
Indian mathematician.photo source wikipedia.
గణితశాస్త్రాన్ని, ప్రాచీనకాలంనుండి ఎంతోమంది భారతీయులు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. భారతీయ గణిత ఆవిష్కరణల్లో ముఖ్యమైనవిగా సున్నా వాడకం, బీజగణితం వంటివాటిని చెబుతారు.
వరాహమిహిరుడు
ఆర్యభట్టు-ఖగోళ శాస్త్ర గణనలు కచ్చితంగా చేసినవాడు.
యతి వృషభుడు – తిలోయపన్నత్తి అనే గణిత, ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రాసిన జైన మత ఆచార్యుడు.
బ్రహ్మగుప్తుడు -అంక గణితంలో సున్న భావన తెచ్చుటకు దోహద పడినవాడు .
శ్రీధరుడు – గోళం యొక్క ఘనపరిమాణం కనుగొనుటకు ఉత్తమ సూత్రములు ప్రతిపాదించినవాడు.
పావులూరి మల్లన – మొదటి తెలుగు గణిత శాస్త్రవేత్త
ఇలా ఎందరో భారతీయ గణాంక నిపుణులు ఖ్యాతి గడించారు.
శకుంతలాదేవికి గణిత మేధావి గా మనదేశములో ఎంతో గుర్తింపు వుంది. ఆమె చదువుకొన్నది. దేశ విదేశాలు తిరిగింది. సర్వత్రా సన్మానాలు పొందింది . చదువకుండానే గణితములో అసమాన పాండిత్యము గడించారు అంధుడైన శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ.
పుట్టుకతోనే అంధుడు అయినా గణిత ప్రవీణుడైయ్యారు. గణిత అవధానాలు కోకొల్లలుగా నిర్వహించారు. ఆయన ప్రతిభ అనన్య సామాన్యం.
ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు.
తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు మంచి శిక్షణ పొందారు.
కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే. ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో శర్మ ఒకరు.
ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!
ఒకటి, రెండు, మూడు…. ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు. సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షిత్రాలు, వారాలు, పక్షాలు… గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు.
లక్కోజు సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు.
జన్మతః అంధుడు కావడంతో పురుడు పోసిన మహిళ గొంతు నులిమి దిబ్బలో పాతెయ్యమంది. కొందరు బంధువులు నోట్లో వడ్ల గింజ వేశారు. అయినా ఆయన్ని మరణం ఏమీ చేయలేక పోయింది. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు.

శర్మ అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, అవి విని, గుర్తుపెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో, తల్లి పెంచి పెద్దచేసింది.
లక్కోజు సంజీవరాయశర్మ. తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించారు. అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను పలు ప్రదర్శనలిచ్చారు.
సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే. అంటే 8 మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి. అలాగే గణితంలో కూడా అవధానం ఉంది. లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధానాలు చేయడంలో దిట్టగా మారారు.
అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబరు 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ సంజీవరాయశర్మ గణితావధానమే.
భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సంజీవరాయశర్మ
మేధాశక్తికి ఆశ్చర్య చకితులయ్యారు. నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు తయారుచేశారు.
అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్, శర్మ ప్రతిభకు ముగ్ధులైయ్యారు.
అనీబ్ సెంట్ , నెహ్రూ, రాజేంద్రప్రసాద్ తో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని కీర్తించారు.
1966 డిసెంబరు ఏడో తేదీ హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక–
ప్రశ్న : 2 power 103 ఎంత?
జవాబు : అది 32 అంకెలలో వుంటుంది. ఆ 32 అంకెల జవాబు ఆయన అర నిముషంలో చెప్పినాడట.
ప్రశ్న : ‘క’ నుంచి ‘క్ష’ వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, ‘స, రి, గ, మ, ప, ద, ని” అక్షరాల లబ్దం ఎంత?
ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు…
జవాబు కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పినాడు.
ఆయన జవాబు చెప్పే విధానము అతి విచిత్రముగా వుంటుంది. ఎటువంటి గణిత
సంబంధిత ప్రశ్న నడిగినా కొన్ని సెకనులు తనవద్ద నున్న ఫిడేలును వాయించి తక్షణం జవాబు సరిగా చెప్పేవాడు. తప్పుకు ఆస్కారము ఉండేదే కాదు.
శర్మ విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు.
అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు గ్రంధాలయాల్లోనూ తన గణితావధాన ప్రదర్శనలు చేశారు. అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు.
సాధారణంగా, గణితావధానం లో, పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కాని, ఈ విషయంలో లక్కోజు సంజీవరాయశర్మకు ఒక ప్రత్యేకత ఉంది.
ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవాడు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పెవారు. ఈ ప్రత్యేకతను మరెవరూ చూపలేకపోయారు. ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత.
లక్కోజు సంజీవరాయశర్మ కే ఇది సాద్యమైంది.
ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ అవకాశం దక్కలేదు.
1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాలున్న పెట్టెను దొంగలెత్తుకెళ్లారు.
ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు శర్మ.
ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ”ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం” అని శర్మనుద్దేశించి అన్నారు. శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ఆయన ప్రతిభావంతుడు అని అంగీకరించింది.
సంజీవరాయశర్మ, శ్రీనివాస రామానుజన్ వంటి మేధావులను గుర్తించలేక పోయిన దేశమిది.శర్మ గారిని స్వతంత్రము వచ్చిన తరువాతనైనా గుర్తించలేదు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
శర్మ తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు.
ఆయన స్వామి వారి సన్నిధిలో రోజూ సాయంత్రం వయోలిన్ వాయించేవారు.
‘ అంక విద్యాసాగర’ విశ్వసాంఖ్యాచార్య
బిరుదులతో సత్కరించారు. 1996 లో శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం వారికి గౌరవ డాక్టరేట్ పట్టా అందజేసింది.
ఏ విద్యాలయంలోనూ,ఏ గురువు వద్ద అభ్యసించకుండా యెంతో ఘనమైన విద్యను సొంతం చేసుకున్న ఒక గొప్ప మేధావి.
ఆయనకు పందొమ్మిదవయేట వివాహమైనది. ఆయన భార్య పేరు ఆది లక్ష్మమ్మ. పెళ్ళినాటికి ఈమె వయస్సు తొమ్మిదేళ్లు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. భార్య ఆదిలక్ష్మమ్మ 1994 జనవరి 5 న శ్రీకాళహస్తిలో చనిపోయింది.
ఆ తరువాత ఆయన మకాం హైదరాబాదులో ఉన్న కుమారుని వద్దకు మారింది. శర్మ 1997 డిసెంబరు 2 న హైదరాబాదులో మరణించారు.
సంజీవరాయశర్మ ఏవిధంగా చూసినా గణనంలో గొప్పవాడు. పుట్టు గ్రుడ్డి అయినందున అంకెల భావనయే కాని రూపము తెలియదు.
మరి ఎలా గణనం చేసేవాడోనని అడిగితే తనకు చీకటి లోనే వెలుగు తప్ప మరేమీ తెలియదనీ, అందులోనే సమాధానం తట్టుతుందనీ చెప్పాడు. కనుక, అతనిది దైవదత్తమైన వరమే కాని మరొకటి కాదు.
