
ప్రకృతిని ఆరాధించి గ్రామీణ జనజీవన సారాన్ని గ్రహించి, అన్నదాతల ఆక్రందనలకు,రాయలసీమ కరువు తీవ్రతలకు చలించి వాటికి అక్షరరూపం కల్పించిన సాహితీమూర్తి బెళ్ళూరి శ్రీనివాసమూర్తి. వీరు 4-2-1910వ తేదీనసీతమ్మ, హనుమంతరావు దంపతులకుజన్మించారు. చిన్నతనం నుండి ప్రకృతి ప్రేమికునిగా అలుపెరగక అక్షర సేద్యం కావించిన నిరంతర సాహితీ శ్రామికుడిగా ప్రశస్తిగాంచిన ‘మూర్తికవి’ అనేక ఖండకావ్యాలను సృజించి చిరస్మరణీయుడయ్యారు.శుకపిక శారికలు, కర్షకులు, కాపుకన్యలు, పచ్చని పైరులు, పూదీగలు వీరి కవితా వస్తువులు. వీటితోనే ఆయనకు ఆత్మయానుబంధం. వీటితో లభించిన తృప్తి, ఆనందం బెళ్ళూరికి మరెచ్చటా దొరకలేదని పిస్తుంది. అందుకే ‘తవపోవనం’లో ఇలా తన్మయుడై పాడుతాడు.
తే॥ ప్రకృతి యొడిలోన సుఖసుప్తి వడయుచుందుకోయిలలు ఏలేపనిదూర మేల్కొనుచుందుఅడవికోనల సెలయేటి పడుచుగాంచిపరమ సంతోష భరమున పలుకరింతు
బెళ్ళూరి వారి తండ్రి హనుమంతరావు ఆనాటి కాలంలో ప్రసిద్ధి చెందిన గ్రామీణ వైద్యులు. ఆయనకు హెూమియోపతి, అల్లోపతి, ఆయుర్వేద వైద్య విధానాలు బాగా తెలుసు. కొత్తచెరువు మండలంలోని ప్రజలకు ఆయన ఆపద్బాంధవుడు.’వైద్యోనారాయణహరి’ అన్నమాటను సార్థకం చేసిన మహానుభావుడు. ఆయన తన కుమారుడు బెళ్ళూరి ఎప్పుడూ ప్రకృతిని కలవరిస్తూ కవిత్వాన్నిపలవరిస్తూండటం చూసి “ఒరేయ్’! కవిత్వ పైత్యమే వద్దు, హాయిగా ఏదైన మంచి ఉద్యోగం చేసుకో సుఖపడతావు’ అని గట్టిగా మందలించేవాడు. శ్రీనివాసమూర్తి ఇవేమి పట్టించుకోకుండా చివరికి ఇల్లు వదలి పెట్టి పూరిగడిసెలో వుంటూ, ఒకవైపు తన కవితా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, మరోవైపు స్వయంకృషితో కష్టపడి చదివివిద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడైనాడు. ఆ తరువాత తెలుగు పండిత శిక్షణ పూర్తిచేసి, తెలుగు పండితులుగా ఉద్యోగాన్ని సాధించాడు. ఈ విషయాన్నే తన కావ్యంలో ఒక చోట ఇలా చెపుతాడు.
తే॥ కాంక్షలే వేరు, నా మనోగతులే వేరుపూరిగుడిసెలలోనైన వుత్తుగాని,గీతమల్లక బ్రతుకు సాగింపలేనుభావగానంచె నాదు సర్వస్వమవని.
