాయం కూడా యాభై శాతం పెరిగింది. మన్రో రూపొందించిన మరో ముఖ్య విధానం భూమిశిస్తు మదింపు విధానం. తాను పాలకుడిగా కొనసాగినంతకాలంలో ఉదారమైన శిస్తు విధానం పాటించాడు. భారతదేశంలో ప్రజారంజకులైన రాజుల కాలంలో రైతుల నుండి వారు పండించిన పంటలో 1/3 వంతు శిస్తు వసూలు చేసిన విధానాన్ని తన పై అధికారులకు ఆయన తెలియపరచారు.రాయలసీమ జిల్లాల్లో మన్రో సాధించిన మరో విజయం ఒకటుంది. రాయలసీమలో గల80మంది పాలెగాళ్లను, 30వేల మంది దాకా వున్న వారి అనుచరులను సంప్రదింపుల ద్వారా,సైన్యం ద్వారా పూర్తిగా అణచి వేసినారు. వారిలో చాలామంది విజయనగర రాజుల కాలం నుండిఅధికారంలో ఉన్నవారు. వారు స్వతంత్రులుగా మారి యుద్ధాలు చేస్తూ గ్రామాలను దోచేవారు.వాళ్లు చివరకు బందిపోట్లుగా దిగజారి పోయారు. వారి అనుచరులు ముఠాలుగా ఏర్పడి తరచూగ్రామాలను దోచేవారు. వీరి దుర్మార్గాల వల్ల దాదాపు వంద సంవత్సరాలకు పైగా ప్రజలు విపరీతంగా బాధలకు గురయ్యారు. గోల్కొండ నవాబు, మొఘలులు, హైదరాలీ, టిప్పుసుల్తాన్, నిజామ్ నవాబులు కూడా వీరి ఆగడాలను అరికట్టలేకపోయారు. మన్రో తీసుకున్న కఠినచర్యల ఫలితంగా పాలెగాళ్ళు, కావలివాళ్ళు, వారి అనుచరుల అకృత్యాలు తగ్గిపోయాయి. అరాచకంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో మన్రో జిల్లా కోర్టులు, జిల్లా, మెజిస్ట్రేలను, పోలీసుయంత్రాంగాన్ని ప్రవేశపెట్టి చట్టబద్ధమైన పాలన ఏర్పరచారు. భారతీయులు తెలుగు, ఇంగ్లీషుభాషలు నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి వీలుగా జిల్లా తాలూకా స్థాయిలలో పాఠశాలలు ఏర్పాటు చేశారు. తెలుగు జిల్లాల్లో నియమింపబడే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా తెలుగు నేర్చుకుని వుండాలన్న నిబంధన విధించారు. 1805 నాటికే తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్న ఆంగ్ల ఉద్యోగులలో మన్రోను మొదటివాడిగా గుర్తించాలి. రాయలసీమ రైతులతో తెలుగులోనే మాట్లాడేవారు.దాంతో భూస్వాములు వారి అనుయాయులు రైతులకు ఏదైనా అన్యాయం చేసినప్పుడు వారు మన్రో వద్దకు వెళ్ళి తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా చెప్పేవారు. తరచూ రైతులతో చెట్ల నీడనేసమావేశమై వారి సమస్యలను పరిశీలించేవారు. అలా రైతులలో మన్రో మంచి గుర్తింపును కలిగివుండేవారు. తాను ప్రవేశపెట్టిన విధానాలు ఏ రకంగా అమలు జరుగుతున్నాయో చూడడానికి మైళ్లతరబడి కాలినడకన వెళ్ళేవారు. వారి సమస్యలు క్షుణ్ణంగా తెలిసిన వాడు కనుక ఎక్కడ పూడికపోయిన చెరువుల కనపడ్డా వెంటనే చెరువుల్లో పూడిక తీయడానికి ఉత్తర్వులు ఇచ్చేవారు. అవసరం కలిగిన రైతులకు రుణాలు మంజూరు చేసేవారు. పన్నుల విధానంలో భారతీయుల పాత్ర వుండాలని, తాము ఎందుకు పన్నులు చెల్లిస్తున్నామో కూడా వారు తెలసుకోవాల్సి వుంటుందని మన్రో భావించేవారు. భారతీయులు కేవలం చట్టాలు రూపొందించడమే కాకుండా అధికార యంత్రాంగంలో బాధ్యతాయుతమైన పదవులు పొందడానికి అవకాశం వుండాలని ఆయన అభిప్రాయం. కేవలం ఇంగ్లీషు భాష, సాహిత్యం మాత్రమే ప్రజల స్థితిగతులను మెరుగుపరచ జాలవని, వారికి గౌరవపదమైన ఉద్యోగాలు, లాభదాయకమైన వృత్తుల ద్వారా మాత్రమే వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాయని నమ్మేవారు. వెనుకుబాటుతనం,బానిసత్వం, దారిద్ర్యంతో మగ్గుతున్న భారతీయులను పైకి తెచ్చి వారిని స్వపరిపాలకులుగా తయారు చేయవలసి ఉంటుందని భావించారు.
