(అనంతసాగరం దినపత్రికలో ప్రచురితం)           రాయలసీమ  పేరుతో  ఒక భౌగోళిక స్వరూపం సంతరించడం 1928 నాటికి జరిగింది.ఇనుప యుగంలో కొన్ని గ్రామ సముదాయాలతో ఉండింది ఈ ప్రాంతమంతా.జనపదాల నుంచి రాచరిక వ్యవస్థ లోకి వచ్చిన తర్వాత ఆ నాటి రాజుల శాసనాల ఆధారంగా మనకు కొన్ని సామాజిక పరిస్థితులు తెలుస్తున్నాయి. అయితే రాయలసీమ ప్రాంత  సామాజిక పరిస్థితులు విజయనగర రాజుల కాలం నుండి వివిధ రచనల ద్వారా తెలుస్తున్నాయి.అందువల్ల రాయలసీమ ప్రాంతాన్ని ఆనాటి  మొత్తం తెలుగు సమాజపు సామాజిక పరిస్థితులలో భాగంగానే పరిశీలించాల్సి వుంటుంది.           క్రీ.పూ.4వ శతాబ్దం నాటికే ఆంధ్రులకు 30 నగరాల సామాజిక , రాజకీయ వ్యవస్థలుండేవని మెగస్తనీస్, తరువాత ఏరియన్ అనే గ్రీకు రచయితలు రాశారు .             కోటిలింగాల , పెద్ద బంకూరు , ధూళి కట్ట , ఎమునూరు మొదలైన స్థలాల తవ్వకాలలో లభించిన క్రీ.పూ.5 – 3 శతాబ్దాల నాటి పంచ్ మార్క్ డ్ నాణేలు , కుండ పెంకులు , ఇనుప వస్తువులు ఆనాటికే జనపదాలున్నాయని రుజువు చేస్తున్నాయి .         తెలుగు నేలపై ఇనుప యుగపు చివరి రోజుల్లో రాచరిక వ్యవస్థ కు దారితీశాయి. చారిత్రక తొలియుగమైన   క్రీ . పూ . 6 , 5 శతాబ్దాల కాలంలో ఉత్తరాదిలో మాదిరిగా తెలుగు ప్రాంతం  గోదావరి లోయలో అశ్మక , ములక , మజీరక ( మోసలి ) లాంటి జనపదాలు ఉండేవి.కృష్ణాజిల్లా కేసరపల్లి అమరావతి ప్రాంతాల్లో దొరికిన లిపిలేని నాణ్యాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతేగాక బుద్ధునికి సమకాలికుడైన బావరి అనే బౌద్ధ చార్యుడు క్రీ.పూ.6వ శతాబ్దం లో ఉత్తర భారతదేశం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి  ఈ జనపదాల సరిహద్దుల్లో ఆశ్రమాన్ని నిర్మించుకుని విద్యా బోధన చేశాడని సుత్తనిపాతం అనే బౌద్ధ గ్రంథం చెబుతోంది. అటు తర్వాత రాయలసీమ ఆంధ్ర ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలోకి వచ్చినట్లు కర్నూలు జిల్లా ఎర్రగుడి, రాజుల మందగిరి, అమరావతి శాసనాల వల్ల తెలుస్తోంది. అశోకుని తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని రేనాటి చోళులు పాలించినట్లు కడప జిల్లా లో దొరికిన శాసనాల వల్ల తెలుస్తోంది. వీరంతా  శాతవాహనులకు ముందరిరాజులు.            క్రీ.పూ.9వ శతాబ్దినాటికే ఆంధ్రులకు సమాజం , రాజకీయ వ్యవస్థలు ఉన్నాయని రుగ్వేద సంబంధ ఐతరేయ బ్రాహ్మణం , మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి . 
