
సనాతన హైందవ ధర్మప్రచారంలో… సప్తగిరి సచిత్రమాసపత్రిక.
ప్రజలలో సత్ప్రవర్తన, సదాచారం, ధర్మాచరణ వంటి వాటిని ప్రేరేపించి ముందుకు నడిపించే విషయంలో ధార్మిక పత్రికల స్థానం ప్రత్యేకం. అందులోను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురిస్తూవున్న ధార్మిక మాసపత్రిక స్థానం మరింత విశిష్టమైనది. ఈ పత్రిక పూర్వాపరాలను పరిశీలిద్దాం.
శేషాచలపతి ఐన శ్రీనివాసుని దర్శించ వచ్చే వేలాది యాత్రికులకు దేవస్థానం చేస్తున్న చేయనున్న సౌకర్యాల వివరాలను ప్రపంచంలో నలుమూలల్లో భక్తులకు తెలియజేయటంతో పాటు క్షేత్ర మహిమ, తదితర పౌరాణిక, వైదిక విజ్ఞానాన్ని ప్రబోధించి ఆస్తికులలో ఆధ్యాత్మిక రోచిస్సు లవిచ్ఛిన్నంగా వెలగటానికి తోడ్పడేటం దుకు 1949వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రచార సాధనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది
దాని ఫలితంగా ఏప్రిల్ 1949వ సం॥లో కరపత్ర సదృశమైన పత్రిక వెలువడింది. అప్పుడది ప్రచార మాత్రంగా ఉండేది. దాని పేరే దేవస్థానపు “బులెటిన్”.

అనంతంగా ఈ వేంకటేశ్వర సేవా కార్యక్రమం దినదిన ప్రవర్ధమానమై దేవస్థానం సమాచార ప్రసారంతో పాటు, పలువురు దిగ్దుంతుల్లాంటి పండితుల సహకారంతో అర్ష విజ్ఞానంలో ఉత్తమ ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలను 1961వ సం|| వరకు వెదజల్లింది. ఈ మధ్యకాలంలో శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం కూడా దేవస్థానం అధీనంలో ఉండటంతో, అందరు పండితుల మన్ననలు వ్యాసరూపంలో పత్రికకు కావలసినంత పరపతిని, ప్రణాళికను సమకూర్చాయి. నిజానికి దేవస్థానం నుండి లోగడ వెలుపడిన గ్రంధాలలో అధికశాతం మొదట మాసపత్రికలో వెలువడి తర్వాత గ్రంథరూపాన్ని సంతరించుకున్నాయని చెప్పటం సత్యమైన మాట
మొక్క మాను కావటం, పూవు కాయ కావటం రివాజు. అలాగే, ఈ పత్రికను కేవలం తిరుపతి యాత్రా సహాయిని స్థాయిలోనే నిల్పకుండా, దీన్ని మహోజ్వల ఆధ్యాత్మికతా ప్రసారణ ప్రతీకగా నిలిచే మాసపత్రిక గా తీర్చిదిద్దాలనే ప్రయత్నం 1961వ సం|| నుండి ప్రారంభమైంది
బులెటిన్’ ‘దేవస్థాన మాసపత్రికగా’, వార్తాపత్రికల నిబంధనలకనుగుణంగా పేరును సంతరించుకొన్నది. ఈ 1961వ సంవత్సరంలోనే.
దీని కార్యరూపమే ఒక సంపాదకుణ్ణి, అనుబంధ సిబ్బందిని 1963వ సం॥లో నియమించటం, దీనివల్ల పత్రిక పైన, దాని ప్రగతి విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకునే అవకాశం కలిగింది
ఆనాడు పత్రిక ప్రతులసంఖ్య 3000 మాత్రమే. చిన్న ఆకృతిలో (1/8 డెమ్మీ) ఉన్న ఈ పత్రిక ఆ రోజులలో చందాదారులకు ఇవ్వటంతో పాటు, తిరుమల, మద్రాసు హైదరాబాదు, బెంగుళూరులలో పత్రిక విక్రయం జరుగుతుండేది. ఆంగ్లం, తమిళం తెలుగు, కన్నడ, హిందీ భాషల వ్యాసాలన్నీ చిన్నచిన్నవిగా
ప్రచురితమౌతుండేవి.
ఆశించిన ఫలితాలు కొంతైనా పొందాలంటే పత్రిక ఉనికి పదిమందికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రణాళికకు ప్రారంభంగా పత్రిక విక్రయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆనాడున్న ధర్మశాలలు,దేవాలయాలు, సమాచార కేంద్రాలలో 1966వ సంవత్సరం జూలైలో ప్రారంభించటం జరిగింది.
విక్రయ కేంద్రాలు మూడు నుండి పన్నెండుకు వచ్చి ఆ పైన విస్తరణ పొందాయి దీనివల్ల పత్రిక ప్రతుల సంఖ్య కూడా పెరిగింది.

