స్త్రీలు గడప దాటడమే పాపంగా ఉన్న రోజుల్లో…
స్త్రీలు గట్టిగా మాట్లాడితేనే తప్పుగా పరిగణించే రోజుల్లో…
అవిద్య – అసమానత స్త్రీ జాతిని నిలువునా నిర్వీర్యం చేస్తున్న రోజుల్లో…
స్త్రీ శక్తిని చాటుకున్న ఆదర్శ మహిళ రామసుబ్బమ్మ !
వీరు – స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు కడప కోటిరెడ్డి గారి సతీమణి !
చీకట్లు ముసిరిన భారతంలో…. చీకట్లో మగ్గుతున్న ఎందరో స్త్రీలకు రామసుబ్బమ్మ మార్గదర్శకంగా నిలిచింది. తనవైన తెలివితేటలతో ఎందరో స్త్రీలని ప్రభావితం చేయగలిగింది. జాతీయ భావాలతో స్వాతంత్ర సమరంలో కీలకపాత్ర వహిస్తూ… భారతీయ స్త్రీల ఔన్నత్యాన్ని ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యానికి చాటిచెప్పింది.

స్ఫూర్తిదాయకమైనబాల్యం

కడప జిల్లా , జమ్మలమడుగు తాలూకా, సుద్దపల్లె వాస్తవ్యులు కొనుదుల రామచంద్రారెడ్డి , అచ్చమాంబ దంపతులకు 1902 లో రామసుబ్బమ్మ జన్మించారు .
ఆమెకు ఊహ తెలిసే నాటికి భారతదేశంలో పరిస్థితులు అగమ్యగోచరంగా వున్నాయి. ఇందుకు అదే జీవితంగా ఆమె రాజీ పడలేదు. తన కుటుంబ సభ్యుల మాటల్లో స్వాతంత్ర్య కాంక్ష గురించి, జరుగుతున్న పోరాటం గురించి తెలుసుకున్నది. తనలో తనే జాతీయ భావాల్ని పెంపొందించుకున్నది.

ఈ క్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులుగారి గురించి తెలుసుకుంది. వారి దేశభక్తి , జాతీయాభిమానం, రామసుబ్బమ్మను బాగా ప్రభావితం చేశాయి.అవకాశం ఉంటే తాను కూడా దేశం కోసం పోరాటం చేయాలనే
స్ఫూర్తిని కూడా పొందింది. కానీ ఆమెకు అవకాశం రాలేదు.

భర్త_ప్రోత్సాహంతో…

1917 వ సంవత్సరంలో ఆమె పదహైదు సంవత్సరాల వయసులో కడప కోటిరెడ్డితో వివాహం అయింది. అప్పటికి కోటిరెడ్డి పుష్కలమైన జాతీయోద్యమ భావాలతో దేశం కోసం స్వాతంత్ర్య కాంక్షతో ఆరాటపడ్తున్నాడు.
కోటిరెడ్డి ఆమె మనసును, ఆమెలోని ధైర్యాన్ని గుర్తించాడు. ఆమె సాధారణ గృహిణి మాత్రమే కాదని అర్ధం చేసుకున్నాడు. ఇదే సమయంలో కుటుంబ మిత్రురాలు కూడా రామసుబ్బమ్మ సమరోత్సాహానికి ప్రోత్సాహం పలికింది.

అన్నింటికి మించి భర్త ఆదరాభిమానాలతో దేశం కోసం ఏ త్యాగం చేయడానికైన సిద్ధపడింది రామ సుబ్బమ్మ . కాగా కోటిరెడ్డి ఆమెకు ఆంగ్లం రాకపోవడం విషయమై కొంత నిరుత్సాహ పడ్డాడు. ఎందుకంటే… స్వాతంత్ర్య పోరాటం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు. అది జాతీయ పోరాటం. అన్ని ప్రాంతాల పోరాట యోధులతో కలిసి ముందుకు నడవాలంటే భాష అవసరం. అందుకే ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆమెకు ఆంగ్లం నేర్పించాడు. తర్వాత తనతో పాటుగా ఆమెను జాతీయోద్యమంలో ముందుకు నడిపించాడు.

