మీకు ‘నెంబర్లవరి’ పేరు గుర్తుందా? 1964కు పూర్వం ఈ వరి రకం బహుళ ప్రజాదరణలో వుండేది. ‘సాంబా’ వరి అనే ఈ రకం ఆంధ్ర, తమిళనాడు, కర్నాటకల్లో బాగా పండేది. దీన్ని సాంకేతికంగా జి.ఇ.బి.24 అని పిలిచేవారు. బియ్యం బాగా నాణ్యంగా దిగుబడి తక్కువ. మొక్కకాండంలో దృఢత్వం లేకపోవడం వల్ల మొక్క పొలంలో పడిపోయి వుండి, అన్నం బాగా ఒదిగి కంటికి యింపుగా వుండేది. మార్కెట్లో గిరాకీ ఎక్కువ. అయితే నష్టం కలిగేది.        1967లో బాపట్ల వ్యవసాయ కళాశాల ‘మసూరి’ వరి రకం ప్రవేశపెట్టింది. ధాన్యంనాణ్యంగా వుండి, కంకి దృఢంగా వుండి దిగుబడి అధికంగా వుండేది. మార్కెట్లో గిరాకీ వుండడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ‘మసూరి’ కూడా ‘సాంబ రకంలాగా పంటకు కోతలు వచ్చే సమయంలో నేలపై వాలిపోవడం వల్ల అపారనష్టం కలిగేది. మరీ ముఖ్యంగా అక్టోబరు – నవంబరు నెలల్లో వచ్చే ఈశాన్య ఋతుపవనాలవర్షానికి గింజ కంకి పైననే మొలకెత్తి 50 నుంచి 90 శాతం నష్టం కలిగేది. రైతులకు లాభదాయకం కాకపోయినా, వినియోగదారుల ఆదరణ తగ్గలేదు.ఈ నేపథ్యంలో 1964లో ఫిలిప్పైన్సు అంతర్జాతీయ వరి పరిశోధనా స్థానం ద్వారా కొత్త వరి వంగడం మనదేశంలో ప్రవేశించింది. మన వాతావరణానికి అనువుగా ఉండి, ఎక్కువ దిగుబడి నిచ్చే ఈ వరి ముతకగా వుండి ముద్దగట్టేది. అంతేకాక చీడపీడలకు తట్టుకునే రకం కాదు ఇది. కానీ కాండం దృఢంగా, పొట్టిగా వుండి, మొక్క వాలేది కాదు.ఆకులు ముదురు ఆకుపచ్చరంగులో నిటారుగా వుండి, ఒక ఆకు నీడ మరో ఆకు మీదపడకుండా అధికస్థాయిలో కిరణజన్య సంయోగక్రియ సాధ్యమయ్యేది. ఏ రుతువులోనైనా125 -135 రోజుల్లో పంట చేతికి వచ్చేది. ఈ రకం పేరు తైచింగ నేటివ్ -1. ఈ మూడు రకాల వరి వంగడాలను గమనించండి. వీటిల్లో ఏ ఏ గుణాలు మనకు ఆదర్శపాత్రమవుతున్నాయి?        ‘సాంబ’ వరి రకంలో గింజ నాణ్యత, వంటకు పనికి వచ్చే గుణాలు,కంకి పైననే తడిస్తే మొలకెత్తని లక్షణాలు – అలాగే ‘మసూరి’ రకంలో కంకి చిక్కటి తనం, మొక్క నిర్మాణం, ఎక్కువ దిగుబడి, ఋతు ప్రభావం స్వల్పంగా వుండటం. వంటి ధర్మాలనుఒకే రకం వరిలో సాధించగలిగితే ఎలా వుంటుంది? దివ్యంగా వుంటుంది!