దేవస్థాన విధాన ప్రచారం, ఆర్షవిజ్ఞాన ప్రసారం ఆశయమైనప్పుడు ఈ పరిధి
పలు ప్రాంతాలలో విస్తరించక తప్పుదు. అందువల్ల పత్రికను, కమీషన్ మీద ఇతర వ్యక్తుల ద్వారా అమ్మించే విధానాన్ని 1967 ఏప్రిల్ నెలలో అమలు చేయడం జరిగింది.
బహుభాషాయుతంగా వెలువడిన దేవస్థానపత్రికను 1970వ సం॥ జనవరి నుండి ఇంగ్లీషు, సంస్కృతం అన్ని పత్రికలకు అంతర్భాగంగా పత్రికను తెలుగు, తమిళం, కన్నడం హిందీ భాషా పత్రికలుగా వేరుచేసి విడుదల చేయటం జరిగింది. దీనివలన ఆ భాషా పత్రిక ఆ యా భాషాప్రాంతాలలో మారుమూలలకు చొచ్చుకునిపోయే అవకాశం కల్గింది. అంటే స్థిర ప్రాతిపదిక పైన పత్రికను రూపొందించే విధానం 1966 వ సం|| నుండి 1970 వ సం వరకు దశలవారీగా జరిగిందన్నమాట
1949 వ సం|| నుండి 1970వ సం|| వరకు అంటే దాదాపు 20 సంవత్స రాలపాటు పత్రిక పత్రికాసంప్రదాయానికి అనుగుణంగా, స్వావలంబకమై సాంకేతికమైన పేరేది లేనట్లుగానే పెరుగుతూ వచ్చింది. 1970వ సం జూన్ లో, ఏడుకొండలకు సాంకేతిక పత్రికగా, బులెటిన్’గా పుట్టి పెరిగి ‘సప్తగిరి’ పత్రికగా అవతరించింది. నాటి నుండి ఈనాటికి అంతటి చరిత్ర ఉంది ఈ పత్రికకు.
ఇక్కడి నుండి పత్రికగతిలో గణనీయమైన మార్పులు తీసుకురావడం జరిగింది ఇన్ని ఏళ్ళ పాటు చిన్న పత్రికగా ఉంటూ వచ్చిన ఈ పత్రికను ఏప్రిల్ 1972వ సం॥లో 1/4 క్రౌన్ పరిమాణంలోకి తీసుకురావటం జరిగింది. ఇంగ్లీషు, సంస్కృతాలు అన్ని పత్రికలకూ సమానంగానే ఉండేవి. కాని, అక్కరలేని వారిపై రుద్దనక్కర లేకుండా ఉండేందుకు వివిధ భాషల పత్రికలు ఆ భాషా ప్రాంతాలలో గణనీయ స్థితిని పొందేందుకు వీలుగా జనవరి 1975వ సం॥ నుండి ఇంగ్లీషు భాషా భాగాన్ని వేరుచేసి ఐదుభాషల్లో పత్రికలు విడివిడిగా విడుదల చేయటం జరిగింది. ఈ పద్ధతివల్ల ప్రతి సప్తగిరి, రెండవ భాషా పత్రికతో సంబంధం లేకుండా ముందుగా విడుదల అయ్యే అవకాశం ఏర్పడింది.
1975వ సం|| ఆగష్టులో పత్రికను 1/4 క్రాస్ నుంచి 1/4 డెమ్మీ సైజుకు మార్చటం జరిగింది
సప్తగిరి మాసపత్రిక పాఠక లోకం యొక్క ఆదరణతో దినదిన ప్రవర్ధ మానమై విస్తరించింది. ఇందులో భాగంగానే 2014 ఏప్రిల్ మాసం నుండి సంస్కృత భాషలో కూడా పత్రిక రావడం ప్రారంభమైంది
2016 జనవరి నుండి సప్తగిరి పత్రిక 6 భాషల (తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం) లోను పూర్తి రంగులలో సచిత్ర మాసపత్రికగా వెలువడుతోంది. కేవలం 3000 ప్రతులతో ప్రారంభమైన సప్తగిరి పత్రిక ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఈనాటికి 2,00,000 ప్రతుల సర్క్యులేషన్ కు చేరుకుంది. ప్రస్తుతం అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఆధ్యాత్మిక పత్రిక సప్తగిరి కావడం సంతోషదాయకం