జాతీయోద్యమంలో

1921 సంవత్సరం నాటికి రామసుబ్బమ్మ ఆంగ్ల భాషలో ఆరితేరారు. ఇక అదే సంవత్సరం కాంగ్రేసులో చేరి జాతీయోద్యమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో అటు ఇంటిని చూసుకుంటూ… ఇటు పోరాటాన్ని కొనసాగిస్తూ…. అంకితభావంతో పనిచేసింది రామసుబ్బమ్మ.
జాతీయోద్యమంలో భాగంగా దేశంలో వివిధ ప్రాంతాలను భర్తతో కలిసి పర్యటించింది. భాష సమస్య లేదు కాబట్టి అన్ని ప్రాంతాల నాయకులతో పరిస్థితుల గురించి చర్చించగలిగింది.

గుండెచూపిన_ఆంధ్రకేసరి

1928 ఫిబ్రవరి 3 న సైమన్ కమిషన్ బహిష్కరణ జరిగింది. ఈ తాలూకు నిరసన ప్రదర్శనాలు మద్రాసులో జరిగాయి. దేశభక్తి ఫెల్లుబికుతుండగా మద్రాసు పౌరులు వెల్లువలా వీధులలో వచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు, కడప కోటిరెడ్డి, రామసుబ్బమ్మ, నిరసన కారుల్లో ఉన్నారు.
మద్రాసు హైకోర్టు సమీపాన నిరసన ప్రదర్శన ఆపటానికి బ్రిటిష్ సోల్జర్లు కాల్పులు విచక్షణా రహితంగా ఆరంభించారు . ఈ కాల్పుల్లో ఒక వీరుడు నెలకొరిగాడు.
ఆతడు ఎవ్వరో తెలియదు. అది కళ్లారా చూసి రామసుబ్బమ్మ విలవిలలాడింది. తెల్ల సోల్జర్లని నిలదీసి చెండాడాలనే ఆవేశంతో రగిలిపోయింది.

ప్రాణం పోయినప్పటికీ బ్రిటీష్ సోల్జర్ల దురాగతం ఆగలేదు. దొరికిన వాళ్ళను దొరికినట్టు చితకబాదుతూ… కాల్పులు జరుపుతూ రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ పరిస్థితిలో ప్రకాశం పంతులు గొంతు సవరించుకున్నాడు.

” ఎవరురా ఆ తెల్లవాడు ? నా ప్రజలను కాలుస్తున్నది? . దమ్ము ధైర్యం ఉంటే నన్ను కాల్చండిరా ” అంటూనే చొక్కా గుండీలు విప్పి తన గుండెను బ్రిటిష్ సోల్జర్లకు ఎదురు నిలిచి చూపెట్టాడు.
సింహంలా గర్జిస్తూ తెల్లవారికి ఆ దృశ్యం రామసుబ్బమ్మ గారి హృదయంలో చెరగని ముద్రవేసింది.
చిన్నప్పటి నుండి టంగుటూరు గురించి విన్నది. ఆ శౌర్యాన్ని ఇప్పుడు కళ్లారా చూసింది. అదే క్షణం ఆమె మనసులో ఒక్కటే నిర్ణయించుకుంది.
” దేశం కోసం ప్రాణ త్యాగం చేయవలసి వచ్చినప్పుడు వెనుకాడలసిన అవసరం లేదు. మన ప్రాణం ఎందరో వీరులను తట్టిలేపాలి “
ఈ నిర్ణయానికి రామసుబ్బమ్మ జీవితాతంతం కట్టుబడి బతికింది.

