అప్పిరెడ్డి హరినాథరెడ్డి

డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి అనంతపురము జిల్లా, గాండ్లపెంట మండలం, తాళ్ళకాల్వ గ్రామంలో రాఘవరెడ్డి, ఉమాదేవి దంపతులకు 4 సెప్టెంబరు1980న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం సొంత గ్రామంలో, ఉన్నత విద్యాభ్యాసం గాండ్లపెంట జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి చేసారు. కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివారు‌‌.

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగును 2005 పూర్తి చేసి, ద్రావిడ విశ్వవిద్యాలయంలో రాయలసీమ కక్షల కథా సాహిత్యం పై పరిశోధన చేసి 2011లో డాక్టరేట్ పట్టా పొందారు. ఈ పరిశోధనలో రాయలసీమలోని కక్షలు, కార్పణ్యాల వాస్తవ స్థితిగతులు, వాటి నేపథ్యంలో వచ్చిన కథాసాహిత్యాన్ని అధ్యయనం చేసారు.

హరినాథరెడ్డి ఉపాధ్యాయులుగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యాయిని వై.శైలజ ను 2012లో వివాహం చేసుకున్నారు. ప్రణవ్ నందన్, శ్రియామనోజ్ఙ వీరి పిల్లలు.

హరినాథరెడ్డి రామగిరి, విడపనకల్లు,గోరంట్ల మండలాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి, ప్రస్తుతం కళ్యాణదుర్గం మండలంలోని దురదకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఒకవైపు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, మరో వైపు సాహిత్యరంగలో కృషి చేస్తూ వస్తున్నారు. రాయలసీమ అస్తిత్వ చైతన్యం, సాహిత్య సంబంధిత వివిధ అంశాలపై 200 వ్యాసాలు, 20 కవితలు, 30 పరిశోధనా పత్రాలను రాసారు. అనేక సాహిత్య సభలు, సీమ సమావేశాలలో ప్రసంగాలు చేసారు. 4 కథలు రాసారు. రాయలసీమ బాగోగుల కోసం జరిగే పోరాటాలలో, సభలలో పాల్గొని తనవంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. తాను బాల్యంనుండి చూసిన కరువులు, కక్షలు, సీమ ప్రజల భాధలే రాయలసీమను గురించి ఆలోచింపచేసాయి. విద్యార్థి దశలో విద్యార్థి సంఘాలలో పని చేసిన అవగాహన కూడా సమాజం పట్ల ఆలోచన దృక్పథాన్ని కలిగించాయి. సీమ ప్రజలలో ఆధునికత, సీమ భూములకు నీటి వసతితోనే ఈ ప్రాంతం మనుగడ ఆధారపడిందని పాతికేళ్ళ వయసుకే నిర్ధారణకు వచ్చాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంతో ప్రాంతీయ అస్తిత్వ స్పృహ కూడా రచయితలలో పెరిగింది. రాయలసీమ చరిత్రలో వివిధరంగాలలో జరిగిన పరిణామాల పట్ల సరైన సమాచారం లభ్యం కావడం లేదు. ఆంధ్ర చరిత్రలో భాగాంగా టూకీగా మాత్రమే కనిపిస్తున్న నేపథ్యంలో సీమ మూలాలను హరినాథరెడ్డి వెతకడం ప్రారంభించారు. ఇందుకు సీమలో వెలువడిన అలనాటి పత్రికలే సరైన ఆధారాలని గ్రహించాడు. ఆ వైపుగా విస్తృత కృషి చేసారు.

పప్పూరు రామాచార్యులు సంపాదకత్వంలో రాయలసీమ అంశాల ప్రాధాన్యతతో అనంతపురము కేంద్రంగా 1926 నుండి 1972 దాకా వెలువడిన “శ్రీ సాధన పత్రిక” వేల ప్రతులు అధ్యయనం చేసి సాహిత్య అంశాలతో ” సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక” అనే వ్యాసాల గ్రంథాన్ని వెలువరించారు. వీరి కృషిని గుర్తించి ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు 2014లో యువ సాహిత్య పురస్కారాన్ని ఆయనకు ప్రధానం చేసింది. సాహిత్య ప్రాధాన్యత ఉన్న విలువైన మరో ఎనిమిది పుస్తకాలను హరినాథరెడ్డి వెలువరించారు.

సాధన పత్రిక ఆధారంగా 1926 నుండి 1947 వరకు వెలువడిన కవితలను “శ్రీ సాధన పత్రిక కవిత్వం” పేరుతో ఒక కవితా సంకలనాన్ని2012లో వెలువరించారు.

2013 లో శ్రీ కృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు – వ్యాసాలు పుస్తకాన్ని వెలువరించారు.

రాయలసీమలో ఆధునిక కథా సాహిత్యం 1941లో జి.రామకృష్ణ రాసిన చిరంజీవి కథతో ప్రారంభమైందని సాహిత్య విమర్శకులు భావిస్తూ వచ్చారు. హరినాథరెడ్డి పరిశోధనల మూలంగ వల్ల 1882 నుండే రాయలసీమలో కథలు వెలువడినట్లు బయటపడింది.1882 నుండి 1941 వరకు వెలువడిన 40 కథలను పరిశోధించి “మొదటి తరం రాయలసీమ కథలు” పేరుతో 2015లో వెలువరించారు.