            తెలుగు ప్రాంతంలో స్పష్టంగా తెలుస్తున్న మొదటి స్వతంత్ర రాజవంశం,సామ్రాజ్యం శాతవాహనులది . వీరు సుమారు క్రీ . పూ .80 నుండి క్రీ . శ . 230 సంవత్సరాల మధ్య అఖిలాంధ్ర దేశాన్ని , ఇతర దక్కను రాష్ట్రాలను పాలించారు.  శాతవాహన చక్రవర్తి హాలుడు సంకలనం చేసిన గాధాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథ, శర్వవర్మ సంస్కృతం లో రాసిన స్వాతంత్ర వ్యాకరణం, వాత్సాయన కామ సూత్రాలు శాతవాహన కాలం నాటి గ్రంథాలలో పేర్కొనదగినవి.   వీరి అనంతరం ఇక్ష్వాకులు కృష్ణానదీ లోయలో తెలంగాణ , రాయలసీమ , కోస్తాంధ్ర మధ్య కూడలి ప్రాంతాన్ని విజయపురి నుండి క్రీ . శ . 225 నుండి 300 వరకు పాలించారు . వీరికి ఇంచు మించుసమకాలికులుగా శకులగు ( విదేశీయులు ) అభీరకులు తెలంగాణాలోను , బహఫలస లేదా బృహత్పలాయనుల జయవర్మ ( శకులు  ) కృష్ణానది ఉత్తర ముఖద్వారం లోను ( క్రీ.శ. 300 – 325 ) పాలించారు . శాలంకాయనులు మొదట శాతవాహన సామంతులుగా ఉండి క్రీ . శ . 320 నుండి 455 వరకు ఉత్తర తీరాంధ్ర ప్రాంతాన్ని వేంగీ రాజధానిగా పాలించారు . వీరికి ( కృష్ణానదికి ) దక్షిణంగా కర్మ రాష్ట్రాన్ని కందారపురం రాజధానిగా ఆనంద గోత్రీకులు (క్రీ.శ.350 – 525 ) పాలించారు .   ‌‌           దక్షిణంగా తమిళనాడులోని కంచి రాజధానిగా పల్లవులు (క్రీ.శ.300 – 630 )ఆంధ్రప్రదేశ్ లో కృష్ణకు దక్షిణంగా గల *రాయలసీమ*ను , నెల్లూరు , ప్రకాశం , గుంటూరు జిల్లాల వరకు గల ప్రాంతాలను పాలించారు.                శాతవాహనుల తర్వాత వారిలో  విష్ణుకుండినులు కృష్ణా – నర్మదా నదుల మధ్య ప్రాంతాన్ని క్రీ . శ . 375 – 612ల మధ్య పాలించారు . వీరి అనంతరం 18 సంవత్సరాలు గోదావరి , ఖమ్మం , నల్గొండల ప్రాంతాన్ని రణదుర్జయులు , గోదావరి ప్రాంతాన్ని మూలరాజు వంశస్థులు పాలించారు.వీరి తరువాత బాదామి(తూర్పు లేదా వేంగీ) చాళుక్యులు (క్రీ.శ.616_1075)  మహబూబ్ నగర్ కర్నూల్ మధ్య సంగమేశ్వరం లేదా తుమ్మెయనూరులో పుట్టి పశ్చిమంగా విస్తరించారు.           వీరికి సామంతులుగా కడప , కర్నూలు , చిత్తూరు ప్రాంతాన్ని రేనాటి చోళులు ( క్రీ.శ. 550 – 750 / 850 ) పాలించారు.రేనాటి చోళులు రాయలసీమలో 7000 గ్రామాల తో కూడిన కడప కర్నూలు చిత్తూరు ప్రాంతాలను పాలించారు వీరు చంద్రవంశజులమని, కరికాల వంశజులమని చెప్పుకున్నారు.వాళ్లు మొదట పల్లవులకు తర్వాత పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు రేనాటి చోళులు దాదాపు మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు. 13 మంది రాజులున్నారు.