ఉప్పుసత్యాగ్రహంలో

1930 మార్చి 12 న గాంధీ, మరో 79 మంది సత్యాగ్రహులతో కలిసి, సబర్మతి ఆశ్రమంలో సత్యాగ్రహం నడక మొదలుపెట్టాడు.
వారి గమ్యం 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ తీర గ్రామం దండి.
ప్రతిరోజూ నడకలో కొత్తవారు చేరుతూ వేలాదిమంది సత్యాగ్రహులు గాంధీకి సంఘీభావంగా నిలిచారు. వీరిలో రామసుబ్బమ్మ ఒకరు. ఆమె ఉత్సాహంగా సత్యాగ్రహ నడక ఆరంభించింది.
సరోజినీనాయుడు, పోణకా కనకమ్మ , ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, దువ్వూరి సుబ్బమ్మ , ఉన్నవ లక్ష్మీబాయమ్మ , దుర్గా బాయమ్మ ,ప్రకాశంపంతులు ,
బులుసు సాంబమూర్తి , భోగరాజు పట్టాభిసీతా రామయ్య , కళావెంకట్రావుల వంటి దేశభక్తులు సత్యాగ్రహంలో చేరారు. వీళ్లందరితో కలిసి రామసుబ్బమ్మ ఉద్యమంలో ముందుకు సాగింది. ఇందులో భాగంగా పాటలు భజనలు వంటి వివిధ పోటీలు పెట్టుకుంటూ ముందుకు సాగేవారు.
విష్ణు దిగంబర్ పలుస్కర్ సంగీతాన్ని సమకూర్చిన గాంధీ గారికి ఎంతో ఇష్టమైన –

రఘుపతి రాఘవ రాజారామ్
పతిత పావన సీతారామ్
ఈశ్వర అల్లా తేరేనామ్
సబ్ కొ సమ్మతి దే భగవాన్
గీతాన్ని అత్యుత్సాహంతో వుద్యమం కొనసాగించేవారు. ఈ అపురూప అద్వితీయ జ్ఞాపకాలను తర్వాతి కాలంలో రామసుబ్బమ్మ తన ఆత్మీయులతో ఎంతో ప్రేమగా పంచుకున్నారు.

శ్రమఫలితంగా

కష్టపడే మనస్తత్వం, వాయిదా పద్ధతులు లేని నిరంతర శ్రమ, రామసుబ్బమ్మను స్ఫూర్తిదాయక మహిళగా తీర్చిదిద్దాయి. ఈ క్రమంలో ఆమె వివిధ భాద్యతలు నిర్వహించే అవకాశాలను కూడా పొందారు.

1938 డిసెంబరులో రామసుబ్బమ్మ కాంగ్రెసు పార్టీ తరపున కడపజిల్లా బోర్డు ప్రెసిడెంటుగా ఎన్నికయినారు.
ఈ పదవి అత్యంత ప్రతిష్టాత్మకమైంది. భారతదేశం మొత్తం మీద ఈ పదవికి ఎన్నికయిన మొట్ట మొదటి మహిళగా రామసుబ్బమ్మ ఘనత సాధించారు.
తనకు లభించిన పదవిని కిరీటంగా కాకుండా భుజ స్కందాలపై భాద్యతగా 15 ఆగష్టు 1943 వరకు సమర్ధవంతంగా నిర్వహించి తన దక్షతను నిరూపించుకున్నారు.
ఈ పదవిని క్విట్టిండియా ఉద్యమం సందర్భంలో
గాంధీజీ సూచన మేరకు త్యజించడం జరిగింది.

1941 లో జరిగిన సత్యాగ్రహంలో భర్త కడప కోటిరెడ్డితో పాటు పాల్గొన్నారు ఈ సమయంలో కోటిరెడ్డి అరెస్టు కాబడి జైలుకు వెళ్లారు. .

తన జీవితకాలంలో 40 సంవత్సరాలపాటు కడప పురపాలక సంఘసభ్యురాలుగా పనిచేశారు.

ఆంధ్రోద్యమంలో

ఆంధ్రుల చరిత్రలో ఆంద్రోద్యమం కీలకమైంది. 1911లో ఈ ఉద్యమం ప్రారంభం అయ్యింది. అప్పటికి దేశవ్యాప్తంగా స్వరాజ్య వుద్యమం పెద్దగా ప్రచారంలోకి రాలేదు. 1912లో ఉద్యమం నేపథ్యంలో ఆంధ్రమహాసభ ఏర్పాటుఅయ్యింది.
మద్రాసు ప్రెసిడెన్సీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలుండేవి. ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. కాబట్టి మద్రాసు నుంచి ఆంధ్రను విడదీసి ప్రత్యేక రాష్టంగా ఏర్పాటు చేయాలనే కోరిక ఉధృతి దాల్చింది.
ఈ పరిస్థితుల్లో రామసుబ్బమ్మ ఒకవైపు జాతీయోద్యమంలో పాల్గొంటూనే… మరోవైపు ఆంధ్రోద్యమం గురించి భర్త కోటిరెడ్డితో కలిసి ఆంధ్ర నాయకులతో సమాలోచనలు జరిపింది.