ఈ కృషి. వృద్ధి, తత్ఫలితం ఏ వ్యక్తికో చెందింది మాత్రం కాదు. దేవస్థాన కార్యనిర్వహణాధికారులందరూ ఒక్కొక్కరు తమ తమ బాటలలో సప్తగిరి ప్రగతికి తోడ్పడ్డా రనటంలో సందేహం లేదు
ప్రారంభించిన నాటి నుండి సప్తగిరిపత్రిక ధార్మికతా, ఆధ్యాత్మికతతో పాటు, ఇతరత్ర ఉండే పుణ్యక్షేత్రాలను గురించీ, దైవతాల్ని గురించీ- త్రివిధమతాచార్యుల విశే షాలూ, సిద్ధాంతాలూ భక్తి మార్గాలూ- అవి సమాజానికి ఎలా ఉపయోగిస్తున్నాయనే విశేషాలు, భక్తి మార్గాలూ, భక్తులచరిత్రలూ, ధార్మికతాత్త్విక గ్రంథాల పరిచయాలు – సులువైన భాషలో సమాజానికి అందిస్తుంది. అంతేగాక- శ్రీవారి ఆలయంలో, అనుబంధ ఆలయాల్లో జరిగే ఉత్సవ విశేషాలూ, పూజా కైంకర్యాలూ, పండుగల ఆచరణ విధా నాలూ, మున్నగు విశేషాలూ ఈ పత్రికలో సందర్భానుసారంగా ముద్రింప బడుతూ ఉంటాయి.
దేవస్థానం పత్రికకు- సప్తగిరులకూ, సప్తగిరీశ్వరు
నికీ ప్రతీకగా ‘సప్తగిరి’ అనే పేరుంచారు. ఈ పేరు వినగానే, సప్తగిరీశుడూ, సప్తగిరులనే మదిలో మెదుల్తాయి. కాలానుగుణంగా ఎన్నో భక్తిపత్రికలు ఎన్ని వస్తున్నా ఈ పత్రిక మాత్రం తన ఉనికిని తాను నిల్పుకొంటూనే ఉంది శిష్ట సాహిత్యం నుంచీ, విశిష్టసాహిత్యం వరకూ ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యమిస్తూండే విశిష్ట పత్రిక ‘సప్తగిరి’. బాలలకు పెద్దలకూ కూడా ఆనందాన్ని, జిజ్ఞాననూ పెంచే పత్రిక ‘సప్తగిరి
ఇప్పటికి ‘సప్తగిరి’ మాసపత్రిక ప్రారంభించి 50వసంతాలు 2020 సం॥| మే’ నెలకి పూర్తి చేసుకొంది… ఈ సందర్భంగా 2020 జనవరి సంచిక నుండి సప్తగిరి మాసపత్రికలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈనాడు నాటిన విత్తనాలు… రాబోవు రోజుల్లో వృక్షాలవుతాయి. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా వెలుగొందాలంటే…. పిల్లలు మానవీయ విలువలతో ఎదగడం ఎంతో అవసరం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దిశగా అడుగులు వేస్తోంది. పిల్లలకోసం ప్రత్యేకంగా ‘బాలసప్తగిరి’ అని 20 పుటల 1/8 డెమ్మీ సైజులో, ప్రతినెలా ఆరుభాషలకు అ బంధంగా మార్చి, 2020 నుండి తీసుకురావాలని తిరుము తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. దాససాహిత్యం, ఆళ్వార్థసాహిత్యం, హిందూ దేవుళ్లు, బాలనీతి, చిత్రకథ. క్విజ్, చిత్రలేఖనం మొ|| పిల్లలభాషలో ‘బాలసప్తగిరి’ వస్తున్నది. బాలబాలికల్లో మన సంస్కృతిపట్ల, ధర్మంపట్ల, పురాణాలపట్ల, భగవంతుని పట్ల, పెద్దలపట్ల చక్కని అవగాహన కలిగించటానికి, ఆధ్యాత్మిక ఆలోచనల్ని పెంపొందించ టానికి ఈ ‘బాలసప్తగిరి’ని ప్రారంభించింది.

ఎందరో కవులు, రచయితల సృజనాత్మక రచనలతో మన ఆధ్యాత్మికరంగం సుసంపన్నం కావటంలో ఆయా కవులు, రచయితల పాత్రతో పాటు ఆ రచనల్ని ప్రచురిస్తున్న పత్రికల పాత్ర కూడా ఎంతో ఉంది. రచయితలోని భావాన్ని లక్షలాది మందికి తెలియజేస్తూ, ఇప్పటికీ మన సమాజంలో ధర్మం, న్యాయం వంటి విలువలు సమున్నతంగా నిలవటానికి పత్రికలు కూడా తమవంతు కర్తవ్యాన్ని నూరుశాతం నిర్వహిస్తున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆధునికత ఎంతగా విస్తరిస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక పత్రికలకు ఆదరణ తగ్గకపోగా, మరింతగా పెరగటం నిజంగానే ఓ ఘనత అందులోనూ మన ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక ‘సప్తగిరి పత్రిక! పదులసంఖ్యలో ఇతర ఆధ్యాత్మిక పత్రికలు మన రాష్ట్రంలో ఆవిర్భవించి ఉన్నా, వీటన్నింటిలోను నిస్సందేహంగా అగ్రతాంబూలం అందుకుంటున్న పత్రిక ‘సప్తగిరి మాత్రమే! ఎందుచేతంటే, ఆ పత్రిక అనునిత్యం ఆనంద నిలయున్ని స్మరింపజేస్తున్న సప్తగిరులకు ప్రతీక గనుక.
సప్తగిరి మే 2020 సచిత్రమాసపత్రిక నుంచి యథాతథంగా….
రచన:-డా||కోటపాటి రాధారమణ, ప్రధాన సంపాదకులు, తి.తి.దే.

Sir, I want subscription for “Sapthagiri” Monthly magzine. Please send bank account and address.
LikeLike
ఏలా దరఖాస్తు చేసుకోవాలన్నది చివరన ఫోటో లో ఉంచాం.
LikeLike