రాయలసీమలో తరతరాల నుంచి కరువు తాండవిస్తుంది. పాలకులు రాయలసీమ ప్రాంత వాసులే అయినప్పటికీ రాయలసీమ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తూవచ్చారు. రాయలసీమ సాగునీటి అంశాల నేపథ్యంగా 2017లో “సీమ నీళ్ళ కవి సమ్మేళనం” నిర్వహించి, ఆ కవితలను “తడిఆరిన సీమ గొంతుకలు” పేరుతో ఒక సంకలనాన్ని తీసుకువచ్చారు.

1917లో పప్పూరు రామాచార్యులు, వారి మిత్రులు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో వదరుబోతు పేరుతో అనేక కరపత్రాలు ప్రచురించి పంచేవారు. హరినాథరెడ్డి ఆనాటి కరపత్రాలను వెలికి తీసి “వదరుబోతుకు వందేళ్ళు” పుస్తకం ప్రచురించారు. ఆనాటి సామాజిక జీవన సమస్యలు, చైతన్యాన్ని ఇది తెలియజేస్తుంది.

బళ్ళారి రాఘవ నాటకరంగ నటుడిగా మాత్రమే జనవ్యవహారంలో ప్రసిద్ధుడు. అయితే ఆయన 1933 లోనే బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, స్త్రీల స్వేచ్ఛ స్వాతంత్రం ఇతివృత్తం గా తీసుకుని “సరిపడని సంగతులు” అనే ఆధునిక వచన నాటకాన్ని రాసారు. దానిని హరినాథరెడ్డి వెలుగులోకి తీసుకొని వచ్చి పుస్తకంగా ప్రచురించి బళ్ళారి రాఘవ సాహితీ సృజనను ప్రపంచానికి చాటాడు.

2018 లో “సాలోచన” అనే పుస్తకాన్ని తన సాహిత్య వ్యాసాలను హరినాథరెడ్డి ప్రచురించారు.

అప్పిరెడ్డి హరినాధరెడ్డి రచించిన పుస్తకాలు

2019 లో “సీమ హక్కులపత్రం – శ్రీభాగ్ ఒప్పందం ” అనే చారిత్రక డాక్యుమెంట్ ను ప్రచురించారు.

సీమ విషయంగా రచనలు చేస్తూ, అనేక ప్రజా సంఘాలలో పనిచేస్తూ, రాయలసీమ ప్రయోజనాల కోసం జరిగే పోరాటాలలో మమేకమవుతూ, సీమ సాంస్కృతికోద్యమానికి తోడ్పాటు నిస్తున్నాడు‌ హరినాథరెడ్డి.

‘వేమన అధ్యయన& అభివృద్ధి కేంద్రం’ ను 2006 స్థాపించి అనేక సామాజిక, భాషా, సాహిత్య, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2016 నుండి ‘రాయలసీమ సాంస్కృతిక వేదిక’ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. భాషా సంరక్షణ, చరిత్ర, పురావస్తు అంశాలపై కుడా తనదైన శైలిలో కృషి చేస్తున్నారు.

“అమెరికన్ తెలుగు అసోసియేషన్” (ఆటా)వారి ఆహ్వానం మేరకు అమెరికా లోని చికాగో నగరంలో రాయలసీమ సమకాలీన స్థితిగతులు, సాహిత్యం పై జూలై 2016 లో పర్యటించి ప్రసంగించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆహ్వానంపై డల్లస్ లో సీమ సాంస్కృతిక విశేషాల పై ప్రసంగించారు.

డల్లస్ లో సన్మానం అందుకొంటున్న చిత్రం

2012లో ఇంటాక్ సాహిత్య పురస్కారం, 2014 లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాలతో పాటు, స్పందన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ఛం సాహిత్య పురస్కారం, 2016 లో గుత్తి నారాయణరెడ్డి తెలుగు సాహిత్య పీఠం వారి అష్టదిగ్గజ పురస్కారాన్ని అందుకున్నారు.

షిల్లాంగ్ లో కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం అందుకొంటూ

సాహిత్యకారుడుగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, భాషా సాహిత్య, సామాజిక ‌ కార్యకర్తగా, అన్నిటికంటే సీమ సామాజిక, సాంస్కృతిక ఉద్యమకారుడిగా ఇలా పలురంగాలలో వైవిధ్యంగా బాధ్యతలు నిర్వహిస్తున్న డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి భవిష్యత్తులో మరింత కృషి చేస్తాడని ఆశీద్దాం. సీమ సాహిత్య, సాంస్కృతిక చరిత్ర రచనే తనముందున్న ప్రస్తుత ప్రధాన కర్తవ్యంగా అడుగేస్తున్న హరినాథరెడ్డి ఆ పనిని విజయవంతంగా చేయాలని కోరుకొందాం.

రచన:-పిళ్లా కుమారస్వామి

1 comment

  1. వ్యాసం చాలా సమగ్రంగా ఉంది రాయలసీమ రత్నం మా అప్పిరెడ్డి అని టైటిల్ పెడితే బాగుండును – నాకు ఇయనంటే అభిమానం – చిరన్జివికిఆశీస్సులు – వారి ఫోన్ నంబర్ ఇవ్వవలసింది

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s