ముఖ్యంగా ఆంద్రోద్యమం రామసుబ్బమ్మ ఆశయం. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్టోద్యమానికి ఉపాధ్యక్షురాలుగా కూడా ఎన్నుకోబడింది. బాధ్యత నిర్వహణలో భాగంగా అంతటా పర్యటించింది. మహాసభలు నిర్వహిస్తూ ప్రజలలో జాగృతిని కలిగించింది

దత్తమండలం

అప్పట్లో రాయలసీమ జిల్లాలను సీడెడ్ లేదా దత్తమండలం అని పిలిచేవారు. దక్కన్ ప్రాంతంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి ఆనాటి నిజాం ద్వారా
1800 సంవత్సరంలో సీడ్ అయిన జిల్లాలను సీడెడ్ జిల్లాలు అంటారు. .రామసుబ్బమ్మ -కోటిరెడ్డి దంపతులు దత్తమండలం / సీడెడ్ పేరును తమ ప్రాంతం పౌరుషానికి అవమానంగా భావించారు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు , కల్లూరి సుబ్బారావు , నివర్తి మృత్యుంజయశాస్త్రీ, చిలుకూరి నారాయణరావు తదితరులు కూడా ఈ విషయమై తరుచూ సమావేశమై సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేశారు. ఇందులో
రామసుబ్బమ్మ కోటిరెడ్డి దంపతులు ఒకరు.

వాస్తవానికి చిలుకూరి నారాయణరావు 1928లో
దత్తమండలానికి రాయలసీమ పెట్టాలని సూచించారు. ఈ సూచన మేధావుల పండితుల జనామోదం పొందినది. .

1928 నవంబర్ 17, 18 తేదీల్లో దత్తమండలాల
నంద్యాల రాజకీయ మహాసభలు జరిగాయి.కడప కోటిరెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. రామసుబ్బమ్మ కూడా సమావేశాల్లో పాల్గొన్నది.

రాయలసీమ ఈ ప్రాంతానికి దత్తమండలాలు అనే పేరు శాశ్వతంగా తొలగించి , రాయలు యేలిన సీమ కాబట్టి రాయలసీమ అని నామకరణం చేశారు.

స్త్రీపరదాపద్ధతినివ్యతిరేకిస్తూ….

1940లో మహిళ సమాజాన్ని ఏర్పాటుచేసి స్త్రీ హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేసింది రామసుబ్బమ్మ. అఖిల భారత స్త్రీసమాజంలో రాష్ట్ర అధ్యక్షురాలిగానూ తన వంతు సేవల్ని అందించింది.

ప్రతి స్త్రీ అక్షరాస్యురాలు కావాలని తపించింది. కాలం చెల్లిన అవసరం లేని విలువలని స్త్రీల నుండి దూరంగా తొలగించాలని గట్టి సంకల్పంతో పనిచేసింది.
మహిళలపై ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతి పురుషుడు స్త్రీని ప్రోత్సహించే దిశగా ఉపన్యాసాలు ఇచ్చింది.

ముఖ్యంగా అప్పట్లో ముస్లింలే కాకుండా హిందు మహిళలు బురఖా వేసుకొనేవారు.ఈ క్రమంలో
హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలి అయిదో వార్షికోత్సవానికి రామసుబ్బమ్మ అధ్యక్షురాలుగా వెళ్లారు. అక్కడ అందరు మహిళలు బురఖాను ధరించి సమావేశానికి వచ్చారు. అప్పుడు మన రామసుబ్బమ్మ ఈ విధంగా మాట్లాడారు.

