
విద్యావేత్త, తిరుపతికి చెందిన తొలితరం నాయకులు, సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ గా ఎదిగారు. నిగర్వి ,ఉన్నతభావాలు కలిగిన వ్యక్తి. స్వతంత్ర పార్టీ అభ్యర్థి గా శాసనసభ కు ఎన్నికైయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకరు డాక్టర్ అగరాల ఈశ్వర రెడ్డి .
అగరాల ఈశ్వర రెడ్డి 1932 వ సంవత్సరం డిసెంబరు 28 న తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం తూకివాకం లో జన్మించారు.
డాక్టర్ అగరాల ఈశ్వర రెడ్డి మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి డిగ్రీ పట్టా పొందారు.
మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు.
మద్రాస్ లా కళాశాల నుంచి బీఎల్ డిగ్రీ పొందారు. అలాగే రాంచీ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పిహెచ్. డి డాక్టరేట్ పొందారు.
1957 లో తూకివాకం సర్పంచ్ గా ఎన్నికైయ్యారు. ఆచార్య ఎన్జీరంగా, మాడభూషి అనంతశయనం అయ్యంగార్లకు శిష్యుడిగా గుర్తింపు పొందారు.
1962 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి నాథముని రెడ్డి చేతిలో స్వల్ప తేడా తో ఓడిపోయారు.
1967వ సంవత్సరములో జరిగిన నాల్గవ శాసనసభ ఎన్నికల్లో తిరిగి తిరుపతి అసెంబ్లీ నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పందర్వేటి గురవా రెడ్డి పై ఈ ఎన్నికల్లో 34వేల పైచిలుకు మెజార్టి సాధించారు.
1978వ సంవత్సరములో ఆరవ శాసనసభకు తిరుపతి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసి రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో గురవా రెడ్డి తిరిగి స్వతంత్ర అభ్యర్థి గా తలపడ్డారు ఓడిపోయారు.
రెండవ సారి ఎమ్మెల్యే గా ఎన్నికైన ఈశ్వరరెడ్డి
1980-1981 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభుత్వ సంస్థల కమిటీకి అధ్యక్షునిగా పనిచేశాడు.
1981 మార్చి 23 నుంచి 1982 సెప్టెంబర్ 6 వరకు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. డిప్యూటీ స్పీకరు హోదాలో అర్జీల, విశేషాధికారాల కమిటీల అధ్యక్షులుగా పనిచేశాడు.
తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గా పనిచేసిన కాలంలో ఈశ్వరరెడ్డి 1982 సెప్టెంబర్ 7 నుంచి 1983 జనవరి16 వరకు స్పీకర్గా పనిచేశారు.
సభానిర్వహణ విషయంలో నియమ నిబంధనలను సమర్థవంతముగా అమలు చేసాడు. సభ్యులు ప్రసంగాలు చేసే సమయంలో సంయమనం పాటించి, నిరాధారమైన ఆరోపణలు చేయరాదని పలు ప్రశస్తమైన రూలింగులను ఇచ్చాడు.
1983లో ఈశ్వరరెడ్డి మూడవసారి తిరుపతి అసెంబ్లీ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేశారు.
తెలుగ దేశం ప్రభంజనంలో
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.తిరుపతి, రేణిగుంటలలో విద్యా సంస్థలు స్థాపించి విద్యాదానం చేస్తున్నారు.
రాజకీయలకే పరిమితము కాలేదు.పేరుపొందిన రచయిత గా గుర్తింపు పొందారు “లోక్ సభ ఎలక్షన్స్ ఇన్ 1977 అండ్ 1980 ఇన్ ఆంధ్రప్రదేశ్”,
“ది ఎలక్టోరల్ రిఫామ్స్ ఇన్ ఇండియా”,
“స్టేట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా మరియు
హు హై ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్ టుడే” పుస్తకాలను రచించి ప్రచురించాడు. ది హిందూ, ఆంధ్రజ్యోతి, డక్కన్ క్రానికల్ మొదలైన వార్తా పత్రికలలో వ్యాసాలు రాస్తుండేవారు.
రేడియోల్లో ప్రసంగించారు.
ఇతను ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షునిగా, ఐ.ఐ.పి.ఎ. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా, మాడభూషి అనంతశయనం ఇన్స్టిట్యూట్ అధ్యక్షులుగా ఉన్నాడు.
అంతేకాక ఎస్.వి. యూనివర్సిటీ సిండికేట్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ బోర్డు సభ్యునిగా, ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ సభ్యునిగా పనిచేశాడు.
ఈయన యు.కె, యురోప్, రష్యా, చైనా,అమెరికా దేశాలలో పర్యటించాడు.
ఈయన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు నిచ్చి సత్కరించింది.
2020 ఫిబ్రవరి 16న
గుండెపోటుతో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
డాక్టర్ ఈశ్వర రెడ్డి కి
ఒక కుమారుడు, కుమార్తె . కుమారుడుతిరుపతి లోనే స్థిర పడగా కుమార్తె చెన్నైలో వైద్యురాలి గా స్థిరపడ్డారు.