మన్రో సత్రం
1803లో అతివృష్టి ఏర్పడినప్పుడు మన్రో రైతులకు, ప్రజలకు అండగా నిబడ్డారు. ఈయనసేవలు గుర్తించి ప్రభుత్వం 1820లో మద్రాసు (చెన్నై) రాష్ట్రానికి గవర్నర్ గా నియమించింది.1826లో గవర్నర్ గా పదవీ విరమణ చేస్తూ స్వదేశానికి వెళ్లే ప్రయత్నంలో కుటుంబాన్ని ముందుగా ఇంగ్లాండ్ కు పంపి రాయలసీమ పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా పర్యటన పూర్తి చేసి కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా గుత్తికి సమీపంలోని పత్తికొండ వద్ద కలరా వ్యాధి సోకి 1827 జూలై 6న రాత్రి 9గంటలకు మన్రో పరమవదించారు. ఆయన భౌతికకాయాన్ని గుత్తికి ఊరేగింపుగా తీసుకుని వచ్చి దుర్గం సమీపంలోని గల ఆంగ్లేయుల సమాదుల వద్ద స్థాపితం చేశారు. మన్రో స్మృతి చిహ్నంగా బెంగళూరు నుంచి హైదరాబాదు వెళ్లే జాతీయ రహదారిపై గుత్తిపట్టణంలో 1827లో సర్ థామస్ మన్రో సత్రం నిర్మించారు. ఇంత భారీ సత్రం రాయలసీమలోఎక్కడా అగుపించదు. అప్పట్లోనే ఈ సత్రం నిర్మాణానికి రూ. 33వేల రూపాయల దాకా ఖర్చుఅయిందని అంచనా. దాదాపుగా 250కి పైగా రాతి స్థంభాలతో నిర్మించిన సత్రంలో 12 గదులుఉన్నాయి. అప్పట్లో ఈ సత్రాన్ని ట్రావెల్స్ బంగ్లాగా ఆంగ్లేయులు ఉపయోగించేవారు. నలువైపులావిశాలమైన వరండాలతో నిర్మించిన ఈ కట్టడం 193 సంవత్సరాలు పూర్తైనా చెక్కుచెదరకుండాపటిష్ఠంగానే వుండటం విశేషం. 1884లో ఈ భవనం గుత్తి తాలూకా బోర్డు స్వాదీనంలో వుండేది. అందులోనే గ్రామపంచాయితీ కార్యాలయం నిర్వహించేవారు. స్వతంత్ర్యం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రి, బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఈ సత్రంలోనే ప్రారంభమై అనంతరం వేరే చోటికి తరలింపబడ్డాయి.

ఆయన విగ్రహాన్ని అనంతపురం కలెక్టరు కార్యాలయం దగ్గర ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం ఆయన జయంతి ని నిర్వహిస్తున్నారు.