క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం మండలం లోని కలమల్లలో ఎరికల్ ముత్తు రాజు బిరుదు గల ధనంజయుడనే రాజు రేనాడును పరిపాలిస్తున్న కాలంలో వేయించిన శాసనం , కమలాపురం లోని ఎర్రగుడిపాడు దగ్గర లభించిన క్రీ.శ.600 నాటి శాసనం, కమలాపురంలోనే ఇందుకూరు లో ధనంజయుని కొడుకు చోర మహారాజు వేయించిన  శాసనం,వీరి పాలన రాయలసీమ లో ఉన్నట్లు ధృవ పరుస్తున్నాయి. క్రీ.శ. 643 లో తూర్పు చాళుక్య రాజైన జయసింహ వల్లభుడు వేసిన విప్పర్ల చేజెర్ల శాసనం కూడా ఇందుకు ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.                రేనాటి చోళుల పతనం తర్వాత రాయలసీమ లో చాలా కాలం అతిపెద్ద రాజ్యం ఏదీ పరిపాలించ లేదు. వీరి తర్వాత బాణులు(క్రీ.శ.795_911),నొలంబులు(క్రీ.శ.770-975),వైదంబులు(క్రీ.శ.910-970) పాలించినట్లు తెలుస్తోంది. వీరు కూడా పల్లవులకు పశ్చిమ చాళుక్యులకు చోళులకు సామంతులుగా వ్యవహరిస్తూ వాళ్ల  బిరుద నామాలను ధరించారు. వీర చరిత్ర గొప్పగా లేకపోయినా తెలుగు భాషా సాహిత్య చరిత్రలో వీరికి గొప్ప స్థానం ఉంది.రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలను చోళులు కూడా పరిపాలించినట్లు తెలుస్తోంది.తెలుగు చోడ వంశానికి చెందిన జటాచోట భీముడు(క్రీ.శ.973-1000) కర్నూలు జిల్లా పెడకల్లు నుంచి పాలించేవాడు. చోళ చక్రవర్తి రాజేంద్రుడు తన సైన్యాధిపతి చోళ వీరాయన్ ను పంపి కుంతల, తెలుంగు,కళింగ,వడ్డె రాజ్యాలను జయించి వేంగీశ్వరునిగా ప్రకటించుకున్నాడని అనంతపురం జిల్లా కొత్త శివారం శాసనంలో ఉంది.ఇతను తన కుమార్తె అమ్మంగదేవిని రాజరాజు కిచ్చి వివాహం చేసి క్రీ.శ.1022లో అతనిని పట్టాభిషిక్తున్ని చేశాడు. రాజరాజు ఆస్థాన కవి నన్నయ.ఇతను సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఇలా కేవలం చిన్న చిన్న రాజ్యాధినేతలుగా ఉండి పరస్పరం కలహించు కుంటూ ఉండేవారు. వీరిలో చాలామంది తెలుగు ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూటులకు, తర్వాత కాకతీయు లకు సామంతులుగా ఉన్నారు. మొత్తం మీద చూస్తే, మనం రాయలసీమగా పిలుస్తున్న మొత్తం ప్రాంతాన్ని పాలించిన రాజులు రేనాటి చోళులు ఒఆతమాత్రమే. ఆ తరువాత విజయ నగర రాజులు.        తెలుగువారైన విజయనగర రాజులు  క్రీ.శ. 1485 నుండి ఎక్కువగా రాయలసీమను . కొంత కాలం కోస్తాంధ్రను , ఆగ్నేయ తెలంగాణాలను పాలించారు. కానీక్రీ.శ. 1565లో జరిగిన తల్లికోట యుద్ధంలో ఇతర బహమనీ రాజులతో కలిసి కుతుబ్ షాహీలు వీరిని ఓడించడంతో  వీరి పాలన అంతమైంది. మహమ్మదీయులపాలన ప్రారంభమైంది.