
సాధారణంగా ఏదైనా ఒక రంగంలో వ్యక్తులు ప్రతిభ చూపుతుంటారు. ఒకే వ్యక్తి అనేక రంగాలలో ప్రతిభ చూపడం అరుదుగా కనిపిస్తుంది, అలాంటి అరుదైన వ్యక్తి శ్రీ పప్పూరు రామాచార్యులు. నరసింహాచార్యులు కొండమ్మ దంపతులకు నవంబరు 8, 1896న అనంతపురంలో పప్పూరు రామాచార్యులు జన్మించారు. వారి చిన్ననాటి చదువంతా తన తండ్రి వద్ద వీధిబడులలో కొనసాగింది, తమ బావగారైన కుంటిమద్ది రంగాచార్యుల ఇంట వుంటూ, మెట్రిక్యులేషన్ ను రాజమహేంద్రవరంలో పూర్తి చేశారు. ఆ రోజుల్లో ప్రముఖ సంఘసంస్కర్త కందకూరి వీరేశలింగం గారితో వీరికి కొంత పరిచయం కలిగి ఉండేది. మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఇంటర్మీడియేట్ చదువుకున్నారు. డిగ్రీ చదివేందుకు స్వస్థలమైన అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బి.ఎ.కోర్సులో చేరాడు
పప్పూరు రామాచార్యులు డిగ్రీ చదువుతుండగానే కొంతమంది మిత్రులతో కలసి 1917లో ‘వదరుబోతు’ పేర పదిహేను రోజులకొకసారి కరపత్రాలు ప్రచురించి పంచేవారు. ఆనాటి సాంఘిక దురాచారాలు, సాహిత్య సాంస్కృతిక స్థితి గతులపై అధిక్షేప ధోరణిలో వ్యాసాల రూపంలో ఆ కరపత్రాలుండేవి. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే రామాచార్యుల వారికి జిల్లా కలెక్టరు కచేరీలో ఉద్యోగం లభించింది. స్వతంత్ర భావాలు కలిసిన పప్పూరి రామాచార్యులు కొంతకాలానికి ఆ ఉద్యోగాన్ని మానేశాడు, ఉద్యోగమయితే మానివేశాడు కాని ఏ పని చేయడానికి అవకాశం లేకపోయింది
అనంతపురంలోని శ్రీకైప సుబ్రమణ్యంగార్ ప్రోత్సాహంతో ఇల్లూరు గ్రామంలో చిన్నపరెడ్డి కుమారులకు చదువు చెప్పే బాధ్యత చేపట్టారు. ఇల్లూరు గ్రామ కరణం ఐతరాజు నరసప్పకి జాతీయోద్యమ స్ఫూర్తి ఉండేది. ఆదే గ్రామంలోని కైప మహనందయ్యకు పత్రిక ఏర్పాటు చేయాలన్న విషయంలో ఆసక్తి ఉండేది. వీరు స్వరాజ్యోదయం పేర పత్రిక నడపాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో పప్పూరు రామాచార్యులు ఆ క్రమంలోనే ఉండటంతో పత్రిక ఏర్పాటు విషయమై చర్చ జరిగేది. ఈ ప్రాంతానికి చిహ్నంగా ఉన్న ‘పినాకిని’ (పెన్న) అని నదిపేర పత్రికను తీసుకువస్తే బాగుంటుందని పప్పూరు వారు సూచించారు. వీరందరి ఆమోదంతో 16 సెప్టెంబరు 1922న ఆ పత్రికను ఆరంభించారు. ఆ పత్రిక నిర్వహణ బాధ్యతనంతా ఆయనే చూసేందుకు పప్పూరు రామాచార్యులు అనంతపురం చేరారు. పత్రిక నిర్వహణ క్రమంలో విభేదాలు పొడచూపడంతో “పినాకిని” పత్రిక బాధ్యతల నుండి రామాచార్యులు దూరమయ్యారు. ఆగస్టు 14, 1926 నుండి ‘సాధన’ పత్రికను స్వయంగా ప్రారంభిచాడు, ఈ పత్రిక జాతీయోద్యమ ప్రచారానికి, సామాజిక సంస్కరణకి, విద్యా, విజ్ఞాన వ్యాప్తికి, రాయలసీమ స్థితిగతులను బయట ప్రపంచానికి తెలియజెప్పటానికి, సాహిత్య సాంస్కృతిక వికాసానికి విశేషంగా తోడ్పడింది.