           ఎక్కువ దిగుబడినిచ్చే గుణం, గింజ నాణ్యత ఇంకా లైటింగ్ నేటివ్ – 1 రకంలో పటిష్టమైనఅలా ఆలోచించగలగడమే భావుకత! సాధించడమే పరిశోధన!! అలా తయారైన రకమే బి.పి.టి. 5204 అలా అంటే అర్థం కాకపోవచ్చు. కానీ.. సాంబ మసూరి, కర్నూలు ఆన, సోన మసూరి, జీలకర మసూరి.. తమిళనాడులో సీరాకపోన్ని. ఉత్తర భారతదేశంలో ఆంధ్ర మసూరి అంటే సులువుగా తెలుస్తుంది. సాంబ మసూరి బియ్యం చాలా నాజూకుగా, నిగనిగలాడుతూ, బాగా ఉడికి తెల్లగా వుండి, కంటికింపుగా, నాలుకకు రుచిగా వుంటుంది.దిగుబడికి దిగుబడి, ధరకు ధర ఉండటంతో రైతులు కూడా ఈ సాంబ మసూరి వేయాలని యిష్టపడేవారు. ఈ సాంబ మసూరి వరి వంగడానికిఆధారభూతమైన సాంబ, మసూరి, తైచింగ్ నేటివ్ -1 రకాలు నేడు కాలగర్భంలో కలిసిపోయాయి. సాంబమసూరి మాత్రం యింటా, బయటా ఆదరణ పాత్రమై విదేశీ మారక ద్రవ్యంతో పాటు మన దేశానికి పేరు ప్రతిష్ఠలు సాధించి పెట్టింది. మరి ఈ పరిశోధన సాధించిన మేధావి ఎవరు? ఏ వ్యవసాయ శాస్త్రవేత్త మేధస్సు నుండి ఈ సాంబ మసూరి పొంగి వచ్చింది? ఆ ప్రతిభావంతుడు, ప్రజాధురీణుడు – డా॥మొరవల్లి వెంకట రమణా రెడ్డిగారు.      డా|| యం. వి. రెడ్డిగా ప్రఖ్యాతులై ‘సాంబ మసూరి’ వరి రకానికి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కీర్తి ప్రతిష్టలు సాధించి పెట్టారు.మూడు పాతికల వయసులో నేడు కూడా పరిశోధన అంటే ప్రాణం యిచ్చే ఈ వ్యవసాయశాస్త్రవేత్త మన దేశానికి గర్వకారణం. బోధన చేస్తూనే, దేశంలోని అత్యుత్తమ పరిశోధన సాగించడం, ఫలితం సాధించడం ఒక్క డా|| యం.వి. రెడ్డి గారికే సాధ్యమయింది. అలాగే బోధన, పరిశోధనల్లో అద్భుత ఫలితాలు సాధించి కళాశాల నిర్వహణలో కూడా గణనీయమైన చాతుర్యం ప్రదర్శించి, విజయం పొందడం తమాషా కాదు. నేటికీ తిరుమల దగ్గర వుండే అలిపిరిలో పొద్దుతిరుగుడు పువ్వు, వేరుశెనగ మీద పరిశోధన సాగిస్తున్న నిత్య పరిశోధనా కృషీవలుడు- డా|| యం.వి.రెడ్డి.డా|| యం. వి. రెడ్డి అనంతపురం జిల్లా కదిరి తాలూకాలో 1929 అక్టోబరు 3న జన్మించారు. వారి విద్యాభ్యాసం కదిరి, మదనపల్లి (చిత్తూరు జిల్లా) పాఠశాలల్లో సాగింది.1954లో బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి బి. ఎస్సీ (అగ్రి) పట్టా పొందారు. అది కూడా ఉత్తమ శ్రేణిలో మొదటి ర్యాంకు. 1955లో అదే కళాశాలలో అసిస్టెంటు లెక్చరర్‌గా చేరి 1958లో ఎం. ఎస్సీ (ఆటా) సాధించారు. 1964లో వ్యవసాయ విద్యాలయం ఏర్పడింది.యుఎస్ ఎయిడ్ కార్యక్రమం క్రింద అమెరికాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో డా॥రెడ్డి1967లో డాక్టరేటు పట్టా పొందారు. ప్రఖ్యాత బ్రీడర్ (గోధుమలు) డా.ఇ.జి. హైనీ గారి నేతృత్వంలో పరిశోధన ప్రారంభించారు. వారి పరిశోధన అంశం – ప్లాంట్ బ్రీడింగ్ మరియు జెనెటిక్స్, డా.ఇజి. హైనీ దగ్గర పరిశోధన చేయడం గొప్ప అదృష్టమని చెబుతారు. డా.హైనీ  లాగా తను కూడా భారతదేశం వచ్చాక కొత్తరకాల వంగడాలు సాధించాలని కలలు కనేవారుఒక విశిష్టమైన విషయం వెనుక ఒక అపురూపమైన తపన వుంటుంది.        1975 లో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులయ్యారు. అదనంగా ఐసిఎఆర్ వారి డైరక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీల్స్ సంస్థ డైరక్టరుగా కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్రిసాట్ – ఎపియురాక్ ఫెల్లర్ కార్యక్రమం క్రింద వివిధ దేశ శనగ పరిశోధనా స్థానాలు సందర్శించారు.తదుపరి బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ అయ్యారు. 