విజయనగర రాజులలో శ్రీకృష్ణదేవ రాయలు(క్రీ.శ.1509-క్రీ.శ.1529) అగ్రగణ్యుడు.ఇతను క్రీ.శ. 1509లో సింహాసనం అధిష్టించాడు. రాయలు పరిపాలించింది 20 సంవత్సరాలు మాత్రమే. ఆ కొద్ది కాలంలోనే అనేక విజయాలను సాధించి సామ్రాజ్యాన్ని నిర్మించాడు.సాహిత్య పోషకునిగా, కళా పోషకుడిగా అజరామరమైన కీర్తిని సంపాదించాడు. ఇతను కర్ణాటక ఆంధ్ర సంస్కృత భాషలలో విద్వాంసుడు. ఆంధ్ర భోజుడుగా కీర్తింపబడినాడు.  ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. అల్లసాని పెద్దన  అతని ఆస్థాన కవి.రాయలు తెలుగులో ఆముక్తమాల్యద రాశాడు. భువనవిజయం అన్న ప్రసిద్ధమైన రాయల దర్బార్ లో వేడుకలు జరిగేవి. కృష్ణదేవరాయల ఆస్థానంలో తెలుగు కవులే కాక సంస్కృత తమిళ కర్ణాటక భాషా కవులు కూడా ఆదరణ పొందారు.ఈయన కాలంలోనే పురందరదాసు కనకదాసు లు కీర్తన రాసి దాస సాహిత్యాన్ని పరాకాష్టకు చేర్చారు.రాయల కాలంలో వచ్చిన కావ్యాలకు ప్రబంధాలు అని పేరు. పెద్దన రాసిన మనుచరిత్ర, రామరాజభూషణుడు వసుచరిత్ర మొదలైన ప్రబంధకావ్యాలన్నీ రాయల కాలంలోనే  రాయబడిన   స్వతంత్ర కావ్యాలు.            శాతవాహనులు , ఇక్ష్వాకులు మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరించారు.  చాళుక్యులు విభిన్న పాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు . కాకతీయులు జనరంజకమైన ‘ నాయంకర ‘ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టి స్థానిక పాలనకు అవకాశమిస్తూ పాలించారు . వీరి విధానాన్నే విజయనగర రాజులు కూడా పాటించారు.         ఆంధ్రరాజులు ఎక్కువగా బ్రాహ్మణ , క్షత్రియ వరాలను , సూర్య చంద్ర వంశాలను తమ మాతృకగా చెప్పుకున్నారు . ఉదాహరణకు విష్ణుకుండినులు ” బ్రహ్మక్షాత్ర తేజోభృతాం ” అని , శాలంకాయనులు చతుర్వేదులైన రథకారులమని , చాళుక్యులు చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకున్నారు.కాని అమ్మ రాజు,దానార్ణవుడు,కామార్ణవుడు, రాజరాజనరేంద్రుడు లాంటి పేర్లను బట్టి,వరాహం లాంటి రాజ చిహ్నాలను బట్టి చూస్తే వీరు మొదట శూద్రులే అని , చిరకాలం పాలించి తమను తాము  క్షత్రియులుగా ప్రకటించుకొన్నారని తెలు స్తోంది. అభీరకులు , బృహత్పలాయనుల లాంటి విదేశీ శక యవనులు,ఆటవిక జాతులు కూడా పాలక వంశాలయ్యాయి. వీరు బ్రాహ్మణులతో సామంతులతో,శకులతో వైవాహిక సంబంధాలు పెట్టుకొని వర్ణసంకరం చెందారు. కానీ వీరు మాత్రం   ఇతరులు వర్ణధర్మాన్ని అతిక్రమించి, వర్ణసంకరం కాకుండా చూసేందుకు బ్రాహ్మణులకు అగ్రహారాలు, మాన్యాలిచ్చారు.బ్రాహ్మణ విద్యాలయాలను(ఘటికలను) పోషించారు.