పెనుకొండ జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తూ, వుండిన పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు గారికి శిష్యులై శిష్టసాహిత్యా ధ్యయనం చేశారు. ఆయన పుత్రుడు పుట్టపర్తి నారాయణచార్యులు బెళ్ళూరికి ప్రియమిత్రులు,పెన్నేటి పాటరాసిన ‘విద్వాన్ విశ్వం’ కూడా వీరికి బాల్యమిత్రులు. అప్పట్లో ఈముగ్గురిని ‘రాయలసీమ కవిత్రయం’ అని చెప్పుకోవడం విశేషం. ఆ రోజుల్లోనేబెళ్ళూరి, వేదాంతం నరసింహారెడ్డి, తలమర్ల కళానిధి ఈ ముగ్గురిని తలమర్ల కవిత్రయంగా చెప్పుకునే వారు. సుమారు మూడు దశాబ్దాలు జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలల్లో ప్రధానాంధ్ర పండితులుగా కళ్యాణదుర్గం, కదిరి, బుక్కపట్నం, కుంది మద్దిలలో పనిచేశారు. పదవీ విరమణ కూడా అహర్నిశం ఆటుపోట్లను తట్టుకుంటూ తన సాహితీ యజ్ఞాన్నినిర్విఘ్నంగా నిర్వహించారు. తాను కవిత్వాన్ని సృజించటమే గాకుండా ఎందరో వర్తమాన కవులను,రచయితలను ప్రోత్సహించి సాహిత్య కారులుగా తీర్చిదిద్దారు. వీరిలో ప్రసిద్ధులు తలమర్ల కళానిధి, గండ్లూరి దత్తా శ్రేయశర్మ, విద్వాన్ తిప్పన్న తదితరులు… బెళ్ళూరి వారే తనకు సాహిత్య మార్గదర్శనం చేసినట్లు తలమర్ల తన ఆత్మకథలో కూడా రాసుకున్నారు. శ్రీనివాసమూర్తి రాసిన ఖండ కావ్యాలన్నీ కలకండ సదృశాలే. తపోవనం, కావ్యగంగ, అమృతాభిషేకము విశ్వవైణికుడు, జాముకోడి, శిల్పవాణి, వివేకానంద మొదలైనవన్ని ఖండకృతులు. వీరి మృదుమధుర కవితాపటిమకు మచ్చుతునకలు. వీరు రచించిన ‘రెడ్డి రాజ్యమహెూదయము’ను మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారికి అంకితం చేశారు. బెళ్ళూరి రచనలు చాలా వరకు ఆనాటి ప్రసిద్ధ సాహిత్య పత్రిక ‘భారతి’లోప్రచురితమైనాయి. ఆయన రచించిన ‘కావ్యగంగ’ను మైసూరు విశ్వ విద్యాలయము వారు బి.ఏ., బి.ఎస్.సి., విద్యార్థు లకు పాఠ్యగ్రంథంగా తీసుకున్నారు. వారి శిల్పవాణి’ కావ్యంలో ఒక శిల్ప విలాసిని తన స్వీయాను భవమును నివేదించుకుంటుంది. ఇందులో రాయల రాజ్యాంగం, సాహితీ సమారాధనం, ఆనాటి సంస్కృతి సంగ్రహంగా నిక్షిప్తమై త్రివేణీ సంగమంలా నిండి తొణికిసలాడుతుంది. భారతీయ యువతను తన ఉపన్యాసాలతో ఉత్తేజితులను చేసిన స్వామి వివేకానందుని గురించి ‘వివేకానందం’ రచించారు. ఇది ద్విపద కావ్యం.రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. వీరి ‘సుందర వస్తు ప్రపంచం విశాలమైనది’ అంటూబెళ్ళూరిని ప్రశంసించడం ఎంతో విశేషం.వీరి ‘తపోవనం’ కావ్యంలోని కొన్ని ఘట్టాలను శ్రీ కృష్ణదేవరాయ విద్యాలయము మరియు ఇతర విశ్వవిద్యాలయాలు, డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశా లుగా నిర్ణయించారు. ఇందులో ఆయన ఆ రోజుల్లో ‘ధాతుకరువు డొక్కల కరువు’ లాంటివి సంభవిస్తే ప్రజలు ఎంతగా అల్లాడిపోయారో ఎంతగా అలమ టించారో మనకు అవగతమవుతుంది. అంతేకాదు ఆ దుర్భర పరిస్థితుల్లో విధిలేక చేతిలో మట్టి చిప్పలు పట్టుకొని గంజి కేంద్రాల వద్ద బారులుగా నిలబడిన అన్నార్తుల దయనీయ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు అక్షరబద్ధం చేశారు బెళ్ళూరి. క్రింది పద్యాలుచదివితే మానవత్వమున్న మనిషి విలపించక మానడు.