1983లో తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలకు బదిలీ అయ్యారు. 1988లో తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ‌పరిశోధనా స్థానం అసోసియేట్ డైరక్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టి 1989లో పదవీ విరమణ‌ చేశారు. దాదాపు 34 సం||ల పాటు బోధనా, పరిశోధనా రంగాల్లో రాణించి 1989 తర్వాత బెంగళూరులోని ఒక ప్రయివేటు కంపెనీలో హైబ్రిడ్ విత్తన బ్రీడర్ గా 1994 దాకా పనిచేశారు.వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్ పీరియన్స్ (ఆర్.ఎ.డబ్ల్యు.ఇ.) రూపకల్పనలో ప్రధానపాత్ర పోషించారు.        సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన తమ తండ్రి యం. నందిరెడ్డిగారు తనకు స్ఫూర్తి కల్గించారని సగర్వంగా పేర్కొంటున్నారు. డా॥ రెడ్డి ఎనభైయ్యేళ్ళ ముది వయస్సులో కూడా తన తండ్రి కపిల తోలి చేనుకు నీరు పెట్టే వారని రెడ్డి గారు చెబుతారు. తండ్రి గారి వ్యవసాయశైలిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశారు. తల్లి లక్ష్మమ్మ చక్కని క్రమశిక్షణతో పెంచింది. తల్లిదండ్రుల చేయూతతో తనకు ఒక విశిష్టమైన ఆలోచనాశైలి అబ్బిందనిరెడ్డిగారంటారు. అలాగే విద్యాభ్యాసం మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ హైస్కూలులో సాగడం వల్ల ఉత్తమ విలువలతో కూడిన వ్యక్తిత్వం తనకు కల్గిందని భావిస్తారు.       మొదట సాంబ, తైచింగ్ నేటివ్ -1 రకాల్లోని విశిష్ట లక్షణాలతో వరి వంగడం తయారు చేశారు. దీన్ని మసూరి రకంతో సంకర పరిచి ‘సాంబ మసూరి’ సాధించారు.అయితే ఆ పరిశోధన ఈ రెండు వాక్యాలు రాసినంత సులువుకాదు. ప్రతి దశలో, కొన్ని వందలు వేలు సంఖ్యలో ప్రతి మొక్క వరి పొలంలో పరిశీలించి, వాటిలో మన లక్ష్యానికి దగ్గరగా వుండే కొన్ని మొక్కలను ఎంపిక చేసి, వాటి సంతతిని వివిధ దశలలో నిశితంగా పరిశీలించి స్వచ్ఛమైన సంతతిని ఎంపిక చేసి ఏడెనిమిది సంవత్సరాల అవిరామకృషి ఫలితంగా సాంబ మసూరి’ వంగడం సాధ్యమైంది.             1986లో వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వరి పండించేందుకు ప్రోత్సహించింది. 1988లో సెంట్రల్ రిలీజ కమిటిద్వారా దేశ మంతటా విడుదలై సంచలనం సృష్టించింది. ఆదరణ పాత్రమైంది.                   ఆ రోజుల్లో బాపట్ల వ్యవసాయ కళాశాలలో విద్యార్ధుల మధ్య కుల వైషమ్యాలు ఉండేవి. అధ్యాపకుల బోధన సరిగా లేని పరిస్థితి. అటువంటి కళాశాలను చక్కని మార్గానికి తెచ్చినపరిపాలనా దక్షుడు డా॥ రెడ్డి. అందుకే ఆయనను 1982లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించింది. ఇప్పటికీ పరిశోధన, బోధన అంటే తగని మక్కువ అని వీరంటారు. తన విషయాలన్నిటా తన అర్థాంగి, హోమియోవైద్యురాలు డా|| ఎం. అన్న పూర్ణ గారి చల్లని హస్తముందంటారు డా॥ రెడ్డి.2004 సంవత్సరాన్ని అంతర్జాతీయ వరి వత్సరంగా (ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రైస్)గా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా వరి మీద ఎంతో ఆసక్తి వుంది. ఇప్పటికీ ‘సాంబ మసూరి’ మీద పరిశోధన సాగుతోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్), అంతర్జాతీయ వరి పరిశోధనా మండలి (ఐఆర్ఆప్) ఫిలిప్పైన్స్ వారు సంయుక్తంగా బయో టెక్నాలజీ ద్వారా ఈ వరి వంగడంలో ‘విటమిన్ -ఎ’ సంక్రమించు జన్యు పదార్థాలు చేర్చడానికి కృషి చేస్తున్నారు. గ్రుడ్డి తనాన్ని తగ్గించే రీతిలో కొత్త ‘సాంబ మసూరి’ త్వరలో రానున్నదని మనం ఆశించవచ్చు.

రచన :-నాగసూరి వేణుగోపాల్

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s