        ఆర్యుల దండయాత్రల వల్ల ఆంధ్రులనే  ద్రావిడ తెగ ఉత్తరదేశంనుండి ఇక్కడకు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే చాలామంది జైనులు , బౌద్ధులు, బ్రాహ్మణులు కూడా ఉత్తర భారత దేశం నుండి తెలుగు ప్రాంతానికి వలస వచ్చారు. వీరి రాకతో తెలుగు ప్రజల సంస్కృతి లో కూడా  పలుమార్పులు వచ్చాయి. తూర్పు చాళుక్యుల కాలంలో రాయలసీమలోని  కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర  దానవులపాడు ఒక గొప్ప జైనక్షేత్రంగా వర్ధిల్లింది.  కడప జిల్లాలో నిసిద్ధవటం , అనంతపురం జిల్లాలో ని పేరూరు,కొనకొండ్ల,కంబదూరు రాయదుర్గం, కర్నూలు జిల్లాలో ఆదోని, పెద్ద తుంబలం వద్ద జైనస్థావరాలు నెలకొన్నాయి. చోళుల కాలంలో కూడా  జైన మతం రాయలసీమలో అక్కడక్కడ నిలదొక్కుకుంది. బౌద్ధమతం కొద్దిగా నిలబడింది. .ఎర్రబాలెం లోని బౌద్ధ విహారానికి వెలనాటి చోళులు దానాలు చేశారు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం, తిక్కన రాసిన నిర్వచనోత్తర రామాయణం చాళుక్య చోళుల కాలంలో  వచ్చాయి. బ్రాహ్మణులు 9వ శతాబ్దం వరకు సమాజంలో ఎక్కువ గౌరవం పొందారు. వీరికున్న పాండిత్యం కారణంగా అనేక  పదవులు అనుభవించారు. 11వ శతాబ్దం నాటికి వీరిలో వైదికులు , నియోగులు అనే శాఖలు ఏర్పడ్డాయి. వీరికి పాలకులు అగ్రహారాలు, మాన్యా లిచ్చి వైదిక ,వర్ణధర్మాలనుద్ధరించడానికి ఉయోగించారు . ఘటికల్లో (విద్యాకేంద్రా)ల్లో వీరే గురువులు.పౌరోహిత్యం వీరి ప్రధాన వృత్తి.అయినప్పటికీ శాలంకాయనులు చతుర్వేద రథకారులు అనడాన్ని బట్టి వీరు అక్కడక్కడ శూద్ర వృత్తులను అనుసరించారని అర్థమవుతోంది . కాకతీయులు రాక పూర్వం రాజకీయ అనైక్యత ఉండటం వల్ల,  శూద్రులకు సైనిక , ఉద్యోగ వ్యవస్థల్లో ప్రాధాన్య మివ్వడం వల్ల బ్రాహ్మణులు కర్నాటకకు, తమిళనాడుకువలసపోయారు. వారి మాతృస్థానాన్ని బట్టి వారిలో ఆరువేలనాటి , వేగినాటి,ములికినాటి , కమ్మనాటి అనే భేదాలు వచ్చాయి. కందుకూరు నెల్లూరు మధ్య గల ప్రాంతాన్ని పాకనాడు, కడప, కర్నూలు మధ్య గల ఈ ప్రాంతాన్ని రేనాడు, మాచర్ల గురజాల ను పల్నాడు, ఒంగోలు బాపట్ల నరసరావుపేట లను కమ్మనాడు అని పిలిచేవారు ఆ రోజుల్లో.ఆయా ప్రాంతం నుంచి వచ్చిన దాన్ని బట్టి బ్రాహ్మణులను ఆయా బ్రాహ్మణులుగా పిలిచేవారు. కమ్మనాడు బ్రాహ్మణులను కమ్మనాటి బ్రాహ్మణులుగా పిలిచేవారు.            శాతవాహనులు , ఇక్ష్వాకుల కాలంలో వైశ్యులు నిగమసభలు ఏర్పాటు చేసుకొని శ్రేష్టి ఆధ్వర్యంలో దేశ , విదేశ వర్తక – వాణిజ్యాలు నిర్వహించేవారు . నగర పాలనలో వీరిది ప్రధానపాత్ర. తెలంగాణలో వీరిని కోమట్లు అంటారు . బోధన్ రాజదేవుడు గోమఠేశ్వరుని భక్తులు కాబట్టి వారికా పేరు వచ్చింది అంటారు . ఇక్ష్వాకుల అనంతరం విదేశీ వాణిజ్యం క్షీణించడంతో స్థానికంగా వస్తువులు అమ్మటం , వడ్డీ తాకట్టు వ్యాపారం చేయడం వీరి వృత్తి అయింది . 