కం|| ముదుసల్లు, స్త్రీలు, పురుషులుపెదవులు తడియారు చంటిబిడ్డలు, మెయిపయ్యెదతిమి సిగ్గు మరచినసుదతులు గలరిందు క్షుద్బాధకు సోలినడచుచున్
ఆకలితో నకనకలాడే మూడు కాళ్ల ముదుసలులు, పెదవుల తడియారి తల్లడిల్లుతున్నచంటిపాపలు, తమ ఒంటిని కప్పుకోవడానికి పైటలు లేని కారణంగా సిగ్గునే మరచిన స్త్రీలు, వారు వీరననేల క్షుద్బాధితు లెల్లరు ప్రత్యక్షమైనారని పై పద్యంలో వివరిస్తారు. క్షామపీడిత ప్రాంత సమస్యలపై చిత్రించిన యీఖండిక వీరిని’అనంతమహాకవి’గా నిలబెట్టింది. బెళ్ళూరి వైయుక్తిక జీవితం తీవ్ర ఆవేదనా భరితంగా సాగింది. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు… నలుగురిని ఆయన కోల్పోగా ఇద్దరు అమ్మాయిలు మిగిలారు. వారే సరోజమ్మ, భారతి. బిడ్డలనుకోల్పోయినపుడు ఆయనపడిన మానసిక క్షోభ వర్ణనాతీతం. ఈ పీనుగుల పెన్నేటి గడ్డపై పుట్టిన అక్షర శ్రీమంతుని పీడించిన దారిద్ర్యమెంత భయంకర మైనదో ఆయన ‘అమృతాభిషేకం’లో పాడుకున్న పాటను వింటే ప్రతివారి కంట వేడి కన్నీరు బొట్టు బొట బొట కారకమానవు.
పాట : చాలా చిన్నదిరా ! నా యిల్లు చాలా చిన్నదిరా ! ||నా |నా మీద ప్రేమతో నావాకిటనునన్ను బిలువు గాని ఆతిథ్యమెటు సేతురా !నా బ్రతుకు అంతటికి నోచదయ్యెనురా ! |నా॥||నా||చిన్న దివ్వెయు లేదురా !నీ రాక చిత్తమున వెత గూర్చురా !మిత్రమై నాతోడ మెలగి ముచ్చటలాడఅరుదెంతువేగాని – చిరుచాపయున లేదురా !కూర్చుండ శిథిల భూభాగంబురా !కనుల నిండుగ నీరు – గ్రమ్ముకొని నీ చెంతపాటలే వినిపింతురా !నా బ్రతుకు పాటతో పయనింతురా ! ||నాయిల్లు!!
బెళ్ళూరికి మధురకవి, రాయలసీమ కవికోకిల, కళాతపస్వి, అభినవ కాళిదాసు, ఆంధ్రకీట్స్ మొదలైన బిరుదులు పొంబదారు. పోతన వలెఇతను సాధారణ జీవితాన్ని గడిపిన ధీశాలి. వృద్ధాప్యంలో నడుమునొప్పితో బాధపడుతూ మంచానికే పరిమితమై 78 సంవత్సరాలు జీవించాడు. సరిగ్గా తాను పుట్టిన రోజు తరువాత ఒక రోజు అనగా 1988 సం|| ఫిబ్రవరి 5వ తేదీనపరమపదించారు. బెళ్ళూరి భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి అనల్పాక్షర కీర్తి నవనవోన్మేష స్ఫూర్తియై భావికవులకు, రచయితలకు మార్గదర్శనం చేయిస్తూ వుంటుంది.
__ఏలూరి ఎంగన్న