నంద్యాలలో 1928లో జరిగిన ఆంధ్ర మహాసభల్లో రాయలసీమ అనే పేరును చిలుకూరు నారాయణరావు ప్రతిపాదించారు. సాధన పత్రికలో రాయలసీమ పేరును విస్తృతంగా ప్రచారంలోని తీసుకురావడానికి ఆరోజు నుండే ఉపశీర్షికగా “ది వాయిస్ ఆఫ్ రాయలసీమ”గా ప్రచురించేవారు. 1929లో పెనుగొండలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవాలలో రామాచార్యులవారు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణదేవరాయలు విద్యా పరిషత్ సంస్థ ఏర్పాటైంది. అందులో పప్పూరు రామాచార్యులు ప్రధాన బాధ్యతలు నిర్వర్తించేవారు.
ప్రతీయోద్యమంలో 1930లలో అనంతపురం పరిసర ప్రాంతాలలో మద్య నిషేధ ఉద్యమం జరిగింది. రామాచార్యుల వారు అందులో క్రియాశీలక పాత్ర పోషించారు. వ్యవహారిక భాషలో, పాత్రోచితంగా కల్లు పెంట” పేర ప్రజలకు అర్థమయ్యేలా నాటకాన్ని స్వయంగా రచించి గ్రామాల్లో ప్రదర్శిపంచేశాడు. 1917లో కరపత్రాలుగా ప్రచురించిన వదరుబోతు వ్యాసాలను 1932లో పుస్తక రూపంలో ముద్రించారు. స్రవంతి పత్రికలో ‘ఆముక్తమాల్యద పై వ్యాసాలను, వేమన పద్యాలను పోలిన ‘రామయ్య పద్యాల’ను పప్పూరు వారు రాశారు. ‘భరత దర్శనం’ పేరుతో యాత్రానుభవాలను రాశారు. వీటితో పాటు అనేక సాహిత్య పుస్తకాలను “శ్రీసాధన ముద్రాక్షరశాల” నుండి వెలువరించేవారు. సాధనపత్రికలో సంపాదకీయాలతో పాటు, మారుపేర్లతో అనేక వ్యాసాలు రాశారు
1932లో సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా బళ్ళారిలో జైలు జీవితం గడిపారు. 1987లో “శ్రీబాగ్ ఒడంబడిక” సందర్భంలో రాయలసీమ ప్రయోజనాలకై కృషి చేశాడు. నవ్యసాహిత్యమాల సంస్థ వారి ‘యుద్ధం వల్ల కలిగే అనర్థాలు’ అనే కరపత్రాన్ని సాధన ముద్రణాలయం తరఫున పప్పూరు రామాచార్యుల వారు ముద్రించారు అందుకు గాను అప్పటి ప్రభుత్వం పప్పూరి వారిని దోషిగా నిర్బంధించారు. ఆతరువాత ఈ కేసు వీగిపోయింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తిరుచునాపల్లిలో జైలు జీవితం గడిపారు. జైలులో ఉన్న సమయం మినహా, మిగతా కాలమంతా క్రమం తప్పకుండా “సాధన పత్రికను ప్రచురించారు.
1947-1952 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ చైర్మన్ గా, 1952-1955లలో జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరవాత కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా సహకారోద్యమానికి ఎనలేని కృషి చేశారు. రేడియో సలహా సంఘం సభ్యుడిగా, జిల్లా గజిటైర్ కమిటీ సభ్యుడిగా, రాయలసీమ సహకార శిక్షణా సంస్థ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమ కారుడిగా తనకు ప్రభుత్వం కేటాయించిన అనంతపురం పట్టణనడిబొడ్డున ఉన్న విలువైన స్థలాన్ని కో-ఆప్ రేటివ్ బ్యాంక్ కు అప్పగించారు. 1955-1962లలో ధర్మవరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజకీయ జీవితంలో విలువలు పాటించారు. చిన్ననాడు తాను విద్యాబుద్ధులు నేర్పిన నీలం సంజీవరెడ్డినే వ్యతిరేకించి టంగుటూరి ప్రకాశం పంతులుగారి వైపున నిలబడి తన ఖచ్చితత్వాన్ని ప్రదర్శించారు. హరిజన సేవాసదనం, నేషనల్ కాలేజి, లలిత కళాపరిషత్ ల వికాసానికి కృషి
చేశారు. తన జీవితమంతా ప్రజలకోసమే పనిచేసిన రామాచార్యుల వారు 21 మార్చి, 1972లో తనువు చాలించారు. జాతీయోద్యమ కారుడిగా, పత్రికా సంపాదకుడిగా, సంఘ సంస్కరణోద్యమకారుడిగా, గ్రంథాలయోద్యమ కారుడిగా, విభిన్న రంగాల్లో కృషి చేసిన ప్రతిభావంతుడిగా శ్రీపప్పూరి రామాచార్యులు నిత్య చైతన్య శీలిగా నిలిచి వుంటారు.
రచన :-డా|| అప్పిరెడ్డి హరినాథరెడ్డి
కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత
9963917187