6,7 శతాబ్దాలలో మనకు కనిపించే గౌరులు, గౌడ ప్రాంతం( నేటి బెంగాల్ ) నుండివచ్చారు. బలిజలు ( బాహుబలి గోమఠేశ్వరుడు ) కూడా కోమట్లే . తూర్పు చాళుక్యుల కాలంలో వర్తక సంఘాలను నకరములు అన్నారు. ఈ నకర మునకు అధిపతిని శ్రేష్టి అనేవారు.వీరిలో అనేక శాఖలు ఏర్పడ్డాయి . 714 గోత్రాలు , కమ్మనాటి లాంటి ప్రాంతీయ భేదాలున్నాయని చెపుతారు.             ఎక్కువగా శూద్రవర్ణంలోనే   ఉపవర్గాలు , కులాలు ఏర్పడ్డాయి. వ్యవసాయం,వర్తకం,ఇతర సేవలు చేయడం వీరి ప్రధాన వృత్తి ( ధర్మం ).శాతవాహనుల కాలం నుండే మనకు నేత , వడ్రంగం . గోవులు మేపడం లాంటి వృత్తులు ఉండేవి. చాళుక్యుల కాలంలో పశువుల సహాయంతో వ్యాపారులకు వర్తక సామాగ్రిని చేరవేసే వారిని పెరికలు అనేవారు . గ్రామాలలో చేతివృత్తులు వీరివే . నిజానికి ఆంధ్ర దేశాన్ని పాలించిన వెలనాటి చోడులు , బోయలు మొదలైన వారంతా శూద్రులే.  క్షాత్రధర్మాన్ని అనుసరించి,క్షత్రియులతో వివాహ సంబంధాలు నెరిపి క్షత్రియులైనారు . పుళింద అనే శూద్ర వర్ణాన్ని నాలుగు వర్ణాల రక్షణకై బ్రహ్మదేవుడు సృష్టించారని రాయించు కున్నారు.         12వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చిన కుల వ్యతిరేక మత శాఖలు  వీరశైవం,వీరవైష్ణవం ఆవిర్భవించాయి.ఆవి కుల నిర్మూలన చేయకపోగా లింగాయత,సాతాని,బలిజ అనే కొత్త కులాల సృష్టికి కారణమయ్యాయి .       ‌     క్రీ.శ.7,8శతాబ్దాలలో యుద్దావసరాల కోసం రాజులు   శూద్రులను  సైనికులుగా, రాజోద్యోగులుగా   నియమించు కున్నారు. అలాంటి వారిలో పంట కాపులైన రెడ్లు, వెలమలు ప్రధానమైన వారు. వీరే తదనంతర కాలంలో స్వతంత్ర రాజులయ్యారు.              ఒక శతాబ్దిన్నర కాలం వీరు పాలించారు.కానీ వీరు పరస్పరకలహాల వల్ల తమ రాజ్యాలు కోల్పోయారు. రెడ్లు , వెలమల తరువాత కమ్మలు , కాపులు బలపడ్డారు . ఈ కారణాల వలన శూద్రులకు సమాజంలో అగ్రతాంబూలాలు అందుకునే పై మూడు వర్ణాలైన ద్విజులకు ఉండే విద్యాభ్యాసం లాంటి అర్హతలు  లేకపోయి నప్పటికీ 11వ శతాబ్ది కల్లా సుగుణాలు కలిగిన శూద్రులుగా ‘ సచ్చూద్రులై’ అగ్రవర్ణ అర్హతను సమాజంలో సాధించుకొన్నారు.
           విజయనగర రాజుల కాలానికల్లా అన్ని వర్ణధర్మాలూ కలుషితమయ్యాయి . బ్రాహ్మణుల్లో పూజారులు , మఠాధిపతులు , భూస్వాములు , మంత్రి , దండనాయక మొదలగు ఉద్యోగులు , వర్తకులు , భోక్తలు అనే వర్ణాలున్నాయని సమకాలీన యాత్రికులు బార్బోసా , పేస్ అభిప్రాయపడ్డారు . అర్చకులు , పూజారులు దేవద్రవ్యాన్ని హరించి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారు . వైశ్యులు వాణిజ్యంలో నీతి తప్పారు . పంచాణం వారు దొంగసొమ్ము (లోహాలను ) కొనే వారని  ‘వైజయంతీ విలాసం’లో పేర్కొన్నారు.