” తప్పు చేసిన వాళ్ళు ముఖం దాచుకుంటారు. మీరేం తప్పు చేశారు? బురఖా తొలగించి మీరు తప్పు చేయలేదని నిరూపించుకోండి. అప్పుడే నేను ప్రసంగిస్తాను”

ఇది విని వెంటనే మహిళలు అందరు ఒకరితర్వాత ఒకరు తొలగించారు. ఆ తర్వాత ఆమె ప్రసంగించింది.

అప్పట్లో స్త్రీ పురుషులు పాల్గొనే కొన్ని సమావేశాలు కూడా కొన్ని నిబంధనలు పాటించేవి. ఇందులో భాగంగా ఓవైపు పురుషులు, మరోవైపు మహిళలను కూర్చోబెట్టి వారి మధ్య తడికలను ఉంచేవారు. ఈ పద్దతిని రామసుబ్బమ్మ ఖండించింది. తడికే సంప్రదాయానికి స్వస్తి పలికేలా అందరినీ జాగృతం చేసింది.

#సమాజసేవలో….

జిల్లాబోర్డు అధ్యక్షురాలి హోదాలో జిల్లాలోని పలుప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల ఏర్పాటుకోసం నిస్వార్థంగా పనిచేసింది. ఈ క్రమంలో
కడపలో తమ తల్లిదండ్రుల స్మారకార్థం మహిళ డిగ్రీకళాశాల స్థాపన కోసం రామసుబ్బమ్మ తీవ్రంగా కృషి చేసింది. ఈ సందర్భంగా లక్షరూపాయలు స్వయంగా విరాళం ప్రకటించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.
ఆనాటి ముఖమంత్రి జలగం వెంగళరావు ఈ కళాశాల ప్రారంభించారు.

కడపలో ప్రత్యేకంగా అంధుల కోసం ఒక హైస్కూలు నెలకొల్పటంలో కూడ రామసుబ్బమ్మ ప్రధాన పాత్ర వహించింది.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ సంఘంలో సభ్యురాలుగా సేవలు అందించారు.అట్లాగే ఆలిండియా సోషల్ వెల్ ఫేర్ బోర్డు సభ్యురాలుగా సేవలు అందించింది.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలిగా పనిచేశారు.

కడప నగరం పాలనమండలి సభ్యరాలుగా పనిచేశారు.
జిల్లావిద్యాసంఘ సభ్యురాలిగా సేవలు అందించారు.

గిల్డు ఆఫ్ సర్వీస్ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు.

ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెసు సంఘ సభ్యురాలుగా 20 సంవత్సరాలు కొనసాగి తనదైన గొంతుక వినిపించారు.

ఖాదీ ఉద్యమం ద్వారా గ్రామీణ నిరుపేద ప్రజల ఉపాధి కల్పనకు తోడ్పాటు అందించారు.

దుర్గాబాయిదేశ్‌ముఖ్‌ – సరోజినీ నాయుడు వంటి ఉద్దండులతో చనువుగా మెలిగింది. దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని ప్రత్యేకంగా కడపకు రప్పించి సభను నిర్వహించి జిల్లా మహిళలకు ఆదర్శంగా నిలిచింది.

భర్త ప్రోత్సాహంతో ఎన్నో పదవుల్ని అధిష్టించి ఉత్తమ నాయకురాలుగా, ఉత్తమ ఇల్లాలుగా, జీవితాన్ని సార్థకత చేసుకున్న రామసుబ్బమ్మ చిరస్మరణీయురాలు.


ఆధారం :
1) ‘ ఆదర్శ మహిళలు ‘ తెలుగు పత్రికా వ్యాసం
2) ” రాయలసీమ ప్రముఖులు ” పరిశోధక విద్యార్ధి నిరంజన్ రెడ్డి పత్ర సమర్పణ వ్యాసం
3) కడప జిల్లా భారత స్వతంత్ర సమరయోధులు వ్యాసం
4)టేకుమల్ల కామేశ్వర రావు – వాజ్ఞ్మయ మిత్రుడు
5) వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం)

రచన:-✍️ తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s