           క్రీ . పూ . 6వ శతాబ్దపు ఇనుప యుగం కాలానికే వ్యవసాయదారులు చర్మకారులను, వారి వృత్తిని చండాలమైనదిగా , అనారోగ్యకరమైనదిగా భావించి సమాజానికి దూరంగా ఉంచారని తెలుస్తోంది. అయితే బౌద్ధమతంలో వీరిపై ఎలాంటి బేధభావాలు లేవనడానికి నిదర్శనం విధిక అనే చర్మకారుడు ధాన్యకటక స్తూపాన్ని కుటుంబ సమేతంగా దర్శించి దానం చేశాడనే శాసనం లభించడం . అయితే హిందూ మతంలోబ్రాహ్మణ స్త్రీకి , శూద్ర పురుషుడికి పుట్టిన సంతానాన్ని చండాలులగా మనుస్మృతి చెప్పింది.అందువల్లఅధికారులుగా, చారులుగా , భటులుగా అంటరానివారు  అగ్రహారాలలో ప్రవేశించి బ్రాహ్మణుల నుంచి సొమ్మును వసూలు చేయడం లాంటి అసాంఘిక చర్యలు చేపట్టరాదనే నిబంధనలుండేవి.మాలలు , మాదిగలు , చండాలులు , మాతంగులు , అంతేవాసినులు , నిషాదులు మొదలైనవారు ఊరు చివరన వెలివాడల్లో జీవించేవారు. వీరందరిని ఇప్పుడు దళితులుగా ప్రభుత్వం పేర్కొంది.’ సగం సాలె నేత సగం మాల నేత ‘ అనే తెలుగు సామెతను బట్టి , ఇప్పటికీ కొందరు మాలలు మంచం , నులక , వ్యవసాయోపయోగ తాళ్లు అల్లడాన్ని బట్టి వీరు సమాజానికి ఉపయోగపడే పనులే చేశారన్నదిస్పష్టంగా తెలుస్తుంది. మాదిగలు కూడా పశువుల చర్మముతో చెప్పులు , ఆరుతాళ్ళు,చాలకోల ( ఎద్దులను అదిలించే కర్రలకు ) అల్లడం , డప్పులు చేయడం , చనిపోయినవారి శవాలను మోయడం , కాటికాపరులుగా ఉండటం , శుభ – అశుభ కార్యాలకు డప్పులు వాయించడం లాంటి సమాజోపయోగ పనులను చేసేవారు . వీరశైవం , శాక్తేయం వంటి  మత శాఖలు కొంత కుల నిర్మూలనకు కృషి చేసి పంచములకు సమానత్వాన్ని ఇచ్చాయి.కాకతీయ పాలెగాళ్ల సేనలలో మాల మాదిగలు చాలామంది ఉండేవారు.                       శాతవాహనులు బౌద్ధ మతాన్ని ఆదరించారు. బౌద్ధం కుల వ్యవస్థ లేని సమాజాన్ని ప్రోత్సహించింది. స్త్రీలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఇచ్చింది.అందువల్ల ఈ కాలంలో స్త్రీలకు గొప్ప గౌరవమర్యాదలు ఉండేవి. పురుషులు తమ తల్లుల పేర్లను తమ పేర్లతో కలిపి పెట్టుకునేవారు. స్త్రీలకు ఆస్తి హక్కు స్వేచ్ఛ ఉండేది స్త్రీలు చాలామంది బౌద్ధ మత అభిమానులుగా ఉండేవారు వీరు బౌద్ధ విహారాలకు విరాళం ఇచ్చేవారు.  హాలుని కంటే ముందు కూడా  స్త్రీలు సాహిత్య సభలలో పాల్గొనేటంతటి ఉన్నత స్థానంలో ఉండేవారు. కాని బౌద్దం క్షీణించడంతో సమాజంలో వారి స్తితి క్రమంగా  తగ్గిపోయింది.               హిందూ మతంలో సాంఘిక దురాచారాలైన బాల్య వివాహాలు , బహుభార్యత్వం , వరకట్నాలు , ఓలి వివాహాలు , ఉంపుడుగత్తెతనం , దేవదాసీ – ఆడపాప వ్యవస్థలు , వేశ్యావ్యవస్థ , సతీసహగమనం , నిర్బంధ వైధవ్యం మొదలైనవన్నీ స్త్రీల పాలిట శాపాలుగా మారాయి. వారి హక్కులను హరించి వారిని భోగ వస్తువులుగా చూసే పరిస్థితి దాపురించింది. అయితే ఉంపుడుగత్తెలు , సానులు – దేవదాసీలు , వేశ్యల ను సామాజిక అవసరంగా మార్చేసింది రాచరిక వ్యవస్థ.అయితే వారికి సమాజంలో గౌరవమే ఉండేదని తెలుస్తోంది .           కాకతీయుల నాగన్న మంత్రి ‘ అంగనా హృదయ సరోజ షట్పదము ‘ అని , మరో రాజు ‘రాయవేశ్యాభుజంగ ‘ అని బిరుదులను ధరించడం , ఊరేగింపులు తదితర ప్రజా ఉత్సవాల్లోనే ఉంపుడు గత్తెలతో సరసమాడటం నాటి రాచరిక వ్యవస్థ లో గొప్ప విషయాలైనాయి.రాజాస్థానానికి వెళ్ళేందుకు ఉంపుడు గత్తెలకు సరాసరి ప్రవేశముండేది . ప్రతాపరుద్రుని ఉంపుడు గత్తె మాచల్దేవికి ఢిల్లీ సురత్రాణి కంటే ఎక్కువ విలువ ఉండేదిట . సర్వజ్ఞ సింగభూపాలుడు పోతన చేత తన ఉంపుడుగత్తెపై ‘ భోగినీ దండకా ‘ న్నే రాయించాడు . కుమారగిరి రెడ్డి లకుమ పై మోజుతో ‘ వసంతరాజీయం ‘ అనే సంగీత నృత్య ప్రధాన గ్రంథాన్ని రచించాడు. రాజులు కవులు ఏనుగు లెక్కించారు కనకాభిషేకాలు చేశారు కానీ వారు ఉంపుడుగత్తెలను ఉంచుకున్నారు ఇచ్చిన గౌరవం ఇవ్వలేదు కవుల కన్నా ఎక్కువగా భోగకాంతలకే బహుమతులిచ్చే వారు.సాహిత్యంలో ఈ కాలాన్ని  ప్రబంధ యుగమని విమర్శకులు పేర్కొన్నారు.      ఉత్తేజకర తాంబూలం వేసుకొని విజయనగర రాజు 200 మందికి పైగా ఉంపుడుగత్తెలతో భోగింపగలిగేవాడని చెపుతూ అబ్దుర్ రజాక్ ఆశ్చర్యపడ్డాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో రాయలసీమ భోగభాగ్యాలతో తులతూగినట్లు చాలా మంది చరిత్రకారులు వర్ణించారు. రాయలనాటి రసికత గురించి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ,పుట్టపర్తి సత్య నారాయణ చార్యులు వారి భోగప్రవృత్తి గురించి వర్ణించారు.ఈ భోగాలన్నీ రాజులు, రాజ బంధువులు,రాజ ప్రతినిధులు ఉన్నతాధికారులు అనుభవించేవారు. వాటిని అనుభవించడానికి వారికి కావాల్సినంత ధనం, విశ్రాంతి, ఆరోగ్యం,ముఖ్యంగా నైతికత పట్ల నిరాదరణ ఉండటమే కారణం. ఇవన్నీ సాధారణ ప్రజానీకానికి ఉండే అవకాశం మాత్రం లేదు.

(అనంతసాగరం దినపత్రికలో ప్రచురితం)

Written by: Pillaa kumaraswaamy,9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s